శ్రీలు పొంగిన పుణ్యభూమి అయిన భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి.
అగస్త్యుని జన్మ నిజంగా చాలా విచిత్రమైనది. అగ్నిదేవుడూ, వాయుదేవుడూ.. ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలో నుంచి పుట్టాడు అగస్త్య మహర్షి.
అందుకే ఆయనకు కలశజుడు, కుంభసంభవుడు, ఔర్వశేయుడు, మిత్రావరణ పుత్రుడు, వహ్నిమారుత సంభవుడనే అనేక పేర్లు ఉన్నాయి.
అగస్త్య మహర్షికి చిన్నతనంలోనే ఉపనయనం, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం వంటివన్నీ దేవతలే చేసేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తుండే వాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకీ చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉన్న మునులను చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి.
ఆ మునులు అగస్త్యుడిని చూసి, ‘నాయనా! మమ్మల్ని పితృదేవతలని అంటారు. నీకు పెళ్లయి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకు వెళ్లే అర్హత వస్తుంది. నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలనని అంటున్నావు. మాకు పుణ్యలోకం ప్రాప్తించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే మా గతి ఇంతే’ అన్నారా మునులు దీనంగా.
అగస్త్యుడు ఇది విని మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు దొరకాలి కదా! అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భ రాజుకు ఒక చక్కని కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు.
అలా విదర్భ రాజుకు లోపాముద్ర అనే కుమార్తె పుట్టింది. లక్ష్మీదేవంత అందంగా, సరస్వతీదేవికి ఉన్నంత విద్యలతో లోపాముద్ర సుగణాల రాశిగా శోభిల్లేది. ఆమెను అగస్త్యుడు పెళ్లి చేసుకుని తనతో పాటు ఆశ్రమానికి తీసుకువచ్చాడు.
వివాహ బంధం కొనసాగాలంటే సంసార జీవనానికి, అవసరాలకు ధనం కావాలి. ధనాన్ని సృష్టించడం కోసం తన తపశ్శక్తిని నష్టపోవడం ఇష్టం లేక శ్రుతర్వుడనే రాజుని కొంత ధనం అడిగాడు. తన వద్ద సరిపడా ధనం లేదని చెప్పిన ఆ రాజు అగస్త్యుడిని తీసుకుని ప్రధ్నశ్వుడు అనే రాజు వద్దకు వెళ్లాడు. ఆయన కూడా తన వద్ద సరిపడా ధనం లేదని చెప్పాడు.
మణిమతీపురానికి రాజు ఇల్వలుడు. ఆయనకు వాతాపి అనే తమ్ముడు ఉండే వాడు. ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకు భోజనం వండి పెట్టేవాడు. అనంతరం ‘వాతాపి’ అని పిలవగానే ఆ బ్రాహ్మణుల కడుపు చీల్చుకుని వాతాపి బయటకు వచ్చేసేవాడు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులను చంపుతుండే వారు.
అగస్త్యుడు తను కలిసిన రాజులందరినీ తీసుకుని ఇల్వలుడి ఇంటికి వెళ్లాడు. మామూలుగానే ఇల్వలుడు వాతాపిని చంపి, వండి పెట్టి, మళ్లీ వాతాపిని పిలిచాడు. కానీ, అగస్త్యుడు ఆ భోజనం చేయగానే ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడు. దీంతో అగస్త్యుడి ఉదరంలోనే వాతాపి జీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాలేదు. ఉంటే కదా.. రావడానికి.
మీరెప్పుడయినా గమనించారా? పసిపిల్లలకు పాలు పట్టగానే ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అంటూ పిల్లల పొట్ట మీద రాస్తారు. వాతాపిని కూడా ఆరగించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లలకు రావాలని అలా అంటారన్న మాట.
ఇల్వలుడు అగస్త్యుడికి ధనం, బంగారం, ఆవులు అన్నీ ఇచ్చి పంపించాడు. తరువాత అగస్త్యుడికి ధృడస్యుడు అనే కుమారుడు, తేజస్వి అనే మనవడు కలిగారు. అగస్త్యుడు వివాహ బంధంలో అడుగుపెట్టి సంతానాన్ని కన్న ఫలితంగా పితృదేవతలు పుణ్యలోకాలకు వెళ్లిపోయారు.
ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుడి ఆశ్రమానికి వచ్చాడు. అగస్త్యుడు ఎదురువెళ్లి బ్రహ్మను తోడ్కొని, ఆయనను తగిన విధంగా సత్కరించి, ‘ఆజ్ఞాపించండి స్వామీ’ అన్నాడు.
‘నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది. ఇప్పుడు విష్ణుమాయ కవేర రాజుకు ముక్తి ఇవ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తోంది. ఆమెను కూడా నువ్వు పెళ్లి చేసుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు.
అగస్త్యుడు ‘బ్రహ్మదేవా! నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను’ అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అవగానే కవేర కన్య కావేరీ నదిగా ప్రవహించింది. కావేరి నదిలో స్నానం చేసిన కవేర రాజుకు విముక్తి కలిగింది.
వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుడిని జయించి ధర్మచరిత్ర కలిగిన మహర్షులు అందరినీ రాత్రి సమయంలో చంపి, పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవాడు. మహర్షులందరూ కలిసి ఆ సముద్ర జలాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో తాగేశాడు. దీంతో వృత్రాసురుడు సముద్రం నుంచి బయటపడ్డాడు. దధీచి మహర్షి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుడిని సంహరించారు.
అగస్త్య మహర్షి దండకారణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుండగా, శ్రీరాముడు అరణ్యవాసం చేయడానికి వెళ్తూ అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్నాడు. ఖడ్గం, విల్లు, బాణాలు, అక్షయమైన అమ్ములపొదిని రాముడికి ఇచ్చి దీవించాడు అగస్త్యుడు.
కొంతకాలం తరువాత రామ రావణ యుద్ధంలో రావణ బాణాలకు రాముడు గాయపడి బాధపడుతుండగా అగస్త్యుడు రాముడికి నువ్వు విష్ణుమూర్తి అవతారధారివని గుర్తుచేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్య హృదయం అనే మహాస్తవం ఉపదేశిం చాడు. అంటే మనం ఇప్పటికీ ఉదయాన్నే చదివే ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించినదే.
పూర్వం నహుషుడనే రాజు నూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. కానీ, ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో ఇంద్రుడు భార్య అయిన శచీదేవిని తనతో ఉండాలని అడిగాడు. అయితే, మునులు పల్లకీ మోస్తుండగా అందులో తానుండాలని, అలా అయితే వస్తానని శచీదేవి చెబుతుంది. నహుషుడు శచీదేవి వద్దకు వెళ్తూ మునులను ఆమె కూర్చున్న పల్లకీని మోయాలని ఆదేశించాడు. పూర్యాచార్యుల మంత్రాలను, బ్రాహ్మణులనూ నిందించడం, అవమానించడం తప్పని అగస్త్యుడు నహుషుడికి చెప్పాడు. దీంతో తల పొగరెక్కిన నహుషుడు అగస్త్యుడిని తల మీద తన్నాడు. దీంతో ఆగ్రహించిన అగస్త్యుడు క్రూర సర్పంగా మారతావని నహుషుడిని శపించాడు. తరువాత నహుషుడి ప్రార్థన మీదట పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు.
అగస్తుడు ‘ద్వాదశ వార్షిక యజ్ఞం’ చేశాడు. అంటే ఆ యజ్ఞం పన్నెండు సంవత్సరాల పాటు నిర్వహించేది. అయితే యజ్ఞం చివరి దశలో ఇంద్రుడు సహకరించలేదు. అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్ర పదవిని పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు. దీంతో ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు.
సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్య పర్వతం కోపగించి, సూర్య, చంద్ర నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదలలేక వదిలి వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు.
‘పర్వతరాజా! మా దంపతులం పెద్దవాళ్లం. నీ మీద ఎక్కడం దిగడం మాకు కష్టం. మేం దక్షిణాది దిశగా వెళ్తున్నాం. తిరిగి మేం వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు’ అని అగస్త్యుడు చెప్పాడు. ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని అణచాడు అగస్త్యుడు.
తరువాత అగస్త్యుడు భార్యతో కలిసి యాత్రలు చేస్తూ గోదావరీ తీరంలో ఉన్న పంపాసరోవరం, దండకారణ్యం, గోదావరీ తీరం, కోటిపల్లి, పలివెల, భీమేశ్వరం, ద్రాక్షారామం, వీరభద్ర శిఖరం మొదలైనవి చూసి కొల్లాపురం చేసి లక్ష్మీదేవిని స్తుతించాడు. లక్ష్మీదేవి అగస్త్యుడిని ద్వాపర యుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాశిలో ఉంటావని దీవిస్తుంది.
అగస్త్యుడు శ్రీశైలం వెళ్లినపుడు ఆయనకు కుమారస్వామి దర్శనమిచ్చి కాశీ మహత్మ్యం గురించి తెలిపాడు.
పరశురాముడు అగస్త్యుడు ఇచ్చిన కృష్ణ కవచాన్ని ధరించే ఇరవై ఒక్కసార్లు రాజులను సంహరించగలిగాడు.
ఒకసారి ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుని రాకను గమనించలేదు. దీంతో కోపం వచ్చి ఏనుగువై పుట్టాలని అగస్త్యుడు శపించాడు. గజేంద్ర మోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు.
కుబేరుడు కుశపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెళ్తూండగా, కుబేరుడి స్నేహితుడు మణిమంతుడు కిందికి ఉమ్మేశాడు. అది తపస్సులో ఉన్న అగస్త్యుడిపై పడింది. అతడిని, అతడి బలగాలను ఒకే మనిషి చేతిలో చనిపోయేలా అగస్త్యుడు శపించాడు. అదేవిధంగా వాళ్లందరూ భీముడి చేతిలో చనిపోయారు.
కొంతకాలం అగస్త్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామిని పూజించి అందిలావృత వర్షంలో ఉండగా నారాయణుడు అగస్త్యుడికి కనిపించి నీకు ఎప్పుడూ ఏ లోటూ ఉండదని ఆశీర్వదించాడు.
అగస్త్య గీత, అగస్త్య సంహిత అనేవి అగస్త్యుడు రాసిన గ్రంథాలే.
అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకహితం కోసమే పాటుపడ్డాడు. ఎంతోమందికి విద్యాదానం చేశాడు. ఇప్పటికీ ఆయన భాద్రపద మాసంలో భూలోకాన నక్షత్ర రూపంలో కనిపిస్తాడని అంటారు. నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్త్యుడి బొమ్మను చేసి పూజించి రాత్రి జాగారం చేస్తారు. అలా చేస్తే అగస్త్య లోపాముద్రల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.

























































































































































































































































































































































































































Review రుషి పీఠం.