మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి
ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
బుజ్జి మేక
బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి?
రాజుగారి తోటలోని మేత కెల్తిని
రాజుగారి తోటలోన ఏమి చూస్తివి?
రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని!
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగ పూల చెట్లు మేసివస్తిని
మేసివస్తే నిన్ను భటులు ఏమి చేసిరి?
భటులు వచ్చి నా కాళ్లు విరగగొట్టిరి
కాలు విరిగిన నీవు ఊరకుంటివా?
మందు కోసం నేను డాక్టరింటికెల్తిని
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివి?
చిక్కనైన తెల్లపాలు అందిస్తిని
ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమాని కేమిస్తవు?
గడ్డి తినక ఒక పూట పస్తులుండి తీరుస్తా
పస్తులుంటే నీకు నీరసం రాదా?
పాడు పని చేయనింక బుద్ధి వచ్చె నాకు.
అల్లరి రాజ
అల్లరి రాజా వచ్చాడు
పిల్లలందర్ని పిలిచాడు
అల్లరి ఎంతో చేశాడు
గొడవలు ఎన్నో తెచ్చాడు
నాన్నతో తన్నులు తిన్నాడు
అల్లరి అంతా మానాడు
పుస్తకం చేత బట్టాడు
శ్రద్ధగా నాన్నతో వెళ్లాడు
గురువు వద్ద చేరాడు
బుద్ధిగ మాటలు విన్నాడు
చదువులు బాగా చదివాడు
శ్రద్ధగా పాఠాలు విన్నాడు
పాఠాలెన్నో నేర్చాడు
పరీక్షలెన్నో రాశాడు.
ఫస్టుక్లాసులో నెగ్గాడు
పెద్దల మన్నన పొందాడు.
బుర్రు పిట్ట
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మగని చేత మొట్టికాయలు తింటున్నది.
Review బుర్రుపిట్ట తుర్రుమన్నది.