అనగా అనగా ఒక చీమా, ఒక చిలుకా ఉండేవి. ఈ ఇద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్లిద్దరికీ పాయసం వండుకుని తినాలనే బుద్ధి పుట్టింది. చీమ వెళ్లి బియ్యపు నూకలూ, పంచదారా తెచ్చింది. చిలుక పోయి కట్టెపుల్లలూ, చట్టీ, నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలక పొయ్యి ఊదింది. పాయసం తయారయింది.
అయితే చీమకు మహా తొందర. అది గబగబా చట్టి ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ఉంచింది. ఇంకేం.. ముక్కు చుర్రున కాలింది. అది కుయ్యో మొర్రోమని ముక్కు విదిలించుకుంటూ రావిచెట్టు మీదకు పోయి కూచుంది.
రావిచెట్టు చిలకను చూసి కొంచెం గేలిచేసింది.
‘చిలకా! చిలకా! ఏం విచారంగా ఉన్నావు?’ అని అడిగింది.
చిలకకు కొంచెం విసుగనిపించింది.
‘ఏమీలేదు. చీమా నేనూ పాయసం వండుకున్నాము. చీమ పాయసం లోపల పడి చచ్చిపోయింది. నాకు ముక్కు కాలింది. ఇంత పోకిళ్లు పోతున్నావు. నీ ఆకులు రాలిపోకూడదూ!’ అని శాపనార్థాలు పెట్టింది.
ఆ మాట అనగానే రావిచెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి.
ఇంతలో ఒక ఏనుగు ఆ దారిన వెళ్తూ చెట్టును చూసి నవ్వింది.
‘చెట్టూ! చెట్టూ! నీ ఆకులు రాలిపోయాయేం? ఎండాకాలం కాదుగా!’ అన్నది.
‘ఏమీ లేదు. చీమా చిలకా పాయసం వండుకున్నాయట. చీమ అందులో పడి చచ్చిపోయింది. చిలకకు ముక్కు కాలింది. చిలకను నేను వెక్కిరించాను. దాంతో నా ఆకులు రాలిపోవాలని అది శపించింది. ఇప్పుడు నువ్వు కూడా అంతగా నవ్వుతున్నావు కదా.. నీ తొండం ఊడిపోకూడదూ’ అంది రావిచెట్టు.
ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు వద్దకు పోయి కూచుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూసి నవ్వాగలేడు.
‘ఏం? ఏనుగా.. ఏనుగా! ఇవ్వాళ నీళ్లు తాగడం లేదేం? తొండం ఎక్కడ పెట్టి వచ్చావు?’ అంది వెటకారంగా.
‘ఎక్కడా పెట్టలేదు. చీమా చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలకకి ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావిచెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి వెటకారం చేస్తున్న నీ నీళ్లు కూడా ఎండిపోకూడదూ’ అంది ఏనుగు.
అలా అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్లు ఇద్దరు చెరువుకు నీళ్లకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్లకు నవ్వాగలేదు.
‘ఏం చెరువూ.. చెరువూ.. ఇలా ఎండిపోయావేం?’ అన్నారు.
‘ఏమీ లేదు. చీమ, చిలక పాయసం వండుకున్నాయి. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలకకి ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావిచెట్టుకు ఆకులు రాలిపోయాయి. అది చూసి వెటకారం చేసిన ఏనుగును తొండం ఊడిపోయింది. ఆ ఏనుగును గేలి చేసినందుకు అది నన్ను శపించింది. దాంతో నా నీళ్లెండిపోయాయి. ఇప్పుడు మీరిద్దరూ నన్ను చూసి పగలబడి నవ్వారు కదా! మీ బిందెలు అతుక్కుపోనూ..’ అంది చెరువు.
అలా అనగానే ఆ తోడికోడళ్ల ఇద్దరి బిందెలూ అతుక్కుపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్ల కోసం అక్కడకు వచ్చాడు. చెరువులో నీళ్లు లేకపోవడం, బిందెలు అతుక్కునిపోవడం చూసి పాపం, అతను మంచిగానే, ‘ఏమమ్మా! బిందెలు అలా అతక్కుపోయాయెందుకు?’ అని తెలుసుకోవడానికి అడిగాడు.
‘ఏమీ లేదు. చీమా, చిలకా పాయసం వండుకున్నాయట. చీమ తొందరగా తినాలనే ఆత్రంలో పాయసంలో పడి చచ్చిపోయింది. పాయసం తినబోయిన చిలకకు ముక్కు కాలింది. ముక్కు కాలిన చిలకను చూసి రావిచెట్టు నవ్వింది. దాంతో నీ ఆకులు రాలిపోవాలని చిలక శపించింది. రావిచెట్టు ఆకులు రాలిపోయాయి. అదిచూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగును వెటకారం చేసిన చెరువులో నీళ్లెండిపోయాయి. చెరువును చూసి పగలబడి నవ్విన మా బిందెలు అతుక్కుపోయాయి. ఇక మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావిడి అంటుకుపోకూడదూ’ అని తోడికోడళ్లు అన్నారు.
అయితే ఆ మాట అనీ అనకముందే ఆ మనిషి కావిడి కింద పారేశాడు. కావిడి కిందపడటంతోనే వాళ్ల భుజాల మీది బిందెలు వూడిపోయాయి. చెరువులోకి నీళ్లొచ్చాయి. ఏనుగుకు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చాయి. చిలక ముక్కు బాగయింది. చీమ బతికింది.
అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు.
Review చీమ..చిలక..పాయసం.