కొత్త పోస్టర్ కనిపిస్తే ఎంత కిక్కిస్తుందో.. అభిమాన తారకు సంబంధించి కొత్త సినిమా కబుర్లు బయటికొచ్చినా అంతే కిక్ వస్తుంది. చిత్రసీమలో కొత్త కాంబినేషన్లు సెట్ అయితే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి కాంబోలు తెరకెక్కాలని, తమ హీరోను కొత్త కథల్లో చూడాలని ఉబలాటపడుతుంటారు. అలాంటి కొన్ని కాంబినేషన్లపై ప్రస్తుతం టాలీవుడ్‍లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది..
ఎన్టీఆర్ డబుల్ ట్రీట్ పక్కా!
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్‍నీల్ దర్శకత్వంలో బహు భాషా చిత్రం చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రచార చిత్రం బయటకు రానుందని సమాచారం. అయి తే మరోవైపు అదేరోజు ఆయన నుంచి మరో కొత్త కబురు వినిపించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ తరువాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఓ మైథాలజీ మూవీ కోసం కలిసి పని చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు. కానీ, అది ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లినట్టు గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడిది ఎన్టీఆర్‍తోనే ఖరారైనట్టు ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. అదే జరిగితే ఎన్టీఆర్ తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చినట్టే.
‘ఇరుముడి’ తరువాత అదేనా?
ఈ సంక్రాంతికి ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో అలరించారు హీరో రవితేజ. ప్రస్తుతం ఆయన ‘ఇరుముడి’ సినిమాను ముగించే పనిలో ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలోనే తెరపైకి రానుంది. అయితే దీని తర్వాత రవితేజ చేయనున్న చిత్రమేంటన్నది ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి చిత్రసీమలో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ‘రా• రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో అలరించిన దర్శకుడు హసిత్ గోలితో రవితేజ చేతులు కలపనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టును నిర్మాత దిల్ రాజు పట్టాలెక్కించే అవకాశా లున్నాయని తెలుస్తోంది.
రామ్ ‘డైరెక్టర్’ రోల్!
హీరో రామ్ పోతినేని చేయనున్న తదుపరి సినిమాపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఇటీవల ఆయన లోగి విఘ్నేశ్ అనే కొత్త దర్శకుడికి ఓకే చెప్పినట్టు ప్రచారం జరిగినా అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు తను ఇప్పటికే స్వయంగా ఒక కథ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. నిన్న మొన్నటి వరకు దీన్ని మరో దర్శకుడి చేతుల్లో పెడతారని వార్తలొచ్చినా.. ఇప్పుడు స్వయంగా రామ్ దాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రామ్ పుట్టిన రోజు సందర్భంగా దీనిపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది.
శ్రీవిష్ణు.. అదా.. ఇదా?
శ్రీవిష్ణు వరుస సినిమాలతో తల మునకలై ఉండగా మరో రెండు కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు ఆయన ముందున్నట్టు తెలుస్తోంది. వాటిలో ఏది ఓకే అవుతుందనేది చూడాలి. ప్రస్తుతం శ్రీవిష్ణు రామ్ అబ్బరాజుతో చేస్తున్న చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. దర్శకుడు జానకిరామ్‍తో చేస్తున్న ‘కామ్రేడ్ కల్యాణ్’ తుది మెరుగులు దిద్దుకుంటోంది. అలాగే సన్నీ సంజయ్ దర్శకత్వంలో సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ సంస్థలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. కాగా, ఇప్పుడీ జాబితాలో మరో చిత్రం చేరింది. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, ఎస్‍ఎల్వీ సినిమాస్ సంస్థ దీన్ని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు, ‘సామజవరగమన’ చిత్రానికి ఓ రచయితగా వ్యవహరించిన భాను భోగవరపు దర్శకత్వంలోనూ శ్రీవిష్ణు ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.





















































































































































































































































Review కొత్త సినిమా.