శక్తి మాసం

తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం ఏడవది. ఆంగ్లమానం ప్రకారం ఇది అక్టోబరు నెల. పద•వది. సృష్టికి మూలమైన అమ్మవారు విశేషంగా పూజలందుకునేది ఈ మాసంలోనే. అందరికీ విజయాలను అందించే విజయ దశమి, జాతికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహాత్మాగాంధీ జయంతి ఈ మాసం ప్రత్యేకం. ఆడపిల్లల వేడుక అట్లతద్ది, తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ ఉత్సవాలు ఆశ్వయుజ మాసానికి శోభ తెస్తాయి.

శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్క•తిలో విలక్షణమైనవి. ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు. సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. అందుకు నిదర్శనంగానే ఆశ్వయుజం అతివల పర్వమై వెలుగొందుతోంది. మహిళలు నోచే నోములు, వ్రతాలు, మరీ ముఖ్యంగా అమ్మవారి వేడుకకు ఆటపట్టయినదీ మాసం. కాలం స్త్రీ పురుష రూపాత్మకం అంటారు. సంవత్సరంలోని చైత్రం మొదలు భాద్రపదం వరకు తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈ నెలలో వచ్చే అట్లతద్ది, దసరా తదితర పర్వాలన్నీ స్త్రీలకు సంబంధించినవే. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజం అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలం. సకల బ్రహ్మంలో సత్వరజోత్తమో గుణాలు ఉంటాయి. సత్యం నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి. సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. సమస్త జగత్తును పాలించే ఆ ఆది పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, పార్వతి, సరస్వతి అయి లోకాలకు సకల సౌభాగ్యాలను, విద్య, శక్తులను ప్రసాదిస్తోంది.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, సెప్టెంబరు 29, ఆదివారం
దేవీ నవరాత్రులు ఈనాటి నుంచే ఆరంభం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈనాటి నుంచి ప్రారంభమవుతాయి. దేవీ నవరాత్రులు పూజలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకుని విజయదశమి వరకు చేస్తారు. ఈ గడియల్లోనే భద్రకాళి అష్టాదశ భుజ మహిషా సురమర్దనిగా అవతారమెత్తింది. ఆదిశక్తి- మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించిందని, ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసిని ఈ అమ్మలగన్న అమ్మ. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి నాడు వాగ్దేవి సరస్వతీ పూజ చేయాలి. జ్ఞానభూమికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం. ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలిపుత్రిగా, బ్రహ్మచారిణిగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, చంద్రఘంటా దేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదో రోజు విజయ దశమి. ఆ రోజునే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని అంటారు. అర్జునుడు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలను తీసి కౌరవ వీరులను జయించినదీ విజయదశమి నాడేనని పురాణోక్తి. ఇంకా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి నాడు స్తనవృద్ధి గౌరీవ్రతం ఆచరించాలని నియమం. నీలమత పురాణంలో ఈనాడు గృహదేవీ పూజ చేయాలని ఉంది. స్మ•తి కౌస్తుభంలో- ఈనాటి నుంచి నవరాత్రారంభమని ఉంది.
ఆశ్వయుజ శుద్ధ తదియ, అక్టోబరు 1, మంగళవారం
చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఈ తిథి గురించి వివరణ ఉంది. ఈనాడు మేఘపాలీయ తృతీయా వ్రతం ఆచరించాలని నియమం.
ఆశ్వయుజ శుద్ధ చవితి, అక్టోబరు 2, బుధవారం
అక్టోబరు 2 గాంధీ జయంతి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించినది మహాత్మాగాంధీ కృషితోనే. ఈనాడు ఆయన జయంతి. అలాగే, ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు దేవతలను, సువాసినులను పూజించాలని నీలమత పురాణంలో ఉంది. గణేశ చతుర్థి వ్రతాన్ని కూడా ఈ రోజు ఆచరిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ పంచమి, అక్టోబరు 3, గురువారం
ఈ తిథి నాడు లలితా గౌరీ వ్రతం ఆచరించాలని కొన్ని పంచాంగాలలో ఉంది. అలాగే, ఉపాంగ లలితా వ్రతం ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ తిథి శాంతి పంచమీ వ్రత దినమని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.
ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అక్టోబరు 5, శనివారం
ఈనాడు గరుడ జయంతి దినం. ఈనాడు మూలా నక్షత్రం. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈనాడు అమ్మవారిని సరస్వతిగా అలంకరించి పూజిస్తారు. ఈ తిథి శుభ సప్తమీ, ద్వాదశ సప్తమీ వ్రతాల దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు స్నానం చేసి కపిల గోవును పూజించి అనంతరం, పంచగవ్యములను మాత్రమే సేవించి మర్నాడు భోజనం చేయాలి.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి, అక్టోబరు 6, ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి దుర్గాష్టమి. తెలుగు రాష్ట్రాల్లో ఇది శరన్నవరాత్రుల్లో భాగమైన అష్టమి దినం. దుర్గాష్టమీగా వ్యవహరించే ఈనాడు మహాష్టమి, దుర్గపూజ, భద్రకాళీ పూజ వంటివి ఆచరిస్తారు. ఇదే రోజు తెలంగాణలో బతుకమ్మ పండుగ. అంగరంగ వైభోగంగా నిర్వ హిస్తారు. ఈనాటితో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. ఇక, ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి మాళవ దేశంలో ప్రత్యేక పర్వంగా వెలుగొందుతోంది. మాళవ ప్రాంతంలో ఈనాటి సాయంకాలం ఒక ఇంట స్త్రీలందరూ సమావేశమవుతారు. సీసామూతి దగ్గర నోటితో ఊది బాలురు శబ్దం తెప్పించేటట్లు ఈనాడు స్త్రీలు ఒక కుండమూతిలో కానీ, ఇత్తడి బిందె మూతిలో కానీ ఊది శబ్దం చేస్తారు. ఇలా ఊదుతూ బాగా శబ్దం చేసిన స్త్రీని మహాలక్ష్మి పూనినట్టు మిగతా స్త్రీలు నమ్ముతారు. ఆ పూనిన స్త్రీ వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుందట. తెల్లవారడంతోనే ఆ పూనకం పోతుంది. రాత్రి దేవత పూనిన స్త్రీకి ఇంటి యజమానురాలు ఉదయాన్నే కుంకుమ, కొబ్బరికాయ, బియ్యం, రవికల గుడ్డ ఇస్తుంది. ఈ ఉత్సవానికి పురుషులు రాకూడదు.
ఆశ్వయుజ శుద్ధ నవమి, అక్టోబరు 7, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ నవమి.. శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు. ఇదే మహర్నవమిగా ప్రసిద్ధి. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని నామ నవమి వ్రతమనీ, దుర్గా నవమీ వ్రతమని వర్ణించారు. ఈనాడు శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటి గుణ కరందానం, మహా ఫలవ్రతం, ప్రదీప్త నవమీ వ్రతం మున్నగు వ్రతాలు ఆచరిస్తారని అంటారు. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ తిథి నాడు మాతృ వ్రతం ఆచరించాలని ఉంది. అలాగే, ఈ నవమి స్వారోచిష మన్వంతరాది దినమని కూడా అంటారు.
ఆశ్వయుజ శుద్ధ దశమి, అక్టోబరు 8, మంగళవారం
ఇది దశమి తిథి. ఈనాడు విజయ దశమి పర్వదినం. ప్రాచీన కాలం నుంచి విజయదశమి (దసరా) ఆచరణలో ఉంది. మైసూరులో ఈనాడు గొప్ప వేడుక నిర్వహిస్తారు. అలాగే, శమీ పూజలు విశేషంగా ఆచరిస్తారు. ఈనాటితో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ తిథినాడు శక్తిపూజ మహోత్క•ష్టమైనది. రావణుడిపై రాముడి విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేదీ, సర్వ విధాలా విజయాలకు కేంద్రంగా పేరొందినది విజయదశమి. చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే, ఉత్సవ హేలగా జరుపుకునే దుర్గాపూజల ముగింపులో దేవి నిమజ్జనం జరుగుతుంది. దసరా నాడు సాయంత్రం శమీపూజ చేయడం ఆచారం. సాయంకాలం ఈ వృక్ష దర్శనం చేసుకుంటారు. దసరా అనేది తొమ్మిది రోజుల- తొమ్మిది రాత్రుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలు నవమి వరకు ఈ పండుగ రోజులు. వీటినే శారద నవరాత్రులనీ, శారదీయ నవరాత్రులనీ అంటారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో ఆ దేవి పూజలందుకుంటుంది. ప్రాంతాలు, ఆచారాలను బట్టి ఆయా రోజులలో అవతారాలు మారుతుంటాయి. సాధారణంగా మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కంధమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజున మహాగౌరిగా, తొమ్మిదో రోజున సిద్ధిధాత్రిగా దేవి ప్రజల పూజలు అందుకుంటుంది. ఈ తొమ్మిది రోజులు రూపానికి తగిన అలంకరణలో ఆయుధాలు ధరించి దేవి నవదుర్గలుగా భాసిస్తూ శరన్నవరాత్రులలో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుంది. భగవతి, పార్వతి ఇత్యాధి నామాలతో వ్యవహరింపబడే దేవతా పూజకు ఈ దినాలు ప్రత్యేక పవిత్రతను ఆపాదిస్తున్నాయి.
గదాధర పద్ధతి, ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథాలలో ఈ తిథిని అపరాజితా దశమిగా పేర్కొన్నారు. ఇది యుద్ధ దేవత ఆరాధన దినం. అపరాజితా దేవి విజయానికి అధి దేవత. ఆమె పూజ రాజులకు మరీ ముఖ్యమైన పర్వం. దసరా నాడు శమీపూజ, దేవీ విసర్జనం, రాజ్ఞస్సీమోల్లంఘనం, అశక్తౌస్వాయుధాది నిర్గమనం, దశరథ లలితా వ్రతం, కూష్మాండ దశమీ వ్రతం మున్నగునవి కూడా ఆచరిస్తారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఆదిమ శక్తి, ఆదిమ కుటుంబిని అయిన పరమేశ్వరి దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే పర్యాయాభిదానాలతో ప్రజలచే పూజలను పొందే శుభవాసరాలివి.
లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి దుర్గ మహిషాసుర మర్దిని అయి ప్రజలను లాలించి, పాలించిన శుభ ఘడియలను స్మరించుకోవడానికి ఏర్పడిన శుభదినాలు- ఈ శరన్నవరాత్రులు. శ్రీరాముడు విజయదశమి నాడే దుర్గాపూజ చేసి రావణుడిని సంహరించి సీతను పొందాడు. పాండవులు విజయదశమీ పర్వ సంబంధ కార్యకలాపాన్ని నిర్వర్తించిన పిదపే కౌరవులను సంహరించి రాజ్యాన్ని పొందారు.
ఆశ్వయుజ శుద్ధ దశమి మధ్వాచార్య జయంతి దినం కూడా. విళంబి నామ సంవత్సరం, క్రీస్తు శకం 1238 సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడే త్రిమతాచార్యులలో మూడవ వాడైన మధ్వాచార్యులు జన్మించారు. హిందూమత వికాసానికి ఈయన చేసిన ఉపకారం అమూల్యమైనది. ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రసాదించిన ఈయన భక్తితత్త్వానికి నూతనోత్సాహాన్ని కలిగించారు.
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి, అక్టోబరు 9, బుధవారం
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి పాశాంకుశైకాదశిగా ప్రతీతి. యమపాశానికి అంకుశంగా పనిచేసే ఏకాదశి ఇది అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నరకప్రాప్తి లేకుండా చేసి స్వర్గలోకాన్ని పొందేటట్టు చేస్తుంది. అందుకే దీనిని ‘పాపాంకుశ’ ఏకాదశిగా కొన్ని వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించే మధన ద్వాదశి వ్రతానికి ఆశ్వయుజ శుక్ల ఏకాదశి ప్రారంభ దినం. ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యప్రదమైనది. ఈ వ్రతం చేయదల్చిన వారు ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసీ సహిత శ్రీ మహావిష్ణువును సమాహిత చిత్తంతో పూజించాలి. తులసీ కోట వద్ద పంచపద్మా పెట్టాలి. అయిదు దీపాలు పెట్టాలి. అయిదు రకాలైన నైవేద్యాలు ఉంచాలి. ఇట్లా కార్తీక శుక్ల పక్ష ఏకాదశి వరకు చేయాలి. ద్వాదశి నాడు చలిమిడి కర్రరోటిలో పాలు పోసి చెరుకు కర్రలతో చిలకాలి.
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి, అక్టోబరు 10, గురువారం
ఈ తిథి నాడు విశోక ద్వాదశి, గోవత్స ద్వాదశి వంటి వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అఖండ ద్వాదశీ, పద్మనాభ ద్వాదశీ వ్రతం ఆచరించాలని కూడా అందులో రాశారు. అలాగే, ఈనాడు వాసుదేవ పూజ చేయాలని, ఉపవాసం ఉండాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ, అక్టోబరు 13, ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ నాడే వాల్మీకి జయంతి అని అంటారు. ఈనాడు కొన్ని వింతైన వ్రతాలు, పూజలు ఆచరణలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది కోజాగౌరీ వ్రతం. అశ్వనీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి సమీపంగా ఉండే రోజున కోజాగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని సాయంత్రం చేయాలి. తన తొలి చూలి బిడ్డకు ఈనాడు తల్లి కొత్త బట్టలు ఇస్తుంది. ఆ తల చుట్టూ ఒక దీపం తిప్పుతుంది. ఆపై అక్షింతలు చల్లి దీర్ఘాయురస్తు అని దీవిస్తుంది. ఇది దేవవైద్యులైన అశ్వనీ కుమారుల రక్షణలో తన బిడ్డను ఉంచడానికి తల్లులు చేసే పర్వంలా దీనిని బట్టి తోస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు నారదీయ పురాణాన్ని దానం చేస్తే ఇష్టలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. కోజాగౌరీ పూర్ణిమ వ్రతం లక్ష్మీదేవికి, శ్రీరామునికి ప్రియమైనదని అంటారు. ఈనాటి అర్ధరాత్రి వేళ లక్ష్మీపూజ చేస్తారు. ఆహ్వానించిన అతిథులకు కొబ్బరికాయలోని పాలు పంచిపెడతారు. ఆశ్వయుజ మాసంలో ఆచరించే వ్రతాల్లో విశేష భాగ్యప్రదమైన వ్రతం ఏదని వాలఖిల్య రుషిని ఇతర రుషులు ప్రశ్నించాడట. అందుకు బదులుగా వాలఖిల్యుడు ‘కోజాగౌరీ’ వ్రతాన్ని గురించి చెప్పాడు. ఆశ్వయుజ పౌర్ణమి నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ దిరుగుతూ ప్రతి ఇంటి వద్దా నిలిచి పిలుస్తుందట. కాబట్టి ఈనాటి రాత్రి ప్రతి వారు కనీసం అర్ధరాత్రి అయ్యే వరకైనా మేలుకుని ఉంటారు. అర్థరాత్రి వేళ లక్ష్మి వచ్చి ప్రతి ఇంటి వద్ద ఎవరు మేలుకుని ఉన్నారని అడుగుతుందట. ఎవరూ పలకకపోతే చల్లగా వెళ్లిపోతుందట. అందుమీద ఈ ఇంటికి లక్ష్మీ ప్రసన్నం లేకుండా పోతుందట. ఈనాడు కౌముద్యుత్సవం, అక్షక్రీడ, లక్ష్మీంద్ర కుబేరాది పూజ వంటివి చేయాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆశ్వయుజ పూర్ణిమ తిథి నాడు ముఖ్యంగా కౌముదీ వ్రతం ఆచరించాలని, లక్ష్మిని, ఇంద్రుడిని పూజించాలని, రాత్రి జాగరణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ రాత్రి అంతా మేల్కొని ఉండటానికి అక్షక్రీడ (జూదం) అనే వినోదాన్ని కూడా ఈ వేడుకలో జోడించారు. ఇక, ఆంధప్రదేశ్‍లో ఈనాడు గొంతెమ్మ పండుగ జరుపుతారు. మాలలు ఈ దేవతను ఎక్కువగా పూజిస్తారని అంటారు. ఇందుకో కారణం కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక యుద్ధంలో మరణించిన వారికి తిలోదకాలు, తర్పణాలను ధర్మరాజు విడుస్తుండగా మధ్యలో కర్ణుని చెయ్యి వచ్చింది. ఇదేమిటని ధర్మరాజు వ్యాసుడిని అడిగాడు. ‘అతను మీ అన్న. తర్పణం విడువు’ అని వ్యాసుడు చెప్పాడు. అలాగే చేసి ధర్మరాజు ఇంటికి వచ్చి తల్లి కుంతిని నిజం చెప్పాలని బలవంతం చేశాడు. ఆమె చిన్నప్పటి తన గాథను విచారంతో చెప్పింది. ‘ఇదే విషయం ముందు చెప్పి ఉంటే కర్ణుడిని చంపకుండా ఉండేవాళ్లం కదా! ఈ తప్పునకు కారణం నువ్వే. కాబట్టి నువ్వు మాలలకు దేవతవు కమ్ము’ అని శపించాడు. ఇంకా- ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు’ అని కూడా శపించాడు. ఈ కారణంగానే గొంతెమ్మ (కుంతి) మాలలకు ఇలవేల్పు అయ్యింది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు ఈ వ్రతం చేయదగినది.
ఆశ్వయుజ బహుళ పాడ్యమి, అక్టోబరు 14, సోమవారం
ఆశ్వయుజ బహుళ పాడ్యమి తిథి నాడు జయావ్యాప్తి వ్రతం ఆచ రించాలి. ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.
ఆశ్వయుజ బహుళ విదియ, అక్టోబరు 15, మంగళవారం
ఈ తిథి అట్లతద్ది భోగి. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పర్వాలకు పూర్వపు రోజును భోగి అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్ల తద్ది భోగి మాదిరిగానే అట్లతద్ది భోగి నాడు కూడా తలంటి పోసుకుంటారు. గోరింటాకు నూరి గోళ్లకు, వేళ్లకు అలంకరించుకుంటారు. తెల్లవారగానే ఉట్టి కింద ముద్ద తింటారు. తాంబూలం వేసుకుని ఆడుకుంటారు. ఇంకా ఈనాడు అశూన్య వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.
ఆశ్వయుజ బహుళ తదియ, అక్టోబరు 16, శనివారం
అట్ల తద్దిగా ఈ తిథి ప్రసిద్ధి. దీనినే చంద్రోదయోమా వ్రతం అని కూడా వ్యవహరిస్తారు. ఈ వ్రతమే అట్లతద్దిగా తెలుగునాట ఆచరణలో ఉంది. ఈ రోజు స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజిస్తారు. భోగి నాడు మొదలుకుని తెల్లవారి తద్ది నాడు పగటి పూజ భోజనం చేయరు. తాంబూలం మాత్రం తరచూ సేవిస్తూ రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. పగటి వేళలో వీలైనంత వరకు ఉయ్యాలలూగుతారు. ఈ ఉయ్యాలలను ఇళ్లలో కాక తోటల్లో, దొడ్లలో పెద్దచెట్లకు వేస్తారు. సాయంత్రం ఉమాదేవిని పూజించి, చంద్రుడిని చూసిన తరువాత అట్లు మున్నగు పిండి వంటలతో భోజనం చేస్తారు. ఇదీ అట్లతద్ది నాటి తెలుగు మహిళల కార్యకలాపం. ఇది అతివల పండుగ. నగర స్త్రీల కంటే పల్లెటూరి పడుచులు ఈ పండుగను ఎక్కువగా, మనోజ్ఞంగా అనుభవిస్తారు.
అట్లతద్ది నోము నోస్తే కన్యలకు ముసలి మొగుడు రాడని, వివాహమైన వారికి నిండు ఐదవతనం కలుగుతుందని అంటారు.
ఆశ్వయుజ బహుళ పంచమి, అక్టోబరు 19, శనివారం
గధాధర పద్ధతిలో ఈనాడు ఘోటక పంచమి తిథిగా పేర్కొన్నారు.
ఆశ్వయుజ బహుళ అష్టమి, అక్టోబరు 21, సోమవారం
ఈ తిథి జితాష్టమిగా ప్రతీతి. ఈనాడు జీమూతవాహన పూజ చేస్తారు. ఇది స్త్రీలకు పుత్రసంతానాన్ని కలిగించే వ్రతం. సౌభాగ్యప్రదమైనది. సాయం కాల ప్రదోష సమయాన ఈనాడు పూజలు ఆచరిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ వ్రతం మిక్కిలి ఆచారంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు మంగళావ్రతం, కృత్వసార సముచ్ఛయంలో మహాలక్ష్మీ వ్రతాన్ని ఆచరించా లని ఉంది. కృత్యసార సముచ్ఛయంలో ఈ అష్టమిని జీవత్పుత్రికాష్టమీ అని పేర్కొన్నారు. అంటే పుత్ర సంతానాన్ని కలిగించే వ్రతమని ప్రతీతి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథిని కాలాష్టమిగా వ్యవహరించారు.
ఆశ్వయుజ బహుళ నవమి, అక్టోబరు 22, మంగళవారం
ఈ తిథి నాడు రథ నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు దుర్గాపూజ చేయాలని కూడా అంటారు.
ఆశ్వయుజ బహుళ ఏకాదశి, అక్టోబరు 24, గురువారం
ఈ ఏకాదశి తిథిని రమైకాదశిగా ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో పేర్కొన్నారు. శోభనుడు అనే రాజు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వర్గలోక ప్రాప్తి పొందాడని ప్రతీతి. కొన్ని గ్రంథాలలో ఈనాడు వాల్మీకి జన్మించిన రోజని ఉంది. బోయి కులస్తులు కొన్ని ప్రాంతాలలో వాల్మీకి జయంతిని ఈనాడు కూడా నిర్వహిస్తారు.
ఆశ్వయుజ బహుళ ద్వాదశి, అక్టోబరు 25, శుక్రవారం
ఇది ధన్వంతరి జయంతి తిథి. ధన్వంతరి గొప్ప వైద్య విద్యావేత్త. పాల కడలి నుంచి అమృతభాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ధన్వంతరి కలశం నుంచి పుట్టాడు. అది ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు జరిగిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. భరద్వజుని వద్ద ధన్వంతరి శిష్యరికం చేసి ఆయర్వేద విద్యను నేర్చుకున్నాడని ప్రతీతి. దివోదాసు పేరుతో ఆయన కాశీకి రాజయ్యాడని కూడా పురాణ కథనం. ఒక చేత్తో జలగ, మరో చేత్తో అమృతభాండం పట్టుకుని ధన్వంతరి జన్మించాడని అంటారు. ధన్వంతరి అమృత కలశంతో పుట్టాడని, ఆ కలశంలోని అమృతం సేవించడం వల్ల అన్ని విధాలైన రోగాలు నశించాయని ఐతిహ్యం. ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరి పూజ చేసే వారికి రోగ భయం ఉండదని చెబుతారు. ఇక, ఇదే రోజును దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాఘ్ర ద్వాదశిగా కూడా జరుపుకొనే ఆచారం ఉంది. గుజరాతీలు దీనిని ‘వాగ్‍బరాస్‍’ అంటారు. అక్కడి వాగ్‍ బరాస్‍ నాటికి దీపావళి మూడు రోజులు ఉంటుంది. దీపావళి పండుగ గుజరాతీయులకు కొత్త సంవత్సరాది. మాళవ దేశ మహిళలు గోవత్స ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. దూడతో కూడిన ఆవును పూజించడం వారి ఆచారం. ఈ పూజ శిశువు క్షేమార్థం నిర్వహిస్తారని అంటారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి, అక్టోబరు 26, శనివారం
ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథం ఈ రోజును ధన త్రయోదశి అంటోంది. త్రయోదశి అనగా పదమూడో తిథి. పాశ్చాత్యుల్లో 13 అంకె మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ, భారతీయ సంప్రదాయంలో ఇది మంచి తిథి. ఈ రోజు పూజలు ఆచరిస్తే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని వారి విశ్వాసం. ధన త్రయోదశి రోజు శుచిగా, శుభ్రంగా ముస్తాబై ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాల్ని పాలతో కడుగుతారు. ఇక, మాళవ దేశంలో ఈ రోజున వర్తకులు తమ లెక్కలు సరి చూసుకుంటారు. ఈనాడు యమలోకంలోని పితరులు తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్తుల నమ్మిక. ధన త్రయోదశి నాడు సాయంత్రం వారు తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. వచ్చే పితరులకు అది దారి చూపుతుందని నమ్ముతారు. ఈనాడు ఇంటిలో గదికి ఒక దీపమైనా ఉంచుతారు. ఇంటిలో దీపాలు స్త్రీలు పెడతారు. రోడ్డు మీద దక్షిణ దిక్కుగా పెట్టే దీపం తల్లిదండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు ధన్‍ తేరస్‍గా వ్యవహరిస్తారు. ఈనాడు ఎంతో కొంత మొత్తంలో బంగారం కానీ, కనీసం వెండినైనా కానీ కొనాలనే ఆచారం ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. ఇక, తెలుగు నాట ఇళ్లలో లక్ష్మీపూజ ఈనాడు ఆచరిస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు ఈ తిథి వస్తుంది. ఇంకా ఈనాడు గోత్రిరాత్ర వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అక్టోబరు 27, ఆదివారం
ఈ తిథి నరక చతుర్దశి తిథి. దీనికే ‘ప్రేత చతుర్దశి’ అనే పర్యాయ నామం కూడా ఉంది. ఈనాడు నరకముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని వ్రత చూడామణి అనే గ్రంథంలో ఉంది. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి – చతుర్దశి తిథుల మధ్య కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ పండుగను జరుపుకోవడం ఆచారం. నరకాసురుడిని కృష్ణుడు సంహరించిన దినం కావడం వల్లనే దీనికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందని చెబుతారు.
ఆశ్వయుజ బహుళ అమావాస్య, అక్టోబరు 28, సోమవారం
ఈనాడు దీపావళి. దేశమంతటా కోలాహలంగా జరుపుకునే పర్వమిది. ఈనాటి నుంచే కార్తీక శుద్ధ పాడ్యమి తిథి కూడా ప్రారంభమవుతుంది. కార్తీక స్నానమారంభ దినం ఇది.

Review శక్తి మాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top