నీ జీవితం విరిసిన దిరిసెన పువ్వు కావాలని.

రజనీ ముఖంబున రాగంబు మెఱసెఁ
గలువ పుట్టింటిలోఁ గలకల విరిసె
దివ్య సౌధంబులో దీపాలు వెలిఁగె
గర్భాలయంబులో గంటలు మ్రోఁగెఁ
బ్రాక్సతీమణి పట్టె బంగారు గొడుగు
విశ్వ సుందరి వీచె విరి చామరంటు
భపద ఖండానంద భవనాంగణమునఁ
బడిగాపు పడియుండె బ్రకృతి గణంబు
– శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, ఏకాంతసేవ

ఏమ్మా! ఎలా ఉన్నావు? ఫోన్‍లో నీ గొంతు విన్నపుడు, నీ పాట విన్నంతటి ఆనందం కలి గింది. చెల్లాయి వసంత ఎలా ఉంది? ‘విశాల’కు రాస్తున్న ఉత్తరం త్వరలో చేరుతుంది. అనుకోని కారణాల వల్ల ఆమెకు ఉత్తరం ఆలస్యంగా రాస్తున్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పగలవు. నేను అన్నిట్లోనూ ఆలస్యమే. అలసిన జీవితానికి ఆలస్యమే శరణ్యం. రేడియోలో నీవు పోగ్రామ్‍ ఇచ్చినట్లు విన్నాను. చాలా సంతోషం. … ఇంట్లో ‘అమ్మా’ వాళ్లు బాగున్నారనుకుంటాను.
నీవు పంపిన ‘క్రీస్తు’ ఫొటో ఎంత బావుందని! ఆలాంటి ఫొటోను కొందామని చాలాసార్లు ప్రయత్నించి మానుకున్నాను. ఈలోగా నీ చేతుల మీదుగా చేరింది. ఫొటో నిగూఢమైన నీ హృదయంలాగే ఎంతో అందంగా ఉంది. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? ఫొటోను విప్పి చూడగానే మనసు ఆనందంతో విప్పారింది. ఎంతో ఆహ్లాదాన్ని అనుభవించింది. ఎప్పటి కలో నిజమైన భావన కలిగింది. కలలకు అలవాటు పడ్డ ఈ కళ్లు నిజాన్ని నమ్మలేకపోతున్నాయి. జీసస్‍ ఫొటోను చూడగానే తెలియని తన్మయత్వంతో కళ్లు చెమ్మగిల్లుతాయి. క్రీస్తును గురించి ఓ కవి అన్న మాటలు జ్ఞాపకమొస్తున్నాయి.

ఓ మహాత్మా!
నీవు ప్రభవించినప్పుడు
ఈ మహీపుష్పం మీద
నీ చరణాల తుమ్మెదలు వాలినప్పుడు
వికసించిన కాంతి
ఇప్పుడు ఎక్కడ వెతుక్కోను?
ప్రభూ! నీ పుట్టుక చీకటికి ప్రళయం!
నీ నిష్క్రమణ కాంతికి ప్రళయం!
ఉదయించు ప్రభూ! హృదయంలో
నినదించు ప్రభూ! ఉదయంలో!
-ఆచార్య తిరుమల

ఏమ్మా! ఇంకేమిటి విశేషాలు?! నీ గొంతులో సెలయేటి పాటలున్నాయి. నీ జీవితంలో కూడా వెలలేని సంతోషపు మూటలున్నాయి. ‘మానసిక సంఘర్షణ’ ఎల్లకాలం ఉండేది కాదు. సముద్రానికి అప్పుడప్పుడు తుఫానులు ఎందుకు అవసరమో మనకు తెలియదు. అలాగే మనసుకు సంఘర్షణ అవసరం. తుఫాను తగ్గగానే నౌకలు సాగరంపై తేలుతాయి. తీరాలు చేరుతాయి. సంఘర్షణ అవ సరం తీరగానే మనో సాగరంపై ఆనంద నౌకలు చేరుతాయి. ఆనంద నౌకలు తీరాలు చేరి సేద తీరుతాయి.
ఘర్షణలో నుంచి వెలుగురవ్వలు రాలుతాయి. మానసిక సంఘర్షణలో నుంచి శాంతి మువ్వలు మోగుతాయి. ఏది ఎందుకు జరిపిస్తాడో ఆ పరాత్పరునికే తెలియాలి. కాని కారణం లేనిదే, అవసరం లేనిదే కరుణామయుని కాఠిన్యం మన జీవన కుడ్యాలను తాకదు. ‘చిరు సుమం – గాలికి కొట్టుకు పోదు’ గాలికి చిన్మయ గంధాలను రాస్తుంది. అన్నీ తెలిసిన ‘ఆయన’ – జరిపించే వన్నీ మనపై తన అదృశ్య హస్తంలో నుంచి ఆనందాన్ని కురిపించటానికే. ఆయన్నే మనం అనుమానించిన నాడు మనకు ఇంకేం మిగులు తుంది? మన జీవన పథంలోని ముళ్లని ఏరి తన తలపై కిరీటంగా మార్చుకుని, మన తలలపై దరహాస తలంబ్రాలు చల్లే ‘క్రీస్తు’ మనకు జ్ఞాపకం రావాలి. ‘ఆయన’ ఆరాటమంతా మన జీవన పోరాటంలో ప్రహర్షాన్ని ప్రసరించటానికే. అమ్మ రహస్యంగా దాచుకున్న, పాపను లాలించి దోచుకున్న డబ్బులన్నీ, ‘పాప’కు అందమైన బొమ్మలు కొనటం కోసం వినియోగిస్తుంది. తల్లి దండ్రులు తమ జీవితాన్నంతా పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేస్తారు. ‘ఆయన’ తనువంతా గాయాలతో వాడినా.. మన జీవన తరువులపై వీడని వసంతాలను వెదజల్లుతూ తన తనువును వీడాడు. మన ‘పాప’ భారాన్నంతా ‘ఆయన’ మోస్తున్నది పసి ‘పాప’లమైన మన జీవితాల్లో పసిడికాంతులు చిలకటానికే. మనం నిద్రిస్తున్నా, తాను మేల్కొని మన బాగోగులు చూసే చిన్నప్పటి మన అమ్మ జ్ఞాపకం రావాలి. ఇంతమంది మనకు ఉండగా, కుండపోతగా దు:ఖం వర్షిస్తున్నా దిగులెందుకు? జీవన లోయల్లోకి దిగుతున్నా గుబులెందుకు? ఒకవేళ గబుక్కున జారిపడితే – చాచి ఉంచిన ‘ఆయన’ చేయి నుంచి నిర్వీర్యమైన మన జీవన నాడుల్లోకి విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆనంద ప్రవాహాలు గంతులేస్తాయి.

భగవంతుని ‘పరీక్ష’లో నెగ్గాలంటే మన ‘నిరీక్షణా’ వైశాల్యం అనంతంగా ఉండాలి. నాకు చాలాసార్లు అన్పిస్తుంది.
ప్రభూ!

ముద్దాడే నీ కమనీయ అధరాల కన్నా, మందలించే నీ కఠిన హస్తాలే ఎక్కువ కారుణ్యాన్ని నా జీవన మృణ్మయ పాత్రలోకి ప్రసరిస్తాయి!.
మనం మోయలేని భారాలన్నింటినీ ‘ఆయన’ పైకి విసిరి హాయిగా నవ్వటం నేర్చుకోవాలి. మన జీవన ధరాతల లలాటంపై తన దరహాస ముద్రలు వదలుతాడు. నీ పేరు ‘వనజ’. వనజ అంటే తామర. కాబట్టి నీకు నీటిలో తామరాకులా జీవించటం ఇంకా సులువు. ఇంకేం రాయాలి?! మదిలోని ఆయన రూపు, మనలోని భయములు బాపు. ధైర్యంగా ముందుకు సాగు… దారి పొడవునా నవ్వుల విరజాజులు రాలుస్తూ, నీ జీవితం విరిసిన దిరిసెన పువ్వులా భాసిస్తుంది. నీ జీవన తరు శాఖల్లో ‘ఆయన’ నవవసంతాలు నింపుతాడు.
చెల్లాయి ‘విశాల’కూ, ఇంట్లో ఆత్మీయులంద రికీ ‘శివరాత్రి’ శుభాకాంక్షలు అందజేయగలవు.
కళ్లు లేని గురివింద తీగెకి పట్టుకొమ్మ దొరికేందుకు
కస్తూరి పూల పరిమళం తోవ చూపిందా?
తన పూల గర్భాల్లోకి దూరి మకరందాన్ని తాగే
తుమ్మెద రొమ్ము కొలత తంగేటి చెట్టుకి ఎన్నడో తెలుసా?
నడి ఎండలో చేతులు జాచి నాట్యం చేసే కొబ్బరి చెట్టుకి
తన ఎత్తు నించి వూడి పడే పావని కాపాడ్డానికి
పీచుదిళ్ల చొక్కాలల్లడం ఎవరు నేర్పారు?
గర్భంలో శిశువులో ఏ అవయవాలు ఎక్కడ ఏర్పడాలో
కన్నతల్లి కలగన్నదా!
-చలం

వనజా! రోజుల విరజాజులపై ఆనందంగా అడుగులు వేస్తూ, ముందుకు సాగు! మనం రాల్చే కన్నీటి చుక్కలను తుడవటానికి ఆయన దగ్గర ‘జేబు రుమాలు’ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
నీ
మనసు మల్లెపొదలో నుంచి పొంగి పొరలే.. సోదరి వాత్సల్య వారధిపై అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ…
(శ్రీరామ్‍ సర్‍ వివిధ సందర్భాలలో రాసిన లేఖలనుంచి సేకరించిన అంశాలు ఇవి

Review నీ జీవితం విరిసిన దిరిసెన పువ్వు కావాలని..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top