ఎడ్ల మూపురం మీద కాడి రాసుకుని పుండు పడు తుంటుంది. పొలం దున్నాలన్నా, బండి లాగాలన్నా ఎద్దు కాడిని మోయాల్సిందే. అలా ఏళ్ల తరబడి పని చేసినప్పుడు చర్మం ఒరుసుకునిపోయి ఎర్రగా పుండు పడుతుంది. ఆ పుండు తగ్గే వరకు ఎద్దుకు విశ్రాంతిని ఇస్తారు. కానీ కాకులు ఆ ఎద్దును కుదురుగా ఉండనివ్వవు. దాని మూపురం మీద ఉన్న పుండును పొడిచి తింటాయి. లేదా ఆ పుండును పొడిచి తినాలని ఒకటే కాకిగోల చేస్తాయి. ఎద్దును విసిగిస్తాయి. ఎద్దు తోకతో తరిమికొడితే కాకులన్నీ ఎగిరి పోతుంటాయి. అలా తోకను కదలిస్తూ ఉంటేనే కాకి దూరంగా ఉంటుంది. లేదంటే ఎద్దుకు కాకి నరకం చూపిస్తుంది. ఈ సన్నివేశం పల్లెల్లో ఎక్కడైనా కనిపిస్తుంది. దీన్ని చూసే ఈ జాతీయం పుట్టింది. పుండు బాధ ఎలాంటిదో, ఎంత ఉంటుందో దానిని భరించే ఎద్దుకే తెలుస్తుంది. దానితో పని చేయించుకునే రైతుకు కూడా ఆ బాధ తెలుసు. కానీ కాకి ఏమాత్రం పట్టించుకోదు. ఎద్దు మాంసాన్ని లాక్కుని తినడమే దానికి కావాల్సింది. అందుకే ఎదుటి వాళ్ల బాధను తీర్చకపోగా అందు నుంచి ప్రయోజనం పొందాలని చూసేవాళ్లను ఉద్దేశించి ‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అనే జాతీయాన్ని విరివిగా వాడుతుంటారు.
Review ఎద్దు పుండు కాకికి ముద్దు!.