పిల్లల ఆటపాటలు

పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ ,
జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ
నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు..

అమ్మాయి రత్న మాణిక్యం
ఆట మాణిక్యమే పాట మాణిక్యం
నట్టింట అమ్మాయి రత్న మాణిక్యం
ఆడంగ ముద్దమ్మ పాడంగ ముద్దు
చిన్ని నా అమ్మాయి చీరకేడిస్తే
నెయ్యిరా సాలీడ నేత్రాన పట్టు
మురుస్తు సాలీడు మూణ్ణెళ్లు నేసు
అరుస్తు చాకలి ఆర్నెళ్లు ఉతుకు
వేడుకతో అమ్మాయి వెయ్యేళ్లు కట్టు
ఆ చీర కట్టంగ అందరికీ ముద్దు
చిన్ని నా అబ్బాయి..
మగువనా అబ్బాయి మాటల్లు జూచి
మాణిక్యములతోటి పొడిచె సూర్యుడు
చిన్ని నా అబ్బాయి చిరుముఖము జూచి
సిగ్గుపడి చంద్రుడు పొడవనేరడు
పొద్దున్నే రావోయి భోగి సూర్యుడ
పొడగన్న వారెల్ల నీకు మ్రొక్కేరు
రాతిరికి వస్తేను రామచంద్రుడ
రాచవారోడుచు నిన్ను రానియరు
పుణ్యమ్ము గలవారి పందిళ్ల క్రిందా
ఆడుచు వుంటేనే తాను అబ్బాయి
పుణ్యమ్ము గలవారి పూతోటలోను
పింఛమిచ్చాడింది సోగల్ల నెమలి
చిలకల్లు మాయింటి చెలికత్తెలమ్మ
హంసల్లు మా యింటి ఆడపడుచులు
కోవెలలు మా యింటి కొత్త కోడండ్లు
అబ్బాయి మాయింటి ముద్దు మనవడు
పుణ్యమ్ము గలవారి పువ్వుల్ల చీర
భాగ్యమ్ము గలవారి పందిళ్ల కళ్లూ
అందెల్లు పెట్టేడు తాను అబ్బాయి
అందుకొని ఆ చీర పువ్వుల్లే కోసు
కాళ్ల కడియాల తాత అబ్బాయి
వద్దు రమ్మని పిలుచు ముద్దు తమ్ముణ్ణి
తిరుమంత్రమే వీరి తిరుమేనులైయుండు
పరగద్వయమే వీరి పాదాంబుజములు
చరమార్థమే వీరి చలవ తిరునయనములు
ఉరు నాభికమలమే ఓంకారము
పరంజ్యోతి ప్రణవమే పట్ట మంచమాయ
పరగాది శేషుడే పానుపాయ
లాలెమ్మ గుఱ్ఱాలు లంకలు మేసు
అబ్బాయి గుఱ్ఱాలు మేసు పల్లాలు
తొర్రి నాగన్నకు తోడెవరమ్మ
ఏనుగుల ఎక్కేటి రాయప్ప తోడు
ఆడుకొని అబ్బాయి వచ్చె గాబోలు
అందెల్లు చప్పుడాయె అరుగుల్ల మీద
చదువుకుని అమ్మాయి వచ్చె గాబోలు
సరస్వతీ చప్పుడాయె చావిడిలోను
గోల్‍కొండ కడ నుంచి డంకా నగారా
గొబ్బున్న కొని వచ్చి గోవిందుకిచ్చె
నెల్లూరి అంగట్లో నెమలి వాలింది
నెమలి కేసిన అంబు నేలకానింది
సింహపురి సింహపురి అందురే కాని
చూపులకు సింహపురి చుట్టుకొల్లారు
కోమట్లకు సింహపురి కొంగు బంగారు
బ్రాహ్మలకు సింహపురి పెన్న స్నానమ్ము
ఇల్లలికి ముగ్గుపెట్టి ఇంతపని చేసి
ఈ యింటి ఆడొడుచు ఎందుపోయినదో?
ఈ యింటి ఆడొడుచు తాను రాజ్యలక్ష్మి
అన్నలతో వియ్యమ్ము అందపోయినది
పోక వన్నె చీర కట్ట వేడుకె
పొరుగూరి పెండ్లికి పోను వేడుకె
వన్నె చీరందమ్ము వీడెమందమ్ము
వెలదికి ఆర్నెల్ల వేకటందమ్ము
పట్టుచీర లందమ్ము పాపడందమ్ము
చుట్టరె చుట్టరె పడక చక్కిలాలు
చిన్న నా అబ్బాయి వడుగు మా యింట
వండరె వండరె వడుగు వంటల్లు
వల్లభుడు జగన్నాథు వడుగు మా యింట
ఆటకూటమ్మున ఆడేటి నెమలి
వేటకాడొచ్చాడు ఆటచాలించు
నాటకపు శాలలో నవ్వేటి పద్మ
నీ మొగుడు వచ్చేడు నవ్వు చాలించు
దిగువ తిరుపతిలోను దీపాలు వెలుగు
ఎగువ తిరుపతిలోను ఏరాజు పెండ్లి
దిగువ తిరుపతిలోను దీపములు వెలుగు
అప్పయ్య అలివేలు మంగ పెళ్లిళ్లు
ప్రొద్దు ప్రొద్దు లేచి ఎక్కుదము కొండ
మ్రొక్కుదము మనపాలి వెంకటప్పణ్ణి
శ్రీ వెంకటయ్య దిక్కు నీవయ్య
బాలులను రక్షించ నీ భారమయ్య
అలివేలు మంగమ్మ ఆడిన్న పసుపు
అప్పయ్య కోనేట తెప్పలై తేరు
వెంకటప్పని కొండ వెలిశుండ వలెను
ఎప్పటికి పుట్టిల్లు కలిగుండ వలెను

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top