నారాయణుడొక్కడే సర్వజ్ఞుడు

భగవంతుడిని ప్రస్తుతించే స్తోత్రాలకు ఆధ్యాత్మిక చింతనాపరులు ‘మంత్రపుష్పం’ అనే పేరు పెట్టారు. పుష్పాలంటే పొసగని వారెవరు? అందుకే జిజ్ఞాసులకు, భక్తులకు భగవంతుడిని కొలిచే ‘మంత్రపుష్పం’ అత్యంత ప్రియమైనది. ఇంకో ముఖ్య విషయం- భగవంతున్ని స్తుతించే స్తోత్రాలకు మంత్రపుష్పాలనే పేరు ఎందుకు పెట్టారంటే- పుష్పమనేది ఆకర్షిస్తుంది. పరిమళిస్తుంది. సున్నితత్వంతో ఉంటుంది. తనలోని మధువును ఆఘ్రాణించాలనే కోరికను పుట్టిస్తుంది. మనస్సును మైమరిపింప చేస్తుంది. అందుకే భగవంతున్ని స్తుతించే మంత్రపుష్పమేదైనా.. అది మహత్తమయినది. ఆస్వాదించండి

ఓం ధాతా పురస్తా ద్య ముదాజహార
శక్రః ప్రవిద్వాన్‍ ప్రదిశశ్చతస్రః
త మేవం విద్వా నమృత ఇహ భవతి
నాన్యః పంథా అయనాయ విద్యతే

తాత్పర్యం: ఓం ప్రథమముగా ఎవరిని స్తుతించడం వల్ల శుభములు సిద్ధించునో, ఆయన స్తోత్రించుటే ఉత్తమమైనదని తెలుసుకొనిన ప్రజాపతి అయిన బ్రహ్మ ఆ పద్ధతి పాటించాడు. దానిని గ్రహించిన దేవరాజైన ఇంద్రుడు తాను నిమిత్తమాత్రుడనని ఎరింగి, సమస్త జీవరాశికి సంరక్షకునిగా ఎవరు ఉండటం వలన మేలు కలుగునోయని యోచించి తెలుసుకుని ప్రకటించిన ఆ విరాట్స్వరూపుని ఆరాధించుట వల్లనే మృత్యుభూయిష్టబైన ఈ భూమండలమంతా అమృతతుల్యము అగుచున్నది. ఈ సమయమందు అమృత తత్వమునొందుటకు మనల్ని నడిపిస్తున్న అతీత శక్తి అయిన ఆ విరాట్‍ స్వరూపుని తెలుసుకొనుటయే తప్ప మరొక మార్గము లేదని తెలియుచున్నది. అనగా, సమస్త విశ్వమును ఆవరించి ఉన్న ఆ విరాఢ్రూపుని తెలుసుకొనుటే పరమపద కైవల్యమునకు మార్గమని భావన.

సహస్ర శీర్ష్ం దేవం విశ్వాక్షం విశ్వశమ్భువమ్‍
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్‍

తాత్పర్యం: అనేక వేల శిరస్సులు, నేత్రములు కలిగి, ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్న మంగళకరమైన, జగదాధార రూపమే విరాఢ్రూపముగా గల ఆద్యుడు, సర్వాధార మూర్తియు, శుభంకరుడునగు ఆ పరమాత్మ నాశనము లేని వాడై, జగధాధారుడై ఉన్నాడు. ఆ సర్వేశ్వరునకు సదా నమస్కారము.

విశ్వతః పరమా న్నిత్యం విశ్వం నారాయణగ్‍ం హరిమ్‍

విశ్వమే వేదం పురుష స్త ద్విశ్వ ముపజీవతి

తాత్పర్యం: ఈ విశ్వాని కంటే విశిష్టోన్న తుడును, ఉత్క•ష్టుడును, శాశ్వతుడును, సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్న సర్వేశ్వరుడును, సర్వాత్మకుడును, నారాయణుడును, పాపములు పోగొట్టువాడును అయిన అతీతమైన పరమాత్మ స్వరూపుడు ఈ విశ్వమంతటినీ ప్రకటించి, పరిపూర్ణుడై ఉన్నాడు. సమస్త విశ్వానికి ఆధారమైన వాడును, సకలమును ఆవరించి ఉన్న ఆ విరాఢ్రూపుని ఆశ్రయించియే సమస్తమును మనగలుగుచున్నది. ఆ విరాడ్రూపుడే నిత్యసత్య శాశ్వతుడు. అతనికి సాష్టాంగ నమస్కారము చేయుచున్నాను.

పతివం విశ్వ స్యాత్మేశ్వరగ్‍ం శాశ్వతగ్‍ం శివ మచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానాం పరాయణం

తాత్పర్యం: ఈ సమస్త విశ్వానికి పతియైన వాడును, సకల చరాచర జీవరాశికి ఆధార భూతమైన వాడును, శాశ్వతుడును, నిత్య శుభంకరుడును, మంగళప్రదాతయును, విశిష్టోన్నతుడును, తన ఉన్నతిని ఏమాత్రం కోల్పోని వాడును అయిన నారాయణుడు ఒక్కడే సర్వజ్ఞుడును, విశ్వాత్మకుడును, విశ్వాధారుడును అయి ఉన్నాడు. అట్టి సర్వోత్క•ష్టమైన పరమాత్మకు పాదాభివందనములు అర్పించుచున్నాను.

నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణ పరః
నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః

తాత్పర్యం: ఆ శ్రీమన్నారాయణుడే పరంజ్యోతిగా, ఈ సమస్త విశ్వంలో శాశ్వతుడై, సకల శాస్త్ర కోవిదుల చేత తెలుసుకొన బడుచుండు వాడై వెలుగొందుతున్నాడు. అతడే జీవాత్మ పరమాత్మల ఏకత్వమును కూడా పొంది ఉన్నాడు. తాను గుణరహితుడయ్యును, సత్త్వరజ స్తమో గుణముల కాలవాలమైన ఈ సమస్త జగత్తును సృజించి, సర్వమునకు కర్త•త్వమును వహించు తత్వముతో తానే ఉత్క•ష్టమైన పరతత్వమును కూడా అయి ఉన్నాడు. అతడే ధ్యానకర్తయు, ధ్యానగ్రహీతయు కూడా అగుచున్నాడు. సర్వస్వము తానే అయి ఉన్న పరంధాముడైన ఆ నారాయణునకు, ఆ సర్వాంతర్యామికి సర్వదా నమస్కారము.

Review నారాయణుడొక్కడే సర్వజ్ఞుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top