లాలీ పరమానంద….

పదం పదంలో అమ్మ ప్రేమను నింపి అందమైన లాలిపాటలను కట్టి ఏడుకొండల వాడినే ఉయ్యాలలూపిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. మాటల్లో మార్దవాన్ని రంగరించి రచించిన ఆ లాలిపాటలు ‘తెలుగుతల్లి’కి అన్నమయ్య ఇచ్చిన అపురూప కానుకలు.
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా.. జోజోఅని పాడే తల్లి జోలకి నిద్రపోని చిన్నారులు తెలుగునాట ఉంటారా? ఇది అన్నమయ్య విరచితమే. ‘అంగజుని గన్న మాయన్న ఇటు రారా – బంగారు గిన్నెలో పాలు పోసేరా’ అని ఒక చరణంలో అంటాడు. అంగజుడు అంటే మన్మథుడు. మన్మథుడు తండ్రి విష్ణువు. మన్మథుడు చాలా అందగాడు. అతని తండ్రి ఇంకెంత అందగా ఉంటాడో కదా! అలాంటి విష్ణుమూర్తిని ‘మాయన్న’, ఇందులో అన్న అంటే తండ్రి అనే అర్థమూ ఉంది. అంటే ‘మా నాయన’ ఇటు రారా అని గోముగా పిలుస్తున్నాడు అన్నమయ్య. ఏ తల్లి అయినా తన బిడ్డను మా నాయనా. నా బంగారం అంటూ ముద్దు చేస్తుంది. అఖిల భువనాలను ఏలే తండ్రి ఇక్కడ అన్నమయ్య పొత్తిళ్లలో పసిబాలుడు.
‘గోవర్ధనంబెల్ల గొడుగుగాబట్టి- కావరమున నన్ను కంసుబడగొట్టి’ అంటూ ఆ పరమాత్ముడి గొప్పదనం చాటాడు. ఏ తల్లికి తన బిడ్డలు ముద్దు కాదు? ఇది అన్నమయ్య రాసిన జోలపాట కాదన్న వాదన ఉంది. అయితే పాట మకుటంలో ‘హంగుగా తాళ్లపాక అన్నమయ్య’ అని ఉండటం వల్ల ఇది అన్నమయ్య జోలపాటగానే చలామణి అవుతోంది. భావపరంగా వినడానికి ఇది లాలిపాటలా కనిపించినా ఇందులో ఎంతో చవన పరిపుష్టి ఉంది. తెలుగు తియ్యదనమూ, అమ్మభాషకు ఉన్న ఆత్మీయతా కనిపిస్తాయి.
అన్నమయ్య ఒకటీ అరా లాలి పాటలు రాసి ఊరుకోలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారీ లాలి పాటలు రాశాడు. దేవుడిని శిశువును చేసి, తన స్వహస్తాల ఉయ్యాలలో ఊపి తల్లిగా మారాడు. ‘ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్య – వెయ్యారు గోపికలు వేడుకనూచెదరు’ అనే పాటలో లోకాలు ఏలేటి వేంకటేశ్వరుడిని ‘ఆగమసన్నుతా అచ్యుతానందా’- యోగనిద్ర పోవయ్య యోగీంద్రవంద్యా’ అని యోగనిద్ర పేర్చుతాడు అన్నమయ్య. లోకాలు ఏలితేనేం నా ఒడిలో నువ్వొక పసిబాలుడివేనన్న గర్వం కనిపిస్తుంది. తల్లికి తన పిల్లలను పొత్తిళ్లలో పడుకోబెట్టుకుని లాలించడం ఓ మధురానుభూతి. ఆ అనుభూతినే అన్నమయ్య పొందాడిక్కడ.
తల్లి ఉగ్గు పెడుతూంటే శిశువు పొందే ఆనందం, చేసే అల్లరి అనుభవించాల్సిందే తప్ప మాటలకు వర్ణనాతీతం. ఉగ్గు పెడుతూ తల్లి పాడిన పాటలే తెలుగు సాహిత్యంలో ఉగ్గుపాటలుగా ప్రసిద్ధి చెందాయి. అన్నమయ్య కూడా ‘ఉగ్గు పెట్టరే వోయమ్మా – చెయ్యొగ్గీ నిదె శిశువోయమ్మా’ అంటూ ఒక సంకీర్తనలో ఏడుకొండల వాడికి ఉగ్గు పట్టిస్తాడు. ‘కడుపులోని లోకమ్ములు గదిలే – నోడ లూచకురే వోయమ్మా, తొడికెడి సరుగున తొలగదీయరే – పుడికెడి పాలివి వోయమ్మా’ అంటూ ఎంతో నింపాదిగా ఉగ్గుపట్టమని అమ్మలక్కలను హెచ్చరిస్తాడు. గట్టిగా కుదిపితే కడుపులోని పాలూ తొణికిపోతాయట. ఇక్కడ దేవుడూ, భక్తి అన్నవి పక్కన పెట్టి చూసినా ఎంతో రసాత్మకంగా అమ్మ ప్రేమను ఒలికిస్తాడు. వీటిలో తల్లి మమకారమే కాదు అచ్చ తెనుగు నుడికారమూ ఉంది. భాషకు పరిపుష్టి కలిగించే ఈ పాటలు తెలుగు పదాన్ని చుట్టిన తేనె తుట్టెలు.

Review లాలీ పరమానంద…..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top