ఉమ్మాయ జగ్గాయల్లా

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

ఉమ్మాయ జగ్గాయలు
వీరిద్దరు తోడుదొంగలు. శ్రావణ భాద్రపదాల్లా కలిసిమెలిసి ఉంటారు. ఉమ్మాయ అనే పదం ఉమామహేశ్వర శబ్దానికి సంగ్రహ రూపం. జగ్గాయ అనేది జగన్నాథస్వామి అనే మాటకు సంక్షిప్త రూపం. మొదటి వాడు శివుడు. రెండో వాడు విష్ణువు. శివుడు వరాలిచ్చి ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆదుకోవడం విష్ణుమూర్తి కర్తవ్యం. విష్ణువు చిక్కుల్లో పడినపుడు శివుడే సాయం చేయాలి గాని మరెవ్వరూ తోడ్పడలేరు. వీరిద్దరూ అన్యోన్యానికి నిదర్శనాలన్న మాట. పార్టీ కార్యకర్తలు తలలు బద్దలు కొట్టుకుంటుంటే నాయకులు సయోధ్యగా ఉన్నట్టు, భక్తులు ఒకరి పొడ మరొకరికి గిట్టక శత్రుత్వం వహించినా ఈ దేవుళ్లిద్దరూ కలిసికట్టుగానే ఉంటారు. ఈ సంగతి కనిపెట్టిన వాళ్లు హరిహరాధన చేస్తారనుకోండి. ఈ ఉమ్మాయ జగ్గాయలు కూడా పరస్పర విరుద్ధ స్వభావాలతో ఉన్నా మౌలికంగా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఒకరికొకరు సాయపడతారు. తత్వంలో వీరిద్దరూ ఒకటే కానీ, ఆచరణ భిన్నంగా ఉంటుంది. పైకి పోరాడుకుంటున్నట్టు నటించినా ఆంతర్యంలో ఒక్కటిగానే ఉంటారు. లోకం దృష్టిలో నిజానికి ఒకే రకం స్వభావం ఉన్న ఇద్దరి కన్నా విరుద్ధ స్వభావాలున్న ఇద్దరే పరస్పర ఆకర్షణతో స్నేహం కడతారు. అలాంటి సందర్భం నుంచే ఈ ఉమ్మాయ జగ్గాయ అనే జాతీయం పుట్టింది. సమాజంలో ఏ ఇద్దరయినా కార్యసాధనలో ఏకోన్ముఖంగా ఉండి ప్రవర్తనలో భిన్నంగా కనిపిస్తే వాళ్లను ఈ పేరుతో పిలుస్తారన్న మాట!.

ఉవాచ
ఒకప్పటి ఈ మారుమూల సంస్క•త క్రియా రూపం ప్రస్తుతం తెలుగులో విశేషంగా వాడుకలో ఉంది. ‘ఇది ఆయన ఉవాచ’ అంటే అది ఆయన మాట, అభిప్రాయం అనే భావంలో ప్రయోగించడం కొల్లలుగా కనిపిస్తుంది. అత్యంత ప్రాచీన కాలంలో ఎవరైనా, ఏమైనా చెబితే దానిని సంస్క•తంలో ఈ క్రియా పదంతో సూచిస్తారు. ఇది ఆ భాషలో మధ్యమ పురుష ఏకవచన రూపం. అంటే అతడు చాలా పురాతన కాలంలో (ఇలా) చెప్పాడు అని అర్థం. సాధారణంగా ఈ క్రియారూపాన్ని దేవతలు, మహర్షులు మొదలైన సుదీర్ఘ జీవులు చెప్పినప్పుడే వాడే వారు. భాష సరిగా తెలియకపోయినా భక్తి కోసం భగవద్గీత వంటి పారాయణ గ్రంథాలు చదివిన వాళ్లు ‘సంజయ ఉవాచ, భగవాన్‍ కృష్ణ ఉవాచ’ మొదలైన వచన భాగాల్లోని ‘ఉవాచ’ను చెప్పాడు, చెప్పింది అనే అర్థాల్లో వాడినట్టు సందర్భాన్ని బట్టి గ్రహించి ఉంటారు. ‘సంజయుడు చెప్పింది’ అన్నట్టు అర్థం చేసుకున్న వాళ్లు ‘ఉవాచ’కు ‘మాట, భావం’ వగైరా అర్థాలు కల్పించుకున్నారు. ఫలితంగా ఇది నామవాచకం అనుకుని తక్కిన విశేష్యాలెన్నిటినో ఎరువు తెచ్చుకున్నట్టు దీన్ని కూడా తెలుగులో వాడటం మొదలుపెట్టారు. ఇలా సంస్క•తంలోని క్రియా రూపం తెలుగులో నామవాచకమై, క్రమంగా జాతీయంగా రూపాంతరం చెందింది.

రుష్యశృంగుడు
రామాయణంలో రుష్యశృంగుడు చిన్న పాత్ర. ఆయన ఒక మహర్షి. అమాయకుడు. అడవిలో పుట్టి పెరిగి, గడ్డాలూ మీసాలూ ఉన్న మహర్షులను తప్ప మరే మానవమాత్రులనూ చూడకుండానే గడిపాడు. చాలాకాలం పైగా ఆయనకు గుండె మీద ఒక కొమ్ము లాంటిది ఉండేది. రాజ్యంలో వర్షాలు లేవని దిగులు పడుతున్న దశరథుడికి పెద్దలు ఒక సలహా ఇచ్చారు. ‘సదరు రుష్యశృంగుడిని ఏదో విధంగా నగరానికి రప్పిస్తే వానలు పడతాయి’ అని చెప్పారు. దీంతో ఆయనను ఆకట్టుకోవడానికి మామూలుగా దేవతలు తపోభంగానికి చేసే పనే మంచిదని అనుకున్నారు. నాట్యకత్తెలను పంపారు. తనకు ఒకటే శృంగము ఉండగా, వారికి రెండేసి శృంగాలు (రెండు స్తనాలని తెలియక) ఉన్నాయని వారిని చూసి రుష్యశృంగుడు విస్తుపోయాడు. అలా ఆసక్తితో వారి వెంటపడిన ఆ మహర్షి అయోధ్యా నగరంలో అడుగుపెట్టాడు. ఆయన అడుగు పెట్టగానే వర్షాలు పడ్డాయి. ఆయనకు దశరథుడు తన కుమార్తె శాంతను ఇచ్చి పెళ్లి చేసి మనుష్య ప్రపంచంలోకి తెచ్చాడు. ఈ కథ కారణంగా స్త్రీ విముఖుడైన, ఆడదాని ముఖమెరుగని అమాయకుడిని రుష్యశృంగుడని వ్యవహరించడం మొదలైంది. ఈ మాటనే స్త్రీలోలుడైన వ్యక్తిని గురించి ఎగతాళిగా ప్రస్తావించడం కూడా కద్దు. తిరుగుబోతును గురించి చెబుతూ, ‘అబ్బో! ఆయన రుష్యశృంగుడేనండీ!’ అని వెటకారం చేస్తారు. అంటే ఆయనకు తద్విరుద్ధ స్వభావం గలవాడని అలా దెప్పిపొడుస్తారన్న మాట.

ఎండగట్టు
ఎండకు ఎండేటట్టు ఏ వస్తువునైనా పరవడం, వేలాడదీయడాన్నే ఎండగట్టడం అంటారు. తడి, చెమ్మ తొలగించడానికి పొగాకు వంటి వాటిని ఆరబెడుతుంటారు. వరుగులు చేయడానికి కూరగాయల ముక్కలను ఎండబెడతారు. పూర్వం పప్పుధాన్యాలను మొదట తడి మట్టిలో ఉంచి, మొలక రాగానే మట్టిని కడిగి, తుడిచి నూనె మెరుగు రాసి ఎండగట్టే వాళ్లు. ఎండిన తరువాత కుండల్లో పెట్టి, కావలసినప్పుడు కావలసినంత బయటికి తీసి, వండుకు తినేవాళ్లు. అప్పట్లో కందులు, మినుములు, పెసలు వగైరా పప్పుధాన్యాలను మొత్తంగానే వంటలో వాడే వాళ్లు. కందిపప్పు, మినప్పప్పులు గాని, పొట్టు లేని ఛాయపప్పును గాని వాడటం అనారోగ్యకరం అనే అభిప్రాయం ఉండేది. ఇలా తడిపి, కడిగి, నూనె రాసి, ఎండబెట్టి రకరకాలుగా భిన్న దశల్లో కొంతకాలం ఉంచడం శ్రమతో కూడిన పని. ఆయా వస్తువులను శిక్షించినట్టనిపించేది. రానురాను ఆ మాటను మనుషులకు కూడా వర్తింపచేసి, ‘బాధించడం’ అనే అర్థంలో ‘ఎండగట్టడం’ అనే జాతీయాన్ని పుట్టించారు. ఇప్పుడు అదే మాటకు ‘లోపాలను బయటపెట్టడం, రహస్యాలను బజారుపాలు చేయడం, దుష్క•త్యాలను బహిర్గతం చేయడం’ అనే అర్థవిశేషాల్లో వాడుతున్నారు.

ఎంబెన్న
ఎంబెన్న అక్షరజ్ఞాన శూన్యుడు. ఎవరైనా అతగాడికి ఏమైనా చిన్న విషయం చెప్పినా అర్థం చేసుకోలేడు. ఏ పనీ తిన్నగా చేయలేడు. పక్కా పల్లెటూరి బైతు. పైపెచ్చు ఛాందసుడు. ఈ లక్షణాలున్న, ఏమీ తెలియని వాడిని ‘ఎంబెన్న’ అని వ్యవహరిస్తారు. ఇతడికి సర్వజ్ఞత అనేది ఉండదు, లేదు. అసమర్థతలో ఇతడికెవరూ సాటిరారు. ఇది పూర్తిగా తెలుగు పదమేనని అంటారు. ‘యం బ్రహ్మ వేదాంతవిదో వదన్తి’ అనే శ్లోకాన్ని సరిగా చదవలేక ఒకడు ఈ ఎంబెన్న అనే పేరు తెచ్చుకున్నాడని కొందరు, ‘యం బ్రహ్మ’ అనే మహాత్ముడుండే వాడని, అతడే కాలక్రమంలో ఎంబెన్నగా మారాడని మరికొందరు వాదిస్తారు. అయితే ఈ ఇద్దరూ ఒకటి కాదనే మరొక వాదన కూడా ఉంది.

చెప్పుడు మాటలు వినరాదు!
అలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరుబడెడు వాడు వెర్రివాడు
కుక్కతోక బట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ! వినురవేమ!

అర్థాలు:
రోసి= విడిచి, వేరుబడెడివాడు= ఆస్తి పంచుకుని పక్కకు వెళ్లేవాడు,
వెర్రివాడు= పిచ్చివాడు.

భావం:
భార్య మాటలు విని అన్నదమ్ములను విడిచి, వేరు కాపురం పెట్టుకునే వాడు వెర్రివడు. అలాంటి వేరు కాపురం కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్టు ఉంటుంది.

వివరణ:
కుటుంబంలో అందరూ కలిసి ఉంటేనే అందరికీ సుఖం. భార్య మాటలు విని అయినవాళ్లను వదిలి విడిగా వెళ్లిపోతే అది మూర్ఖత్వం అవుతుంది. తెలివి కలవాడు ఆ పని ఎప్పుడూ చేయడు. కుక్క నీళ్లలో కొంత వరకు మాత్రమే ఈదగలదు. దానికి ఈదేశక్తి ఉంది కదా అని దాని తోకను పట్టుకుని గోదావరి నదిలో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వెళ్దామనుకుంటే అది జరగని పని. అలాగే భార్య మాట విని కుటుంబాన్ని విడిచిపెడితే బతుకు సాగదు. ఆలి మాట అని వేమన ఇక్కడ మాట వరుసకు చెప్పినా, చెప్పుడు మాటలు విని కష్టాలు కొనితెచ్చుకోకూడదనేది ఇక్కడ భావంగా తీసుకోవాలి. ఎవరైనా, ఏదైనా విషయంలో ఏం చెప్పినా.. దాని గురించి మంచిచెడులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తదనుగుణంగా వ్యవహరించాలి తప్పితే, గుడ్డిగా అవతలి వారు చెప్పిన సలహాను పాటిస్తే కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టవుతుంది. కుటుంబ జీవనంలో కొన్ని నైతిక, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని తెంచుకునే విధంగా ఎవరు సలహా ఇచ్చినా పాటించరాదని, చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోరాదని పై పద్యం భావం.

Review ఉమ్మాయ జగ్గాయల్లా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top