‘‘మీరు బ్రహ్మచారి కదా! శృంగార గీతాలు, రొమాంటిక్ పాటలు ఇంత బాగా ఎలా రాస్తున్నారు?’’ అని ఒకసారి రేలంగి.. మాటల మాంత్రికుడు పింగళి గారిని అడిగారట.
‘‘యుద్ధం సీన్లు చేయాలంటే యుద్ధం చేయాలా? రవి కాంచనిది కూడా కవి గాంచును కదా! అదే నీకు, నాకు ఉన్న వ్యత్యాసం’’ అని నవ్వుతూ బదులిచ్చారట పింగళి గారు.
పాత తరం సినిమాల్లో పింగళి గారు రాసిన మాటలు, పాటలు మరుపురానివి. అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఆయన మాటల్లోని పాటలు.. పాటల్లోని మాటలు సినిమా టైటిల్స్గా వచ్చాయంటే.. ఆయన రచనా ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.
అహ నా పెళ్లంట, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు, హై హై నాయకా, రావోయి చందమామ, ఎంత ఘాటు ప్రేమయో.. పింగళి వారి కలం నుంచి జాలువారిన ఈ పదాలన్నీ సినిమాలకు పేర్లయ్యాయి. అలాగే, మాటలతో ప్రయోగం చేసి, కొత్త పదాలను సృష్టించడంలోనూ ఆయన దిట్ట. తస్మదీయులు, హలా, డింగరీ, గిడిగిడి, వాలతుల్యుడు, నిక్షేపరాయుడు, హంవీరుడు – హరమతి, కాలమతి, ఘాటు ప్రేమ, జగజగాలు, ఉర్రూగించిన.. అసలీ పదాలు భలే కొత్తగానూ, వింతగానూ, తమాషాగానూ ఉండటమే కాదు.. ఆ రోజుల్లో అందరి వాడుక మాటల్లోనే ఇవే దొర్లేవి.
‘‘ఎవరూ పుట్టించకుండా పదాలెలా పుడతాయి? వెయ్యండి వీరతాళ్లు’’ అంటాడు ఘటోత్కచ పాత్రధారి ఎస్వీ రంగారావు మాయాబజార్‍లో. అందుకు తగినట్టే పింగళి పదాలు, మాటలు కొత్తవి సృష్టించేవారు. ‘‘చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణీ (కో ఆపరేటివ్ విధానపు వలస)..’’ అనిపిస్తారు అర్జునుడి చేత ఊర్వశితో ‘పెళ్లి చేసి చూడు’లో. డ్రీం సీక్వెన్స్లో వచ్చే ఈ డైలాగ్ అప్పట్లో ఫేమస్.
1901, 29 డిసెంబరున రాజాంలో (బొబ్బిలి) జన్మించిన పింగళి నాగేంద్రరావు.. మచిలీ పట్నంలో పెరిగి అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. అనంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‍లో చేరి దేశభక్తి గీతాలు, నాటికలు రాసి జైలుకు కూడా వెళ్లారు. మేవాడ్ రాజ్య పతనం, జేబున్నీసా, నా రాజు, రాణి సంయుక్త, వింధ్యారాణి వంటి నాటకాలు రాశారు. వింధ్యరాణి 1948లో సినిమాగా కూడా వచ్చింది. ఆయా సినిమాల్లో పాత్రలకు ఈయన పెట్టే పేర్లు చిత్రంగా ఉండేవి. శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుని కపట సన్యాసి వేషానికి ఆయన పెట్టిన పేరు ‘అజభీదఫపా విశ్వేసకి స్వాముల వారు’’. అర్జునునికి గల అనేకానేక పేర్లలోని మొదటి అక్షరాలు తీసుకుని ఈ కొత్త పేరును సృష్టించారు పింగళి.
ఆయన చేసిన ప్రయోగాలు, చమత్కారాలకు లెక్కేలేదు. హరిశ్చంద్రలో శిష్యుడు గురువుతో ‘‘ఎందుకు రానూ? తద్దినానికి వస్తాను’’ అంటాడు. తత్ దినము (ఆ రోజుకు) అని ఇక్కడ అర్థం. ఈ బాణీ ఆయనకే సొంతమైన వాణి. పింగళి మొదట భలే పెళ్లి (1941) సినిమాకు రచన అందించినా, గుణసుందరి కథ (1949)తోనే విజయ పరంపర ఆరంభమైంది.
విజయా వారి అన్ని సినిమాలకు మాటలు, పాటలు రాశారు పింగళి. పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, జగదేకవీరుని కథ, అప్పుచేసి పప్పుకూడు.. పింగళి ప్రయోగాలకు వేదికలయ్యాయి. నాటక సమాజానికి కార్యదర్శిగా ఉండి, తన వింధ్యరాణి, నా రాజు డ్రామాలు వేస్తున్న కాలంలోనే ప్రేక్షకుల నాడి పట్టేశారు పింగళి. ఏ కథైనా వినోద ప్రధానంగా ఉండి, చమత్కారాలతో ఉంటేనే ప్రేకులు అదరిస్తారని!. కథనం హాయిగా, సరదాగా సాగిపోవాలి. అదే విజయ సూత్రం అంటారాయన. పింగళి రాసిన సాంఘిక చిత్రం పెళ్లి నాటి ప్రమాణాలు కూడా అదే రుజువు చేసింది.
గుండమ్మ కథలో జమున, ఎన్టీఆర్‍లపై డ్యూయెట్ ఊటీలోనో, బృందావన్ గార్డెన్స్లోనో తీయాలని అనుకుంటుంటే, చక్రపాణి గారు ‘ఏం అవసరం లేదు. ఎందుకు ఊటీలు? బృందావనాలు?.. ఇక్కడ మన గార్డెన్‍లోనే తీయవచ్చు’’ అన్నారట. ఆయన మాటలనే పాటగా మార్చేశారు పింగళి. కట్ చేస్తే- ‘ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..’ అనే పాట అయ్యింది. ఇలా పాత తరం తెలుగు సినిమాల్లో పింగళి గారు చేసిన ప్రయోగాలను మరెవరూ చేయలేదు.
Review చాలు చాలు.. నీ వలపు పంపిణీ.