కార్తిక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో మహిమాన్వితమైనవి. అలాగే, మాఘ మాసంలో ఆదివారాలు, శ్రావణ మాసంలో మంగళ, శుక్ర, శనివారాలు శుభమైనవిగా ప్రసిద్ధి చెందాయి. వారంలోని ఏడు రోజుల్లో ఐదు రోజులు ఇలా మహిమాన్వితమైనవిగా గుర్తింపు పొందితే, బుధ, గురువారాలు మాత్రం ఏ మాసంతో సంబంధం లేకుండా ఉన్నాయి. కానీ, ప్రతి గురువారం తిరుపతిలో శ్రీనివాసుడికి పూలంగి సేవ జరుగుతుంది. ఆనాడు స్వామి వారి అలంకరణగా ఉన్న ఆభరణాలన్నిటినీ తీసివేసి, పుష్పాలతోనే శ్రీవారిని అలంకరిస్తారు. ఆ రాత్రి స్వామి ఎడమ చేతిలో సూర్య కటారిని ఉంచుతారు. శుక్రవారం ఉదయాన్నే కటారిని, ఆ పూలంగిని తీసివేస్తారు. తిరుపతిలో ఇంతటి మహిమాన్వితమైన గురువారం లోకం పోకడలో మాత్రం ‘వ్యవహారాలకు మంచిది కాద’నే ఆచారం ఉంది. ఈనాడు తెలుగు రాష్ట్రాలలో భూ సంబంధ కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాల ప్రారంభాలు చెయ్యరు. ఇక, గురువారం షిర్డీ సాయినాథుని మందిరాలు హారతి ప్రార్థనలతో ఆధ్యాత్మికతను సంతరించు కుంటాయి. అలాగే బుధవారం నాడు పుట్టాడని చెప్పే దత్తాత్రేయునికి గురువారం ప్రీతికరమైనదనే సంప్రదాయం కూడా ఆచారంలో ఉంది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని లక్ష్మీనర్సింహ స్వామి వారి విగ్రహాన్ని గురువారం నాడే ప్రతిష్ఠించారని అంటారు. ఈ విధంగా గురువారం ప్రసిద్ధమై ఉంది. ఇక, మార్గశిరంలో వచ్చే గురువారాలు మరీ మహత్తయినవని అంటారు. మామూలు లక్ష్మివారాల్లో కంటే మార్గశిర లక్ష్మివారాల్లో లక్ష్మీవ్రతం చేయడం మరింత పుణ్యప్రదమని ఒడిస్సా వాసుల విశ్వాసం.
Review గురువారం నాడే శ్రీ వారికీ పూలంగి సేవ.