జన్మాష్టమి

ఆగస్టు 23/24, శనివారం

శ్రావణ బహుళ అష్టమి తిథి కృష్ణాష్టమి పర్వం. ఇది మనకు ముఖ్య మైన పండుగల్లో ఒకటి. మన భారత్‍లో 23వ తేదీన, విదేశాలలో 24వ తేదీని ఈ పర్వం గడియలు ఉన్నాయి. ఈ పర్వం విశేషాల్లోకి వెళ్తే.. శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పర్వం కావడం వల్ల జన్మాష్టమిగా కూడా ప్రసిద్ధి. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. కృష్ణ జయంతి నాడు ఉపవాసం ఉండి ఆయనను పూజిస్తే సకల పాపాలు హరించిపోతా యని పురాణాలు చెబు తున్నాయి. కృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, జయం కలుగుతాయని స్కంద పురాణోక్తి. కృష్ణ జయంతిని ఆచరించని వారు మహా పాపాన్ని పొందుతారని, యమపాశంలో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, క్రూర రాక్షసులుగా జన్మిస్తారని స్కాందాది పురాణాల్లో ఉంది. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యమివ్వాలని, బంగారంతో కానీ, వెండితో కానీ ద్వాదశాంగుల విస్తారమైన చంద్రబింబం చేసి వెండి, బంగారుపాత్రలలో దానిని ఉంచి, పూజించి అర్ఘ్యమివ్వాలని, అలా చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో ఉంది. కృష్ణావతారం దశావతారాల్లో 8వది. కృష్ణ చరితం హరివంశ భాగవత విష్ణు పురాణాల్లో విపులంగా ఉంది. ఆబాల గోపాలానికి కృష్ణుని లీలలు, కొంటె చేష్టలు తెలిసినవే. కృష్ణుడు లోకోత్తర సుందరమూర్తి. మహాబల పరాక్రమశాలి. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం- భగవద్గీత. ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పాలనా పద్ధతికి కృష్ణుడే ఆద్యుడు. కృష్ణుని కాలంలో కంసుడు, నరకాసురుడు, కాలయవనుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన రాజులు ఎవరికి వారు చక్రవర్తులమని, రాజాధిరాజులమని చెప్పుకొంటూ దుష్పరిపాలనతో రాజ్యాలను ముక్కలు చెక్కలుగా చేసి పాలిస్తుండే వారు. కృష్ణుడు తాను రాజ్యాధికారం కోరక, దేశానికి కేంద్ర పరిపాలన విధానం ఉండటం మంచిదని భావించి పాండవులచే మిగతా రాజులను హతులను చేయించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేసి కేంద్ర పాలనకు బీజం వేశాడు. కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రాన రాత్రి సమయాన జన్మించాడు కనుక అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తారు. జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి ఆడిస్తారు. బాల్యంలో కృష్ణుడు చేసిన బాల్య చేష్టలకు నిదర్శనంగా వీధులలో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు.

Review జన్మాష్టమి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top