2026- మార్చి 1, ఆదివారం, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి
2026- మార్చి 31, మంగళవారం, చైత్ర శుద్ధ త్రయోదశి వరకు..
శ్రీ పరాభవ నామ సంవత్సరం- ఫాల్గుణం/చైత్రం- శిశిర/వసంత రుతువులు- ఉత్తరాయణం
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం సంవత్సర క్రమంలో మూడో నెల- మార్చి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ – చైత్ర మాసాల కలయిక. తెలుగు మాసాలలో ఫాల్గుణం చివరిది. చైత్రం మొదటిది. మార్చి 18 వరకు ఫాల్గుణ మాసపు తిథులు ఉంటాయి. తదుపరి చైత్ర మాసం ఆరంభమవుతుంది. చైత్ర మాసపు తొలి దినం చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది. మన తెలుగు వారికి ఇదే నూతన సంవత్సరం. ఈ సంవత్సరం పేరు- పరాభవ నామ సంవత్సరం. అప్పటి నుంచే వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ ఫాల్గుణ-చైత్ర మాసాల కలయికలోని మార్చిలో వచ్చే పండుగలు, పర్వాలలో హోలీ, ఉగాది, వసంత పూర్ణిమ, శ్రీరామ నవమి వంటివి ముఖ్యమైనవి.
ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన పున్నమి కలది ఫాల్గుణం. మాఘ మాసం మహా జ్ఞాన మాసమైతే.. ఫాల్గుణం మనసంతా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మోసుకొచ్చే మాసం. ఫాల్గుణ మాస తిథులు ముగియడంతోనే శిశిర రుతువుకు తెరపడుతుంది. నువ్వులు, ఉసిరిక, చూత కుసుమం (మామిడిపూత) విరివిగా వాడటానికి కొన్ని నెలలు ప్రత్యేకమైనవి. అందులో ఫాల్గుణం ఒకటి. ఫాల్గుణ మాసం శిశిర రుతువు కాలం. చెట్లన్నీ ఆకులు రాలుస్తాయి. చలి తీవ్రత తగ్గుతుంది. వానలు కూడా అంతగా ఉండవు. శిశిరం వసంతపు అందాలను అలంకరించుకుని ఉండే ఈ మాసం మహా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఫాల్గుణ మాసంతో శిశిర రుతువు ముగిసి వసంత రుతువు ఆరంభమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరిది (పన్నెండవది). మత్స్య పురాణంలో పేర్కొన్న పక్రారం.. ఫాల్గుణ మాసం గృహ నిర్మాణానికి అత్యంత అనువైనది. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తే కనక, పుత్ర లాభం కలుగుతుందని అంటారు. ఫాల్గుణ మాసంలో చేసే గోదానం, ధన దానం, వస్త్ర దానం శ్రీమహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తాయని అంటారు. తెలుగు సంవత్సరాల వరుసలో చివరిదైన ఫాల్గుణ మాసంలో.. అంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు చివరిదైన ఈ మాసంలో మళ్లీ కనిపిస్తాయనేది పండితుల ఉవాచ. అందుకే ఫాల్గుణం సర్వదేవతా వ్రత సమాహారంగా, సర్వ వ్రత సింహావలోకనంగా ఉంటుందని చెబుతారు. ఈ కారణంగానే ఫాల్గుణంలో చేసే దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని అంటారు. ఇక దశావతారాల్లో అతి ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశి ఈ మాసంలోనే వస్తుంది.
ఈ మాసం తరువాత నుంచి చైత్ర మాసం ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమితో వసంతకాలం పలకరిస్తుంది. చైత్రం వసంతానికి చిరునామా. వసంత రుతువుకు స్వాగతం పలికేది, తెలుగు సంవత్సరాలలో తొలిది చైత్ర మాసమే. ఒకపక్క చెట్లు ఆకులు రాల్చే
కాలమిది.
మరోపక్క కొత్త చివుళ్లు తొడుగుతాయి. పచ్చనాకులు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. ప్రకృతి కొత్త చిగుళ్లు తొడుగుతూ వాతావరణం మహా ఆహ్లాదభరితంగా ఉంటుందీ మాసంలో. చిత్తా నక్షత్రంలో పూర్ణ చంద్రుడు ఉండే మాసం కాబట్టి ఇది చైత్ర మాసం అయ్యింది. చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి మన పెద్దలు ఆయా మాసాలకు ఆయా పేర్లను నిర్ణయించారు. అంటే, చంద్రుని గతి ఆధారంగా నక్షత్ర మండలాలకు ఆయా పేర్లు పెట్టారు. ఆ మండలాలలో చంద్రుడు ప్రవేశించినపుడు ఆ నెలకు ఆయా నక్షత్రాల పేర్లు వస్తాయి. ఈ కోవలో, చిత్త నక్షత్రంలో పూర్ణ చంద్రుడున్న మాసం చైత్రమవుతుంది. చైత్ర మాసపు తొలి దినమే ఉగాది. జీవితాల్లో శుభాలను కలిగించేది.. జీవితాలకు శోభను చేకూర్చేది- ఉగాది. ఇది మనకు కొత్త తెలుగు సంవత్సరాది. చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలయ్యే వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ నవమితో ముగుస్తాయి. ఆ నవమి నాడే శ్రీరామ కల్యాణం. చైత్ర మాసంలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని అంటారు.
ఫాల్గుణ – చైత్ర మాసాల్లో వచ్చే ప్రధాన పండుగలు,
పర్వాల గురించి తెలుసుకుందాం.
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి
మార్చి 1, ఆదివారం
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు. ఈ రోజున శివుడిని, మన్మథుడిని, కృష్ణుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుల జన్మ తిథి ఇది.
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
మార్చి 2, సోమవారం
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు కూడా హోలికా దహన్ నిర్వహిస్తారు. దీనిని ‘చోటీ హోళీ’గా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు లలితా కాంత్యాఖ్యదేవీ వ్రతం ఆచరించాలని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతోంది. ఈనాటితో తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ముగుస్తుంది.
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ
మార్చి 3, మంగళవారం
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ వసంత పూర్ణిమ తిథి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని మహా ఫాల్గుణీ అనీ వ్యవహరిస్తారు. దీనినే హోలికా పూర్ణిమా అనీ అంటారు. కొన్ని వ్రత గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమగా వర్ణించాయి. ఈ పూర్ణిమ నాడు దక్షిణాది ప్రాంతాలలో కామ దహనం చేయడం ఆచారం. అందుకే ఈ పూర్ణిమను కాముని పున్నమి అంటారు. కాముడు ఈ రోజున దహనమయ్యాడని పురాణగాథ. అందుకే పంచాంగకర్తలు ఈ తిథిని కామదహన దినమని రాస్తారు. దక్షిణ భారతంలో కామదేవుని దహన దినంగానే కానీ, ఇది ఉత్తరాదిలో మాదిరిగా హోలికా దహన దినంగా అంత ప్రఖ్యాతం కాదు.
హోలిక అనే రాక్షసిని దగ్ధం చేసిన దానికి గుర్తుగా కామదహనం పేరిట మంటలు వేసే ఆచారం ఏర్పడిందని అంటారు. హోలిక అనే రాక్షసి పేరును బట్టే దీనికి హోలీ పర్వదినం అనే పేరు స్థిరపడింది. ఉత్తరాదిలో ఈ పర్వాన్ని చోటీ హోలీగా వ్యవహరిస్తారు.
హేమాద్రికాండం, భవిష్యత్తు పురాణం, ధర్మసింధు, నిర్ణయసింధు అనే గ్రంథాల ప్రకారం.. హిరణ్యకశిపుడి సోదరి హోలిక. కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పరాయణుడు కావడంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు అటువంటి ప్రయత్నాలన్నిటినీ అధిగమించి క్షేమంగా ఉంటాడు. చివరకు హిరణ్యకశిపుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల అతడి సోదరి హోలికకు ఓ పై వస్త్రం లభిస్తుంది. ఎంతటి భయంకరమైన అగ్ని అయినా ఆ వస్త్రం ధరించిన వారిని ఏమీ చేయదు. హోలికను ఆ వస్త్రాన్ని ధరించాలని చెప్పి, ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి, తన భటుల చేత నిప్పు అంటింపచేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ చేత హోలిక కప్పుకున్న ఆ మాయా వస్త్రం గాలికి ఎగిరిపోయి, చివరికి ఆ మంటల్లో ఆమే దగ్ధమవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ విధంగా హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు. దైవభక్తి ముందు ఎటువంటి మాయోపాయాలు పనిచేయవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని హోలీ పూర్ణిమ వృత్తాంతం తెలియ చెబుతుంది.
ఇంకా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ పలు విధాలుగా ప్రసిద్ధమై ఉంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే లక్ష్మీ జననమని అంటారు. అందుకే ఈ తిథిని లక్ష్మీ జయంతి తిథిగానూ వ్యవహరిస్తారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలితాలు కలుగుతాయని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే వివాహం చేసుకుందని అంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది.
భగవద్గీత, కృష్ణతత్వాన్ని విస్త•తంగా ప్రచారం చేసిన చైతన్య మహాప్రభు వారి జయంతి తిథి కూడా ఈనాడే.
మార్చి 3న పాక్షిక చంద్ర గ్రహణ దినం. ఇది భారతదేశంలో కొద్దిసేపు మాత్రమే కనబడుతుంది.
అలాగే తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం ఈనాడే నిర్వహిస్తారు.
ఫాల్గుణ బహుళ పాడ్యమి
మార్చి 4, బుధవారం
ఫాల్గుణ బహుళ పాడ్యమిని కూడా కొన్ని ప్రాంతాల్లో హోలీ పర్వదినంగానే భావిస్తారు. ఫాల్గుణ పూర్ణిమ నాటి మరుసటి దినమే కొన్ని ప్రాంతాల వారికి కొత్త సంవత్సర ఆరంభ దినం కూడా. హోలీ వసంతాగమన సూచిక పర్వం. వసంతాన్ని ఆహ్వానిస్తూ పిల్లా, పెద్దా అందరూ ఆనందోత్సాహాలతో రంగునీళ్లు, పూలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా ఒకరినొకరు రంగునీళ్లతో తడుపుకోవడం అనే పక్రియ దాదాపు రోజంతా సాగుతుంది. ఎర్ర రంగు నీళ్లను వసంతాన్ని చల్లుకోవడాన్ని కొన్ని ప్రాంతాల్లో రంగ్‍లీల అంటారు. పూర్ణిమ నాడు మంటలు వేసే తతంగం పూర్తి కాగానే, ఈ రంగ్‍లీల ఆరంభమవుతుంది.
హోలీ పర్వం అతి ప్రాచీనమైనదే కాక.. ఆధునికమైనది కూడా. అంతేకాదు, వివిధ దేశాల్లో కూడా ఈ వసంత వేడుక ఆచరణలో ఉంది. హోలీ వసంత రుతు సంబంధ ప•ర్వం. ఈ సమయానికి రాగి రంగుతో చిగుళ్లు, ఆకు పచ్చరంగుతో పత్రాలు, పలు తెరగుల రంగులతో పువ్వులు పొటమరిస్తాయి. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరతాయి. పునాస పంటలన్నీ పంట ముఖాల పసిమితో ఉంటాయి. ఈ రంగుల వాతావరణమే హోలీలో వాడే రంగులకు ప్రతీక అని అంటారు.
ఇంకా ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి నాడు ధూలి వందనం అనే పండుగ చేస్తారని కొందరు చెబుతారు. మొత్తానికి ఇది వసంతారంభోత్సవ సమయం. అయితే, మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం.. పౌర్ణమి నాడే హోలీ పర్వమని పేర్కొన్నారు.
తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం ఈనాడు ముగుస్తుంది.
ఇక, హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి జన్మతిథి ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడే.
ఫాల్గుణ బహుళ విదియ
మార్చి 5, గురువారం
ఫాల్గుణ బహుళ విదియ కూడా కామ మహోత్సవంగానే వ్యవహారికంలో ఉంది. అయితే, ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక్కడ ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీ సంబంధ పర్వంగానే భావించాలి. హోలీ మర్నాడే వచ్చే తిథి కాబట్టి, ఇది దానికి అనుబంధంగా వచ్చే తిథిపర్వమని భావించవచ్చు.
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు.
ఫాల్గుణ బహుళ తదియ
మార్చి 6, శుక్రవారం
ఫాల్గుణ బహుళ తదియ తిథిని కల్పాది దినంగా ఆయా వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి.
ఫాల్గుణ బహుళ చవితి
మార్చి 7, శనివారం
ఫాల్గుణ బహుళ చతుర్థి వినాయక పూజకు ఉద్ధిష్టమైన తిథి. దీనినే సంకష్ట హర చతుర్థి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథి వ్యాసరాజ స్మ•తి దినంగా కూడా ప్రసిద్ధి. వ్యాసరాయ స్వామి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. రాజ వ్యవహారాలు, యుద్ధ విషయాలలో రాయల వారు ఈయన సలహాలు సూచనలు పొందే వారని ప్రతీతి. రాయచూరు యుద్ధంలో రాయలు విజయానికి వ్యాసరాయల వారి వ్యూహమే కారణమని అంటారు.
ఫాల్గుణ బహుళ పంచమి
మార్చి 8, ఆదివారం
ఫాల్గుణ బహుళ పంచమి తిథిని రంగ పంచమి అని కూడా అంటారు. అయితే, ఈనాడు ఈ పంచమి వ్రతాన్ని ఆచరించాలని చెబుతారు కానీ, ఆనాడు ఆచరించాల్సిన విధాయకృత్యాలేమిటో పంచాంగాలలో వివరణ లేదు. అయితే, ఇది హోలీ పండుగకు ఐదవ రోజున వస్తుంది. ఇది కూడా రంగుల పండుగే. ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‍లతో ప్రసిద్ధి చెందిన పర్వం. ప్రజలు గులాల్ (రంగులు) చల్లుకుంటూ సానుకూల, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ వేడుకను నిర్వహించుకుంటారు.
ఫాల్గుణ బహుళ షష్ఠి
మార్చి 9, సోమవారం
ఫాల్గుణ బహుళ షష్ఠి దేవసేనకు అధిపతి అయిన కుమారస్వామిని పూజించడానికి అనువైన తిథి. ప్రత్యేకించి తమిళనాట షష్ఠి నాడు ఈయనకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుమారస్వామి.. వివిధ ప్రాంతాల్లో స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు అనే పేర్లతోనూ ప్రసిద్ధమై ఉన్నాడు. తమిళులకు ఈయనే ప్రధాన దైవం. ఆది తమిళ దైవంగా పూజలందుకుంటాడు.
ఫాల్గుణ బహుళ సప్తమి
మార్చి 10, మంగళవారం
ఫాల్గుణ బహుళ సప్తమి తిథి శీతల సప్తమి దినం. ఈనాడు శీతలా మాత అనుగ్రహం కోసం ఆమెను విశేషంగా పూజిస్తారు. శీతలా దేవిని పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశపు పండుగ. మశూచి, స్ఫోటకం తదితర పిల్లలకు సోకే వ్యాధుల నుంచి రక్షించే దేవతగా ఈమెను పరిగణిస్తారు. అలాగే మంచి భర్తను పొందడానికి, ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందడానికి ఆమెను పూజిస్తారు. భక్తుల జీవనోపాధి వనరులను కాపాడే దేవతగానూ ఈమెను పూజిస్తారు. కరువు, వర్షాభావం, పశువుల వ్యాధుల నివారణకు కూడా ఈ దేవతను ప్రార్థిస్తారు. ఈమె ఒక చేతిలో చీపురును, మరో చేతిలో నీటికుండను ధరించి ఈ మాత దర్శనమిస్తుంది. ఆ నీటి కుండలో ఔషధాలు ఉంటాయని అంటారు. స్కాంద పురాణంలోని కాశీఖండ విభాగంలో శీతల దేవి మశూచి, స్ఫోటకపు మచ్చలను పోగొట్టే దేవతగా వివరిస్తూ, ఆ వ్యాధులను నయం చేసే విధానాల గురించి వివరణ ఉంటుంది. ఈమె వేపచెట్టుపై నివాసం ఉంటుందని అంటారు. ఉత్తర భారతదేశంలో ఈ దేవత ఆలయాలు చాలా ఉన్నాయి.
ఫాల్గుణ బహుళ అష్టమి
మార్చి 11, బుధవారం
ఫాల్గుణ బహుళ అష్టమి తిథి నాడు శీతలాష్టమి పర్వం జరుపుకుంటారు. అంటే ఈనాడు సీతాదేవి పుట్టిన రోజు. ప్రధానంగా ఉత్తర భారతంలో ఈ పర్వం ప్రసిద్ధమై ఉంది. ఈనాడు సీతాదేవిని పూజించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. సీతాష్టమికి సంబంధించి ఆసక్తికర కథ ఉంది.
సీత పూర్వజన్మలో వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి దంపతుల ముద్దులపట్టి. కుశధ్వజుడు వేదాలు అధ్యయనం చేస్తుండగా శిశువు పుట్టడం వల్ల ఆ శిశువుకు వేదవతి అనే పేరు పెట్టారు. తన కుమార్తెను శ్రీహరికి ఇచ్చి పెళ్లి చేస్తానని కుశధ్వజుడు అంటుండేవాడు. ఒకసారి దంభుడు అనే రాక్షసుడు వేదవతిని తనకిచ్చి వివాహం చేయాలని అడగగా, కుశధ్వజుడు నిరాకరించాడు. దీంతో ఆ రాక్షసుడు ఒకనాడు నిద్రలో ఉన్న కుశధ్వజ మునిని హతమార్చాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య మాలవతి సైతం ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి.. తండ్రి కోరిక మేరకు శ్రీహరినే పెళ్లాడాలని నిశ్చయించుకుని తపస్సుకు దిగింది. దీక్షలో ఉన్న ఆమెను ఒకసారి రావణుడు చూసి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. విష్ణువును తప్ప వేరెవరినీ పెళ్లాడనని వేదవతి చెప్పింది. అయినా రావణుడు మోహావేశంతో వేదవతిని తాకాడు. ‘నీచుడవైన నువ్వు తాకిన నా శరీరాన్ని ఇప్పుడే త్యజిస్తున్నాను. నేను అయోనిజగా తిరిగి భూమ్మీద పుట్టి నిన్ను పుత్ర, మిత్ర కళత్రంగా నాశనం చేస్తాను’ అని శపించి వేదవతి యోగాగ్నిలో దహనమైంది. అనంతరం వేదవతి శిశువుగా జన్మించి లంకలోని తామర కొలనులో ఒక తామరపువ్వు బొడ్డులో సూక్ష్మరూపంలో దాగుండి తపస్సు చేసుకోసాగింది. శివపూజకు ఒకనాడు లంకాధీశుడైన రావణుడు తామరపూలను కోస్తూ కాస్త బరువుగా ఉన్న ఈ పువ్వును తన మందిరానికి తీసుకెళ్లాడు. అక్కడి ఆస్థాన జ్యోతిష్యులు పరిశీలించి.. ఆమె పుట్టుక అరిష్టమని చెబుతారు. దీంతో శిశువును ఒక బంగారు పెట్టెలో పెట్టి రావణుడు సముద్రంలోకి విడుస్తాడు. అది కొట్టుకెళ్లి జనక మహారాజు రాజ్యంలో భూస్థాపితమైంది. జనకుడు ఒకనాడు భూమి దున్నుతుండగా ఈ పెట్టె బయటపడింది. దానిని తెరవగా శిశువు కనిపించింది. ఆ రోజు ఫాల్గుణ బహుళ అష్టమి. నాగలి చాలుకు తగిలిన కారణంగా పెట్టెలో నుంచి బయటపడిన ఆ శిశువుకు ‘సీత’ అనే పేరు పెట్టి జనకుడు పెంచుకున్నాడు. నాగలిచాలునే సంస్క•తంలో ‘సీత’ అంటారు. తరువాత ఆమెను రాముడికి ఇచ్చి వివాహం చేయడం, రావణుడు అపహరించడం.. సీతాన్వేషణలో భాగంగా రాముడు లంకకు వెళ్లి రావణుడిని హతమార్చడం తెలిసిందే. ఇంకా ఫాల్గుణ బహుళ అష్టమి నాడు శీతలాష్టమి, కాలాష్టమి వ్రతాలు కూడా ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.
ఫాల్గుణ బహుళ నవమి
మార్చి 12, గురువారం
ఫాల్గుణ బహుళ నవమి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన పూజలు, వ్రతాలు ఏమీ లేవు. కానీ, సాధారణంగా నవమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమై ఉంది. ఈనాడు దుర్గాపూజలు చేస్తారు.
ఫాల్గుణ బహుళ దశమి
మార్చి 13, శుక్రవారం
ఫాల్గుణ బహుళ దశమి నాడు కూడా ప్రత్యేకించి ఆచరించాల్సిన పూజావిధులేమీ లేవు. దశమి తిథిని కూడా దుర్గాదేవి ఆరాధనలు విశేషంగా జరుపుతారు.
ఫాల్గుణ బహుళ ఏకాదశి
మార్చి 14/ 15, శని, ఆదివారాలు
ఫాల్గుణ బహుళ ఏకాదశి తిథి మార్చి 14, 15 తేదీలలోని శని ఆదివారాలలో కొనసాగుతోంది. ఈ ఏకాదశిని పాపవిమోచన ఏకాదశి అంటారు. మంజుఘోష అనే అప్సర.. మేధావి అనే మునికి తపోభంగం కలిగించి శాపానికి గురైంది. చివరకు ఆమె ఈ ఏకాదశి నాడే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తనకు శాపాన్ని కలిగించిన పాపాన్ని పోగొట్టుకుంది. శాప, పాప విమోచనం పొందిన ఏకాదశి కాబట్టి ఫాల్గుణ బహుళ ఏకాదశి ‘పాప విమోచన ఏకాదశి’ అయ్యిందని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి, ఆ రోజు ఉపవాసం ఉండి, ఏదైనా ఆలయాన్ని దర్శించుకోవాలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయాలి.
ఇంకా ఈనాడు ఛందో దేవపూజ ఆచరించాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా ఫాల్గుణ బహుళ ఏకాదశిని కృష్ణైకాదశిగానూ వ్యవహరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాన్ని బట్టి తెలుస్తోంది. కశ్మీర్‍లో ఈనాడు ఛందో దేవపూజ ఆచరిస్తారని నీలమత పురాణంలో ఉంది. అలాగే, ఈ తిథి నాడే శ్రీ చైతన్య మహాప్రభు జన్మించారు. ఈనాడు మీన సంక్రమణ దినం.
ఇక మార్చి 15 పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి వర్థంతి దినం.
అలాగే, శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి పుష్సయాగం ఈనాడే నిర్వహిస్తారు.
ఫాల్గుణ బహుళ ద్వాదశి
మార్చి 16, సోమవారం
ఫాల్గుణ బహుళ ద్వాదశి తిథి సాధారణంగా పుష్యమితో కూడి వస్తే ఆ ద్వాదశిని గోవింద ద్వాదశిగా పరిగణిస్తారు. ఈ ద్వాదశి నాడు మనోరథ ద్వాదశి, సుకృత ద్వాదశి, సుగతి ద్వాదశి, విజయా ద్వాదశి వంటి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకి వ్రతం చేయాలని మరికొందరు అంటారు. ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు గంగా స్నానం మహా పాపాలను హరిస్తుందని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ప్రస్తావించారు. మరికొన్ని వ్రత గ్రంథాల ప్రకారం ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం చేయాలని, యోగేశ్వర భగవానుడిని పూజించాలని నియమం.
అలాగే, ఈనాడు ఆంధప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం ఈయన జీవితాంతం పాటుబడ్డారు. ఈయన 1901, మార్చి 16న మద్రాసులో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరి జిల్లాలోని పడమటిపాలెం. 25 ఏళ్ల వయసులో భార్యను, బిడ్డను కోల్పోయిన ఈయన వైరాగ్యంతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. అనంతరం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952, అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఈయన నిరాహార దీక్ష ప్రారంభించారు. 1952, డిసెంబర్ 15న దీక్షలోనే పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. తదనంతర పరిణామాలతో అదే ఏడాది డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.
ఫాల్గుణ బహుళ త్రయోదశి
మార్చి 17, మంగళవారం
ఫాల్గుణ బహుళ త్రయోదశి తిథి మాస శివరాత్రి పర్వదినం. శివుడిని ఈనాడు పూజించాలి. అలాగే, ఈనాటి నుంచే తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
ఫాల్గుణ బహుళ చతుర్దశి
మార్చి 18, బుధవారం
ఫాల్గుణ బహుళ చతుర్దశినే పిశాచ చతుర్దశి అని కూడా అంటారు. ఈ తిథి నాడు శివపూజ చేసి పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని నీలమత పురాణంలో ఉంది. అలాగే, మరికొన్ని వ్రత గ్రంథాల ప్రకారం ఈ తిథి నాడు లలిత కాంత్యాఖ్యదేవి వ్రతం చేయాలని, మహేశ్వర వ్రతం ఆచరించాలని అంటారు.
చైత్ర శుద్ధ పాడ్యమి/అమావాస్య
మార్చి 19, గురువారం
ఈనాటి నుంచి చైత్ర మాసపు తిథులు ఆరంభం అవుతాయి. తొలి తిథి చైత్ర శుద్ధ పాడ్యమి. ఇదే ఉగాది పర్వదిన తిథి. ఈనాటి నుంచే తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పేరు- శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈనాటి నుంచే వసంత నవరాత్రారంభం.
సాధారణంగా మన దేశంలో పుష్య, మాఘ మాసాల్లో పంటలు పండి ప్రకృతి పంటల బరువుతో, పచ్చదనపు సొగసులతో తులతూగే కాలం. రైతులు తమ శ్రమ ఫలాన్ని కళ్లెదుట చూసుకుని పొంగి పోతుంటారు. ఈ సమయంలో వచ్చేదే సంక్రాంతి పర్వం. సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలమని, విషువత్పుణ్య కాలమని అంటారు. విషువత్తంటే పగలు, రాత్రి సమానంగా ఉండే కాలం. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖపై ఉంటాడు. ఈనాటి నుంచి ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి సంక్రాంతినే పూర్వం ఉగాదిగా భావించేవారు. అయితే, నక్షత్ర గణకులు, సిద్ధాంతకర్తలు చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది తిథిగా తరువాత కాలంలో నిర్ణయించారు. అలా ఉగాది పుష్య, మాఘ మాసాలను దాటుకుని చైత్రంలో నిర్ణయమైంది. చైత్రంలోని తొలి తిథి అయిన శుద్ధ పాడ్యమి ఈ పర్వానికి నెలవైంది. ప్రస్తుతం మనకు ఇదే సంవత్సరారంభ దినం. ఇక ఈ పర్వం పూర్వాపరాల్లోకి వెళ్తే..
ఉగాది పండుగ ఆర్యావర్తనం అని పిలిచే ఉత్తర హిందూస్థానంలో ప్రస్తుతం నామమాత్రమైపోయింది. వ్రతోత్సవ చంద్రికాకారుని రాతలను బట్టి ప్రస్తుతం వింధ్య పర్వతానికి ఉత్తరాన ఒక్క మాళవ దేశంలోనే చైత్రాది పర్వం ఆచరణలో కొద్దిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈనాడు గృహాలంకరణం, పంచాంగ శ్రవణం అక్కడి విధాయ కృత్యాలు. ఉత్తర హిందూ దేశాన ఇతర ప్రాంతాలో ఈ మాత్రం పర్వం కూడా నిర్వహించరు. ఆర్యావర్తంలో ఈ ఆర్యాచారం ఎందుకు లుప్తమైపోయిందంటే.. కాలాంతరాన అమల్లోకి వచ్చిన సౌరబార్హ్యస్పత్య మన్వాది కాల పరిగణనలో గల తేడాలు ఇందుకు ఒక కారణం కావచ్చు. వింధ్యకు దక్షిణాన శాలివాహన శకము, ఉత్తరాన విక్రమార్క శకమూ ప్రచారంలోకి రావడం ఇందుకు మరో కారణం కావచ్చు. ఈ రెండు శకాల సందర్భంలో మహారాష్ట్రలో ప్రచారంలో ఉన్న గాథ గురించి తెలుసుకోవాలి.
పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి నలుగురు కొడుకులు. చనిపోయే ముందు అతను తన కొడుకులకు నాలుగు సీళ్లు వేసిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కాని సీళ్లు తెరవద్దని అతను కొడుకులను ఆదేశించాడు. అలాగే, ఆ కొడుకులు తండ్రి మరణానంతరం ఆ పాత్రల సీళ్లు తొలగించి చూశారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు ఉన్నాయి. దీనికి అర్థం వారికి తెలియలేదు. ఆనాటి హైందవ చక్రవర్తి విక్రమార్కుడు. ఆ కుమారులు నలుగురూ దాని అర్థాన్ని బోధించాల్సిందిగా విక్రమార్కుడిని కోరారు. కానీ విక్రమార్కునికి కూడా అందులోని అంతరార్థం తెలియలేదు. అప్పుడు వారు ప్రతిష్ఠానపురానికి వెళ్లారు. అక్కడ కూడా రాజు కానీ మరెవ్వరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కాని ఆ ఊరిలోని వింత బాలుడు ఒకడు ఆ సమస్యను విడమరిచి చెప్పాడు. ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. ఆ బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు ఇద్దరు సోదరులు. నాగ కుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. ఇందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. దిక్కులేని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయమిచ్చాడు. ఆ కుమ్మరి ఇంట్లోనే ఆమె ఒక కుమారుడిని ప్రసవించింది. ఆ బాలుడికి ఆమె శాలివాహనుడు అని పేరు పెట్టింది. ఆ బాలుడు వర్తకుని నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్లి ఇలా చెప్పాడు.
‘మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమినీ, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ, ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్నీ, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్నీ పంచుకోవాలనేది వర్తకుని తాత్పర్యం’ అని శాలివాహనుడు చెప్పాడు. శాలివాహనుడు ఇంత సముచితంగా సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతనిని చూడ్డానికి కుతూహలపడి కబురంపాడు. కానీ, శాలివాహనుడు రాజు వద్దకు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన విక్రమార్కుడు శాలివాహనుడిని మట్టుబెట్టడానికి అపార బలసమేతుడై దండెత్తి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనలపైకి వదిలాడు. శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రముని సేనల్ని నిద్రపోయేటట్టు చేశాడు. అందుకు విక్రముడు వాసుకి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఉభయ పక్షాలకూ మధ్య రాజీ కుదిరింది. ఆకాశవాణి.. నర్మదా నదికి ఉత్తర ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షిణాన్ని శాలివాహనుడు ఏలాలని ఆదేశించింది. దీంతో మన ఆంధ్రులకు, దక్షిణాదులకు శాలివాహనుడు శక స్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. దీంతో ఉగాది పర్వం అతని శక స్థాపనతో ముడిపడినదైంది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వారికి చైత్రాది దినమే సంవత్సరాది. ఆదిలో ఈనాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఈనాడే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు నియోగించాడు. నాటి నుంచి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఆదిలో ఈనాడు ఆరంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా, దిన క్రమాభివృద్ధిగా సాగుతోంది.
ఉగాది నాడు ప్రధానంగా ఆచరించాల్సిన పది విధాయ కృత్యాలను మన శాస్త్రకారులు విస్పష్టంగా పేర్కొన్నారు. అవి-
1) ప్రతిగృహ ధ్వజారోహణం: అంటే ప్రతి ఇంటా ధ్వజారోహణ చేయడం. అంటే, ఇంటి గుమ్మం ఎదుట విజయచిహ్నంగా ధ్వజాన్ని ప్రతిష్ఠించడం.
2) తైలాభ్యంగం: నువ్వుల నూనెతో తల స్నానం చేయాలి.
3) నవ వస్త్రభరణధారణం- ఛత్రచామరాది స్వీకారం: శుచిగా స్నానం చేసిన అనంతరం కొత్త బట్టలు, కొత్త నగలు ధరించడం, కొత్త గొడుగు, కొత్త విసనకర్ర స్వీకరించడం మూడవ విధి కిందకు వస్తుంది.
4) దమనేన బ్రహ్మ పూజనము: బ్రహ్మదేవుడిని దమనములతో పూజించడం నాల్గవ విధి.
5) సర్వాకచ్ఛాంతకర మహాశాంతి – పౌరుషప్రతిపద్వ్రతము: విఘ్నేశ్వరుడిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజిస్తూ శాంతిపూజ చేయడం ఐదవ కృత్యం.
6) నింబకుసుమ భక్షణం: వేపపువ్వును లేదా వేపపువ్వుతో చేసిన పచ్చడిని స్వీకరించడం.
7) పంచాంగ పూజ – పంచాంగ శ్రవణం: పంచాంగ శ్రవణం, ఆ ఏడాది కలిగే శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకోవడం ఏడవ విధి.
8) ప్రపాదాన ప్రారంభం: చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనుల దాహార్తి తీర్చడం ఎనిమిదవ కృత్యం.
9) రాజదర్శనం: మన శ్రేయస్సుకు కారకులైన వారిని, పెద్దలను దర్శించుకోవడం తొమ్మిదవ విధి.
10) వసంత నవరాత్రి ప్రారంభం: పై తొమ్మిది కృత్యాలు చేయగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్టు.
ఉగాది నాడు ఈ పది విధాయ కృత్యాలను విధిగా ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పర్వం నాడు ఆనందోత్సాహాలతో గడపాలనే వారంతా ఈ పది విధాయ కృత్యాలను విధిగా పాటించాలని శాస్త్ర నియమం.
ఇక, తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనాడే ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఈనాటి నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరుడి నిత్యోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇక, చైత్ర శుద్ధ పాడ్యమి ఘడియల్లోనే అమావాస్య ఘడియలు కూడా కూడి ఉన్నాయి. ఈ అమావాస్య నాడు గోదావరి తీరవాసులు ఏరువాక సాగుతారు. అమావాస్యను సాధారణంగా అశుభంగా భావిస్తారు. కానీ, శుభాశుభాలతో నిమిత్తం లేకుండా ఈనాడు ఆంధప్రదేశ్‍లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారు ఈ పర్వాన్ని వైభవంగా జరుపుకొంటారు. ఈ పర్వాన్ని దొంగ ఏరువాకగా, కొత్త అమావాస్యగా కూడా పేర్కొంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామ గ్రామాన ఈనాడు దేవతల ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. అలాగే, ఈ తిథి నాడు మీన సంక్రమణం కనుక అయితే, అందుకు సంకేతంగా ఈనాడు మత్స్యవాసులదేవులను పూజించాలని హేమాద్రి అనే పండితుడి అభిప్రాయం.
చైత్ర శుద్ధ విదియ
మార్చి 20, శుక్రవారం
చైత్ర శుద్ధ విదియ నాడు ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలను దమనములతో పూజించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. బ్రహ్మ పురాణంలో ఈ మేరకు వీరికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పార్వతి తన భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉంది. ఆ సమయంలో అగ్ని అక్కడకు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా జరిగాడు. అప్పుడు శివుడికి వీర్యపతనం అయ్యింది. క్రీడా భంగానికి ఆగ్రహించిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాలని ఆజ్ఞాపించింది. అగ్ని ఆ వీర్యాన్ని భరించి కుమారస్వామి జననానికి కారణభూతుడయ్యాడు. ఇక, స్కంధ పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఆ వ్రతం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు తృతీయ వరకు చేయాలని అంటారు. ఇది స్త్రీల సుమంగళత్వాన్ని కాపాడ్డానికి ఉద్దేశించిన వ్రతం. అయితే, ప్రస్తుతం ఎక్కడా అరుంధతీ వ్రతం ఆచరిస్తున్న దాఖలాలు లేవు. అయితే, వివాహ సందర్బాలలో అరుంధతీ దర్శనం చేయించే ఆచారం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లి నాటి రాత్రి ఔపోసనానంతరం నక్షత్ర రూపంలో ఉండే అరుంధతిని ప్రాతివత్య నిష్టకు ప్రతీకగా పెళ్లి కుమార్తెకు చూపిస్తారు. అరుంధతి అంటే- ఏ కారణం చేత కానీ ధర్మాన్ని అతిక్రమించనిది అని అర్థం.
చైత్ర శుద్ధ తదియ
మార్చి 21, శనివారం
చైత్ర శుద్ధ పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రుల తొమ్మిది రోజులలో ఈ తదియ మూడవ రోజు. ఈనాడు శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తారని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శివ డోలోత్సవం నాడు ఉమా శివులను దమనములతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాస్త్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ తదియను మహారాష్ట్ర పంచాంగాలు గౌరీ తృతీయ అని పేర్కొంటున్నాయి. వ్రత గ్రంథాలను బట్టి చూస్తే చైత్ర శుక్ల తృతీయ నాడు మహాదేవుడితో కూడిన గౌరిని పూజించాలి. దీనినే డోలా గౌరీ వ్రతం అంటారు. ఈ పూజలో కుంకుమ, అగరు, కర్పూరం హెచ్చుగా వాడాలి. అలంకారానికి మణులు, మంచి వస్త్రాలు వాడాలి. రాత్రి జాగరణం చేయాలి.
అలాగే, ఈనాడు సౌభాగ్య శయన వ్రతాన్ని కూడా ఆచరించాలని, ఈ వ్రతాన్ని గురించి మత్స్యుడు మనువుకు చెప్పినట్టు మత్స్య పురాణంలో ఉంది. చైత్ర శుద్ధ తృతీయ పూర్వాహ్న వేళ ఉమా మహేశ్వర ప్రతిమలకు వివాహం చేసి కల్పోక్త ప్రకారం పూజలు, దానాలు చేస్తే శివలోకప్రాప్తి కలుగుతుంది. ఈనాడు రామచంద్ర డోలోత్సవం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో రాశారు.
చైత్ర శుద్ధ చవితి
మార్చి 22, ఆదివారం
చైత్ర శుద్ధ చవితి తిథి నాడు గణపతిని దమనములతో పూజించాలని నియమం. ఈనాడు ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. సాధారణ పంచాంగాలలో ఈనాడు చతుర్థి వ్రతం, రోహిణి వ్రతం ఆచరించాలని ఉంది.
చైత్ర శుద్ధ పంచమి
మార్చి 23, సోమవారం
చైత్ర శుద్ధ పంచమి తిథి శాలి హోత్రయ పంచమి దినం. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలలో ఉన్నాయి. ఈనాడు హయపూజ చేయాలని నియమం. శాలిహోత్రుడు అశ్వశాస్త్రం రాసిన రుషి. మన రాజులు ఆశ్విక దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్రహయ పంచమి వ్రతం బాగా ఆచారంలో ఉండేదని తెలుస్తోంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శ్రీపంచమి, శ్రీ వ్రతం అని రాస్తారు. మాఘ మాసంలో ఒక శ్రీ పంచమి ఉంది. ఈ పంచమి కంటే అది బాగా ప్రచారంలో ఉన్న పండుగగా కనిపిస్తుంది. ఈనాడు లక్ష్మీపూజ చేయలని, ఈ పక్రియనే ‘శ్రీ వ్రతం’గా వ్యవహరిస్తారని అంటారు. కొన్ని ప్రాంతాలలో ఇది లక్ష్మీ పంచమిగానూ పరిగణనలో ఉంది.
చైత్ర శుద్ధ షష్ఠి
మార్చి 24, మంగళవారం
చైత్ర శుద్ధ షష్ఠి నాడు స్కంద షష్ఠి వ్రతం ఆచరిస్తారు. ఇది కుమారస్వామి సంబంధమైన పర్వం. ఈనాడు ఆచరించే పూజను స్కంద పూజ అంటారు. అర్క, కుమారషష్ఠి వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి, ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథాలలో ఉంది.
చైత్ర శుద్ధ సప్తమి
మార్చి 25, బుధవారం
చైత్ర శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని దమనాలతో పూజించాలి. సప్తమి తిథి నాడు ఇంకా గోమయాది సప్తమి, నామ సప్తమి, సూర్య, మరుత్, తురగ సప్తమీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు వాసంతీ పూజ చేయాలని ఆమాదేర్ జ్యోతిషీలో రాశారు. అలాగే, ఈనాడు అర్క వ్రతం ఆచరించే వారు రాత్రి భోజనం చేయకూడదు. పైన పేర్కొన్న వ్రతాలన్నీ సూర్య సంబంధమైనవే.
చైత్ర శుద్ధ అష్టమి
మార్చి 26, గురువారం
చైత్ర శుద్ధ అష్టమి నాడు భవానీ యాత్ర, అశోకాష్టమి, అశోక రుద్రపూజ, అశోకకలికా ప్రాశనం అనే వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. దీనిని బట్టి ఇది భవానీ అష్టమిగా, అశోకాష్టమిగా పరిగణనలో ఉందని భావించాలి. భవానీ అనేది పార్వతీదేవికి గల మరో పేరు. ఆమె శివుని భార్య. శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షుని పెద్ద కుమార్తె. శివుడు ఒకసారి దక్షుడిని నిరాదరించాడు. ఆ కోపంతో దక్షుడు కూతురిని పుట్టింటికి తీసుకురావడం మానేశాడు. ఆమె చెల్లెళ్లను మాత్రం తరచూ పుట్టింటికి పిలుస్తూ చీరలు, సారెలు పెట్టి పంపించే వాడు. ఈ క్రమంలోనే దక్షుడు ఒకసారి మహా క్రతువు తలపెట్టాడు. దీనికి పార్వతి (సతీదేవి)ని తప్ప అందరినీ పిలిచాడు. కానీ తనను పిలవకున్నా పుట్టింటిపై మమకారంతో పార్వతి వెళ్లింది. అక్కడ ఆమెను తండ్రితో సహా ఎవరూ పలకరించలేదు. ఈ అవమానం భరించలేక కాలి బొటనవేలితో పార్వతి నేలను రాచింది. దాంతో యోగాగ్ని పుట్టింది. అందులో ఆమె భస్మమైపోయింది. సతీదేవి భస్మమైన విషయం తెలుసుకున్న శివుడు తన •టాఝూటం నుంచి వీరభద్రుడిని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని భార్య అయిన మేనకాదేవి గర్భంలో చైత్ర శుద్ధ అష్టమి నాడు పుట్టింది. కాబట్టి చైత్ర శుద్ధ అష్టమి పార్వతి జన్మతిథి అయ్యింది. పర్వతరాజుకు పుట్టడం చేత ఆమెను పార్వతి అని పిలవసాగారు. భవానీ ఆమె పర్యాయ పదం.
చైత్ర శుద్ధ నవమి
మార్చి 27, శుక్రవారం
చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి పర్వదినం. ధర్మ సంస్థాపకుడైన శ్రీరామచంద్రుడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి నాడే. చై•త్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర యుక్తాన రాముడు జన్మించాడు.
అందుకే ఇది శ్రీరాముని జన్మతిథి. శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రామావతారం ఏడవది. శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథుడికి కౌసల్య గర్భంలో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ పుట్టాడు. అందుచేత ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి దినమైంది. విష్ణువు పది అవతారాల్లో మూడు అవతారాల జయంతులు చైత్ర మాసంలోనే రావడం విశేషం. ఇందులో ఇంకో విశేషం ఉంది. ఏటేటా వచ్చే ఈ పది జయంతులలోనూ ఉగాది తరువాత మొదట వచ్చే జయంతి పర్వం శ్రీరామ నవమే. శ్రీరామ నవమి పండుగ తొమ్మిది రోజులు చేస్తారు. ఆ తొమ్మిది రోజులలో ఉగాది పాడ్యమి మొదటి రోజు. ఈ తొలి రోజున ప్రారంభించి శ్రీరామ నవమి వరకు రామాయణ పారాయణ మొదలైనవి ఆచరిస్తారు. ఈ తొమ్మిది రోజులను గర్భ నవరాత్రులు అంటారు. ఈనాడు తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం, ఒంటిమిట్ట తదితర రామాలయాలతో పాటు ఊరూవాడా గల అన్ని చిన్నా పెద్దా ఆలయాల్లోనూ రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
చైత్ర శుద్ధ దశమి
మార్చి 28, శనివారం
చైత్ర శుద్ధ దశమి రెండు విధాలుగా ప్రసిద్ధమై ఉంది. ఒకటి- శాలివాహన జయంతి తిథి ఈనాడు. రెండు- ధర్మరాజ దశమి. చైత్ర శుద్ధ దశమి శాలివాహన జయంతి తిథి. శాలివాహనుడు శాతవాహన వంశానికి ఆద్యుడు. ఆంధ్రభూమి ప్రసవించిన మహా పురుషులలో ఈయన ఒకరు. ఈయన విక్రమార్కుడిని సంహరించాడని అంటారు. కుమ్మరి కన్యకు జన్మించాడు. ఉగాది పర్వం ఈయనకు సంబంధించిన కథతో కూడా ముడి పడి ఉంది. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడటం పరిపాటి. వీటిలో ప్రముఖంగా వాడే పేరు- క్రీస్తు శకం ఒకటి కాగా, భారతదేశంలో ప్రామాణికమైనది- శాలివాహన శకం. ఇది హిందూ కాలమానం. భారత జాతీయ కాలమానం. కంబోడియా బౌద్ధ కాలమానంగా కూడా శాలివాహన శకాన్ని వాడతారు. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాల శాతవాహనుని రాజ్య కాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుంచి ప్రారంభమైంది. శాలివాహన శకం 78 ఏ.డి.లో ప్రారంభమైంది. దీనికి ముందు విక్రమ శకం 56 నుంచి వాడుకలో ఉండేది.
అలాగే, చైత్ర శుద్ధ దశమి నాడు పాండవ అగ్రజుడైన ధర్మరాజును దమనముతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. రెండు ప్రధాన పర్వాలతో కూడిన చైత్ర శుద్ధ దశమి కాబట్టే ఈనాడు మన పంచాంగకర్తలు ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అని రాస్తారు. ఇంకా, రామ నవమి ప్రతాంగ హోమం ఈనాడే నిర్వహించాలని అంటారు.
ఇక, ఈనాడు శివ క్షేత్రమైన క్షీరా రామలింగేశ్వరస్వామికి గొప్ప కల్యాణం నిర్వహిస్తారు. పంచారామాల్లో క్షీరారామానికి ఆధ్యాత్మికంగా, సాంస్క•తికంగా గొప్ప ప్రాధాన్యం ఉంది. ఆంధప్రదేశ్‍లోని పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలో గల పాలకొల్లులో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడికి దరిదాపుల్లోనే సోమారామం, ద్రాక్షారామం, కుమారారామం, అమరారామం క్షేత్రాలు ఉన్నాయి. పాలకొల్లు అనే పేరు రావడానికి ఇక్కడి ఆలయంలోని పాల రంగులో ఉన్న లింగమే కారణమని అంటారు. పచ్చని పంటపొలాలు, కొబ్బరి, చెరకు తోటలు పాలకొల్లు ప్రాకృతిక వైభవాన్ని చాటుతున్నాయి. చుట్టూ గోదావరి కాలువలతో అందమైన ద్వీపంలా ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. గోదావరి దక్షిణ గంగా ప్రసిద్ధి. శివుని •టాజూటం నుంచి దిగివచ్చిన నదీ ప్రవాహమే గోదావరి. గౌతమ మహర్షి గోహత్యా పాపం తొలగించుకోవడానికి శివుడిని ఆశ్రయించాడు. అతడి వెంటపడి గౌతమి అయింది. గోహత్యా స్థలాన్ని పునీతం చేసి గోదావరి అయింది. నర్సాపురంలో సంగమమై అంతర్వేదిలో ఈ గోదావరి అంతర్లీనం అవుతుంది. 72 నల్లరాతి స్తంభాలు, సమున్నత ప్రాకారాలతో, 120 అడుగుల ఎత్తు, 9 అంతస్తులతో ఈ ఆలయంలో చాలుక్య శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో సర్వదేవతా సమాహారం నాటి మత సామరస్యానికి సంకేతం. చైత్ర శుద్ధ దశమి నాడు పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. పంచారామాలు శివుడికి ప్రీతికరమైన నివాస స్థానాలు. ఒక్కరోజు క్షీరారామంలో ఉంటే ఏడాది పాటు కాశీలో ఉన్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
చైత్ర శుద్ధ ఏకాదశి
మార్చి 29, ఆదివారం
చైత్ర శుద్ధ ఏకాదశి అనేది సాధారణంగా ఉపవాసాల రోజు. అందుకే తిథులన్నిటిలోకీ ఏకాదశి చాలా పవిత్రమైనది. చైత్ర శుద్ధ ఏకాదశిని పంచాంగకర్తలు కామద ఏకాదశిగా వ్యవహరిస్తున్నారు. ఏకాదశి పర్వం విశేషాల్లోకి వెళ్తే.. ఏకాదశి తిథి నెలలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది. పక్షానికి ఒకటి, మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు. ఈ ఇరవై నాలుగు ఏకాదశులూ ఇరవై నాలుగు పర్వాలుగా ఉన్నాయి. ‘ఏకాదశి’ అనేది పౌరాణిక గాథల్లో ఒక దేవత పేరు. మురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద భూమికి దిగి వచ్చాడు. అసురుడితో ఆయన బాగా యుద్ధం చేశాడు. యుద్ధం మధ్యలో అతను అలసిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక సౌందర్యవతి ఆవిర్భవించి అసురుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది. ఆ సౌందర్యవతికి దేవతలు ‘ఏకాదశి’ అనే పేరు పెట్టారు. ఏకాదశి పొందిన విజయాన్ని స్మరించడం కోసం ఈ పర్వం ఏర్పడిందని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించే వారిని ఆ దేవత రక్షిస్తుందని అంటారు. ఈనాడు ఏ కోరికలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ కోరికలు తీరుతాయి కాబట్టి ఈ ఏకాదశి పర్వాన్ని కామద ఏకాదశి అన్నారు. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. లలిత అనే గంధర్వ స్త్రీ ఈ తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, తన కోరికలను తీర్చుకుందట. ఆమె మనసులోని కామితం (కోరిక) నెరవేరింది కాబట్టి ఇది కామదౌకాదశి (కామద ఏకాదశి) అయ్యింది. గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏకాదశిని వాడపల్లి ఏకాదశి పేరుతో జరుపుకుంటారు. ఈనాడు అక్కడి వేంకటేశ్వరస్వామికి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈనాడు లక్ష్మీనారాయణులను దమనములతో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు.
చైత్ర శుద్ధ ద్వాదశి
మార్చి 30, సోమవారం
చైత్ర శుద్ధ ద్వాదశి విశిష్టత గురించి పద్మ పురాణంలో కొంత ప్రస్తావన ఉంది. ఏకాదశి నాడే క్షీరసాగర మథనం ప్రారంభమైంది. ఏకాదశి మర్నాడు ద్వాదశి నాడు ఈ పక్రియలో భాగంగా దేవతలు పాల సముద్రాన్ని మథించగా లక్ష్మీదేవి నాలుగు చేతులలో రెండు చేతులతో బంగారు పద్మాలను, మిగతా రెండు చేతులతో ఒక సువర్ణ పాత్రను, మాదీ ఫలాన్ని పట్టుకుని ఆవిర్భవించింది. అనంతరం చంద్రుడు పుట్టాడు. ఆ సందర్భంలో నారాయణుడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు- ‘ద్వాదశి నాడు లక్ష్మీసహితుడనైన నన్ను తులసీ దళాలతో విశేషంగా పూజించారు. కాబట్టి ద్వాదశి తిథి నాకు మిక్కిలి ప్రియమైనది. ఇది మొదలు జనులు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ప్రాత కాలాన శ్రద్ధాభక్తులతో లక్ష్మీసహితుడనైన నన్ను తులసితో పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగింటిని ఇచ్చేది’ అని పలికాడు. అందుకే చైత్ర శుద్ధ ద్వాదశి నాడు విష్ణు దమనోత్సవం నిర్వహించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. దీనినే వాసుదేవార్చనగా వ్యవహరిస్తారు. మన పంచాంగకర్తలు మాత్రం ఈనాటి వివరణలో వామన ద్వాదశి అని రాస్తారు. వామనుడిని లేదా విష్ణువును లేదా వాసుదేవుడిని ఈనాడు దమనంతో పూజించాలని నియమం. దమనం అంటే పరిమళభరితమైన పత్రం అని అర్థం.
చైత్ర శుద్ధ త్రయోదశి
మార్చి 31, మంగళవారం
చైత్ర శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశి అనీ లేదా మదన త్రయోదశి అనీ అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మథుడని అర్థం. దీనిని బట్టి ఇది మదనుడికి సంబంధించిన పర్వమని అర్థమవుతోంది. మన్మథుడు శివాగ్రహానికి గురై అనంగుడిగా మారాడు. అనంగుడు అంటే దేహం లేని వాడు. దీనికి సంబంధించి పురాణాలలో రెండు కథలు ఉన్నాయి. చైత్ర మాసంలో అనంగ్ ఉత్సవ్ పేరుతో ఉత్తరాదిన గొప్ప ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో చైత్ర మాసపు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈనాడు ప్రజలు తమ ఇళ్ల వెలుపల రంగోలీలను తీర్చిదిద్దుతారు. త్రయోదశి తిథి నాడు ప్రదోష యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు చాలా పవిత్రమైనవి. అనంగ్ త్రయోదశి నాడు ఉపవాసం పాటిస్తే వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ప్రేమానుబంధాలు మెరుగవుతాయని అంటారు. వారి సంతానానికి మంచి కుటుంబం ఏర్పడుతుందని చెబుతారు. సాక్షాత్తూ తన చేతిలో దహనమైన కామదేవ్ (మన్మథుడు) కోసం శివుడు ఏర్పరిచిన పర్వమిది. ఈనాడు శివపార్వతులకు తెల్లటి రంగు వస్తువులు, వస్త్రాలు, తీపి పదార్థాలను నివేదించాలి. శివుడిని దమనాలతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు చేసే శివపూజ మిక్కిలి ఫలప్రదమైనదని అంటారు. ఈ ఒక్కనాటి పూజ వలన సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలం కలుగుతుంది.


























































































Review ఉగాది సందడి.. నవమి వేడుక.