ముగ్గు చూడు.. ముగ్గందం చూడు

సంక్రాంతి పండగ వేళ, పల్లెటూరి తెలుగింటి పడుచుల సృజనాత్మకత రంగుల హరివిల్లులా వెల్లివిరుస్తుంది. వాళ్ల మునివేళ్ల చివరి నుంచి ఒడిసిపట్టే ముగ్గులు ఎన్ని రకాలో !
శివుడి కళ్లు, పద్మాలు, గుంటల కోనేరు, పాముల బుట్ట, ఏనుగుల ముగ్గు, పతంగుల ముగ్గు, పన్నీరు బుడ్డి, గంధపు గిన్నె, మల్లె పందిరి, తాబేలు, కొబ్బరిబోండాలు, అడ్డబాస, విస్తరాకు, బాణం, తులసికోట, గుమ్మడికాయ, వరివెన్నులు, గాదె.. ఇలాంటి ముగ్గులను వరుస చుక్కలతో, గీతలను, రేఖలను కలుపుకుంటూ నెలంతా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు ముద్దుగుమ్మలు.
ఇక సంక్రాంతి రోజు వేసే వైకుంఠ ద్వారాల ముగ్గు, కనుమనాడు వేసే రథం ముగ్గు గురించి, తెలుగు పత్రికల్లో ఇప్పటి వరకు కొన్ని వేల కార్టూన్లు తెలుగువాళ్లను నవ్వించాయి.
సందెవేళ వేసే ముగ్గుల్లో అడ్డగీతలు ఉండేటట్లుగా జాగ్రత్తపడి, ఇంట్లోని లక్ష్మిని బయటికి పోకుండా బంధిస్తుంది తెలుగింటి ఇల్లాలు.
తెలుగు పడుచు సృజన శక్తిని చూసి మురిసిన గోరటి వెంకన్న ‘‘సక్కనైన ముగ్గుల జూసి చందమామయ్యో / సుక్కాలన్ని సాటుకుబోతవి చందమావయ్యో’’ అంటూ ముచ్చటపడ్డారు.
ఇక ఇంటి ముందు తీర్చిన రంగవల్లుల్లో ఆవు పేడతో చేసి పసుపు కుంకుమలద్ది, గుమ్మడి పూలను సింగారించిన గొబ్బెమ్మలను దేవతలుగా నిలిపి, రేగుపండ్లు, చెరకు ముక్కలు, నవధాన్యాలతో అలంకరించడమూ తెలుగింటి సంప్రదాయమే.
కన్నెపిల్లలు ముగ్గులను తీర్చి గొబ్బి దేవతల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. అయితే, ‘‘చేమంతి పువ్వంటి – చెల్లిల్నియ్యవే’’ అని అక్కడి వరకూ బాగానేపాడి, ‘‘మొగలి పువ్వంటి – మొగుణ్నియ్యవే’’ అంటూ తడబడుతూ సిగ్గుల మొగ్గలను ముంగిళ్లలో విరబూయించే దృశ్యం మన తెలుగు లోగిళ్లకే ప్రత్యేకం.
ఇంతటి కమనీయ దృశ్యం ఆవిష్క•తమయ్యేది.. సంక్రాంతి పర్వదిన సందర్భంలోనే.
ప్రాచీన మధ్యయుగంలో మానవుడు నిత్య జీవితంలో తనకు కనిపించే పక్షుల, జంతువుల బొమ్మలను వేయడం ప్రారంభించాడు. నవీన శిలాయుగం నాటికి మనిషి చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకోవడం మొదలు పెట్టాడు. ఇంటి నేలను, గోడలను పేడ, మెత్తని మన్ను కలిపి అలికి గీసిన బొమ్మలే కాలక్రమేణా ముగ్గులుగా రూపాంతరం చెందాయి. ఇక రాజుల కాలం వచ్చేసరికి సౌధాలను, ప్రాంగణాలను కస్తూరితో అలికి ముత్యాల పొడితో ముగ్గులు వేయడం గృహాలంకరణలో భాగంగా మారింది. రామాయణ కాలంలో జనకుడు ‘‘తా ముద్దు కూతురిని తాజేర బిలిచి/ఆవుపేడ దెచ్చి అయినిళ్లు అలికి/గోవుపేడ దెచ్చి గోపురాలు అలికి / ముత్యాలు చెడగొట్టి ముగ్గు వేయించా’’డని పదిహేడో శతాబ్దంలో చేమకూర వేంకటకవి గృహాలకు శోభను చేకూర్చే ఈ ‘ఆణిమెఱుంగు ముత్తెపుటొయ్యారపు ముగ్గుల’’ సింగారానికి ముగ్ధుడై తన కావ్యంలో రమణీయంగా రంగరించి రాశాడు.
అప్పుడే వేసిన గోమయం కస్తూరితో సమానమంటుంది ఆయుర్వేద శాస్త్రం.
పేడనీళ్ల కళ్లాపి జల్లిన ముంగిలి పచ్చపచ్చని కాంతితో వింతైన శోభిలీనుతూ ఉంటుంది. పచ్చని ఆ ముంగిలి తెల్లని సున్నంపొడి ముగ్గు వేయడంతో ప్రకృతి సహజమైన ప్రత్యేక అలంకరణను సంతరించుకుంటుంది. నీలాల ఆకాశంలో కాంతులీనె నక్షత్రాలను మన ఇంటి ముంగిట్లో దింపినట్లుంది ముగ్గు పెడితే. ఇంటికి వెలుగైన ఇల్లాలు ‘ముగ్గు చూడు/ముగ్గందము చూడు/ముగ్గులో ఉన్న మురిపెము చూడు..’ అంటూ మురిసి పోయిందంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి అష్టఐశ్వర్యాలతో కొలువు తీరిందనే అర్థం.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో…

Review ముగ్గు చూడు.. ముగ్గందం చూడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top