మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
బేగంనగరపు జమీందారు ఒక
అలీనవాజను మహమ్మదీయుడు
పేదసాదలకు, దిక్కులేని వా
రందరి కాతడు కడు ఆత్మీయుడు
పోషిస్తాడు దీనులందరిని
కంటిరెప్పలా, బిడ్డల మాదిరి
అందువల్లనే జనులందరికీ
అతడంటే బహు అభిమానం మరి
ఆ ఊళ్లోనే రామిశెట్టి అని
ఉన్నాడొక్క డబ్బుగల కోమటి
అప్పుకోసమెప్పుడూ కాచుకొని
ఉంటారెందరెందరో వాకిట
చుట్టుపట్ల పల్లెలవారందరు
పేదలె ఐన, మోతుబరులైనా
అతని ముందు చేయిజాచకతప్పదు
లొంగక తప్పదు ఎవ్వరికైనా
అతని చేతిలో చిక్క ఎందరో
నాశనమై పొయ్యారప్పుడుగక
ఇతరులటుంటి అలీనవాజుకే
తప్పలేదు అతనిని రుణమడుగక
శెట్టి కప్పుబడిపోయాడాయన
రాబడిలో సుంతైనా మిగులదు
దీన యాచకుల కక్కడ తప్పక
ఒక దమ్మిడీ ఎక్కడా పిగలదు
అప్పు పెరిగి వడ్డీపై వడ్డీ
జమీందారు కొంపకు ఎసరైనది
తాకట్టులోనున్న ఆస్తంతా
ఒకవిధాన శెట్టికి పరమైనది
‘ఏమున్నది? మన జమీందారుపని
ఇంతటితో సరి’ అన్నారందరు
దిక్కులేని పక్షులమైనామని
పేదలు, ఆశ్రితులెందుకు కుందరు?
వచ్చిందింతోనే దీపావళి
వెలిగిందింటింటా దీపావళి
శ్యామశర్వరీలతాశాఖికల
విచ్చింమల కనకకుసుమావళి
బాణసంచా కాల్చే పిల్లలు
ఎచట చూసినా వెలుగులు, రవ్వలు
ప్రతి మొఖాన సంతోషపు కళలే
ప్రతి ఇంట్లో మార్మోగే నవ్వులు
హయారూఢుడై జమీందారు తన
గ్రామంలో వేడుక చూదామని
వెడలినాడు, రుణమూలంగా తన
కే ఉత్సాహం లేనప్పటికిని
శెట్టి ఇంటివైపునే మరలినా
డతడు అలాగే వేడుక చూస్తూ
అతనిని చూచి శెట్టి పరుగెత్తుక
వచ్చాడంగలు పెద్దవి చేస్తూ
‘చాలారోజుల కిటు వచ్చా’రని
ఎంతో ఆప్యాయతతో అతనిని
తీసుకుపోయాడింటి లోపలికి
చేతులు బలవంతాన పట్టుకొని
శెట్టి గృహం దేదీప్యమానమై
వెలుగుతోంది వైభవ నిలయంగా
జమీందారు కెన్నో మర్యాదలు
గావించాడు అతడు వినయంగా
జమీందారు ఆశ్చర్యచకితుడై
పోయాడీ మర్యాద ఏమిటని
అనుకొన్నాడిది అంతా బహుశా
డబ్బు మాట అడిగేందుకు ఎత్తని
కొంతసేపటికి అతడు శెట్టిని
సెలవడిగా డిక నేపోతానని
శెట్టి పడమటింట్లో కెళ్లా డుం
డండిదిగో నేవస్తున్నానని
లోపల నుంచి అతడేవేవో
కాగితాలు చేగొని వచ్చాడు
దగ్గరనున్న దీపశిఖలోనే
వాటిని త్వరగా ముట్టించాడు
‘ఏమి పనయ్యా? అది నా నోటని’
జమీందారుగా రరచేలోగా
అంతా ఐపోయింది క్షణంలో
కాగితాలు బూడిదయైపోగా
‘రుణవిముక్తులిక మీరలు, ఇదిగో
ఇది నా సత్యమైన దీపావళి’
అని పలికాడు శెట్టి తేజోమయ
మై వెలిగిందాతని ముఖమండలి
కన్నులు చెమ్మగిల్లి ‘యా అల్లా!’
అని నవాజు తలవంచాడప్పుడు
ఇద్దరి హృదయాల్లో భగవంతుడు
ఒకే జ్యోతి వెలిగించాడప్పుడు


































































































































Review జమీందారు- శెట్టి గారి అప్పు.