ఆరు రుచులు.. అరవై రకాల మేలు

ఉగాది పచ్చడి

ఉగాది పర్వదిన సందర్భంగా చేసుకునే ఆహార పదార్థాలు, నైవేద్యాల్లో ఉగాది పచ్చడి, బొబ్బట్లు, వడపప్పు, పులిహోర ముఖ్యమైనవి. వీటిలో ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. ఈ షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం (తీపి), ఆమ్లం (పులుపు), కటు (కారం), కషాయం (వగరు), లవణం (ఉప్పు), తిక్త (చేదు) రుచులు మిళితమై ఉంటాయి. ఈ ఆరు రుచులు జీవితంలో ఎదురయ్యే సంతోషం (తీపి), దు:ఖం (చేదు), కోపం (కారం), భయం (ఉప్పు), విసుగు (చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం (మామిడి) సమ్మేళనం. అంతేకాక ఈ ఆరు రుచులు ఆరు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
కావాల్సినవి:
ఒకటిన్నర కప్పు నీరు
రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు
కొద్దిపాటి వేప పువ్వులు
మూడు టేబుల్ స్పూన్ల బెల్లం
తగినంత ఉప్పు
తగినంత మిరియాల పొడి
ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం
లేదా
వేపపువ్వు- తగినంత, చిన్న చెరుకు ముక్క- 1, చిన్న కొబ్బరి ముక్క- 1, అరటిపండ్లు- 2, చింతపండు- తగినంత, చిన్న మామిడికాయ- 1, బెల్లం- 100 గ్రాములు, పచ్చి మిరపకాయ- 1, ఉప్పు- తగినంత, నీళ్లు- సరిపడా,. కొత్త కుండ- 1
తయారు చేసే విధానం:
ముందుగా చెరకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్ని తీసి పెట్టుకోవాలి. తగినన్ని నీళ్లలో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తరువాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడి కాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధం.
వడపప్పు
కావాల్సినవి:
పెసరపప్పు- కప్పు, కీరా- ఒక చిన్న ముక్క, పచ్చి మిర్చి- 1 (తరగాలి), కొత్తిమీర తరుగు- టీ స్పూన్, కొబ్బరి తురుము- టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత.
తయారు చేసే విధానం:
ముందుగా పెసరపప్పును నాలుగు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపితే వడపప్పు సిద్ధం.
బొబ్బట్లు
కావాల్సినవి: సెనగపప్పు- 1 కప్పు, మైదాపిండి- 1 లేదా అరకప్పు, తురిమిన బెల్లం- 1 కప్పు, నూనె- 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి- 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి- 2 టీ స్పూన్లు
తయారు చేసే విధానం: ముందుగా మైదాపిండిని చిటికెడు ఉప్పు వేసి చపాతీ పిండి మాదిరిగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాలి. సెనగపప్పు కడిగి గంటసేపు నానబెట్టాలి. సెనగపప్పును కాస్త పలుకుగా ఉడికించుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. అందులో బెల్లం తురుమును, యాలకుల పొడిని కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పళ్లెంలోకి తీసుకుని, చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చేసి ఉంచుకోవాలి. మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లాగా చేత్తో వత్తాలి. పూరీ మధ్యలో పై సెనగపప్పు, బెల్లంతో చేసిన ఉండలను ఉంచి, అంచులను పూర్తిగా కవర్ చేయాలి. చేత్తో తడుతూ, పూరీలాగా వత్తాలి. ఇలా మొత్తం రెడీ చేసి ఉంచుకోవాలి. పెనం వేడి చేసి దాని మీద నేతితో కానీ, నూనెతో కానీ రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ బొబ్బట్లు వేడి వేడిగా నేతితో తింటే చాలా బాగుంటాయి.

Review ఆరు రుచులు.. అరవై రకాల మేలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top