సుఖంగా ఉండాలని కోరుకోనిదెవరు? అయితే సుఖం అంటే ఏమిటి? మనిషికున్న సుఖాలు ఆరు అని చెప్పిన మహాభారత విధుర నీతి శ్లోకం.
శ్లో।। ఆరోగ్యమానృణ్యమవిప్రవాసః సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః ।
స్వప్రత్యయా వృత్తిరభీతివాసః షడ్జీవలోకస్య సుఖాని రాజన్ ।
– మహాభారతం
ఆరోగ్యం, అప్పులు లేకపోవటం, ఉదర పోషణ నిమిత్తం దూరప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకపోవడం (ఉన్న ఊళ్లో ఉద్యోగం), మంచివాళ్లతో సహవాసం, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవనోపాధి (స్వంత ఉపాధి), భయం లేని నివాసం – ఈ ఆరు మనిషికి సుఖాన్ని కలిగించేవి.
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అటూ ఇటూ అయినప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. వ్యాసమహర్షి ప్రధానంగా ఆరోగ్యాన్ని పేర్కొనటం గమనించాలి. ఇక తరువాతది అప్పు లేకపోవడం. ‘‘అప్పు లేనివాడే అధిక సంపన్నుడు’’ అని ప్రాచీనోక్తి. అందుకని ఆదాయానికి మించిన ఖర్చులు చెయ్యకుండా వుండటమే సుఖం. సత్సాంగత్యం కూడా ఒక సుఖం – ఓ ఆహ్లాదకరమైన అనుభూతి. తరుచుగా చేసే ప్రయాణాల వల్ల ఆరోగ్యం,యోగాభ్యాసం వంటి అనుష్ఠానాలు దెబ్బతింటాయి. అందుకని ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఉద్యోగం కోసం కుటుంబానికి దూరంగా వున్న జీవనం, ఉదర నిమిత్తం చేసే దూరప్రయాణాలు సుఖాన్నివ్వవని అన్వయించుకోవచ్చు. వృత్తిని గురించిన ప్రస్తావన కూడా ఈ శ్లోకంలో వుంది. జీవనోపాధి ఆత్మవిశ్వాసంతో ఉంటేనే సుఖాన్నిస్తుంది. భీతిలేని జీవనానికి మన నివాసం అడ్డు రాకూడదని కూడా కవి సలహా ఇచ్చారు. జనసంచారం లేనిచోట ఉన్న ఇల్లు, ప్రమాదం చేరువలో ఉన్న ఇల్లు, అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆరు సుఖాలు ఈ శ్లోకంలో పేర్కొన్నారు.
– బి.ఎస్. శర్మ
Review 6 సుఖాలు.