నిజం చెప్పాలంటే.. మన మాతృభాష తెలుగు
క్షీణ దశలో ఉంది. చాలా పదాలు, పదబంధాలు
వాడుకలో లేకుండాపోతోంటే, మరికొన్ని విపరీత వాడకంతో
నవ్వుల పాలవుతున్నాయి. అందుకేనేమో.. ఆడవారి మాటలకు కాదు..
మన తెలుగు వారి మాటలకు అర్థాలే వేరయా అని అనుకోవాల్సి వస్తోంది. మరోపక్క మనం
ఆంగ్లం నుంచి చాలా పదాలు అరువు తెచ్చుకున్న మాట నిజమే కావచ్చు గాక! కానీ, మన తెలుగు పదాలను తీసుకెళ్లి ఆంగ్లం వాళ్లు ఆంగ్లీకరణ చేసుకున్న వైనాలూ ఉన్నాయి. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం.
షష్ఠి అంటే ఆరు. షష్టి అంటే అరవై. అరవై ఏళ్ల వయసులో కూడా గట్టిగా ఉండాలనే ఉద్దేశంతోనేమో ప్రస్తుతం చాలామంది ‘షష్ఠిపూర్తి’ అని రాస్తున్నారు. అంటే మనం రాసిన ప్రకారం ఆరేళ్ల వయసు ఆయనకు అరవై ఏళ్ల వేడుక చేస్తున్నామన్న మాట. తెలుగు వారు తాము ఏ మాట అయినా పలకలేకపోతే ఆ పదాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తారట. అందుకు ఉదాహరణ.. ఆశ్చర్యం అనే పదం. దీన్ని పలకడం కష్టమని భావించి అచ్చెరువు అనే పదాన్ని సృష్టించాడు. భోజనం బోనమైపోయింది. వర్ణము వన్నెగా మారిపోయింది. కాదన్న మాదన్న ఎవడూ లేడు. వీటన్నింటి వల్ల భాష పెరిగిందా? లేదా? నన్ను ముట్టుకోకు నామాల కాకి అనుకుంటుంటే ఎక్కడి భాష అక్కడే ఉండిపోతుంది. ఎక్కడి ఘోష అక్కడే ఉంటుంది. ఇంగ్లిష్ వాడి విజయ రహస్యం కూడా మనలా పదాలను సరిగా పలకలేకపోవడమే. మన మచిలీపట్నాన్ని వాళ్లు పలకలేకపోవడం వల్ల మసూలిపటాం పుట్టింది. మన పందికొక్కును ఇంగ్లిష్ వారు పట్టుకుపోయి బ్యాండీకూట్ చేసుకున్నారు. మన కాసు తీసుకుపోయి తెల్లవాడు క్యాష్ చేసుకున్నాడు. అన్నట్టు ఇంగ్లిష్ మాటల్ని మనమూ సొంతం చేసుకున్నాం. బాగానే ఉంది. రైళ్లో ప్రయాణిస్తున్నాం. నిజానికి రైలు అంటే పట్టా తప్ప బండి కాదు. మన పొగబండికి మనమే పొగబెట్టుకున్నాం. ఇలా ఎన్ని తెలుగు పదాలు ఇంగ్లిష్ దెబ్బకు మరుగున పడిపోతున్నాయో చూసుకోవాలి.
మనది త్రిలింగ దేశమే. ఎవరూ కాదనరు. ఎటొచ్చీ ‘లింగాల’ మధ్య పేచీ ఉంది. అయ్య పుంలింగం. మరి, అక్కయ్య, అత్తయ్య స్త్రీ లింగాలు. వచనాల ప్రవచనాల్లోనూ ఓ గొడవ ఉంది. విస్తరి ఏకవచనం. మరి పెళ్లిలో వేయి విస్తరి లేచింది అంటే విస్తళ్లు అని అర్థం చేసుకోవాలి. గొయ్యి ఏకవచనం. గోతులు బహు వచనం. అలాగే, నుయ్యి, నూతులు. మరి పొయ్యి ఏకవచనం. బహువచనం పోతులు కాదే. ప్రయోగాన్ని బట్టే వ్యాకరణం ఉంటుంది. ఉండాలి. ప్రయోగ శరణం వ్యాకరణం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.
చాలామంది మన తెలుగులో తద్దినం పెట్టకయ్యా అంటారు. అలాగే, మొక్కుబడిగా చేయకయ్యా అంటారు. నిజానికి తద్దినం పెట్టడం ఎంత కష్టమో పెట్టేవాడికే తెలుస్తుంది. అది మూడు గంటల కష్టం. చెమటోడ్చి చెయ్యాలి. మొక్కుబడి తీర్చుకోవడం ఎంత కష్టమో ఆపై
వాడికే తెలుసు. తేలిగ్గా తీసుకోకూడదు. పొట్టలో చుక్కది ఇంకో సమస్య. ఎక్కడ చుక్క పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో ఓ పరీక్ష. ఓ కథ. అది అర్థవంతమయింది. లేకపోతే ఇంకో అర్థం. చుక్క ఉంటే ఒక అర్థం. చుక్క లేకుంటే మరొక అర్థం. ల, ళ, లు, స, ణ, సలు, ష, స లు మరో సమస్య. ళ బదులు ల, ణ బదులు న, ష బదులు స వాడటం చూస్తూనే ఉన్నాం. కల్యాణంలోనూ ‘ల’ రాయాలి, ‘ళ’ కాదు అంటే కొందరి మనసు ఎందుకో మనస్కరించదు. భాష పేరు మలయాళం అయితే మళయాళం అని రాస్తుంటాం. కళను కల అని రాస్తే ఏం బాగుంటుంది?
ఏమాటకామాటే చెప్పాలంటే తెలుగు వారి తీరే వేరు. తన మాతృభాష మీద కన్నా పరాయి భాష మీదనే తమకు పట్టు ఎక్కువ అని చెప్పుకునే వాళ్లు తెలుగు వాళ్లలో తప్ప యావత్ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించరు. ఆచితూచి మాట్లాడటం ఎంతైనా అవసరం. ఈ విషయంలో నియంత్రణ లేదు కనుకనే అపభ్రంశ పదాలే వాడుకలోకి వచ్చేశాయి.
Review ఏడాపేడా వాడేస్తే అంతే.