నల్ల కుక్క.. తెల్ల ఆవు

శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ చేసే మంగలి ఉండేవాడు. అతను విశ్వాసపాత్రుడే కాకుండా, తన పనిలో చాలా నైపుణ్యం కలవాడు కూడా. పైగా అతడు సదాచార పరాయణుడు. క్షురకుడైనా కూడా నిరంతర నిష్టా గరిష్టుడూ, దెవభక్తి పరాయణుడూ కూడానూ. అతని విశ్వాసానికి, శీలానికి చాలా సంతోషించిన రాయలు వారు అతడిని ‘మంత్రీ!’ అని పిలిచేవారు. మంగలిని గౌరవంగా మంత్రి అని కూడా అంటారు.
ఒకనాడు రాయలు అతడిని పిలిచి, ‘నీకేం కావాలో కోరుకో!’ అన్నారు.
అప్పుడతను చేతులు జోడించి, ‘ప్రభూ! తమరికి తెలియనిది ఏమున్నది? నేను చిన్నప్పటి నుంచి నిష్టా నియమాలు పాటిస్తూ వచ్చిన వాడిని. ఎలాగైనా నన్ను బ్రాహ్మణుడిని చేయించండి. చాలు. నాకు బంగారం మీదా, డబ్బు మీదా ఆశ, కోరిక లేవు.. బ్రాహ్మణ్యంపై తప్ప’ అని విన్నవించుకున్నాడు.
తన తీవ్రమైన కోరిక ప్రభావంలో అతను యుక్తాయుక్తాలు మరచి అటువంటి గడ్డు కోరిక కోరగా..
కవీ, పండితుడు కూడా అయిన రాయల వారు కూడా క్షవర కల్యాణం చేయించుకున్న ఆనంద సుఖాలలో మైమరచి కాబోలు, అతడి కోరికలోని సాధ్యాసాధ్యాలను మరచి, ‘సరే.. అలాగే’ అనేశారు.
రాజ పురోహితులకు కబురు వెళ్లింది. వారు వచ్చారు.
‘ఈ క్షురకుడిని బ్రాహ్మణుడిగా చేయండి’ అని ఆజ్ఞాపించారు రాయల వారు.
అది అసాధ్యమని వారికి తెలుసు. కానీ, రాజాజ్ఞను కాదంటే దండన తప్పదు కదా అనే ప్రాణ భయంతో, అయిష్టంగానే, విధిలేక తలూపారు.
క్షురకుడిని రాజ పురోహితులు నదీ తీరానికి తీసుకెళ్లి ప్రతిరోజూ హోమాలు, జపాలు, మంత్రోచ్ఛారణలు చేయసాగారు. ఈ సంగతి ఎవరి చెవిన పడకూడదో వారి చెవినే పడింది. పైగా అతడు రామలింగడు. మామూలోడు కాదు కదా!. అంతే, రోజూ ఓ నల్లకుక్కను నది ఒడ్డుకు తీసుకెళ్లి దానిని మాటిమాటికీ నీళ్లలో ముంచుతూ, ‘ఓం.. హ్రీం.. హ్రీం’ అంటూ రాజ పురోహితులకు పోటీగా అన్నట్టు బిగ్గరగా బీజాక్షరాలు చదవడం ప్రారంభించాడు.

ఒకవైపు క్షురకుడిని సంస్కరించే ప్రయత్నంలో రాజ పురోహితులు.. మరోవైపు వారికి కొద్ది దూరంలోనే కుక్కను సంస్కరించే ప్రయత్నంలో తెనాలి రామలింగడు..
ఇలా కొద్దిరోజులు గడిచిపోయాయి.
ఒకరోజు క్షురకుడు ఎంతవరకూ విప్రుడయ్యాడో చూద్దామని రాయల వారు నదీ తీరానికి వచ్చారు.
ఆ సమయంలో అటు రాజ పురోహితులు, ఇటు రామలింగడూ బిగ్గరగా మహా హడావుడి చేస్తూ మంత్రోచ్ఛారణలు చేస్తున్నారు.
వీళ్లు క్షురకుడినీ, రామలింగడు నల్లకుక్కనీ మాటిమాటికీ నదిలో ముంచి తీస్తున్నారు.
ఇదంతా చూసి రాయల వారికి ఆశ్చర్యం వేసింది.
రామలింగడి వద్దకు వచ్చి, ‘ఏం చేస్తున్నావ్‍ రామకృష్ణా?’ అని అడిగారు నవ్వాపుకుంటూ.‘ఈ నల్లకుక్కను తెల్ల ఆవుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను ప్రభూ’ అన్నాడు రామలింగడు అతి వినయంగా.
‘కుక్క కుక్కే కానీ గోవు ఎలా అవుతుంది? నీకు పిచ్చిగానీ ఎక్కలేదు కదా?’ అంటూ నవ్వారు రాయల వారు.
నిర్భీతికి, నిర్మొహమాటానికి మారుపేరైన రామకృష్ణుడు- ‘ప్రభువులైన మీకే పిచ్చెక్కినప్పుడు నాకూ పిచ్చెక్కినట్టే మరి’ అన్నాడు నిస్సంకోచంగా.
‘రామలింగా!’ అని గద్దించారు రాయల వారు.
‘ఔను ప్రభూ! మంగలిని బ్రాహ్మణుడిగా చేయడం సాధ్యమైనపుడు, కుక్కను ఆవుగా చేయడం ఎందుకు సాధ్యం కాదు?. యథా రాజా.. తథా ప్రజా (రాజుని బట్టే ప్రజలు) అని లోకోక్తి కదా!’ అన్నాడు రామకృష్ణుడు.
ఆ ఎత్తిపొడుపుతో రాయల వారికి జ్ఞానోదయమైంది.
తన తొందరపాటూ, తెలివితక్కువతనమూ తెలిసి వచ్చాయి.
రామలింగడు తనకు సున్నితంగానూ, పరోక్ష మార్గంలోనూ బుద్ధి చెప్పడానికే ఇలా చేశాడని గ్రహించారు.
వెంటనే క్షురకుడిని బ్రాహ్మణుడిగా మార్చే కార్యక్రమాన్ని ఆపుచేయించారు.

Review నల్ల కుక్క.. తెల్ల ఆవు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top