మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..
అన్నదమ్ముల మిత్రత్వం బాల్యంతోనే ఆగిపోతుందని, పెద్దయిన తరువాత కూడా అక్కచెల్లెళ్ల ఆత్మీయత కొనసాగుతుంటుందనే లోక సహజమైన విషయాలను అనేక సామెతలు చెబుతున్నాయి.
అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అప్పచెల్లెళ్ల పొత్తు పెద్దప్పుడు అనే సామెత పై విషయాన్నే రుజువు చేస్తుంది.
ఈ పొద్దు చిన్నక్కకైతే రేపు పెద్దక్కకు అనే సామెతను, ఈ రోజు అన్యాయం ఎవరికో జరిగిందని ఊరుకుంటే రేపు మనకే అది జరగొచ్చని జాగ్రత్త చెప్పేందుకు వాడతారు.
స్త్రీలు ఒక్కోసారి తమ భోగభాగ్యాల కన్నా తమ అక్కచెల్లెళ్ల భోగభాగ్యాలను తలుచుకుని మురిసిపోవడం కద్దు. ఆ విషయాన్ని అక్క భాగ్యం చూసి చెల్లెలు చెయ్యి విరగబడ్డది, చెల్లెలి మగని చూసుకుని చేయి విరగబడ్డదట అనే సామెతలు వ్యంగ్యంగా చెబుతాయి.
అక్కచెల్లెళ్లకు అన్నం పెట్టడం సోదరుల విధి. అలా చేయని వారిని నిందించే సామెత- అక్కచెల్లెళ్లకు అన్నం పెట్టి లెక్క రాసినట్టు అనేది.
బాల్యంలో అన్నదమ్ములుగా ఆప్యాయతను పంచుకున్న వారు పెరిగే కొద్దీ దాయాదులుగా శత్రుత్వాలు పెంచుకుంటారు. ఈ నిజాన్ని- పుడుతూ సోదరులు. పెరుగుతూ దాయాదులు అనే సామెత తెలుపుతుంది.
ధర్మం చెప్పేందుకు బాంధవ్యం అడ్డురాకూడని- తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పవలె అనే సామెత చెబుతుంది.
అన్నదమ్ముల్లో చివరి వాడైతే అందరూ తనపై జులుం చెలాయిస్తారని, తను పెద్దయ్యేటప్పటికే అన్నలు, వదినలు ఆస్తి కరిగించేస్తారని చివరి వాడి బెంగ. ఆ విషయాన్ని- అన్నదమ్ముల్లో కడపటి వాడి కంటే అడవిలో మానై పుట్టడం మంచిది అనే సామెత చెబుతుంది.
అన్న భార్య వదిన విషయంలో ఒక సామెత ఉంది- వదిన వదిన వంకాయ వదిన వట్టి టెంకాయ- ఇది మరదళ్లు లేదా మరుదులు వదినను పరిహాసం చేస్తూ పాడిన పాటలో ఒక భాగం. ఇదే సామెతగానూ మారింది.
మగని సోదరుని భార్య తోడికోడలు లేదా ఏరాలు. మగని మరో భార్య సవతి. భర్తకు కొత్త భార్య మీద మోజు. ముందు భార్యకు సవతిపోరు. ఇన్నాళ్లూ భర్త తనువూ, మనసూ దోచుకున్న భార్య తనను లెక్కచేయకుండా భర్త మరో స్త్రీని పెండ్లాడినపుడు బావో, చెరువో చూసుకున్న సందర్భాలు ఇప్పటికీ అనేకం చూస్తున్నాం. తనకు జరిగే అన్యాయమే కాక సవతి పిల్లలు తన పిల్లలతో పాటు ఆస్తిలో భాగం పంచుకుంటారని ముందు భార్య ఆక్రోశం. ఆ విషయాన్ని- నాయనకు పెండ్లి సంబరం. అమ్మకు సవతి సంకటం అనే సామెత చెబుతుంది.
ఒక్కోసారి స్త్రీ సవతి ఉనికినైనా సహిస్తుందేమో కానీ తోడికోడలును సహించలేదు. సవతి తన భర్త భార్యే. పిల్లలు పుడితే తన భర్తకే పుడతారు. అంటే అంతో ఇంతో సంబంధం ఉంటుంది. తోడికోడలు తన భర్త సోదరుడి భార్య. అంటే దాయాది భార్య. ఆమె ఇంట్లో సరి భాగం కోసం పోరాడుతుంది. ఉమ్మడి కుటుంబాల్లో
తోడికోడళ్లు ‘నువ్వెంతంటే నువ్వెంత?’ అని పోట్లాడుకుంటారు. ఒకరు నాలుగు శేర్లు గింజలమ్మితే మరొకరు పోటీగా పది శేర్లు అంగడింటికి పోస్తారు. ఒకామె తలనొప్పి అని పనిమాని పడకేస్తే, మరొకామె కడుపునొప్పి అని ముసుగుతన్ని పడుకుంటుంది. అందుకే- ఇరుపోటీలతో ఇల్లు చెడె వాయు నొప్పులతో ఒళ్లు చెడె అనే సామెత పుట్టింది.
సాధారణంగా అన్నదమ్ముల మధ్య గొడవల కంటే తోడికోడళ్ల మధ్య కలహాలతోనే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి.
దీన్ని చెప్పే సామెతలు- సవతి కుండలోనైనా ఉడుకుతానన్నది కానీ తోడికోడలి కుండలో ఉడకనన్నదట, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు, అప్పచెల్లెలు బతుకు కోరితే తోటికోడలు చావు కోరుతుంది- అనేవి.


































































































































Review మగడు కొట్టినందుకు కాదు...