శరీరానికీ, మనస్సుకీ సేద తీర్చేది నిద్ర. నిద్ర లేకపోవటం ఓ అనారోగ్య చిహ్నం. ఎంతటి సౌకర్యవంతమైన పడక గదిలో, పట్టుపరుపులపైన వున్నా, నిద్రరాదు కొందరికి – ఎటువంటివారికి నిద్ర పట్టదు?
మహాభారతంలో విదురులవారు ఈ శ్లోకాన్ని చెప్పారు.
శ్లో।। అభియుక్తం బలవతా
దుర్బలం హీనసాధనమ్ ।
హృతస్వం కామినం చోరమ్
ఆవిశన్తి ప్రజాగరాః ।।
– మహాభారతం
మహారాజా! బలవంతునితో విరోధం పెట్టుకున్న దుర్బలునికి, (బలం లేనివాడికి) సమస్యని పరిష్కరించుకొనే సాధన సామగ్రి లేనివానికి, సంపద పోగొట్టుకున్న వానికీ, కాముకునికీ (తీరని కోరికలు వున్నవారికి), దొంగతనం చేసినవానికి, ఈ ఐదు రకాల వారికీ నిద్ర పట్టదు.
ఈ పట్టికలో ఇమడకుండా జాగ్రత్త పడిననాడు నిద్రలేమితో బాధపడకుండా ఆరోగ్యంగా వుండగల్గుతారు. అంటే ఎవరితోనూ విరోధం పెట్టుకోకుండా, సంపదను రక్షించుకుంటూ, కోర్కెలను అదుపులో ఉంచుకొని, పరద్రవ్యాకాంక్ష లేకుండా వున్నవారికి మానసికంగా సుఖం లభిస్తుంది. మానసిక ఆందోళనలు ఉంటే నిద్ర రాదు. నిద్ర పడితేనే మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఇందువల్ల పై దుర్గుణాలు దూరం చేసుకొంటే నిద్రకు మందులు వేసుకొనే అవసరం ఉండదు
Review నిద్ర పట్టనివారు ఎవరు?.