పలుకు‘బడి’

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

కందాలరాజు
కొందరు ఎప్పుడూ తేరతిండి కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్లకూ మనకూ ఎలాంటి సంబంధం ఉండదు. మహా ఉంటే బాదరాయణ సంబంధం ఉండవచ్చు. అయినాసరే, అటూఇటూ ఏడు తరాల సంబంధం కల్పించుకుని ఊదరపెడ్తారు. సరిగ్గా ఏ తిండి వేళకో వేంచేస్తారు. మొహమాటానికైనా ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించమనక తప్పదు గృహస్తుడికి. ఒకవేళ అనకపోయినా, ఆహ్వానించకపోయినా ‘మిమ్మల్ని చూసి ఎన్నాళ్లయిందో కదా! చిన్నపిల్లల్ని ఓసారి చూసి ముద్దుచేసి మా చెల్లెలి చేతివంట తింటే గాని ఈ పాడు జీవితానికి తృప్తి లేదు. కోరికలు తీరకుండాపోతే దయ్యాలవుతారంటారు’… ఇలా సోది చెప్పి తిండికి తయారవుతారు. ఈ బాపతు మనిషిని ‘కందాలరాజు’ అంటారు. మనకు అతడితో చిన్నమెత్తు పని ఉండదు. ఉన్నా అతడు చేసి పెట్టేది లేదు. అతగాడికి కూడా వేరే పనిలేదు.. తేరగా వచ్చే చోట తినిపోవడం తప్ప, ఇచ్చకాలు పలకటం తప్ప. ఇలా ఉట్రవుడియంగా వచ్చిపడి తేరతిండి తినిపోయే వాళ్లను ఈ పేరుతో పిలుస్తారు. అటువంటి వాళ్లకు ఆతిథ్యం ఇవ్వకపోతే అప్రదిష్ట తప్ప మనకు వచ్చిపడేదేమీ ఉండదు. ఒకవేళ మనం అతగాడికి ఇంత తిండి పెట్టలేదో.. ఇంటింటికీ వెళ్లి తనకు మనం చేసిన అమర్యాదను గురించి దుష్ప్రచారం చేసే ప్రమాదం ఉంది ఇలాంటి వాళ్లతో.

కంబళపురీషం
పురీషం అంటే మలం. పెంట. మల విసర్జన కంబళి మీద జరిగితే దాన్ని శుభ్రం చేయడం దాదాపు అసాధ్యం. అసలే పెంట. అది కడగడానికీ, తొలగించడానికీ ఒక పట్టాన వీలుగాని చోటది. అంటే ఆ అసహ్యం భరించక తప్పదన్న మాట. అందువల్ల ఎన్నటికీ తేలని దరిద్రపు వ్యవహారాన్ని కంబళపురీషమని అంటారు. అది ఒక పట్టాన వదలదు. వదిలించుకోవాలన్నా సాధ్యం కాదు. ‘పిల్లపోయినా పీతి వాసన పోలే’దన్నట్టు వదిలించుకుందామను కున్నా వదలని వేధింపును, బాధను, పీడను కంబళపురీషమని అంటారు.

కంభం చెరువు
పూర్వం కర్నూలు జిల్లాలో, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న కంభంలో బ్రహ్మాండమైన చెరువు ఉంది. ఆ చెరువు కింద పండే పంట మేలు రకం. వర్షాకాలంలో గట్లు పొంగి వరద వస్తుంటుంది. ఆ ధాటికి ఎన్ని గొడ్లు చస్తాయో, ఎంత పంట నష్టమవుతుందో లెక్కలేదు. అందుకే ‘కంభం చెరువు కింద పండిన పంటే లెక్క గాని చచ్చిన గొడ్లు లెక్కలోకి రావు’ అనే సామెత పుట్టింది. ఆ రాళ్ల సీమలో అంత గొప్ప జలాధారం ఉన్నందుకే సంతోషం. అందుకే విశాలమైన వస్తువులను కంభం చెరువుతో పోలుస్తారు. ‘కంభం చెరువంత పొట్ట’ అని తిండిపోతును వర్ణిస్తారు. కృష్ణా జిల్లాలోని కళ్లేపల్లి చెరువు కూడా ఇలాంటిదే. గొడ్ల చావు లెక్కల విషయం కాదుగాని, ఇలా భిన్న స్థలాల్లో చాలా చెరువులున్నాయి.. ఇలా పోలికతో చెప్పేవి.

కరటక దమనకులు
తోడుదొంగలు అనే అర్థంలో ఈ మాటను తెలుగులో వాడతాం. పంచతంత్రంలోని జంతు (నక్క) పాత్రలివి. చిన్నయసూరి నీతిచంద్రికలో ఇవి ఎంతో స్నేహంగా ఉన్న సంజీవకమనే ఎద్దునూ, పింగళకమనే సింహాన్ని విడదీస్తాయి. పైకి ఒకరు వద్దంటే రెండోవారు కాదంటూ నటించినా ఉభయులకూ లక్ష్యమొక్కటే. అది- మిత్రభేదం సృష్టించడం. మాయమాటలతో చాపకింద నీరులాగా స్వప్రయోజన దృష్టి పెట్టుకుని స్నేహం చెరిచిన వాళ్లు కరటక దమనకులు. పైకి ఒకరొకరి మాటలకు పొంతన లేనట్టుంటుంది కానీ, ఇద్దరూ కలిసికట్టుగా సాధించదలచింది నెరవేర్చుకోగలుగుతారు. అందువల్ల మోసగాళ్లను, అభిప్రాయభేదం కలిగించే వాళ్లను, తోడుదొంగలనూ కరటక దమనకులని అంటారు.

కరణం దస్త్రం
కరణీకం చేసే వ్యక్తి గ్రామంలోని ఆస్తిపాస్తుల వివరాలను లెక్కలు రాసి, ఆ పుస్తకాలను దస్త్రంలో కట్టి ఉంచడమనేది వృత్తిధర్మం. వెనకటికొక కరణం గారు చిన్న కొడుక్కి పెళ్లి చేశారట! కోడలు కాపురానికి వచ్చింది. తాను పెద్దవాడవుతున్నాడు కాబట్టి గ్రామ లెక్కల వివరాలన్నీ కుమారుడికి బోధించడం మొదలుపెట్టాడు. పగలంతా ఈ దిక్కుమాలిన లెక్కలతో ఊపిరాడని ఆ కొడుకు రాత్రివేళకు అలసిపోయి తలగట్టుకుని పడుకోసాగాడు. కొత్త కోడలు ఇదంతా చూసి ఉసూరుమన్నది. కానీ చేయగలదేమీ లేదు. ఆ సమయంలో ఇంటి ఆవు పెయ్యదూడను కన్నది. దూడ చెంగనాలు పెడుతూంటే మామగారు వినేట్టు కోడలు ఇలా అన్నదట- ‘అంత మిడిసిపాటు పనికిరాదు. మామగారికి చెప్పి మెడలో కరణం దస్త్రం కట్టిస్తాను. జాగ్రత్త అని. ఈ మాట విన్న కరణం తన కొడుక్కి విద్య నేర్పటాన్ని వాయిదా వేశాడనేది కథ. కదలటానికీ మెదలటానికీ వీలుగాకుండా కాళ్లకు బందమేసినట్టు, మోత బరువుకు నడుములు విరిగేట్టు, కూర్చున్న పాటున మెడ పట్టినట్టు వేధించే పనికి ‘కరణం దస్త్రం’ అనే పేరొచ్చింది. భారమైన పని, బాధాకరమైన కార్యం, స్వాతంత్య్రం లేని చాకిరీ మొదలైన అర్థ విశేషాల్లో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

కరతలామలకం
కొందరు ‘హస్తామలకం’ అని కూడా అంటారు. అమలకం అంటే ఉసిరికాయ. కరతలామలకం అంటే చేతిలో ఉన్న ఉసిరికాయ అని అర్థం. ఈ మాటకు మామూలు అర్థం ‘చాలా సులభమైన, స్పష్టమైన విషయం’ అనే అర్థంలో ఈ పదబంధం ప్రయోగిస్తారు. నిమ్మకాయలాగే ఉసిరికాయ కూడా చేతిలో బాగా ఇముడుతుంది కాబట్టి కరతలామలకం అన్నారు. ఉసిరికాయ లోపలి విత్తనం/గింజ కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి బాగా తెలిసిన విస్పష్టమైన విషయమని అనేప్పుడు ఈ పదబంధాన్ని వాడాలని మరికొందరంటారు. ఫలానా శాస్త్రం ఫలానా వ్యక్తికి కరతలామలకం అంటే అందులో ఆయన నిష్ణాతుడనీ, ఆ శాస్త్రమూలం (బీజం-విత్తనం- మూల కారణం) కూడా ఆయనకు తెలుసనీ అర్థమన్న మాట. ‘నాకు ఇది బాగా తెలుసు’ అనడానికి ఇది నాకు కరతలామలకం అనడం పరిపాటి.

కరెళ్ల కామక్క
కామక్క చాలా పెద్దదయిపోయింది. తిండి గడుస్తున్నదేమో గాని ఊరూపేరూ లేకుండా బతికింది. చివరి దశలో తానేమైనా గొప్ప పని చేసి పేరు సంపాదించాలని అనుకుంది. ఆమె ఆనాడు అమరావతిని పాలిస్తున్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి సమకాలికురాలట. ఆ రాజు ఏటా తులాభారం తూగి, ఆ సొమ్మును దానధర్మాలకు వినియోగించే వాడు. కామక్క తానూ అంత పని చేయాలని అనుకుంది. అయితే, వెంకటాద్రి నాయుడు బంగారం తూగేవాడు. తనకంత శక్తి లేదు కాబట్టి ఆయన కోటలో బంగారం తులాభారం తూగినప్పుడు తాను పేటలో వంకాయలతో తూగింది. బంగారాన్ని అమ్ముకుని మాత్రమే తినగలరు. అదే వంకాయలనైతే వండుకుని తినవచ్చు. అందు••ని నాయుడు గారి నుంచి బంగారం దానంగా పొందిన వారు పనిలో పనిగా కామక్క వద్ద కూడా ఈ వంకాయల దానాన్ని స్వీకరించారు. ఫలితంగా ఆయన బంగారం తులాభారానికి వచ్చిన పేరు కామక్క వంకాలయ తులాభారానికి కూడా మంచి పేరొచ్చింది. తన శక్తికి తగినట్టు ఆమె పేరు తెచ్చుకుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని స్మరించినట్టే కామక్కనూ తలుచుకుంటారు.. చివరకు ఎగతాళి చేయడానికైనా సరే. ఆయన తాహతుకు బంగారమే దానం చేయాలి. ఈమె శక్తికి వంకాయలూ ఆపాటివే. ఈ విధంగా ఆమె పేరు ఆ ప్రాంతంలో ఒక జాతీయంగా స్థిరపడిపోయింది. ఎవరైనా పోటీకి అవతలి వారు చేసిన పనిలాంటిదే చేయబోతే, ‘ఆహా! కరెళ్ల కామక్క కూడా తులాభారం తూగింద’ని వేళాకోళం చేస్తారు. వెంకటాద్రి నాయుడికి బంగారం పంచడం లెక్కలో విషయం కాకపోవచ్చు గానీ కామక్కకు వంకాయలు తులాభారం తూగి వాటిని పంచడం మాత్రం ఖరీదైన త్యాగమే!.

చదువు కోసం దెబ్బలు తినవచ్చు!
చాకివాడు కోక చీకాకు పడజేసి
మయిల బుచ్చి, మంచిమడుపు జేయు,
బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
అర్థాలు:
చాకివాడు= బట్టలు ఉతికేవాడు, కోక= చీర, చీకాకు పడజేసి= అటూఇటూ జాడించి.
వివరణ:
బట్టలకు పట్టిన మురికిని పోగొట్టి, శుభ్రం చేయడానికి ఆ బట్టల్ని ఉడక బెట్టాలి. బండకేసి బాదాలి. ఎండలో ఆరబెట్టాలి. ఇలా బట్టల్ని కష్టపెట్టడం భావ్యం కాదనుకుంటే, ఆ బట్టలకున్న మురికిపోదు. అవి శుభ్రం కావు. అలాగే చదువు చెప్పేటప్పుడు గానీ, ఇది తప్పని చెప్పేటప్పుడు గానీ ఒక దెబ్బ వేయాల్సి వస్తుంది. కొడితే బాధపడతాడని కొట్టడం మానితే విద్యార్థికి పాఠం బుర్రకెక్కదు. కాబట్టి వాళ్ల లాభం కోసమే దెబ్బ వేయాల్సి వచ్చింది కాబట్టి అది తప్పు కాదు. అది వాడి ప్రయోజనం కోసమే కాని వాడి మీద పగ ఉండి కాదు. కాబట్టి తన లాభం కోస•మే పెద్దవారు ఇలా చేశారని గ్రహించి విద్యార్థులు కొన్ని బాధలకు సిద్ధపడి ఉండాలనేదే పై పద్య తాత్పర్యం.

Review పలుకు‘బడి’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top