నిమ్మపండు.. ఆరోగ్యం మెండు

నల్లమద్ది: దీని చూర్ణం లేదా కషాయం వ్రణాలను ఆర్చి వేస్తుంది. కఫాన్ని, మల దోషాన్ని, పైత్యాన్ని హరిస్తుంది.
నల్ల వంకాయ:
రుచిగా, మనోహరంగా ఉంటుంది. కఫ, పైత్యాలను అణచివేస్తుంది. రుచిని పుట్టిస్తుంది. విరేచనాన్ని జారీ చేస్తుంది. అతిగా తింటే నేత్రరోగాలను కలుగచేస్తుంది.
నార చీర: వాతాన్ని తగ్గిస్తుంది. చలి, ఎండల వలన కలిగే బాధలను అణచివేస్తుంది. శుచిగా ఉంటుంది.
నారింజ: ‘సి’ విటమిన్‍ అధికంగా లభించే పండు ఇది. చెట్టున పండినదయితే తియ్యగా ఉండి చలువ చేస్తుంది. పైత్యాన్ని హరిస్తుంది. మూత్రాన్ని జారీ చేసి పొట్టకు బలాన్నిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. రక్తాన్ని
శుభ్రపరుస్తుంది. పుల్లని పండయితే ఉష్ణతత్వం కలవారికి అనుకూలంగా ఉంటుంది. దబ్బపండు, కమలాఫలం, బత్తాయి, తియ్య నిమ్మపండు, ఈడెపండు.. ఇవన్నీ నారింజ జాతికే చెందుతాయి. వీటిలో ఏది తీసుకున్నా వెంటనే నీళ్లు తాగకూడదు. తాగితే పొట్ట పాడవుతుంది. నీళ్ల విరేచనాలు అవుతాయి. జ్వరం వచ్చే అవకాశం ఉంది.
నారింజ తొక్క: నారింజ జాతికి చెందిన ఏ పండ్ల తొక్కలయినా సువాసన కలిగి చేదుగా ఉంటాయి. వీటి చూర్ణం గాని, కషాయంగాని తీసుకుంటే కడుపులోని వాతం పోతుంది. అగ్నిమాంద్యం, పైత్య జ్వరాలు కూడా పోతాయి.
నిద్రగన్నిక: దీనిని అత్తిపత్తి చెట్టని కూడా వ్యవహరిస్తారు. దీనిని ముట్టుకుంటే చాలు.. ముడుచుకునిపోతుంది. దీని కషాయం లేదా చూర్ణం మేహశాంతి, పైత్యశాంతిని కలుగచేసి, వీర్యవృద్ధిని కలిగిస్తుంది. ఇంద్రియ నష్టాన్ని అరికడుతుంది. మూలవ్యాధి, భగందరాలను పోగొడుతుంది. చూర్ణాన్ని ఆవుపాలతో తీసుకుంటే శ్రేష్టం. దీని పచ్చి ఆకును నూరి కడితే వరిబీజం పోయే అవకాశం ఉంది. గడ్డలు కరిగిపోతాయి. దీని ఆకు నూరి పూసిన పక్షంలో భగందరం మానిపోతుంది. దీని రసంలో గుర్రపు మూత్రాన్ని కలిపి చేసిన అంజనం కంటిపొరలను పోగొడుతుంది.
నిద్ర: రాత్రి నిద్ర దేహపుష్టిని, బలాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని కలిగిస్తుంది. జఠరాగ్నిని వృద్ధి చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి సర్వేంద్రియాలకు సౌమ్యతను ఇస్తుంది. వీర్యపుష్టిని కలుగచేస్తుంది. సుఖం, బుద్ధి, కాంతి, బలిమి, ఆనందం, ఆరోగ్యాలను కలిగిస్తుంది.
నిద్రలేమి: వేడి చేస్తుంది. కళ్లకు జబ్బు చేస్తుంది. బడలికగా ఉంటుంది. అజీర్ణాన్ని కలుగచేస్తుంది. రోగాలను పుట్టించి బుద్ధి బలాన్ని తగ్గిస్తుంది. మెదడు నరాలకు సంబంధించిన రోగాలను పెంచి దగ్గు, పడిసెంను కలుగచేస్తుంది.
నులకమంచం: దీని మీద పడుకుంటే కఫ, వాత, పైత్యాలు తగ్గుతాయి. చలికాలంలో ముసలివారికి, చలిజ్వరం సోకిన రోగులకు, పురటాళ్లకు వాతాది రోగాలు రాకుండా ఇది కాపాడుతుంది.
నువ్వుండలు: బెల్లం పాకం పట్టి చేసిన నువ్వుండలు వాతాన్ని, కంటికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులను పోగొడతాయి. వీర్యవృద్ధిని కలిగించి పుంసత్వాన్ని హెచ్చిస్తాయి.

నిమ్మకాయ: పచ్చి నిమ్మకాయ రసం దాహం, శూల, ఎక్కిళ్లు, చర్ది, శ్వాస, వాత, శ్లేష్మాలను పోగొడుతుంది. పైత్యాన్ని కలుగచేస్తుంది.
నిమ్మపండు: ఆకలిని, జీర్ణశక్తిని కలుగచేస్తుంది. త్రిదోషహరమయినది. మతిభ్రమ, నేత్రరోగం, శ్రమ, దురదలు, అరుచి, దాహం, శూల, ఎక్కిళ్లు, శ్వాస, కఫం, మల బద్ధకం, ముక్కు, ముఖం, కంఠం.. వీటిలో వచ్చే రోగాలను అణచివేస్తుంది. ఆయుర్వ•ద్ధి, కాంతిని కలుగచేస్తుంది. మత్తును హరిస్తుంది. రక్తంలో వేడిని, కడుపులో వేడిని, మంటను, వికారాన్ని పోగొడుతుంది. పొట్టకు, కాలేయానికి బలాన్ని చేకూరుస్తుంది. కాఫీ కషాయంలో పాలకు బదులు నిమ్మపండు రసాన్ని కలిపి తీసుకుంటే మలేరియా జ్వరం తగ్గుముఖం పడుతుంది. గ్లాసు నీళ్లలో నిమ్మపండు రసం కలిపి పడుకునే ముందు తీసుకుంటే కడుపు, ప్రేగులు శుభ్రమై సుఖవిరేచనం అవుతుంది. నిమ్మచెక్కకు ఉప్పు రాసి నాలుక మీద అద్దుకుంటే అరుచి, నోటి అసహ్యం పోతాయి. పరగడుపున దీనిని తీసుకోరాదు. తీసుకుంటే పొట్టకు హాని చేస్తుంది. నిమ్మపండు రసాన్ని ఆముదంలో కలిపి తలకు మర్దన చేయించుకుని స్నానం చేస్తే తలలో గల వేడి తగ్గుతుంది. మెదడుకు చలువచేస్తుంది. ఉన్మాదం, భ్రమ వంటి రోగాలు తగ్గే అవకాశం ఉంది.

Review నిమ్మపండు.. ఆరోగ్యం మెండు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top