క్లైమాక్స్ అదిరేలా..

క్యాలెండర్‍లో చివరి నెల దగ్గర పడుతోంది. తెలుగు సినీ పరిశ్రమకూ సంవత్సరాంతం కీలకమే. ముగింపు ఘనంగా ఉండాలని కోరుకునే నిర్మాతలు డిసెంబర్‍లో తమ సినిమాల విడుదలకు ప్లాన్‍ చేస్తున్నారు. స్ట్రెయిట్‍, డబ్బింగ్‍ కలిపి దాదాపు 15 వరకు సినిమాలు డిసెంబర్‍లో విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఆయా సినిమాల వివరాలు..

ఈ డిసెంబర్‍లో విడుదలయ్యే సినిమాల్లో అందరి దృష్టి బాలకృష్ణ ‘అఖండ2: తాండవం’పైనే ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్‍ బిజినెస్‍తోనే ఈ సినిమా దాదాపు 150 కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. డిసెంబర్‍ 5న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‍, టీజర్‍ అభిమానులను ఇప్పటికే విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‍గా వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో బాక్సాఫీస్‍ను గలగలలాడించడం ఖాయమని చిత్ర పరిశ్రమ అంటోంది. బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్‍ తొలిసారి నటిస్తుండగా, ‘అఖండ’లో బాలకృష్ణతో కలిసి సందడి చేసిన ప్రజ్ఞాజైశ్వాల్‍ అఖండ2 లోనూ తెరపంచుకుంటోంది. 14 రీల్స్ ప్లస్‍ పతాకంపై ముస్తాబైన ఈ సినిమాకు తమన్‍ సంగీతం అందించాడు.

వా వాతియార్‍: తమిళ హీరో కార్తి, కృతిశెట్టి, మాధుర్‍ మిట్టల్‍, ఆనందరాజ్‍, రాజ్‍కిరణ్‍, శిల్పా మంజునాథ్‍, కరుణాకరన్‍ తదితరులు నటించిన ‘వా వాతియార్‍’ కూడా డిసెంబర్‍ 5నే థియేటర్లలోకి వస్తోంది. ఇది తమిళ డబ్బింగ్‍ సినిమా. స్టూడియో గ్రీన్‍ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమాకు నలన్‍ కుమారస్వామి దర్శకుడు. తెలుగులోనూ మంచి క్రేజ్‍ సంపాదించుకున్న కార్తి ఈ సినిమాపై గట్టి అంచనాలే పెట్టుకున్నాడు.

బైకర్‍: శర్వానంద్‍ చాలా రోజుల తరువాత నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం శర్వా స్లిమ్‍గా మారిపోయిన చిత్రాలు ఆ మధ్య సామాజిక మాధ్యమాల్లో హల్‍చల్‍ చేశాయి. రియల్‍ బైక్‍ రేసింగ్‍ దృశ్యాలతో విజువల్‍ వండర్‍గా ముస్తాబైన ఈ సినిమా డిసెంబర్‍ 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మౌగ్లి: సుమ కనకాల, రాజీవ్‍ కనకాల దంపతుల కుమారుడు రోషన్‍ కనకాల ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. పీపుల్‍ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‍పై రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అతడి సరసన సాక్షి సాగర్‍ మాదోల్కర్‍ హీరోయిన్‍గా నటిస్తోంది. కాలభైరవ సంగీతం అందిస్తుండగా, సందీప్‍రాజ్‍ దర్శకత్వం వహించారు. డిసెంబర్‍ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

లవ్‍ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్‍ఐకే): ‘డ్యూడ్‍‘గా ఇటీవలే ప్రేక్షకులను పలకరించి.. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ వరుస హిట్లు కొడుతున్న ప్రదీప్‍ రంగరాజన్‍.. ఈ సినిమాతో డిసెంబర్‍ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎస్‍జే సూర్య, కృతిశెట్టి, యోగిబాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. విఘ్నేశ్‍ శివన్‍ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

చాంపియన్‍: రోషణ్‍ హీరోగా ప్రదీప్‍ అద్వైతం దర్శకత్వంలో ఈ సినిమా డిసెంబర్‍ 25న థియేటర్లలోకి రానుంది.

యుపోరియా: చాలా కాలం తరువాత భూమిక చావ్లా మళ్లీ తెరపై కనిపించనున్న చిత్రమిది. ఇంకా దర్శకుడు గౌతమ్‍ వాసుదేవ్‍ మీనన్‍, సారా అర్జున్‍, నాజర్‍ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గుణ హ్యాండ్‍మేడ్‍ ఫిల్మ్ పతాకంపై సిద్ధమైన ఈ సినిమాకు కాలభైరవ స్వరాలు సమకూర్చారు. గుణశేఖర్‍ దర్శకుడు.

పతంగ్‍: ప్రణశ్‍ కౌశిక్‍, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్‍ 25న విడుదల అవుతోంది. ప్రణీత్‍ ప్రత్తిపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

ఇవికాక మరికొన్ని చిత్రాలతో పాటుగా డిసెంబర్‍లో మొత్తంగా 15 వరకు సినిమాలు రానున్నాయని అంచనా. మరికొన్ని సినిమాలకు విడుదల తేదీలు ప్రకటించడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

కళ్లు చెదిరే రేసింగ్స్..
• శర్వానంద్‍ నటించిన కొత్త చిత్రం ‘బైకర్‍’. ఈ డిసెంబర్‍ 6న థియేటర్లలోకి వస్తోంది. అభిలాష్‍రెడ్డి కంకర దర్శకుడు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‍ నిర్మిస్తున్నారు. సీనియర్‍ హీరో రాజశేఖర్‍ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. మాళవిక నాయర్‍ కథానాయిక. ‘ఇక్కడ ప్రతి బైకర్‍కీ ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకు ఎదురెళ్లే కథ.. ఏం జరిగినా పట్టు వదలని మొండివాళ్ల కథ’ అంటూ సాగే ప్రచార చిత్రాన్ని ఇటీవలే చిత్ర యూనిట్‍ విడుదల చేసింది. అలాగే, ప్రచార చిత్రంలోని విజువల్స్, బైక్‍ రేసింగ్‍ దృశ్యాలు కళ్లు చెదిరే రీతిలో ఉన్నాయి. ‘ఇక్కడ గెలవడం గొప్ప కాదు. చివరి దాకా పోరాటం గొప్ప’ అనే సంభాషణతో కథా నేపథ్యాన్ని పరిచయం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన రేసింగ్‍ సినిమాలను మించిన గొప్ప అనుభూతిని పంచుతుందీ చిత్రం అంటున్నాడు దర్శకుడు అభిలాష్‍. ఇండోనేషియా వెళ్లి అక్కడి నిజమైన బైకర్స్తో తీసిన నిజమైన సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్‍ పంచుతాయని చెబుతున్నాడు.

అచ్చియ్యమ్మ వచ్చేసింది..
• హీరో రామ్‍చరణ్‍, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‍లో రూపుదిద్దుకుంటున్న పాన్‍ ఇండియా చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‍ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్‍ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్‍ కథానాయిక. జాన్వీ ఇందులో అచ్చియ్యమ్మ పాత్రలో కనువిందు చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఇటీవల రెండు కొత్త లుక్స్ను విడుదల చేసింది. దీంట్లో తనది దేనికీ భయపడని ఫైర్‍బ్రాండ్‍ లాంటి అమ్మాయి తరహా పాత్రగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. క్రీడా నేపథ్య అంశాలతో ముడిపడి ఉన్న ఈ రూరల్‍ యాక్షన్‍ ఎంటర్‍టైనర్‍లో రామ్‍చరణ్‍ ఆట కూలీగా కనిపించనున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.

అతడొక యోధుడు..
• ‘పద్మవ్యూహాన్ని ఛేదించిన పార్థుడు.. పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు.. గురువు లేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే అతడొక యోధుడు.. మన చరిత్ర అధ్యాయాల్లో దాగిన ఓ ధైర్యవంతుడైన ఓ సైనికుడి కథ..’ అంటూ పోస్టర్‍ విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ప్రభాస్‍ హీరోగా ఈ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్‍ ఇది. ఆయన పుట్టిన రోజున విడుదలైన ఈ అప్‍డేట్‍తో ప్రభాస్‍ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పేరును అధికారికంగా ప్రకటించారు. నవీన్‍ ఎర్నేని, వై.రవిశంకర్‍ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇమాన్వీ కథానాయిక. ప్రభాస్‍ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‍తో పాటు ఫస్ట్ లుక్‍కు విశేష స్పందన లభించింది. పీరియాడికల్‍ యాక్షన్‍ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. ఇంకా, ప్రభాస్‍ బర్త్డే సందర్భంగా.. ‘సలార్‍2’, ‘కల్కి2’ సినిమాల చిత్రీకరణ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్‍ నటిస్తున్న ‘ది రాజా సాబ్‍’ వచ్చే జనవరి 9న థియేటర్లలోకి రానుంది.

Review క్లైమాక్స్ అదిరేలా...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top