జగదంబ మూల మంత్రార్థం

పంచానికి మూలమైన పరమాత్మను తెలియచేసే శబ్దం- ప్రణవం. అదే ఓంకారం. దీనిలో అ, ఉ, మ, అనే ఆద్యంతాక్షరాలే ‘అమ్మ’గా రూపాం తరం చెందాయి. ‘అ’కారం పలకగానే నోరు తెరుచుకుంటుంది. అది సృష్టిని తెలియచేస్తుంది. ‘మ’కారం పలకగానే నోరు మూసుకుంటుంది. ఇది ఓష్ఠ్యం క్రియ. ఇది సంపూర్ణతను సూచిస్తుంది. ఈ రెండింటి నడుమ ఉన్నదే స్థితి. అందుకే ‘అమ్మ’ సంపూర్ణ శబ్దమైనది. ఓంకారమంత విలువైన, శ్రేష్ఠమైన మంత్రం- ‘అమ్మ’.

పరాశక్తిలోని పలు రకాల వ్యక్తీకరణలను పలు విధాల నామరూపాలతో దర్శింపచేసే మన ఉపాసనా శాస్త్రంలో అవన్నీ మంత్రాలుగా లభిస్తున్నాయి. దుర్గతులను దునుమాడే దుర్గాదేవిని ఎనిమిది నామాలతో కీర్తించే ఒక మంత్రరాశిని దేవీ పురాణం అందిస్తోంది. ఆ ఎనిమిది నామాలు- ఆర్యా, దుర్గా, వేదగర్భా, అంబిక, భద్రా, భద్రకాళీ, క్షేమ్యా, క్షేమంకరీ. మహిమాన్వితమైన కొన్ని నామాలను కూర్చి జపిస్తే- దాన్ని మూల మంత్రం అంటారు. పై ఎనిమిది నామాల మూల మంత్రం ఆపదలను తొలగించి, రక్షణను ఇస్తుందని మహర్షుల మాట. వీటిని నమస్కార పూర్వకంగా మంత్రాలుగా పఠించి సత్ఫలితాలు పొందవచ్చునని దేవీ పురాణం చెబుతోంది. ఈ ఎనిమిది నామాల మంత్రార్థాల గురించి విపులంగా తెలుసుకుందాం.

ఆర్యాయై నమః

‘ఆర్యా’ అనే మాటలకు ‘పూజ్యురాలు’ అని అర్థం. పూజింపదగిన తత్వం, మహిమ, అద్భుత గుణాలు కలిగిన తల్లి జగదంబ. దేవతలు, రుషులు, బ్రహ్మవిష్ణురుద్రులు కూడా ఆరాధించే గొప్పతనం చేత ఆమె ‘ఆర్యా’ అనిపించుకున్నది. అసుర బాధితులు ఆక్రమించినపుడు ఇలవేల్పులందరూ అమ్మ కరుణ అనే రక్షణ పొందారు. అర్చనకు యోగ్యమైన పవిత్రత, ఔన్నత్యం, సమర్థత కలది పరాశక్తి.

దుర్గాయై నమః

సర్వజగతికి ఆశ్రయమైన శక్తి కనుక ‘దుర్గా’ అన్నారు. ‘దు’రాచారాలను, ‘దుః’ఖాలను, ‘దు’ష్టత్వాన్ని, ‘దు’ర్మార్గాన్నీ, ‘దు’స్సాధ్యాన్నీ తొలగించే సమర్థురాలు అని ‘దుర్గా’ నామంలోని భావం. ‘భయం కలిగినపుడు దుర్గా నామస్మరణ వల్ల ఆ భీతిని తొలగించుకుంటారు. ఏ భయమూ లేనివారు, దారిద్య్రాన్నీ, దుఃఖాన్నీ, భయాన్నీ పోగొట్టే దయార్ద్ర చిత్తం గల దేవి దుర్గ’ అని మార్కండేయ పురాణం లోని దేవీ మహాత్మ్యంలో మహర్షులు పేర్కొన్నారు.

వేదగర్భాయై నమః

‘వేదాలలో ఉన్న పరతత్వం దేవి. ఆ దేవి నుంచే వేదాలు ఆవిర్భవించాయి’.. రెండు అర్థాలు ఈ నామంలో ఉన్నాయి. ‘గర్భం’ అనే మాట లోపలి భాగాన్నీ, మాతృత్వాన్నీ తెలియచేస్తుంది. వేదాల కన్నతల్లి జగదంబ. ‘కడుపు చల్లంగ వేదాల కన్నతల్లి’ అని శ్రీనాథ మహాకవి కీర్తించాడు. సర్వధర్మాలకూ, జ్ఞానాలకూ నిది వేదం. ఆ వేదాలకు మూలం, వేదాల గమ్యం ఈ పరతత్వమే. వేదం అనే మాటకు జ్ఞానం అని అర్థం. జ్ఞానానికి కేంద్రమైన చైతన్య స్వరూపిణి శ్రీమాత.

అంబికాయై నమః

ప్రపంచానికి కారణమై, పోషకమై, రక్షకమైన ప్రేమ స్వరూపిణి కనుక జగన్మాతను ‘అంబిక’ అని పిలుస్తున్నారు. వేద మంత్రాల్లో ‘అంబితమే, దేవితమే’ అని అమ్మను ప్రస్తుతించారు. తల్లుల్లోకెల్లా గొప్పతల్లి జగజ్జనని. విశ్వకారణ శక్తిని మాతృభావంతో ఆరాధించడంలో మాధుర్యం ఉంది. పిల్లలకు తల్లి గురించి జ్ఞానం లేకపోయినా, ‘అమ్మా’ అని పిలువగలిగే ప్రేమ భావం ఉంటే చాలు- ఆ అమ్మ అమాయకులైన బిడ్డల్ని ఆదరంగా అనుగ్రహిస్తుంది. విశ్వమూలశక్తిపై అవగాహన లేకున్నా, ఆ శక్తిని ‘జననీ’ భావంతో స్మరిస్తే చాలు.. అవ్యాజ్యమైన కరుణతో ఆ తల్లి కృపను వర్షిస్తుంది.

భధ్రాయై నమః

శుభాలనూ, మేలునూ కలిగించే రక్షణ శక్తిగా దేవిని ఈ నామంతో కీర్తించింది ‘మంత్ర వాంగ్మయం’.

భద్రకాళ్యై నమః

ఏది, ఎక్కడ, ఎలా కొనసాగాలో నియమించే విశ్వసనీయమైన శక్తిని ‘కాళి’ అంటారు. ఈ కాల స్వరూపిణిని మంగళకారిణిగా, అనుగ్రహించేదిగా ఆమెను ‘భద్రకాళి’ అని పిలుస్తున్నారు.

క్షేమ్యా•యై నమః

అమ్మ స్వభావమే క్షేమం. పదిలమైన స్థితిని ప్రసాదించే దయ ఆమె గుణం కనుక ‘క్షేమ్యా’ అయ్యింది. ‘యోగక్షేమాల’లను వహించే కృప ఆమె నైజం.

క్షేమంకర్యై నమః

క్షేమాన్ని స్వభావంగా కలిగిన కారణంగా, క్షేమాన్ని కలిగించడమే ఆమె మహిమ. దీపం కాంతిని ఇచ్చినట్టుగా, దుర్గాంబ క్షేమాన్ని ప్రసాదిస్తుంది. ప్రయాణ సమయంలో, మార్గమధ్యంలో ఈ నామాన్ని జపిస్తే ఏ ప్రమాదాలూ రాకుండా రక్షిస్తుందని ‘మంత్ర శాస్త్రం’ చెబుతోంది.
పై ఎనిమిది నామాల మంత్రాలను అభీష్ట సిద్ధులను అందించే అద్భుత రత్నహారంగా రుషులు సమకూర్చారు. రక్షణనూ, భద్రతనూ, క్షేమాన్నీ ప్రసాదించే ఈ శబ్ద మణిమాలను భక్తిశ్రద్ధలతో జపించి ధన్యులమవుదాం.

Review జగదంబ మూల మంత్రార్థం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top