అనంత పద్మనాభ వ్రతం

పడుచుల పండుగ

భాద్రపద బహుళ తదియ, సెప్టెంబరు 17, మంగళవారం

ఉండ్రాళ్ల తద్ది. ఇది ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తన భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. భాద్రపద బహుళ తదియకు ముందు రోజైన భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారు జామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరిం టాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట ఆడతారు. ఊరి బయట తోటలకు అట్లు, బెల్లపట్లు, పెరు గన్నం పట్టుకెళ్లి, వాటిని ఆరగించాక ఉయ్యాల లూగుతారు. రాత్రి గౌరీ పూజ చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా స్త్రీల సౌభాగ్యం కోసం చేసే పండుగ. శ్రావణ, బాద్రపద మాసాలలో కొన్ని స్త్రీ సౌభాగ్యకారకమైన వ్రతాలు గురించి వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కానీ, ఉండ్రాళ్ల తద్ది గురించి ఆయా గ్రంథాలలో లేదు. హేమాద్రి పండితుడు చెప్పిన ప్రకారం.. చైత్ర, భాద్రపద, మాఘ మాసాలలో రూప సౌభాగ్య సౌఖ్యప్రదమైన తృతీయా వ్రతాన్ని గురించి తనకెందుకు చెప్ప లేదని యుధిష్టరుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. కృష్ణుడు- భవిష్యోత్తర పురాణం నుంచి ఓ వ్రతాన్ని ఉదహరించాడు. భాద్రపద తృతీయ అన్నాడే కానీ, భాద్రపద బహుళ తదియ అని స్పష్టంగా చెప్ప లేదు. సాధారణంగా భాద్రపద శుద్ధ తృతీయ నాడు చేయాల్సిన వ్రతాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ‘గుడ తృతీయ’మనే ఒక వ్రతాన్ని కృష్ణుడు ఉద హరించాడు. గుడాంన్నము దేవికి నైవేద్యంగా పెట్టి, జలాశయాల్లో దేవీ ప్రతిమలను నిమర్జన చేస్తారు. వాసు దేవుని ప్రీతి కోసం పాయసాన్ని సమర్పించాలని ఈ వ్రతంలో ఉంది. ఈ వ్రతం కూడా ఏ పక్షపు తృతీయ అనేది స్పష్టంగా లేదు. గుడాపూపములు నైవే ద్యంగా ఇవ్వాలని అనడం వల్ల నేటి ఉండ్రాళ్ల తద్దియే ఆ వ్రతమై ఉండవచ్చని వ్రతకారుల అభిప్రాయం. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలనేది ఆరోగ్య సూత్రం. దానికి అనుగుణంగానే ఉండ్రాళ్లు ఆరగించే ఈ పండుగ ఆచరణలోకి వచ్చి ఉండవచ్చు.
కాగా, ఉండ్రాళ్ల తద్ది (తదియ) నాడు కొన్ని వర్ణాల వారు గొంతెమ్మ (కుంతి) పూజ చేయడం కూడా ఆచారంగా ఉంది.

అనంత పద్మనాభ వ్రతం
భాద్రపద శుద్ధ చతుర్దశి, సెప్టెంబరు 12, గురువారం

అనంత పద్మనాభ వ్రతం ఏటా భాద్రపద శుద్ధ చతుర్దశి తిథి నాడు వస్తుంది. అరణ్యవాసం చేస్తున్న పాండవులు ఏ వ్రతం చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయో చెప్పాలని శ్రీకృష్ణుడిని కోరారు. కృష్ణుడు వారికి అనంత పద్మనాభ వ్రతాన్ని ఉప దేశించాడు. కృష్ణుడు పాండవులకు ఈ వ్రత కథను వివరంగా చెప్పడంతో పాటు ఇంకా ఇలా చెప్పాడు.
‘ధర్మరాజా! లోపాముద్ర సమేతంగా అగస్త్యుడీ వ్రతాన్ని ఆచరించి లోకాన వ్యాపింప చేశాడు. సగర, భరత, దిలీప, హరిశ్చంద్ర, జనకాది రాజులంతా తమ తమ ధర్మపత్నులతో సహా ఈ వ్రతాన్ని ఆచరించి తరించారని బోధించాడు.
అయితే, కాలాంతరాన, యుగ ధర్మం రీత్యా పురుషులంతా సంసార వ్యవహారాలలో మునిగి తేలడంతో ఈ వ్రతాన్ని ప్రస్తుతం స్త్రీలు ఆచరించడం ఆచారంగా మారింది. తమ యొక్క, తమ భర్తల యొక్క, పుత్రుల యొక్క, ప్రియుల యొక్క శ్రేయస్సును కోరి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించలేని స్త్రీలు- భక్తి పూర్వకంగా ఈ కథను విన్నా, చదివినా కూడా కష్టదూరాలూ, ఇష్టాప్రాప్తలూ అయి చిరకాలం సుఖిస్తారు.
అనంత పద్మనాభ వ్రతం ఇలా ఆచరించాలి..
అనంత పద్మనాభ వ్రతాన్ని పద్నాలుగు (14) సంవత్సరాల పాటు ఆచరించాలి. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చతుర్ధశి నాడు నదీ స్నానం చేసి నదీ తీరంలోనే ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజా స్థలాన్ని గోమయంతో అలికించి సర్వతోభద్ర మండలం చేసి, దుద్దుతో కూడిన అష్టదళపద్మాన్ని నిర్మించి, దాని చుట్టూ తెల్ల బియ్యం పిండితోనూ, పంచవన్నెలతోనూ ముగ్గులు పెట్టించి, మండలానికి కుడి వైపు కలశం పెట్టాలి. కలశం ముందు- 14 ముడులు కలిగిన తోరాన్ని కుంకుమలో తడిపి ఉంచాలి. మధ్యలో దర్భలతో చేసిన అనంతుడి ప్రతిమను ప్రతిష్ఠించాలి. అది ఏడు పడగల శేషువు మీద శయనిస్తున్నట్టు ఉండాలి. పచ్చని కన్నులుండాలి. నాలుగు చేతులుండాలి. కుడివైపు పై చేతిలో శంఖం, కింది చేతిలో పద్మం, ఎడమ వైపు ఎగువ చేతిలో చక్రం, దిగువ చేతిలో గద ఉండాలి. కలశ, మండల, ప్రతిమలు.. మూడింటా స్వామిని పూజించాలి. 14 రకాల ఉపచారాల ప్రకారం పూజించి, 14 రకాల నైవేద్యాలు ఉంచాలి. ఐదు పదుల (7,500 గ్రాములు) గోధుమపిండితో తగినంత బెల్లం 28 అతిరసాలు (అరిసెలు) చేసి అందులో సగం (14) బ్రాహ్మణునికి వాయనంగా దానమిచ్చి, తక్కినవి తాము బంధుసమేతంగా భుజించాలి. అనంతరం పూజలో పెట్టిన తోరం తీసి కట్టుకోవాలి. పూజలో అన్నీ 14 సంఖ్యలోనే ఉండాలి. పైన చెప్పిన విధంగా 14 ఏళ్ల పాటు స్వామిని పూజించాక ఉద్యాపన చేసుకోవాలి. అది కూడా వ్రతం మాదిరే ఆచరించాలి. ఉద్యాపనాన్ని సంకల్పించుకోవాలి. అనం తుని పూజకు ముందు యమునా పూజ ముఖ్యం.

Review అనంత పద్మనాభ వ్రతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top