త్రిజటుడిని చూడగానే లోకంలోకి పేదరికమంతా ఒక్కచోటికి చేరి ఆకారం దాల్చిందా అనిపిస్తుంది.
చినిగిపోయిన అంగవస్త్రం, అంతకంటే చినిగిపోయిన తుండుగుడ్డ, బక్కచిక్కిన శరీరం, ముడతలు పడిన ముఖం, మానిపోయిన గడ్డం, జడలు కట్టిన జుట్టు, మట్టిపట్టిన యజ్ఞోపవీతం, కప్పు సరిగా లేని కుటీరం, కుక్కి మంచం, కట్టుకున్న చీర, మెడలో పసుపుకొమ్ము తప్ప మరో చీరగాని, ఆభరణం గాని లేని ఇల్లాలు, ఇంటి నిండా గంపెడు పిల్లలు.. ఇదీ త్రిజటుని స్థితి, కుటుంబం పరిస్థితి.
అయినా, ఆ బ్రాహ్మణుడికి అసూయ లేదు.
ద్వేషం లేదు.
అల్పత్వం అంత కంటే లేదు.
అయితే అలసట మాత్రం ఉంది. అధికంగా ఉంది.
పేదరికంతో పోరి పోరి ఆ బ్రాహ్మణుడు అలసిపోయాడు.
ఎంతో అలసిపోయాడు.
త్రిజటుడు ఉదయాన్నే లేచేవాడు.
స్నానాదికాలు పూర్తి చేసుకునే వాడు.
నొసట విభూతిరేఖలు తీర్చుకుని, తృప్తిగా గాయత్రి మంత్రాన్ని జపించుకునే వాడు.
గుక్కెడు మంచినీళ్లు తాగి గునపం చేతపట్టుకుని, పార, తట్ట నెత్తిన పెట్టుకుని అడవికి వెళ్లేవాడు.
మధ్యాహ్నానికి కందమూలాలు, కాయకసురులతో, ఫలపత్రాలతో గంప నెత్తిన పెట్టుకుని ఇంటికి వచ్చేవాడు.
నట్టింట గంప దింపి, నిట్టూర్పు విడుస్తూ నేలపై గుడ్డ పరుచుకుని కొంతసేపు పడుకునే వాడు.
ఆయన ఇల్లాలు అప్పుడు మడికట్టుకునేది.
ఆయన తెచ్చిన వాటిలో కొన్ని ఉడకబెట్టేది.
త్రిజటుడు మెల్లగా లేచి మళ్లీ స్నానం చేసి, సంధ్య వార్చి, దేవతార్చన జరిపి, భార్య కూర్చిన వంటకాలు భగవంతుడికి నివేదన పెట్టేవాడు.
తరువాత తాను, పిల్లలు భోజనం చేసేవారు.
ఆ ఇల్లాలు భర్తకు, పిల్లలకు అడిగి, అడిగి వడ్డించి, అడుగున మిగిలిందేదో తిని వంటగదిని, ఉన్న ఒకటి రెండు పాత్రలను
శుభ్రం చేసుకుని మరునాటి భోజనానికి మోదుగాకుల విస్తళ్లు కుట్టుకుంటూనో లేక దీపారాధనకు వత్తులు చేసుకుంటూనో వాకిట్లో పంచటరుగు మీద కూర్చునేది.
ఇరుగింటి సోమిదేవమ్మ, పొరుగింటి సావిత్రమ్మ, ఎదురింటి మహాలక్ష్మమ్మ వచ్చి కూర్చునే వారు.
వాళ్లతో ఏవేవో కబుర్లు, వ్రతాల విషయాలు, నోముల విషయాలు, ఉపవాస విషయాలు మాట్లాడుకుని సాయంకాలం కాగానే అందరూ దేవాలయాలకు వెళ్లేవారు.
అక్కడ దైవదర్శనాలు, పురాణ శ్రవణాలు, పుణ్యకథా కాలక్షేపాలతో గడిపి వచ్చేవారు.
త్రిజటుడు నొసటి విభూతి రేఖలతో, కుంకుమబొట్టుతో వీధి అరుగు మీద కూర్చుని యజ్ఞోపవీతానికి దారం వడుకుతుంటే సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వచ్చి సూత్రయజ్ఞం చేస్తున్నట్టు ఉండేది.
ఒక టెంకాయ చిప్పలో కండెం తిప్పుతూ,
మరో టెంకాయ చిప్పలో మధ్య మధ్యలో విభూతి చేతికద్దుకుంటూ చిక్కుముడులు సరిచేస్తూ చెయ్యి సాగినంత దూరం సన్నగా దారం తీస్తుంటే- ఏదో వెలుగు కిరణం ఆయన హృదయం నుంచి వెలికి వస్తున్నట్టు ఉండేది.
ఆ సూత్రయజ్ఞం చూడ్డానికి చుట్టుపక్కల వారంతా వచ్చేవారు.
కొందరు ధర్మసందేహాలు అడిగేవారు.
కొందరు వేద విషయాలు ప్రస్తావించే వారు.
కొందరు గ్రహగతులు తెలుసుకునే వారు.
అదో చిన్న బ్రహ్మలోకంగా ఉండేది.
త్రిజటునిది ఒక స్వతంత్ర జీవనం.
ఒక స్వచ్ఛ జీవనం.
చెయ్యి చాచటం ఆయన చేతగాని పని.
శ్రమపడి జీవించడం ఆయన సహజ స్వభావం.
త్రిజటుడన్నా ఆయన భార్య అన్నా అందరికీ ఎంతో ప్రేమ, గౌరవం.
పేదరికం ఆయన బ్రహ్మవర్చస్సుకు అడ్డురాలేదు.
ఆయన గౌరవాన్ని అది కించపరచలేదు.
అయితే దాన్ని భరించడమే బాధాకరంగా ఉంది.
వయసు ముదిరే కొద్దీ ఆ పేదరికాన్ని సహించడం చాలా కష్టంగా ఉంది.
త్రిజటుడు కావాలని పేదరికాన్ని వరించలేదు.
వచ్చిన పేదరికాన్ని సహించాడు.
త్రిజటుడు ఆశను త్యజించలేదు.
దానిని అదుపులో ఉంచాడు.
త్రిజటుడు సర్వసంగ పరిత్యాగి కాదు. సంసారి.
ఎంతకాలమని ఈ పేదరికాన్ని ధరించడం?.
ఆయన భార్య ఎన్నోసార్లు బతిమాలింది.
‘స్వామీ! ఇంతమంది పిల్లలతో ఈ దారిద్య్రాన్ని ఎంతకాలమని భరిద్దాం? మీరూ వృద్ధులవుతున్నారు. శక్తి తగ్గిపోతున్నది. ఒక్కసారి ఆ దశరథ మహారాజును కలవండి. ఏదైనా అడగండి. మన దారిద్య్రం తీరిపోతుంది. ఎందరెందరో ఆ మహారాజును ఆశ్రయిస్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. మీరూ వెళ్లండి. మన పిల్లల కోసమైనా అడగండి’ అని అనేక విధాల బతిమలాడింది.
త్రిజటుడు ప్రతిసారీ తల ఊపేవాడు.
ఆమె వైపు జాలిగా చూసేవాడు.
అక్కడి నుంచి లేచి వెళ్లేవాడు.
అంతేగాని ఆయన ఎన్నడూ రాజద్వారంలో అడుగుపెట్టలేదు.
ఆ మహారాజును అర్థించలేదు.
ఆ రోజు త్రిజటుడు ఆలస్యంగా అడవికి బయల్దేరాడు.
ముందురోజు ఉపవాసం.
అందుచేత మరీ నీరసంగా ఉన్నాడు.
అయినా వెళ్లక తప్పదు.
వెళ్లకుంటే పూట గడవదు.
పాపం! త్రిజటుని కాళ్లు తడబడుతున్నాయి.
కళ్లు మూతలు పడుతున్నాయి.
అలాగే, తట్టా పారా నెత్తిన పెట్టుకుని, గునపం దోటీ చేతబట్టుకుని నడవసాగాడు.
అడవిలో అక్కడక్కడా తవ్విచూశాడు.
ఎక్కడా కందమూలాలు దొరకలేదు.
కొంతసేపు చెట్టు నీడన కూర్చున్నాడు. సేదదీరాడు.
మళ్లీ తవ్వడం మొదలుపెట్టాడు.
పొద్దెక్కుతూ ఉంది.
పిల్లలు ఆకలితో ఎంత అలమటిస్తున్నారో!
తవ్వి, తవ్వి త్రిజటుడు అలసిపోయాడు.
వాడిపోయిన తోటకూర కాడలా గునపం మీద తలవాల్చి అలా నిలబడ్డాడు.
ఎండ మండిపోతూ ఉంది.
శరీరమంతా చెమటలు కారిపోతున్నాయి.
దారిద్య్ర భారాన్ని మోయలేక మోయలేక చతికిలబడిన ఆ సంసారికి ఏమీ దిక్కుతోచలేదు.
భారంగా ఒక నిట్టూర్పు వదిలాడు.
వాల్చిన తల పైకెత్తాడు. చంటివాణ్ణి చంకన వేసుకుని భార్య పరుగెత్తి వస్తోంది.
ఎందుకో? ఏం జరిగిందో?!.
ఆందోళనగా త్రిజటుడు ఆమె వైపు చూశాడు.
ఆమె అల్లంత దూరం నుంచే గొంతెత్తి, ‘ఆ గునపం తట్టా ఆవల పారేయండి. రాముడు అరణ్యాలకు వెళ్తున్నాడు. అమితంగా దానాలు చేస్తున్నాడు. అడిగిన వాళ్లకు అడిగినట్టు ఇస్తున్నాడు. మీరూ వెళ్లండి. ఏదైనా అడగండి. నా మాట కాదనకండి. మీ కష్టాన్ని చూడలేకుండా ఉన్నాను. ఈ దారిద్య్రాన్ని భరించలేకుండా ఉన్నాను’ అని గట్టిగా ఆయన చేతులు పట్టుకుని రోదించింది.
త్రిజటుడు తనను తాను చూసుకున్నాడు.
తన భార్య ముఖంలోకి చూశాడు.
ఆమె చంకనున్న పసిబాలుని వైపు చూశాడు.
భారంగా ఒక్క నిట్టూర్పు విడిచాడు.
రెండు కన్నీటి బొట్లు రాల్చాడు.
గునపం అవతలికి విసిరేశాడు.
నడుముకు బిగించిన తుండుగుడ్డ విప్పి, విదిల్చి భుజాన వేసుకున్నాడు.
ఒక్క ఊపున అక్కడి నుంచి బయల్దేరాడు.
అది రాజాంత:పురం. రామ మందిరం.
ముందు ఎందరెందరో బ్రాహ్మణులు, పరిచారకులు, ప్రజలు.. కొందరు దానాలు గ్రహించిన వారు, మరికొందరు గ్రహించడానికి వరుసలో నిల్చున్న వారు.
ఒక వెలుగు కిరణంలా త్రిజటుడు లోనికి చొచ్చుకువెళ్లాడు.
ఆయన బ్రహ్మవర్చస్సును, ఆవేశాన్ని, పూనికను చూసి ద్వారపాలకులంతా పక్కకు తప్పుకున్నారు.
సరాసరి త్రిజటుడు రాముడి సమక్షానికి వెళ్లాడు.
సభ్యతను పాటించడానికి తన తుండుగుడ్డను పైన కప్పుకోవాలని ప్రయత్నించాడు.
పాపం! ఆ తుండుగుడ్డ నిండా చినుగులే.
దాన్ని ఎలా కప్పుకుందామన్నా చినుగు మీదకు వస్తున్నది.
ఒకపక్క చినుగు వెనుకకు వేసుకుంటే మరోపక్క చినుగు ముందుకు వస్తున్నది.
రాముడు త్రిజటుడి అవస్థను చూశాడు.
చిరునవ్వు నవ్వాడు.
చివరకు త్రిజటుడు ఎలాగో తుండుగుడ్డ కప్పుకున్నాడు.
రాముడు ఆపాదమస్తకం ఆ బ్రాహ్మణుని చూశాడు.
అతడు నీళ్లన్నీ ఎండి, పగుళ్లువారిన వేసవి పంట కాలువలా ఉన్నాడు.
ఆకులన్నీ రాలి చిదుగుల గూడులా కనిపించే చెట్టులా ఉన్నాడు.
రాముడు ఆర్ద్రంగా ఆ త్రిజటుని వైపు చూశాడు.
త్రిజటుడు తలవంచుకున్నాడు.
ఇద్దరి మధ్య పెద్ద మౌనం.
అయితే ఆ మౌనం ఎంతసేపు?
త్రిజటుడు తల ఎత్తి ఏదో తప్పు చేస్తున్న వాడిలా రాముడి వైపు చూశాడు.
రాముడు ఏమిటో చెప్పమన్నట్టు ఆ విప్రుడిని చూసి తల ఆడించాడు.
త్రిజటుడు, ‘రాకుమారా! నేను పేద బ్రాహ్మణుడను. బహు కుటుంబిని. ఉంఛ వృత్తితో జీవిస్తున్నాను. దారిద్య్రాన్ని భరించలేకున్నాను’ అని మళ్లీ తల వంచుకున్నాడు.
రాముడు పరిహాసంగా, ‘అయితే, నీకు వెయ్యి గోవులనైనా ఇవ్వను’ అన్నాడు.
త్రిజటుడు తల ఎత్తి నిరాశగా చూశాడు.
రాముడు చిరునవ్వు నవ్వి, ‘త్రిజటా! అదుగో, ఆ కర్ర తీసుకో. శక్తికొద్దీ దాన్ని విసురు. అది ఎంత దూరాన పడుతుందో అంతదాకా ఉన్న గోవులన్నీ నీకు దానం చేస్తా’ అన్నాడు.
అక్కడున్న వారంతా ఆ త్రిజటుడిని చూసి, ‘అయ్యో పాపం!’ అన్నారు.
ఆ బ్రాహ్మణుడు ఎండుకట్టెలా ఉన్నాడే, ఈ కర్రను ఎలా విసరగలడని అనుకున్నారు.
ఒకవేళ విసిరినా ఒక్క గోవునైనా దాటి అది పడుతుందా అనుకున్నారు.
అయినా రాముడు ఎవరికీ ఇలాంటి పరీక్షలు పెట్టలేదే!
ఈ పేద బ్రాహ్మణుడికి ఎందుకీ పరీక్ష అనుకున్నారు.
అయితే రాముడి ఆంతర్యమేమిటో అని అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు.
త్రిజటుడి కళ్లలో ఆశారేఖ తళుక్కున మెరిసింది.
తక్షణం అతడు తుండుగుడ్డ నడుముకు బిగించాడు.
కర్రను గిరగిరా తిప్పి తన శక్తినంతా చిక్కబట్టి ఒక్క ఊపున విసిరివేశాడు.
అది సరయూ నదికి ఒడ్డున అనేక వేల గోవులను అతిక్రమించి నెమరువేస్తూ నిలబడి ఉన్న ఒక ఆంబోతు ముందు పడింది.
ఆ బ్రాహ్మణుడిలో అణగి ఉన్న దారిద్య్ర బాధ అంత తీవ్రం.
రాముడు ఆశ్చర్యపోయాడు.
ఆనందపరవశుడయ్యాడు.
ఆ బ్రాహ్మణుడిని గాఢంగా కౌగిలించుకున్నాడు.
‘త్రిజటా! నీ దారిద్య్ర బాధ ఎంత తీవ్రమో ఇప్పుడర్థమైంది. ఏదో నవ్వులాటకన్నాను వెయ్యి గోవులనైనా ఇవ్వనని. అందుకు ఆగ్రహించకు. నీ తేజస్సు అద్భుతం. అది కనిపిస్తూనే ఉంది. అయినా దాన్ని కొంచెం స్పష్టంగా చూద్దామని కర్ర విసరమన్నాను. ఆ కర్ర పడిన దాకా ఉన్న గోవులన్నీ నీవే. అవి ఎన్ని వేలైనా సరే. ఇంకా నీకేం కావాలో అడుగు’ అన్నాడు రాముడు ఎంతో ప్రేమగా.
త్రిజటుడు తృప్తిగా తల ఊపాడు.
అంతలో అతని భార్య కూడా అక్కడకు చేరుకుంది.
భర్త సంపాదించిన గోసంపాదనను చూసి ఆమె కొండంత ఆనందించింది.
త్రిజటుడి దారిద్య్రం తీరిపోయింది. దంపతులు ఇద్దరూ రామచంద్రుడిని మనసారా ఆశీర్వదించారు. మౌనంగా తమ ఆశ్రమానికి తరలివెళ్లారు. రాముడు వారిని సంతోషంగా కొంతదూరం సాగనంపాడు. ఆవులన్నింటినీ ఆశ్రమంలో చేర్చాలని భటులను ఆదేశించాడు.
అందరి కళ్లలో ఆశ్చర్యం!
ఎంతోకాలం అతికష్టం మీద భరించిన తీవ్రాతి తీవ్ర దారిద్య్రం.. అవకాశం అపురూపంగా వచ్చి తీరే పరిస్థితి ఏర్పడితే- ఆ వ్యక్తి ఉత్సాహం ఉరికే ఎత్తు, పరుగెత్తే దూరం లోకంలో ఆశ్చర్యకరాలుగానే ఉంటాయి.
అంతేగాదు. మానవుని దేహబలం కంటే మనోబలం ఎంతో గొప్పదని రామాయణంలోని ఈ త్రిజటుని కథ మనకు చెబుతుంది.
లేనిపోని ఆరాటం
ఓ సాధువు దేశాటనం చేస్తూ ఓ రాజ్యంలోకి ప్రవేశించాడు. ఆ వీధులలో నడుస్తుంటే ఓ నాణెం దొరికింది. అన్నీ త్యజించి తిరుగుతున్న తనకు నాణెంతో పనిలేదు. కాబట్టి దాన్ని ఆ నగరంలోని ఎవరికైనా ఇవ్వాలని అనుకున్నాడు. దాని అవసరం ఉన్న వాళ్ల కోసం రోజంతా వెతికాడు. బీదలు, పేదలు, చిరిగిన బట్టలతో ఉన్న వారు.. ఇలా ఎందరెందరో ఎదురైనా.. నాణెం ఇవ్వబోతే ఒక్కరూ తీసుకోలేదు. ఆ నగరంలోని ప్రజలంతా పూర్తి సంతృప్తిగా ఉన్నారని, అందుకే తాను నాణెం ఇచ్చినా తీసుకోవట్లేదని గ్రహించిన ఆ సాధువు ఎంతో సంతోషించాడు. రాత్రికి సాధువు అక్కడే ఓ చెట్టు నీడన విశ్రమించాడు. మర్నాడు పక్క దేశంపైకి దండెత్తుతూ ఆ దేశపు రాజు సాధువు ఉన్నచోటుకు వచ్చాడు. ఆయనను మహాత్ముడిగా భావించిన రాజు.. ‘ఓ సాధు పుంగవా! రాజ్య విస్తరణ కాంక్షతో పొరుగు దేశంపైకి దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’ అన్నాడు రాజు.
సాధువు ఏమీ మాట్లాడకుండా ఆ రాజు చేతిలో తన వద్దనున్న నాణేన్ని ఉంచాడు.
రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటన్నట్టు చూశాడు.
‘మహారాజా! ఈ నాణెం నిన్న మీ రాజ్యంలోనే దొరికింది. అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలనుకుంటే.. ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా జీవిస్తూ నాణెం తమకు అవసరం లేదన్నారు. నువ్వు మాత్రమే ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని దండయాత్రకు బయల్దేరావు’ అన్నాడు సాధువు.
రాజు తన యుద్ధ ప్రయత్నాన్ని మాని తిరుగుముఖం పట్టాడు.













































































































































































Review మనోబలానికి మారుపేరు త్రిజటుడు.