ఆరోగ్య ప్రదాత

ఏ దేశ సంప్రదాయం చూసినా సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. జీవశక్తినిచ్చే భగవానుడు. అత్యంత శక్తి సంపన్నుడు. ఆపన్నుల పాలిట కరుణారస హృదయుడు. సూర్యుడు ఈ సృష్టికి, వాతావరణానికి ఆద్యుడు. మన ఉనికికి మూలం. సూర్యుడు లేనిదే జీవరాశికి మనుగడ లేదు. అందుకు కృతజ్ఞతగా అనాదిగా సూర్యుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు మనిషి. ఆ ప్రార్థన ఒక వ్యాయామ విధానం. అందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. సూర్య నమస్కార విధానాలు నిజంగా అభినందనీయమైన ఒక కూర్పు. సూర్యుడు కాలానికి ఆద్యుడు. అటువంటి ఆదిత్యునికి ఉదయాన్నే లేచిన వెంటనే ఒక నమస్కారం చెయ్యడం మన కృతజ్ఞత. అదే మన సంప్రదాయమైంది. అదే సంధ్యా వందనం. దీనికి కాస్త కదలికలను జోడిస్తే అవే సూర్య నమస్కారాలు.
సూర్య నమస్కారాలు ఒక అద్భుతమైన వ్యాయామ పద్ధతి. ఒక విశిష్టమైన ఆసన సరళి. ఒక మహోన్నత మైన శ్వాస నియంత్రణ. ఒక పరమోత్క•ష్ట ధ్యాన విధానం. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి చూడటానికి ఏదో సాధారణమైన ‘బస్కీలు’, ‘దండీలు’గా కనిపిస్తాయి కానీ, నిజంగా ఓసారి అభ్యసించి చూస్తే కానీ తెలియదు ఆరోగ్యానికి ఇవెంత మేలు చేస్తాయో!. ఆచరించి చూస్తే కానీ తెలియదు ఆరోగ్యానికి ఇవెంత ఐశ్వర్య ప్రదాయినులో!. సూర్య నమస్కారాలలో ఉండే ఒక క్రమం, ఒక లయ, ఒక పద్ధతి చూసే వారికి కూడా కనులకు ఇంపుగా ఉంటుంది.
ఉదయాన్నే వ్యాయామమే ఒక చక్కని అనుభూతి. అలాంటిది తూర్పు దిక్కు ఎర్రబారుతూ ఉండగా ఒక పక్క కువకువ స్వరాలతో స్వాగత సుమాంజలులు పలుకుతూ ఉంటే, నవ పల్లవాలు చిరుగాలికి అలలా కదులుతూ ఉంటే, ఓ తెలిమంచు తెర భూదేవిని కప్పి ముద్దు చేస్తుంటే అపుడు నిశ్వసించిన పుడమి నిట్టూర్పులకు పుట్టుకొచ్చిన మంచు రేణువులు ఇలాంటి ఆహ్లాదకర ప్రకృతితో, ప్రశాంత చిత్తానికి మనలని తీసుకువెళ్లే తరుణంలో తన అరుణారుణ కిరణాలతో తన చైతన్యాన్ని నును లేత కిరణాల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని నింపి, సకల జీవులకు జవజీవాల్ని నింపడానికి సమాయత్త మవుతూ ఉన్న ప్రత్యక్ష దైవానికి కృతజ్ఞతా పూర్వక మైన నివాళి ఈ సూర్య నమస్కారాలు.
సూర్య నమస్కారాలు మనకు సనాతనమైనవి కాదని చెప్పడానికి చాలా తార్కాణాలు ఉన్నాయి.
ఇవి తరువాత కాలంలో యోగాసనాలను ఒక పొందికగా కూర్చి చేసిన ఒక ప్రయత్నం అని తెలుస్తుంది. యోగాసనాలను నేర్చుకునేటప్పుడు మనం ఒక రకమైన గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఇన్ని ఆసనాలు నేర్చుకుంటున్నాం కదా.. ఏవి ముందు? ఏవి తరువాత? ఎన్ని వెయ్యాలి? అనే సందేహం కూడా కలుగుతుంది. అలాంటి సందేహాలకు చక్కని సమాధానమే ఈ సూర్య నమస్కారాలు.
సూర్య నమస్కారాలు ఒక చక్కని వ్యాయామ పద్ధతే కాకుండా, ఇది ఆరోగ్యాన్నిచ్చే ఒక సాధనం. ఎందుకంటే ఉదయం పూట సూర్యకాంతిలో మనం వ్యాయామం చేసేటప్పుడ్రు మన శరీరంలోని కొలెస్ట్రాల్‍ కరిగి, మన చర్మానికి అవసరమైన విటమిన్‍ ‘డీ’ని తయారు చేస్తుంది. దీనిని మనం శాస్త్రీయంగా నిరూపించవచ్చు. అలాగే నేటి కాలంలో ‘మోనోపాజ్‍’ సమస్యలు చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. ఇలా స్త్రీ పురుషుల్లో ఇద్దరిలోనూ 35-40 ఏళ్లకి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాంటి మోనోపాజ్‍ వచ్చిన వారికి సూర్య నమస్కారాలు మంచి సమాధానం అని ‘హార్మోన్‍ స్పెషలిస్టులు’ సూచిస్తున్నారంటే, వీటి గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.
సూర్య నమస్కారాలు ఒక పరిపూర్ణ వ్యాయామ విధానం. దీనికి ‘డైనమిక్‍ ఎక్సర్‍సైజ్‍’ అని కూడా మరో పేరు కూడా వ్యావహారికంలో ఉంది. ఎందుకంటే, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన శరీరంలోని ప్రతి కండరం, ప్రతి భాగం, ప్రతి అవయవం, ప్రతి అంగుళం కూడా ఇన్‍వాల్వ్ అవుతాయి. ప్రతి కీలు, ప్రతి టెండన్‍, ప్రతి లిగమెంట్‍ కదులుతాయి. కాబట్టి మొత్తం శరీరానికి సూర్య నమస్కారాలను మించిన మంచి వ్యాయామం లేదు.
సూర్య నమస్కారాలలో మనం ఇంకా గమనించేదేమంటే మంచి స్ట్రెచింగ్‍ ఎక్సర్‍సైజులు. వీటి వలన కండరాలు బాగా సాగి వాటిలో నిలువ ఉన్న లాక్టిక్‍ ఏసిడ్స్ రూపంలో ఉన్న మెటబాలిక్‍ వేస్ట్ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. తద్వారా శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. అలాగే, యోగాసనాల్లో ఉన్న ‘కౌంటర్‍ పోజెస్‍’ కూడా సూర్య నమస్కారాలతో ఒక క్రమ పద్ధతిలో పొందుపరిచారు. ఉదాహరణకు ఒక బేసిక్‍ వర్డ్ బెండింగ్‍ ఆసనం తరువాత వెంటనే ఒక ఫార్వర్డ్ బైండింగ్‍ ఆసనం వస్తుంది. మధ్యలో సాష్టాంగ నమస్కారం పేరుతో రిలాక్సేషన్‍ టైం కేటాయించారు. అలాగే నించుని, బోర్లా పడుకునే విధంగా కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా అలా బోర్లా పడుకుని తిరిగి లేచి నిలుచోడానికి వీలుగా ఆసనాలు రూపొందించారు. జాగ్రత్తగా దృష్టి పెట్టి చేస్తే సూర్య నమస్కారాలను చాలా సులువుగా నేర్చుకోవచ్చు.
సూర్య నమస్కారాలు యోగాసనాల మేలి కూర్పు. ఇంకా ఆలోచించి చేస్తే వీటిని మామూలు ఫిజికల్‍ ఎక్సర్‍సైజ్‍ల మాదిరిగా కూడా చెయ్యవచ్చు. అంత వీలుగా ఉంటాయి సూర్య నమస్కారాలు. మీకు ఇంకా సృజనాత్మకత ఉంటే వీటిలో ప్రాణాయామాన్ని కలపవచ్చు. గాలి పీల్చడం, వదలడం లోపల ఉంచుకోవడం, బయటకు వదిలి మళ్లీ పీల్చుకోకుండా ఉండటం.. ఇలా వివిధమైన దశలను మనం అభ్యాసం చేయవచ్చు. అలా చెయ్యడం వలన మనలోని శారీరక దృఢత్వ స్థాయిలు అనకున్న దాని కంటే బాగా పెరుగుతాయి. ఎందుకంటే, సాధారణమైన వ్యాయామంలో మనలోని గుండె వేగం తగ్గిపోతుంది. ఇక ధ్యానాన్ని కూడా దీంట్లో మంత్ర రూపంలో ప్రవేశ పెట్టుకోవాలి. అప్పుడు పూర్తిగా ఇదొక అత్యద్భుత సాధన అవుతుంది.
ఇక సూర్య నమస్కారాల సాధన మొదలుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా వయసు యాభై అయిదు సంవత్సరాలు దాటాక మొట్టమొదటసారిగా సూర్య నమస్కారాలు ప్రారంభించడం అంత మంచిది కాదు. మొదట రెండు, మూడు నెలలు మిగతా ఆసనాలు వేశాక వీటిని నేర్చుకోవడం ఉత్తమం. అలాగే, బీపీ, నడుము నొప్పితో బాధపడే వారు, వీటిలో ఫార్వర్డ్ బెండ్స్ (పాదహస్తాసన, పర్వతాసన విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం నడుము నొప్పి పెరిగినా, వీటిని మానివేసి మిగతా వాటినే ప్రాక్టీస్‍ చేయాలి) అలాగే ప్రాణాయామ పద్ధతుల్ని ముఖ్యంగా కుంభకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ముందుగా కొన్ని రోజులైనా మీరు మామూలుగా సూర్య నమస్కారాలను ప్రాక్టీస్‍ చేసి ఉండి ఉండాలి. మొట్ట మొదటిసారే పర్‍ఫక్షన్‍ కోసం తాపత్రయ పడితే ఇబ్బందులు ఏర్పడతాయి.
‘మొదట్లో ఇబ్బంది.. ఆపై హాయి..హాయి..’ ఇదీ వ్యాయామంలో కలిగే అనుభూతి. వ్యాయామం అనగానే మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. శరీరం కొత్త కదలికలకు అనుగుణంగా మారే క్రమంలో భౌతిక సమస్యలు ఏర్పడతాయి. సూర్య నమస్కారాలు చేసిన మొదటి రోజున కొద్దో గొప్పో ఒళ్లు నొప్పులు రావడం సహజం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సూర్య నమస్కారాలు సాధన చేస్తే మీ శరీరంలో కలిగే మార్పుల్ని, ఆరోగ్యంలో కొత్తగా కలిగే ఒక సామ్యతని మీరే గమనించడం మొదలు పెడతారు. ఆపై అభ్యాసం అనేది దినచర్యగా మారిపోతుంది.

Review ఆరోగ్య ప్రదాత.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top