యింతి చెలువపు రాశి..

।।ప।। ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి
।।చ।। కలికి బొమ విండ్లు గల కాంతకును ధను రాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి
।।చ।। చిన్న మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె పాయపు సతికి కన్నె రాశి
వన్నెమైపైడి తులదూగువినతకు తులరాశి తి
న్నని వాడి గోళ్ల సతికి వృశ్చికరాశి
।।చ।। ఆముకొని మొరపుల మెరయు నతివకు వృషభరాశి
జామిలి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిధున రాశి
(అన్నమయ్య కీర్తన)
తెలుగునాట ఈ పాట వినని వారుండరేమో. ఈ తరం మాటేమో కానీ, తెలుగు వారి పెళ్లి క్యాసెట్లలో, కల్యాణ సమయంలో ఈ పాట ఆల్‍టైమ్‍ ఫేవరేట్‍. ఇక, ఈ పాటలో అన్నమయ్య వాడిన తెలుగు పదాలు, వాటి భావాల సౌందర్యం చూస్తే..
అన్నమయ్య అమ్మవారిలో గల లక్షణా లన్నిం టినీ జ్యోతిశ్చక్రంలో ఉన్న రాశులతో పోల్చారు. అమ్మ జగన్మాత. అందుకే ఈ పన్నెండు రాశులు ఆమెలోనే ఉన్నాయి. అంతర్లీనంగా ఆలోచిస్తే అన్నమయ్య అమ్మవారికి, అయ్యవారికి రాశి మైత్రి కుదిరిందని చెబుతున్నారు. అమ్మవారిలో అన్ని రాశులూ ఉన్నాయి కాబట్టి స్వామి యే రాశిలో పుట్టినా (జననకాలంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మన జన్మరాశి అవుతుంది) వారిద్దరికి రాశి మైత్రి అద్భుతంగా కలుస్తుందన్న మాట. ఈ విధంగా ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ జరగదు. అన్నమయ్య కేవలం ఆధ్యాత్మిక తత్వవేత్త మాత్రమే కాదు, పరిపూర్ణ శాస్త్రజ్ఞుడు కూడా.
పన్నెండు రాశుల ఉనికి కలిగిన యువతి ఈ అందాలరాశి. ఇంతకీ ఆ పన్నెండు రాశులూ ఆమెలో ఎలా కలిగాయంటే..
ఆమె కనుబొమ్మలు విల్లులా (ధనస్సు) వంగి ఉన్నాయి. కాబట్టి ఆమెలో ధనూరాశి కలిగింది.
ఆమె కనులు అందమైన చేపల (మీనములు) వలే ఉన్నాయి. కాబట్టి ఆమెలో మీనరాశి గోచ రిస్తోంది.
ఆ సౌందర్యవతికి శృంగారముగా కులుకుతూ కదులుతూన్న కుండల వలే గుండ్రని కుచములు ఉన్నవి. కాబట్టి ఆమెలో కుంభ (కుండ) రాశి ప్రతిబింబిస్తోంది.
ఆమె తీగలాంటి సన్నటి నడుము సింహము నడుము లాగ ఉన్నందున ఆమెలో సింహరాశి దర్శనమిస్తోంది.
ఆమె వక్షస్థలాన్ని కప్పే పయ్యెద- గాలికి అటూ ఇటూ ఊగుతూ మన్మధుని జెండా (మకర ధ్వజము)- మొసలి చెన్నెలున్న మరుని పతాకం వలే ఉన్నందున ఆమెలో మకర రాశి కనిపిస్తోంది.
ఆమె నిత్యము యవ్వనవంతురాలు. కాలం ఆమెలో ఏ మార్పునూ తీసుకురాలేదు (మనం కాలంతో పాటు వృద్ధులమవుతాం కదా! ఆవిడకు ఆ బాధ లేదు). కాబట్టి కన్య (యవ్వనవతి అయిన స్త్రీ) రాశి ఆమెను ఆశ్రయించింది.
మేలిమి బంగారంతో సరిసమానంగా తూగే మిసమిసలాడుతున్న బంగారు వర్ణపు శరీరం కలిగిన పడతి కాబట్టి ఆమెలో తులా (త్రాసు) రాశి సంతరించబడింది.
సన్నని పొడవైన వాడి గల గోళ్లు కలిగినది కాబట్టి ఆమెలో వృశ్చిక (తేలు) రాశి వెల్లివిరిసింది.
ఆమె చాలా మృదు మధురంగా పాడగలడు. రిషభాది స్వరాలు ఆమె గొంతులో సుస్వరంగా పలుకుతాయి. కాబట్టి ఆమెలో వృషభరాశి ఒనరింది (‘సరిగమపదని’లో ‘రి’ అంటే రిషభం కదా!).
ఎండ్రకాయ (పీత, కర్కాటకం) కాలువ గట్టుల్లో బొరియలు చేసుకుని అత్యంత గుట్టుగా నివ సిస్తుంది. అలాగే, అలమేల్మంగ స్వామితో కలిసి నపుడు చాలా గుట్టుగా ప్రణయ రహస్యములు పలుకుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి ఆమెలో ఆ విధంగా భాగమైంది.
మేక ఎప్పుడూ లేత చిగుళ్లు మేస్తూంటుంది. మేక నోటి వద్ద ఎప్పుడూ లేత చిగుళ్లుంటాయి. ఈ అలమేల్మంగకు అధరాలే (పెదవులే) ఎర్రని లేత చిగుళ్లలా ఉన్నాయి. కాబట్టి ఈమెలో మేషరాశి మమేకమైంది.
ఆమె శ్రీవేంకటపతిని కల్యాణమాడి, ఆయనతో సంగమిస్తే అది మిధునరాశి అవుతుంది.

Review యింతి చెలువపు రాశి...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top