వరాల తల్లి

శ్రావణ శుద్ధ నవమి, ఆగస్టు 9, శుక్రవారం
శ్రావణంలో వచ్చే వారాల్లో విశేషమైనది- శుక్రవారం. ఈ రోజున ముత్తయిదువలు వరలక్ష్మీ వ్రతం పేరుతో విశేష పూజలు నిర్వ హిస్తారు. ఇంకా ఈ మాసంలోని మంగళవారం, శనివారం కూడా విశేషమైనవే. ఒక్కో వారం గురించి వివరణ..

శ్రావణ శనివారాలు

వారాల్లో మూడు వారాలు శ్రావణమాసంలోనే మహత్తు కలవిగా ఆచారంలో ఉన్నాయి. ఇవన్నీ అతివలకు అత్యంత ప్రీతిపాత్రమై ఉన్నాయి. శ్రావణ మాసంలో శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు మహత్తయినవి. శ్రావణ మాసంలోని శనివారాల్లో తిరుమలలో పూజా విశేషాలు అధికంగా జరుపుతారు.

శ్రావణ మంగళవారాలు

కొత్తగా వివాహమైన మహిళలు శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా ఆచరించడం వల్ల జన్మజన్మల్లో అమంగళం కలగకుండా ఉంటుందని చెబుతారు. దీనినే శ్రావణ మంగళగౌరీ వ్రతం అంటారు. ఈ వ్రతం వివాహమైన తరువాత వరుసగా ఐదేళ్లు చేయాలని నియమం.

శ్రావణ శుక్రవారాలు

శ్రావణ శుక్రవారం వ్రతం (వరలక్ష్మీ వ్రతం) మహత్తయినది. ఇది పుణ్యస్త్రీలకు ప్రత్యేకంగా నియమించిన వ్రతం. ఈ వ్రతాచరణ వలన పాపాలు పోవడమే కాక, లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందని ప్రతీతి. శ్రావణ మాసంలోని శుక్రవారాల్లో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మరీ మహత్తు కలది. ఈ వ్రతం ధనకనకవస్తు వాహనాది వృద్ధికి మూలమైనది. మహాలక్ష్మీ నుంచి ఉపదేశాన్ని పొంది చారుమతీ దేవి ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్రతమిది. శ్రావణ వరలక్ష్మీ పూజ కొత్త నగతో చేయాలని నియమం. కొత్తగా వివాహమైన మహిళలకు శ్రావణ తగవు పేరుతో అత్తవారు నగలు తెస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనినే శ్రావణ పట్టీ అంటారు.

వరలక్ష్మీ ప్రాశస్త్యం..

‘వర’ శబ్దానికి ‘కోరుకున్నది’ అని అర్ధం. అందరూ కోరుకునే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేది, వాటి రూపంలో ఉన్నది వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞా స్థాయీ బేధాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరుకున్నవి కావాలన్నా భగవత్‍ సంకల్పం లేనిదే, ఆయన దయ లేనిదే పొందలేం. అసలు ఆనందం, సంపద లేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నది, ఆనందాలను ప్రసాదించేది ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, మోక్షలక్ష్మీ, సిద్ధలక్ష్మీ అనే ఐదు లక్ష్ములూ సమన్వయమై ఉన్నారు. ఈ ఐదు లక్ష్మీల చరమ నామమే ‘వరలక్ష్మి’. ‘ప్రతి స్త్రీలోనూ లక్ష్మీకళ ఉన్నది’ అనేది అర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీస్వరూ పాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీ రూపాన్ని అర్చిం చడం ఈనాటి కృత్యం.

వరలక్ష్మీ వైభవం

మన పంచాంగానుసారం శ్రావణ శుద్ధ పౌర్ణమి (ఆగస్టు 15)కి ముందు వచ్చే శుక్రవారం (శ్రావణ శుద్ధ నవమి, శుక్రవారం, ఆగస్టు 9) వరలక్ష్మీ వ్రత వారమై ఉంది. మహిళలకు సౌభాగ్యాలనిచ్చే ఈ వ్రతం తెలుగు నాట విశేషంగా ఆచారంలో ఉంది. అష్టలక్ష్మీ రూపాల్లో వరలక్ష్మీ దేవికి ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజలోకెల్లా వరలక్ష్మీ ఆరాధనం సర్వోత్తమమైనది. రూప, గుణ, మహిమా విశేషాలతో వరలక్ష్మి వరాల సిరుల్ని కురిపించ డానికి శ్రావణంలో తరలి వస్తుంది. సకలాభీష్ట ప్రదం కోసం, నిత్య సుమంగళిగా తాము విలసిల్లాలని విన్నవించుకుంటారు. వరలక్ష్మీ వ్రత కథలో అమ్మవారి కృపను పొందిన భక్తురాలు చారుమతి. ఈ చారుమతి నామధేయం ద్వారా తన భక్తులు ఎలా మసులు కోవాలో లక్ష్మీదేవి తెలియ చెప్పిందని కథనం. ‘చారుమతి’ అంటే మంచి మనసు. చెడు బుద్ధి, దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు లేని మనసు. ఇలాంటి పునీత మనస్కులు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారని వరలక్ష్మీ వ్రతం సందేశమిస్తోంది. ప్రేమపూరిత, సామరస్య, ప్రశాంతమైన సన్నిధులు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీ వైభవం అవిరామంగా విలసిల్లు తుంది. ఈ దివ్యమైన వాతావరణంలో ప్రతి లోగిలి లక్ష్మీకళతో వర్థిల్లుతుంది.

వరలక్ష్మీ వ్రత నియమం

శుక్రవారం ప్రాతఃకాలంలోనే నిద్రలేచి, కాలకృత్యాలు ముగించుకుని అభ్యంగన స్నానం చేయాలి. నూలుతో చేసిన కొత్త వస్త్రాలు ధరించడం శ్రేష్ఠం. పూజ కోసం నిర్ణయించిన స్థలంలో గోమయంతో అలికి, ముగ్గుతో పద్మాన్ని తీర్చిదిద్దాలి. దానిపై పీటను అమర్చి, పీట మీద బియ్యం పోసి దానిపై కలశం, చెంబును ఉంచాలి. ఒక కొబ్బరికాయకు పసుపు, కుంకుమ, కాటుకలతో కనులు, ముక్కు, చెవులను తీర్చి వరలక్ష్మీ రూపునివ్వాలి. తరువాత ఆ రూపును ఆ కలశంపై ఉంచాలి. ఈ విధంగా రూపొందించిన రూపంలోకి నియమ బద్ధమైన పూజాధికాలతో వరలక్ష్మీ దేవిని ఆహ్వానించాలి. ఆ రూపాన్ని యథాశక్తి పూజించాలి. సాయంత్రం వేళ ముత్తయిదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి పేరంటం చెయ్యాలి. వ్రతాచరణ తరువాత ముత్తయిదువులతో కలిసి వ్రత మహత్యాన్ని తెలిపే కథలను చదవాలి, వినాలి.
వరలక్ష్మీని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఆ తల్లి స్త్రీలకు అయిదవ తనాన్ని, సౌభాగ్యాన్ని, సంతానప్రాప్తిని, ఇంకా సకల శుభాలను కలుగచేస్తుందని ప్రతీతి. కన్యలు, ముత్తయిదువలు భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వరలక్ష్మి వరాల వర్షాన్ని కురిపిస్తుంది.

Review వరాల తల్లి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top