సాధనశక్తి

‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అంటారు పెద్దలు. ఏ పనైనా సాధనతోనే సఫలీకృతమవుతుంది. పారమార్థిక మార్గంలో వెయ్యి గ్రంథాల పఠనమైనా ఒక గంట సాధనకు సమానం కాదని పండితులు చెబుతారు. ‘సాధన’ అనే మాట ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా వినిపిస్తుంది. భగవత్‍ మార్గంలో పయనిస్తూ చేసే ప్రతి మంచి పనీ ‘సాధనే’ అనిపించుకుంటుంది.

పంచాగ్ని యజ్ఞం నుంచి పుష్ప సేకరణ వరకు ప్రతి ఒక్కటీ సాధనే అవుతుంది. తీవ్రమైన తపస్సు నుంచి నిర్మాల్య నిర్మూలన వరకు ప్రతీదీ సాధనే అనిపించుకుంటుంది. భగవంతుడి పేరును జత చేస్తే చాలు ఎటువంటి పువ్వునైనా పరిమళాలు కమ్ముకుంటాయి. పుక్కిలించిన నీళ్లు సైతం పవిత్ర జలాలై అభిషేక అర్హత పొందుతాయి. ఎంగిలి పండ్లు కూడా అమృత తుల్యమై నైవేద్యంగా మారతాయి. అదీ భగవన్నామ ఘనత. సాధనలోని విలక్షణత.. అదెంతో రుచికరం. అంతకుమించి, మనోభిరామం.

ఒకనాడు శంకరాచార్యులు వెళ్తున్న దారిలో ఇంటి అరుగు మీద కూర్చుని సూత్రాలు, సిద్ధాంతాలు వల్లె వేస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ‘వీటన్నిటి వల్ల ప్రయోజనం ఏమిటి? దైవాన్ని భజించు. సాధనతో జీవించు’ అని స్వామి అతనికి బోధిస్తారు. అంత అవసరమైనది సాధన. భగవంతుడిని భజించడాన్ని మించిన సాధన లోకంలో మరేదీ లేదు.

ప్రతి చిన్న పనీ సాధనే అయినా, పరిణామ క్రమంలో దాని స్థాయి మారిపోతుంటుంది. అక్షరాల క్రమం నుంచి వ్యాకరణం, దాని నుంచి పాండిత్యం, ఆ తరువాత పరిశోధనల వరకు పరిణామం చెందుతుంది విద్య. అదే రీతిలో సాధన వ్యక్తం కావాలి. దీప ప్రజ్వలనం నుంచి దినకర ఆరాధన వరకు, తపోనిష్ట నుంచి తత్వమసి భావన దాకా అది సాగిపోవాలి. అందరిలోనూ భగవంతుడిని చూడటం నుంచి ‘నేనే భగవంతుడిని’ అనే ‘అహం బ్రహ్మస్మి’ భావనలోకి పరిణితి చెందే వరకు సమస్తమూ సాధనే.

ధ్యాన సాధన కంటే పుష్ప సమర్పణ గొప్పది. సమాధి స్థితి కన్నా ధూప సమర్పణే ఘనమైనది. ఇదంతా పరిణామ క్రమం. ప్రమిద లేనిదే చమురు పోయలేం. అది లేనప్పుడు వత్తి వేయలేం. వత్తి లేనిది జ్యోతిని వెలిగించలేం. పరిణామక్రమమన్నా, సాధన క్రమమన్నా ఇదే. ధారగా మొదలైనదే నదిగా మారుతుంది. అదే ఉత్తుంగ తరంగ మహానది అవుతుంది. భక్తుడి సాధనా అంతే.

సమర్పణ లేదా సాధన చిన్నదిగానే మొదలవుతుంది. అదే కఠోర తపస్సుగా రూపాంతరం చెందుతుంది. కార్తీక మాసంలో చలిలో నిండు వస్త్రాలతోనే ప్రాథమిక సధన ప్రారంభిస్తాడు భక్తుడు. క్రమానుగతంగా సంభవించే మార్పుల వల్ల, అతడే కౌపీన మాత్రధారిగా మిగిలే సాధకుడవుతాడు. అతడు రుషిలా ఘన పరిణామం చెందాలి. పతంజలి మహర్షి విరచిత అష్టాంగ యోగ సాధన నియమావళి అదే చెబుతుంది.

యమ నియమ అనే సాధారణ స్థాయిలో సాధన ప్రారంభం అవుతుంది. ముందుకు, మున్ముందుకు, ఇంకా పైపైకి సాగాలని నిర్దేశిస్తారు. మానవ విద్యాసాథనలో, జీవిక సాధనలో అక్షర క్రమంలోని ‘అ,ఆ’లు ఎప్పటికీ ఉపయోగపడతాయి. ఎంతగానో ఉపకరిస్తాయి. అంతమాత్రాన అదే విద్య కాదు. అదే జీవితమూ కాదు. తరువాత విద్యలోనే ఎంతో వైవిధ్యం ఉంటుంది. వివేకం, విశిష్టత నెలకొంటాయి. సాధనా అంతే.

ఒక్కో దశలో పైపైకి సాగిపోతున్న శిష్యుడిని గురువే ఆపుతాడు. మెల్లమెల్లగా అతని చేయి వదిలి, ఇంకా పైకి వెళ్లనిస్తాడు. శిష్యుడు తనను మించి మరెంతో ప్రయోజకుడిగా ఎదగాలన్నదే గురువు ఆశయం. మరో విశేష పరిణామమూ ఉంది. పరిణితి చెందుతున్న దశలో, మనసే సాధకుడికి మార్గదర్శనం చేస్తుంది. అప్పుడు అతను పొరపాట్లు చేసే అవకాశమే ఉండదు. ప్రగతి సాధించాక, భగవంతుడే చేయి అందిస్తాడు. సాధకుడిని ఇంకా పైపైకి తీసుకువెళ్తాడు. అలాంటి ఉదాహరణలు ఎన్నో పోతన, త్యాగరాజు, సక్కుబాయి వంటి భకు

Review సాధనశక్తి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top