ఎండా, వానా, చలి.. అప్పుడూ
ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ప్రతి ఇంట్లో బామ్మ ఉండేది. ఇప్పుడు లేదు. అప్పట్లో ఒంట్లో నలత చేసినా.. కలత చెందినా బామ్మ చిట్కా వైద్యంతో క్షణంలో నయమయ్యేది. ఇప్పుడు మెడికల్ షాపుకో, హాస్పటల్‍కో పరుగెడుతున్నాం. చిన్నదానికీ, పెద్దదానికీ, అయిన దానికీ, కాని దానికీ పరీక్షలు.. వైద్యుల ఎదుట నిరీక్షణలు.. అయినా నయమవుతుందా అంటే అదీ లేదు. ఒకపక్క ఆరోగ్యంతో ఒళ్లు గుల్ల.. ఇంకోపక్క వైద్యఖర్చులతో జేబు గుల్ల.. చిన్నా చితకా సమస్యలకు డాక్టర్లు, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. నాటి బామ్మలు ఇప్పుడు లేకున్నా.. ఆ బామ్మలు వదిలివెళ్లిన వైద్యపు చిట్కాలు పదిలంగా ఉన్నాయి. వాటినోసారి గుర్తు చేసుకుందాం. వీలైనంత వరకు పాటిద్దాం.
తలనొప్పి చిటికెలో
మాయం ఇలా..!
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ వేధించే సమస్య- తలనొప్పి. దీనికి రకరకాల కారణాలు. తలనొప్పి మొదలవగానే మెడికల్ షాపునకు పరుగెత్తే వారెందరో! ఈసారి తలనొప్పి వస్తే ఆ పని చేయకండి. ఇలా చేసి చూడండి..
శొంఠికొమ్మును నీటితో తడిపి సానరాయి మీద బాగా అరగదీసి, ఆ గంధాన్ని తలనొప్పి ఉన్నచోట పట్టిస్తే చాలు.. ఆ గంధం గాలికి ఆరిపోయే లోగా తలనొప్పి మాయమవుతుంది.
తలనొప్పి నివారణ కోసం శొంఠికొమ్ము కషాయాన్ని లోనికి కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిలో రెండు గ్రాముల శొంఠికొమ్మును బాగా నలగ్గొట్టి వేసి, ఆ నీరు సగమయ్యే వరకు మరిగించాలి. అలా తయారు చేసిన కషాయాన్ని వడగట్టి, అందులో పటికబెల్లం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
కొందరు పార్శ్యపు తలనొప్పి (మైగ్రేన్)తో బాధపడుతుంటారు. ఇది పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు. దీర్ఘకాలం వేధించే మైగ్రేన్‍కూ శొంఠికొమ్ములతోనే చక్కని విరుగుడు ఉంది. వంద గ్రాముల శొంఠికొమ్ములను తీసుకుని నేతిలో దోరగా వేయించాలి. వేగిన శొంఠికొమ్ములను బాగా దంచి, వస్త్రఘాళితం పట్టాలి. మెత్తగా తయారైన ఈ శొంఠిపొడిలో 200 గ్రాముల పాత బెల్లం కలిపి బాగా దంచాలి. దీనికి ఒక గాజుసీసా లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకుని రోజూ రెండుపూటలా భోజనానికి ముందు ఐదు గ్రాముల చొప్పున తీసుకుని కాసేపు చప్పరిస్తే చాలు ఎలాంటి దోషం వల్ల తలెత్తిన తలనొప్పి అయినా మటుమాయం కావాల్సిందే. అంతేకాదు, శొంఠి, బెల్లం కలిపి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తినడం వల్ల అరుచి పోయి బాగా ఆకలి కూడా పుడుతుంది.
తలనొప్పికి విరుగుడుగా తలనూనెల కోసం దుకాణాలపైన ఆధారపడాల్సిన పనిలేదు.
ఇంట్లోనే చక్కని తలనొప్పి తైలాన్ని తయారుచేసుకోవచ్చు. పావు కిలో నువ్వుల నూనెను మూకుడులో వేసి, పొయ్యి మీద సన్నని మంటపై వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో సన్నగా తరిగిన శొంఠిముక్కలు, వస వేరు ముక్కలు, అతిమధురం వేరు ముక్కలు.. ఒక్కొక్కటి పాతిక గ్రాముల చొప్పున వేసి, గరిటెతో కలియదిప్పుతూ వేయించుకోవాలి. ఇవి నల్లగా మారగానే పాత్రను దించేయాలి. చల్లారిన తరువాత ఈ నూనెను వడగట్టి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకుంటే ఎలాంటి తలనొప్పులైనా నమయవుతాయి.
జలుబు, దగ్గు.. ఇదిగో మందు!
అందరినీ వేధించే సమస్యలు- జలుబు, దగ్గు. సాధారణంగా రుతువులు మారే సమయంలో జలుబు, ముక్కుదిబ్బడ పట్టి పీడిస్తాయి. జలుబు చేసిన వెంటనే మెడికల్ షాపుల్లో దొరికే మందులు వేసుకుంటారు చాలామంది. కానీ, ఇవి తక్షణమే జలుబును తగ్గించలేవు. జలుబు పూర్తిగా తగ్గడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. మందు మాకులు వాడినా, వాడకున్నా వారం పాటు వేధించే సమస్య జలుబు. అలాంటి దానికి ఇంగ్లిష్ మందుల బదులు ఇంట్లోనే తయారు చేసుకునే ఔషధం నుంచి ఉపశమనం పొందడం మేలు.
పసుపుకొమ్మును కాల్చి, ఆ పొగను పీలిస్తే జలుబు వల్ల కలిగే ముక్కుదిబ్బడ కొంతవరకు తగ్గుతుంది.
ఉల్లిరసం, అల్లం రసం, తేనె సమపాళ్లలో కలిపి మూడు పూటలా రెండేసి చెంచాల చొప్పున సేవిస్తే జలుబు, రొంప నుంచి ఉపశమనం దొరుకుతుంది.
ధనియాల చూర్ణం, మెత్తగా దంచిపెట్టుకున్న పటికబెల్లం సమపాళ్లలో కలిపి తీసుకుంటే జలుబు, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ లక్షణాలు త్వరగా నయం అవుతాయి.
జలుబు ఎక్కువై గొంతులో కఫం చేరితే చెంచాడు తేనెలో అరచెంచా కరక్కాయ పొడి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
శొంఠి, మిరియాలు, పసుపుకొమ్ములు సమపాళ్లలో తీసుకుని, వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని చెంచాడు కలుపుకుని మూడు పూటలా తీసుకుంటే జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది
•• జలుబుతో పాటు దగ్గు, గొంతునొప్పి కూడా బాధిస్తే తులసిపాకంతో ఊరట పొందవచ్చు. తాజా తులసి ఆకులను బాగా నూరి, ఆ ముద్దను శుభ్రమైన వస్త్రంలో మూటలా ఉంచి రసం పిండాలి. వంద గ్రాముల తులసి రసంలో వంద గ్రాముల పటికబెల్లం, పాతిక గ్రాముల అల్లం రసం, పది గ్రాముల మిరియాల పొడి చేర్చి ఒక పాత్రలో వేసుకుని సన్నని మంటపై నీరంతా ఇగిరిపోయే వరకు మరిగించాలి. పూర్తిగా నీరింకిన తరువాత పాత్రను దించేసి, చల్లారిన తరువాత పాకాన్ని గాజుసీసాలో నిల్వ చేయాలి. ఈ పాకాన్ని చెంచా లేదా రెండు చెంచాల వరకు కప్పు గోరువెచ్చని నీటిలో వేసి కలిపి తాగితే త్వరగా జలుబు, దగ్గు నుంచి బయటపడవచ్చు. తులసిపాకం సేవిస్తే అలర్జీ వల్ల కలిగే దద్దుర్లు, ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా తీరిపోతాయి.
జీర్ణ సమస్యలా.. ఇదిగో చిట్కా!
ఫాస్ట్ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ సంస్క•తి పెరిగాక అందరిలోనూ అజీర్ణం, కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. కడుపులో ఏకాస్త ఇబ్బంది తలెత్తినా ఎడాపెడా యాంటాసిడ్ సిరప్‍లు, పౌడర్లు వాడేస్తుంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తినపుడు మన వంటింట్లోనే దొరికే దినుసులను, సామగ్రిని సరిగా వినియోగించుకుంటే యాంటాసిడ్లతో పనే ఉండదు.
శొంఠికొమ్ములను, మిరియాలను శుభ్రం చేసుకుని, ఆరబెట్టుకున్న వేపచెట్టు బెరడును సమపాళ్లలో దోరగా వేయించుకుని మెత్తని పొడిగా చేసి పెట్టుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకుని పరగడుపున తీసుకుంటే ఎసిడిటీ, పులితేన్పులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కరక్కాయ, పిప్పిళ్లు, శొంఠి, వాము, సైంధవ లవణం.. వీటిని ఒక్కొక్కటి యాభై గ్రాముల పరిమాణం చొప్పున తీసుకోవాలి. వీటిలో వాము, శొంఠి, పిప్పళ్లను దోరగా వేయించుకోవాలి. వీటికి సైంధవ లవణాన్ని, కరక్కాయలను చేర్చి మెత్తని పొడి చేసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఈ పొడిని అరచెంచా చొప్పున గోరువెచ్చని నీటితో తీసుకున్నట్టయితే మందగించిన ఆకలి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.
నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి ఆ మిశ్రమంలో సన్నగా తరిగిన అల్లం ముక్కలను వారం రోజుల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అల్లం ముక్కలను ఎండబెట్టాలి. ఈ అల్లాన్నే ‘భావన అల్లం’ అంటారు. దీన్ని ఒక అర చెంచాడు నోట్లో వేసుకుని నమిలితే అరుచి తగ్గి ఆకలి పుడుతుంది.
భావన అల్లం తయారు చేసుకున్నట్టే నిమ్మరసం, సైంధవ లవణాలతో జీలకర్రను కలిపి వారం రోజులు నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టిన జీలకర్రను ‘భావనజీర’గా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా జీర్ణకోశ సమస్యలకు మంచి విరుగుడుగా పని చేస్తుంది.
రెండు చిటికెల ఇంగువ, పావుచెంచా వాము దోరగా వేయించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
దానిమ్మ గింజలను ఎండబెట్టి, వంద గ్రాముల పొడి తయారు చేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులను ఎండబెట్టి యాభై గ్రాముల పొడిని తయారు చేసుకోవాలి. వీటికి పాతిక గ్రాముల సైంధవ లవణం పొడిని జతచేసి మూడింటినీ వస్త్రఘాళితం చేయాలి. ఈ పొడిని గాజుసీసాలో నిల్వ చేయాలి.
మూడుపూటలా భోజనం తరువాత ఈ పొడిని అరచెంచాడు చొప్పున కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక అజీర్ణ సమస్యల నుంచి, కడుపునొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే భోజనం చేసిన తరువాత కలిగే ఇబ్బందులు వంటివి సమసిపోతాయి.
చిన్ని కరక్కాయలు యాభై గ్రాములు, సోంపు గింజలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, సైంధవ లవణం పది గ్రాములు ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి. వీటికి ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు అల్లం రసం కలిపి ఎండబెట్టాలి. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని గాజు సీసాలో నిల్వ చేయాలి. చెంచాడు తేనెలో ఈ చూర్ణాన్ని అరచెంచాడు కలిపి రెండుపూటలా తీసుకుంటున్నట్టయితే అజీర్తి, కడుపుబ్బరం, కడుపునొప్పి మాత్రమే కాకుండా నోటి దుర్వాసన, నిద్రలేమి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
తాజా కరివేపాకును మెత్తగా రుబ్బుకుని, ఆ ముద్దను వస్త్రంలో వేసి రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న కరివేపాకు రసం రోజూ రెండు చెంచాల చొప్పున తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
దంతసిరి ఇలా..!
ఆధునిక జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. అతిగా శీతల పానీయాలు తీసుకుంటూ ఐస్‍క్రీమ్‍లు తింటూ దంత సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అలాగే, దంతాలకు అంటుకుపోయే పిజ్జా, బర్గర్ వంటి జంక్‍ఫుడ్ పదార్థాలను తరచూ తీసుకోవడం వంటి కారణాల వల్ల చిగుళ్ల వాపు, దంతాలు వదులు కావడం, పిప్పి పళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి తగిన ఔషధాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
తుమ్మకట్టెలను కాల్చి తయారుచేసిన బొగ్గులు వంద గ్రాములు, సన్నని మంటపై పొంగించిన పటిక వంద గ్రాములు, సైంధవ లవణం వంద గ్రాములు.. ఈ మూడింటినీ మెత్తని పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి. దీనినే పళ్లపొడిగా వాడుతున్నట్టయితే దంతాలకు దృఢత్వం కలుగుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి.
వంద గ్రాముల సుద్దపొడిలో నలభై గ్రాముల ఏలక గింజల పొడి, అరవై గ్రాముల సైంధవ లవణం పొడి కలిపి వస్త్రఘాళితం చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. రోజూ ఈ పొడితో పళ్లు తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా తయారవుతాయి. నోటి దుర్వాసన వంటి సమస్యలు మటుమాయం అవుతాయి.
పటికను పొంగించి పొడి చేసుకోవాలి. సైంధవ లవణాన్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. తుమ్మ బొగ్గులను కూడా పొడిగా చేసుకోవాలి. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకుని వస్త్రఘాళితం చేసుకోవాలి. ఈ పొడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు, నోటి దుర్వాసన రాకుండా ఉంటాయి.
నయనానందానికి..
టీవీలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక చిన్నారులు సైతం కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంటిచూపు మందగించకుండా ఉంటానికి, చిన్నా చితకా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే చక్కని ఔషధాలను తయారు చేసుకోవచ్చు.
పిప్పళ్లు, వాయు విడంగాలు, అతి మధురం, శొంఠి, సైంధవ లవణం.. వీటిని ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా దంచుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరునాటి ఉదయం వీటిని గుజ్జులా నూరుకోవాలి. ఒక మూకుడులో అర లీటరు నువ్వులనూనె, అరలీటరు మేకపాలు వేసి అందులో ఈ గుజ్జును వేసి సన్నని మంటపై వేడి చేయాలి. బాగా ఉడికిన తరువాత మూకుడును దించేసి చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టాలి. వడగట్టిన తైలాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని ముక్కులో నాలుగు చుక్కల చొప్పున వేసుకుని నశ్యంలా పీలుస్తుంటే కంటికైన గాయాలు, కంటిలో ఏర్పడిన పుండ్లు తగ్గుతాయి.
కంటిచూపు క్షీణించకుండా ఉండటానికి త్రిఫలాఘృతం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు. కరక్కాయల బెరడు, గింజలు తీసేసిన ఉసిరికాయ ముక్కలు, తానికాయ ముక్కలు.. వీటిని ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకుని వీటిని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక పాత్రలో మూడు లీటర్ల నీళ్లు తీసుకుని నూరుకున్న త్రిఫలాల పొడిని నీట్లో వేసి లీటరు కషాయం మిగిలేంత వరకు సన్నని మంట మీద మరిగించుకోవాలి. ఈ కషాయాన్ని వడగట్టుకుని అందులో అర లీటరు ఆవుపాలు, పావు లీటరు ఆవునెయ్యి వేసి నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు సన్నని మంట మీద మరిగించాలి. ఇలా తయారైన త్రిఫలాఘృతాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకుని, ప్రతి రోజూ పది గ్రాముల చొప్పున భోజనానికి ముందు సేవిస్తున్నట్టయితే కంటిచూపు క్రమంగా మెరుగుపడుతుంది.
కీళ్లనొప్పులా..?!
కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు ఇప్పుడు లేనిదెవరికి? ఇలాంటి నొప్పులకు పెయిన్‍బామ్‍లు, పెయిన్ కిల్లర్స్పై ఆధారపడొద్దు. ఇంట్లోనే తగిన ఔషధాలను తయారు చేసుకోవచ్చు.
ఆముదపు గింజలను చితగ్గొట్టి, పై పెంకును తీసేసి లోపలి పప్పును వంద గ్రాముల వరకు తీసుకోవాలి. దీనికి వంద గ్రాముల శొంఠి, వంద గ్రాముల పటికబెల్లం చేర్చి మెత్తగా దంచాలి. రెండుపూటలా కప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని చెంచాడు కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు క్రమంగా నయమవుతాయి.
దోరగా వేయించిన శొంఠిపొడి, అశ్వగంధ పొడి, నల్లనువ్వుల పొడి, పటికబెల్లం పొడి సమపాళ్లలో తీసుకుని నాలుగింటినీ కలిపి వస్త్రఘాళితం చేసుకోవాలి. మూడు పూటలా భోజనం చేసేటపుడు ఈ పొడిని రెండు చెంచాల ఆవునేతితో కలిపి తీసుకుంటే నడుము నొప్పి, ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఒంటికి బలం వస్తుంది.
శొంఠి పది గ్రాములు, వాయు విడంగాలు (మిరియాల్లాగే ఉంటాయి) పది గ్రాములు పొడిగా దంచుకుని, ఈ పొడిని ఒక పాత్రలో వేసి రెండు కప్పుల నీటిలో సన్నని మంటపై మరిగించాలి. నీరు సగానికి సగం ఇగిరిపోయి కషాయం తయారయ్యాక అందులో ముప్పై గ్రాముల పాతబెల్లం కలిపి రోజుకు ఒకసారి తీసుకుంటే మహిళలకు వచ్చే నడుము, నెలసరి నొప్పులు తగ్గుతాయి.
నిమ్మరసం పావు లీటరు, నువ్వులనూనె పావు లీటరు, వెల్లుల్లి గుజ్జు పావు కిలో తీసుకుని, ఈ మూడింటినీ కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. చల్లారిన తరువాత నూనెను వడగట్టి అందులో యాభై గ్రాముల ముద్ద కర్పూరం కలిపి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. నొప్పులు ఉన్నచోట ఈ నూనెతో మర్దన చేస్తే త్వరలోనే ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది.


































































































































Review ఆరోగ్యానికి ‘చిట్కా’!.