మాసం.. విశేషం

ఆంగ్లమానం ప్రకారం ఐదవ మాసం మే. ఇది తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ- జ్యేష్ఠ మాసాల కలయిక. వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. వైశాఖం తెలుగు మాసాలలో రెండవది. మాధవ మాసం, సాధన మాసంగా పేర్కొనే వైశాఖలో కూర్మ జయంతి, బుద్ధ జయంతి, అన్నమాచార్య జయంతి, మోహిని ఏకాదశి, నిర్జన ఏకాదశి వంటి పండుగలు, పర్వాలు పలకరిస్తాయి. ఇక, మే 17, ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాస తిథులు ప్రారంభమవుతాయి. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో మూడవది కాగా, ఆంగ్లమానం ప్రకారం ఐదవది. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది.

2026- మే 1, శుక్రవారం, వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి
2026- మే 31, ఆదివారం, అధిక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు….

శ్రీ పరాభవ నామ సంవత్సరం- వైశాఖం/జ్యేష్ఠం- వసంత/గ్రీష్మ రుతువులు- ఉత్తరాయణ

వైశాఖ – జ్యేష్ఠ మాసాలు వసంత, గ్రీష్మ రుతు కాలం. మే నెల ముగిసి జూన్‍ ప్రారంభమయ్యే నాటికి ఎండలు మరింత మండిపోతాయి. గ్రీష్మతాపంతో మానవాళే కాదు పశుపక్ష్యాదులు అల్లాడిపోతుంటాయి. నెల చివరి నాటికి వాతావరణం కొంత చల్లబడుతుంది. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసమని పేరు. జ్యేష్ఠ మాసం నెలంతా బ్రహ్మను ఆరాధించాలని అంటారు. నెల పొడవునా ఆయన ప్రతిమను గోధుమపిండితో తయారు చేసుకుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని అంటారు. ఇలా చేస్తూ జ్యేష్ఠ మాసంలో తనను ఆరాధించే వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసమనే పేరు వచ్చింది. పితృదేవతల ప్రీత్యర్థం చేయాల్సిన కర్మలకు, వారి రుణం తీర్చుకోవడానికి, చేసిన పాపాల నుంచి విమోచనం పొందడానికి ఉద్దేశించిన కొన్ని మంచి తిథులు జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. అలాగే శుభ ముహూర్తాల పరంగా కూడా ఈ మాసం అంతగా అనుకూలం కాదని అంటారు. అయితే, ఈ మాసంలో కొన్ని విశేషమైన పర్వాలు, వ్రతాలు ఉన్నాయి. స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే సావిత్రి వ్రతం, పార్వతీదేవి ఆచరించిన రంభా వ్రతం, పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఆచరించే నిర్జల ఏకాదశి వంటివి జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన వ్రతాలు. ఈ తిథి నాడు విష్ణుమూర్తిని కూడా పూజించి నీరు, అన్నం, పండ్లు వంటివి దానం చేయాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల 12 ఏకాదశి తిథుల్లో స్వామిని పూజించిన ఫలితం దక్కుతుందట. ప్రధానంగా వ్యవసాయానికి జ్యేష్ఠ మాసమే శ్రేష్ఠమైనదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే ఫలసాయానికి బీజం పడేది ఈ మాసంలోనే. అందుకే రైతులు ఆనందంగా ‘ఏరువాక’ జరుపుకుంటారు. వృషభ పూజలు ఈ మాసంలో విశేషంగా జరుగుతాయి. తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతా సూచకంగా రైతులు జ్యేష్ఠంలో వృషభ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, వ్యవసాయంలో ప్రధానమైన ఖరీఫ్‍ సీజన్‍కు రైతులు శ్రీకారం చుట్టేది ఈ మాసంలోనే. ఇక, దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’, శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింప చేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనాపరులకు ఉన్నతిని కలిగిస్తాయి. ఇక, మే నెల ప్రారంభం నుంచి 16వ తేదీ వరకు వైశాఖ మాస తిథులు కొనసాగుతాయి. ఈ కాలంలో వచ్చే ముఖ్యమైన పర్వాల్లో హనుమజ్జయంతి ఒకటి. వైశాఖంలో కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే హనుమజ్జయంతిని ఆచరించే ఆచారం ఉంది. శ్రీరాముడు జ్యేష్ఠ మాసంలోనే హనుమంతుడిని కలిశాడట!. ఇంకా వైశాఖ, జ్యేష్ఠ మాస తిథుల్లో వచ్చే ముఖ్యమైన పర్వాల విశేషాలు..

వైశాఖ శుద్ధ పూర్ణిమ/బుద్ధ పూర్ణిమ
మే 1, శుక్రవారం

వైశాఖ శుద్ధ పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రశస్తమై ఉంది. ఏ మాసంలో వైశాఖి పూర్ణిమ వస్తుందో ఆ మాసానికి వైశాఖ మాసమని పేరు. వైశాఖిని మహా వైశాఖి అనీ అంటారు. ఇక, ఈ పూర్ణిమ నాటి పర్వాలు చాలా పవిత్రమై ఉన్నాయి. వాటిలో కొన్ని..
•వైశాఖ శుద్ధ పూర్ణిమ తిథి బుద్ధుని జన్మ మహోత్సవమని నీలమత పురాణంలో పేర్కొన్నారు.
•విష్ణువు దశావతారాల్లో ఒకటైన కూర్మావతారం కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమ తిథి నాడే ఆవిర్భవించింది. వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కూర్మావతార ప్రాదుర్భావ దినమైతే, పుష్య శుక్ల ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి వ్రతం ఆచరణ దినం. కూర్మావతారం విష్ణువు యొక్క దశావతారాలలో రెండవది. పాల సముద్రాన్ని మథించిన సందర్భంలో మందర పర్వతాన్ని కవ్వంగా దేవతలు, రాక్షసులు (అమృతం కోసం) చేసుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోయడానికి విష్ణువు పెద్ద తాబేలు ఆకారాన్ని ధరించాడు. అదే కూర్మావతారం.
• సుబ్రహ్మణ్య స్వామి వైశాఖ పూర్ణిమ నాడే అవతరించినట్టు చెబుతారు.
•వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేసే ఆచారం కూడా ఉంది. ఈనాడు ధర్మరాజు ప్రీత్యర్థం నానావిధ దానాలు చేయాలి.
• పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి దినం కూడా ఈనాడే. ఆంధప్రదేశ్‍లోని తాళ్లపాకలో జన్మించాడు. వాగ్గేయకారుడిగా వినుతికెక్కిన ఈయన దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని, అహోబిలం నృసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. ఈయన పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం మిళితమై ఉంటాయి. శ్రీమహావిష్ణువు ఖడ్గానికి ‘నందకం’ అని పేరు. ఆ నందకం అంశతోనే అన్నమాచార్యులు జన్మించారని అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
•వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు శివుడు శరభావతారాన్ని ఎత్తాడు. శరభం అంటే ఎనిమిది కాళ్ల జంతువు. అది సింహాన్ని చంపగలిగే శక్తి కలది. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహావతారం దాల్చిన విష్ణువు హిరణ్యకశిపుని సంహరించాడు. అయినా ఆయన ఉగ్రం చల్లారలేదు. దీంతో దేవతలు శివుడిని ప్రార్థించారు. దాంతో శివుడు శరభ అవతారం దాల్చి నృసింహావతారంలోని సింహాన్ని చంపి వేస్తాడు. అనంతరం దాని చర్మాన్ని ఒలిచి కప్పుకుంటాడు. ఈ విధంగా నృసింహావతారం ముగుస్తుంది. ఇక, ఈ మూలంగా శివుడు శరభావతారం దాల్చాడు కాబట్టి వైశాఖ పూర్ణిమ శరభ జయంతి దినంగా ప్రసిద్ధి చెందింది.
ఇక, బుద్ధులకు వైశాఖ పూర్ణిమ మహోత్సవ దినం. శాక్య వంశంలో పుట్టిన సిద్ధార్థుడు ఒకనాడు- వృద్ధుడు, రోగి, శవం (మరణం), సన్యాసిని చూసి చలించిపోయి అంతర్ముఖుడయ్యాడు. ఇల్లు, భార్యాబిడ్డలను వదిలి వెళ్లిపోయాడు. బిహార్‍లోని బుద్ధగయలో బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయమైంది. ఆయన ఆర్య సత్యాలు వెల్లడించాడు. అష్టాంగ యోగమార్గం బోధించాడు. బుద్ధుడిగా తన మొదటి జ్ఞానబోధను సారనాథ్‍లో ప్రారంభించాడు. బోధ్‍ గయలో జరిగే బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో యాత్రికులు వస్తారు. బోధ్‍ గయ తరువాత బౌద్ధ మతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సారనాథ్‍లోనూ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. బౌద్ధ మత సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఇష్టంగా లేదా అయిష్టంగా తీసుకోకూడదు. కనుక బౌద్ధులు ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలను చాలా శాంతంగా జరుపుకుంటారు. ఉత్సవాలలో బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగురవేస్తారు. బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. బుద్ధుని బోధనలను స్మరించుకుంటారు.
ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే ధర్మ సూత్రాన్ని బౌద్ధం నొక్కి వక్కాణిస్తుంది. బౌద్ధ మతస్తులు ఈనాడు పూవులు, దీపాలు, అగరవత్తులు బుద్ధునికి సమర్పిస్తారు. అందమైన పూవులు కొద్దిసేపటికి వాడిపోతాయి. కాంతులొలికే దీపం, మధురమైన అగరవత్తులు కాసేపటికే ఆవిరైపోతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికి ప్రతీకలుగా బుద్ధునికి భక్తులు వీటిని సమర్పిస్తారు. గౌతముడు లేదా బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ఇల్లు వదిలి, కష్టాలకు కారణం ఏమిటో అన్వేషిస్తూ, దేశాటన చేస్తూ, ఎంతో శోధించిన మీదట, చివరకు గయలో బోధి వృక్షం కింద ‘కోరికలే దు:ఖానికి మూల కారణం’ అని కనుగొన్నాడు. తాను కనుగొన్న సత్యాన్ని ఆయన ప్రచారం చేశాడు. ‘మనకు కష్టం కలిగిందీ, దుఖిస్తున్నామూ అంటే అందుకు ఏదో ఒక కోరికే కారణం. కనుక కోరికలను జయించాలి’ అని ఆయన బోధించాడు.
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతీదీ మార్పు చెందుతుంది. చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దానిని ఆమోదించాలి. మంచి, చెడు.. దేనికీ ప్రతిస్పందించవద్దు’ అనే బుద్ధుని బోధనలు ప్రపంచమంతటా విస్తరించాయి.
ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పలు ప్రధాన క్షేత్రాల్లో ఈనాడు పలు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీ కపిలేశ్వరస్వామి వార్ల పత్ర పుష్పయాగాన్ని ఈనాడే నిర్వహిస్తారు.

గోవిందరాజ స్వామి వారి పొన్న కాల్వ ఉత్సవాన్ని కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే జరుపుతారు.

అలాగే, తిరుచానూరు పద్మావతీ తాయార్ల వసంతోత్సవం ఈనాటితో ముగుస్తుంది.

నాగులాపురం శ్రీవేద నారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనాటి నుంచే ప్రారంభమవుతాయి.

దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం ఈనాటితో ముగుస్తుంది.

మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం.

వైశాఖ బహుళ పాడ్యమి
మే 2, శనివారం

వైశాఖ బహుళ పాడ్యమి నారద మహర్షి జయంతి తిథి. ఆయన గొప్ప హరి భక్తుడు. ‘నారాయణ.. నారాయణ’ అంటూ ముల్లోకాలు తిరుగుతూ హరిభక్తిని జనులకు చాటేవాడు. ఇంకా ఈనాడు భూత మాత్రుత్సవం’ ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు మొదలుకుని అధిక జ్యేష్ఠ పూర్ణిమ చివరి వరకు శ్రీ ప్రాప్తి వ్రతం ఆచరించాలని కూడా నియమం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్‍ ప్రకారం అన్నమాచార్య జయంతి తిథి ఈనాడే. ఇతర తెలుగు క్యాలెండర్లలో మాత్రం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే అన్నమాచార్యుని జయంతిగా పేర్కొన్నారు.

వైశాఖ బహుళ విదియ
మే 3, ఆదివారం

వైశాఖ బహుళ పాడ్యమి తిథి నారద జయంతి దినమని కొన్ని పంచాంగాలలో ఉండగా, వైశాఖ బహుళ విదియ తిథే ఆయన జయంతి తిథి అని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. నారదుడు వీణాధారి. లోకసంచారి. ‘నారాయణ’ మంత్రాన్ని పఠిస్తూ ఆయన లోకాలు తిరుగుతుంటాడు. ఈనాడు ఆయన ప్రీత్యర్థం వీణ దానం చేయాలని అంటారు. నారదుడు గొప్ప గాన విద్యా కుశలుడు. ఆయన చేతిలో ఉండే వీణకు ‘మహతి’ అని పేరు. ఈ వీణ ఆధారంగానే ఆయన నిత్యం విష్ణుగానం చేస్తూ ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉంటాడు.
నారదుడు గడిచిన కల్పంలో ఉపబర్హణుడునే గంధర్వుడిగా పుట్టాడట. అతను ఆ కాలంలో నారాయణ కథలు గానం చేసేవాడు. తరువాత కల్పంలో బ్రహ్మ మానసపుత్రుడయ్యాడు.

వైశాఖ బహుళ చవితి
మే 5, మంగళవారం

వైశాఖ బహుళ చవితి (చతుర్థి) తిథి గణపతి ఆరాధనకు అనువైనది. ఈనాడు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఇది గణపతి సంబంధమైన వ్రతాచరణ పర్వం. పంచాంగాలలో ఈనాడు భౌమ చతుర్థి దినమని పేర్కొన్నారు.

వైశాఖ బహుళ పంచమి
మే 7, గురువారం

ఈనాటి నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. అలాగే వైశాఖ బహుళ పంచమి తిథి నాడే శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవం ఆరంభమవుతుంది.
అలాగే, ఏటా మే 7వ తేదీన ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. జీవితంలో నవ్వు ప్రాధాన్యాన్ని, నవ్వు వలన కలిగే మానసిక ఆరోగ్య ప్రయోజనాలను తెలియచెప్పడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

వైశాఖ బహుళ షష్ఠి
మే 8, శుక్రవారం

సాధారణంగా షష్టి తిథి కుమార స్వామి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈయననే మనం సుబ్రహ్మణ్యస్వామిగా పిలుస్తాం. తమిళనాట కార్తికేయుడని, కుమారస్వామి అని పిలుస్తారు. ఈనాటి నుంచి కృతిక కార్తె ఆరంభమవుతుంది. నిజ కర్తరి కూడా ఈనాటి నుంచే ఆరంభం. కుమారస్వామి కూడా కృతిక నక్షత్రంలోనే జన్మించాడని అంటారు.

వైశాఖ బహుళ దశమి/ హనుమజ్జయంతి
మే 12, మంగళవారం

వైశాఖ బహుళ దశమి నాడే హనుమంతుడి జన్మతిథి. ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమంతుడి జయంతి వేడుకలు విశేషంగా జరుగుతాయి. కొండగట్టు హనుమంతుడి దీక్షలు ఈనాటితో ముగుస్తాయి. అలాగే, హైదరాబాద్‍ సమీపంలోని తాడ్‍బంద్‍కు భారీ శోభాయాత్ర జరుగుతుంది. ఇది నేత్రపర్వం చేసే వేడుక. కాగా, చైత్ర మాసంలోనే హనుమజ్జయంతి అనే వాదనలూ ఉన్నాయి. తెలుగు వారు మాత్రం రెండు తిథుల్లోనూ హనుమంతుడి జన్మతిథి వేడుకలు నిర్వహించుకుంటారు.
ఆంజనేయుడు సకల సుగుణాల నిధి. రాముడిది ఒకటే బాణం.. ఒకటే మాట. మరి హనుమంతుడు ఏమైనా తక్కువా? ఆయనదీ ఒకటే మంత్రం.. ఒకటే నామం.. అదే రామనామం. హనుమంతుడంటే ధైర్యానికి నిలువెత్తు చిరునామా.. ప్రభుభక్తికి అసలైన అర్థం. కఠోరమైన బ్రహ్మచర్యానికి నిజమైన ఉదాహరణ. ఇవన్నీ హనుమంతుడి గురించి పరిచయం చెయ్యాలంటే చెప్పాల్సిన గుణగణాలు. ఇన్ని సుగుణాలు కలిగినా కూడా ఏ డాంబికాలు పలకకుండా, తన గొప్పదనం ఏమీ లేదంటూ, అంతా ఆ ‘రామ మంత్ర మహిమ’ అని చెప్పడం ఎవరికి సాధ్యం?. రుద్రాంశ సంభూతుడు, అప్రమేయ శక్తిశాలి అయినా కూడా తన శక్తిని అంతా దాచుకుని వానర రాజైన సుగ్రీవుడికి మంత్రిగా సేవలు అందించడంలో ఎంత వినయం? కొద్దిపాటి అధికారానికే డాబూ దర్పం ఒలకబోసే మనబోటి వాళ్లం హనుమను చూసి చాలా నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా పాదాలు మాత్రం నేల మీదనే నిలపాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మనలోని శక్తిని ఎప్పుడు? ఎలా? ఉపయోగించాలో తెలియక అహంకారంతో ప్రవర్తించే వారెందరో? కానీ, అవసరమైనపుడు మాత్రమే, అది కూడా లోకకల్యాణం కోసమే తన శక్తిని ప్రదర్శించి, దానిని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు వినియోగించడం అనేది ఎంత గొప్ప విషయం? ఇలాంటి నిరహంకారం (అహంకారం లేకపోవడం) అనే మంచి లక్షణాన్ని, మరెన్నో సుగుణాలను మనం హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి.
మొత్తానికి ఒకే పర్వాన్ని రెండుసార్లు జరుపుకోవడం వల్ల పుణ్యమే కానీ, నష్టమేమీ లేదు. హనుమాన్‍ జయంతి రోజున ఆయనకు తమలపాకుల దండను సమర్పించాలి. తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తర శత నామ పూజ జరిపించాలి. ఆయనకు అరటిపండ్లు ప్రీతికరం. అందుకే జయంతి నాడు ఆయనకు వీటిని సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం కూడా నివేదించాలి. ఇంకా ఆయనకు ఎంతో ఇష్టమైన వడమాల, అప్పాల మాల సమర్పిస్తే కార్యసిద్ధి, జయం లభిస్తాయని శాస్త్ర వచనం. బెల్లం, శనగలు, బూందీ లడ్డూ కూడా హనుమంతుడికి ప్రీతికరమైన ప్రసాదాలు. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
హనుమజ్జయంతి నాడు సామూహిక హనుమాన్‍ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి. హనుమంతుడిని సింధూరంతో అభిషేకిస్తే కోరినవన్నీ అనుగ్రహిస్తాడని అంటారు.

వైశాఖ బహుళ ఏకాదశి/అపరైకాదశి
మే 13, బుధవారం

వైశాఖ బహుళ ఏకాదశిని అపరైకాదశి అని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటే పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన ఫలం, పలు రకాల దానఫలం కలుగుతుందని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

వైశాఖ బహుళ ద్వాదశి
మే 14, గురువారం

వైశాఖ బహుళ ద్వాదశి నాడే వృషభ సంక్రమణం. దీనినే వృషభ సంక్రాంతి అనీ అంటారు. ఇంకా ఈనాడు సుజన్మ వాప్తి వ్రతం. సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. కర్షకులు వృషభ సంక్రాంతి నిర్వహిస్తారు. ఇది, వైశాఖ బహుళ అమావాస్య గురువారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదం అంటారు.
ఇక, ఏటా మే 14న అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మాతృమూర్తులను స్మరించుకుని, గౌరవించుకోవాల్సిన ప్రత్యేక రోజు ఇది.

వైశాఖ బహుళ త్రయోదశి
మే 15, శుక్రవారం

వైశాఖ బహుళ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. అలాగే, ఈనాడు మాస శివరాత్రి.

వైశాఖ బహుళ చతుర్దశి
మే 15, శుక్రవారం

వైశాఖ బహుళ చతుర్దశి తిథి కూడా మే 15నే వస్తుంది. ఈనాడు ఉపవాసం ఉండి, ప్రదోషకాలంలో స్నానం చేసి, తెల్లని వస్త్రాలు ధరించి, గంధం మొదలైన ఉపచారాలతో, మారేడు దళాలతో శివలింగాల్ని పూజించాలి. ఈనాడు శివరాత్రి, సావిత్రీ వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు పిండితో శివలింగాన్ని తయారు చేసి పంచామృతాలతో స్నానం చేయించి కుంకుమ పూసి ధూప, దీప నైవేద్యాలతో పూజ చేయాలి. దీనికే లింగ వ్రతమని పేరు.

వైశాఖ బహుళ అమావాస్య
మే 16, శనివారం

వైశాఖ బహుళ అమావాస్య తిథితో వైశాఖ మాస తిథులు ముగుస్తాయి. ఈనాడు కృష్ణ పూజ చేయాలని, ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుని ఉవాచ. ఈనాడు ప్రయాగలో స్నానం పాపహరమని ప్రతీతి. త్రయోదశి నాడు ఆరంభించి ఈనాటితో సావిత్రీ వ్రతం పూర్తి చేయాలని పురుషార్థ చింతామణి గ్రంథంలో రాశారు. పితృదేవతలను పూజించడం, పార్వణ విధిలో శ్రాద్ధం దానం చేయడం ఈనాడు చేయాల్సిన ప్రధాన విధులు.

అధిక జ్యేష్ట శుద్ధ పాడ్యమి
మే 17, ఆదివారం

అధిక జ్యేష్ట మాస తిథులు ఈనాటి నుంచి ఆరంభం అవుతాయి. (ఈనాటి నుంచి ప్రారంభమయ్యే జ్యేష్ఠ మాస తిథుల్లో జ్యేష్ఠానికి ముందు ‘అధిక’ అని వ్యవహరించాలి). ఈనాడు కరవీర వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే భద్రచతుష్టయ వ్రతం కూడా చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. వసంతం ముగిసి గ్రీష్మ రుతువు ఈనాటి నుంచే ప్రారంభమవుతుంది. ఈ రుతు సమయంలో ఎండలు మండిపోతాయి. సూర్యుడు భూమికి దగ్గరగా ఉండటం వల్ల తీవ్రమైన వడగాల్పులు, వేడిగాలులు వీస్తాయి. పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిలోని పచ్చదనం కనుమరుగవుతుంది. నీటి వనరులు ఆవిరైపోతాయి. భూమి వేడెక్కుతుంది. మనుషులు, పశుపక్ష్యాదులు చల్లదనం కోసం పరితపిస్తారు. ఆయుర్వేద వైద్య విజ్ఞానం ప్రకారం ఈ కాలంలో కుండలలో నిల్వ చేసిన చల్లని నీళ్లు అధికంగా తీసుకోవాలి. పండ్లు.. ముఖ్యంగా మామిడిపండ్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

అధిక జ్యేష్ట శుద్ధ తదియ/రంభా వ్రతం
మే 19, మంగళవారం

అధిక జ్యేష్ట శుద్ధ తదియ నాటి వివరణలో మన పంచాంగ కర్తలు ‘రంభావ్రతమ్‍’ అని రాశారు. మరికొన్ని వ్రత గ్రంథాలు దీనినే ‘రంభాతృతీయ’ అని పేర్కొన్నాయి. రాజ్యవ్రతం, త్రివిక్రమ తృతీయ వ్రతం తదితర ఇతర వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని ఉంది. వీటన్నిటిలో రంభావ్రతమే కొన్నిచోట్ల ఆచరణలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకసారి తపోనిష్టలో ఉన్న శివుడికి సపర్యలు చేసేందుకు హిమవంతుడు తన కుమార్తె పార్వతిని శివుడికి అప్పగించాడు. పార్వతిపై ప్రేమ కలగడానికి మన్మథుడు శివుడిపై తన బాణాలు ప్రయోగించాడు. శివుడికి చిత్తం చెదిరింది. ఆపై కోపంతో తన మూడవ కన్ను తెరిచి చూశాడు. దీంతో మన్మథుడు భస్మమయ్యాడు. శివుడు అక్క• నుంచి వెళ్లిపోగా, పార్వతి చిన్నబుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి ఎదురుగా వచ్చి ఆమెను గుచ్చి కౌగిలించుకుంది. పార్వతి బావురుమంది. తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకెళ్లింది. ఇంతలో అక్కడికి సప్త మహా మునులు వచ్చారు. వారికి హిమవంతుడు తన కుమార్తె సంగతి చెప్పాడు. అప్పుడు ఆ మునులలో భృగువు- ‘బిడ్డా! ఒక వ్రతం ఉంది. దాన్ని ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు’ అన్నాడు. అప్పుడు పార్వతి కోరిక మేరకు ఆ వ్రతాచరణ గురించి భృగువు ఇలా చెప్పాడు.
‘రంభ అంటే అరటి చెట్టు. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు చేయాలి. ఆనాడు ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచవన్నెల ముగ్గు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కాబట్టి అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలి’ అని వివరించాడు.
అందు మీదట పార్వతి- ‘మహర్షీ! అరటి చెట్టుకు సావిత్రి అధిష్ఠాన దేవత ఎలా అయ్యింది?’ అని ప్రశ్నించింది.
‘బిడ్డా! అడగదగిన ప్రశ్న వేశావు. సావిత్రి, గాయత్రి అని బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రీదేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్లడం మానేసింది. గాయత్రి ఎంత చెప్పినా ఆమె వినలేదు. బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలి మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని ఆయన సావిత్రిని శపించాడు. అప్పుడు సావిత్రి పశ్చాత్తాప పడింది. అయినా బ్రహ్మ కరగలేదు. గత్యంతరం లేక సావిత్రి అరటి చెట్టుగా మారి ఐదేళ్ల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేసింది. అప్పటికి బ్రహ్మ మనసు కరిగింది. ‘నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు. అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు ఈడేరుతాయి. ఇక నీవు నాతో సత్యలోకానికి వచ్చేయవచ్చు’ అంటూ బ్రహ్మ ఆమెను తనతో తీసుకెళ్లాడు. సావిత్రికి శాప విమోచనం అయిన దినం కాబట్టి జ్యేష్ఠ శుద్ధ తదియ ఒక పర్వదినం అయ్యింది’ అని భృగువు వివరించాడు.
ఈ కథంతా విన్న పార్వతి- ‘మహర్షీ! అయితే ఈ వ్రతం నియమాలేమిటో దయచేసి తెలపండి’ అని కోరింది.
‘ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. దానిని సరస పదార్థ సంపన్నం చేయాలి. అరటి చెట్ల నీడన పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్తోత్రం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. మర్నాటి నుంచి రాత్రి జాగరణ అవసరం లేదు. పద్మాసనస్థ అయి పగలు సావిత్రి స్తోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్ల కిందనే విశ్రమిస్తూ ఉండాలి. ఇలా నెల రోజులు చేసి ఆ మీదట సరస పదార్థ సంపన్నమైన ఆ మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని గతంలో లోపాముద్ర చేసి భర్తను పొందింది’ అని భృగు మహర్షి వ్రత నియమాల గురించి వివరించాడు.
పార్వతి ఈ విధంగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దీక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్లాడాడు. ఇదీ రంభా వ్రతకథ.

అధిక జ్యేష్ట శుద్ధ చవితి
మే 20, బుధవారం

అధిక జ్యేష్ట శుద్ధ చవితి తిథి నాడు ఉమా చతుర్థీ వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం చెబుతోంది. అలాగే, ఈనాడు ఉమా పూజ చేయాలని కూడా అంటారు. ఇంకా ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథి గణేశ చతుర్థి అని, శుక్లాదేవి పూజ చేయాలని కూడా ఉంది.

అధిక జ్యేష్ట శుద్ధ పంచమి
మే 21, గురువారం

అధిక జ్యేష్ట శుద్ధ పంచమి తిథి పితృ దేవతలను పూజించడానికి మంచి ఉద్ధిష్టమైన దినమని పంచాంగకర్తల ఉవాచ. కాబట్టి ఈనాడు స్వర్గంలో ఉన్న పితృదేవతలను యథాశక్తి పూజించాలి.

అధిక జ్యేష్ట శుద్ధ షష్టి
మే 22, శుక్రవారం

అధిక జ్యేష్ట శుద్ధ షష్టి నాడు అరణ్యాల్లో, కొండల్లో గౌరీదేవిని పూజించే వారికి సౌభాగ్యం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈనాడు ఇంకా ఆరణ్యక షష్ఠి, స్కంద షష్ఠి, వింధ్యేశ్వర పూజ, అరణ్యగౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ వంటి వాటిని ఆచరించాలని వ్రత గ్రంథాల్లో ఉంది. అలాగే, షష్ఠి తిథి నాడు కుమారస్వామిని విశేషంగా ఆరాధిస్తారు.

అధిక జ్యేష్ట శుద్ధ సప్తమి
మే 23, శనివారం

అధిక జ్యేష్ట శుద్ధ సప్తమి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఇంకా వరుణ పూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

అధిక జ్యేష్ట శుద్ధ అష్టమి
మే 24, ఆదివారం

ఇది దుర్గాష్టమి తిథి. ఈనాడు త్రిలోచనాష్టమి కూడా ఆచరిస్తారు.

అధిక జ్యేష్ట శుద్ధ నవమి
మే 25, సోమవారం

జ్యేష్ఠ శుద్ధ నవమి తిథి నాడు బ్రహ్మణీ నామ్యా ఉమాయా పూజ, శుక్లాదేవి పూజ ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాటి నుంచే రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. రోహిణీ కార్తె నాటికి ఎండలు మరింత ముదురుతాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండ కాస్తుందని నానుడి.

అధిక జ్యేష్ట శుద్ధ దశమి/దశపాపహర దశమి
మే 26, మంగళవారం

దశమి తిథితో ముడిపడి మనకు రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి- జ్యేష్ఠ శుద్ధ దశమి. రెండు- ఆశ్వయుజ శుద్ధ దశమి. మొదటిది దశపాపహర దశమి. రెండవది విజయదశమి. రెండూ కూడా పది రోజుల పర్వాలే. పాడ్యమితో మొదలై దశమితో ముగుస్తాయి.
దశపాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. పది పాపాలను పోగొట్టడానికి సమర్థమైన ఈ వ్రతం జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు చేస్తారు. ఈనాడు ఏ నదిలో స్నానం చేసినా విశేష ఫలాన్నిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే ఇంకా గొప్ప పుణ్యప్రదం. కాశీలోని దశాశ్వమేథ ఘాట్‍లోని గంగాస్నానం మరీ పుణ్యం. గంగావతరణ ఈనాడేనని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. జ్యేష్ఠ శుక్ల దశమి, బుధవారం హస్తా నక్షత్రం కాలంలో గంగావతరణ జరిగిందని వ్రతోత్సవ చంద్రికాకారుడు చెబుతున్నాడు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో కూడా ఉందని అంటారు. జ్యేష్ఠ శుక్ల దశమి సౌమ్యవారంతో హస్తా నక్షత్రంతో కలిసి వచ్చిన నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వపాపాలు సమసిపోతాయని నమ్మిక. కాగా, వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణ జరిగినట్టు గ్రంథాంతరాల్లో ఉంది. మొత్తానికి జ్యేష్ఠ శుక్ల దశమి గంగావతరణ దినమైనా కాకున్నా ఈ పర్వం గంగానదిని ఉద్దేశించి చేయబడేది కావడం మాత్రం విశేషం. జ్యేష్ఠ శుద్ధ దశమి వ్రత విధానం గురించి స్కంధ పురాణంలో ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి కొందరికి సంవత్సరాది దినం కూడా. ఈనాడు స్నానం, దానం ముఖ్యమైనవి. పాడ్యమి మొదలు దశమి వరకు స్నానం చేయడం కూడా ఈ పర్వం విధులలో భాగమే. ఈ ఉత్సవాన్ని గంగోత్సవమని కూడా అంటారు.
ఇక, గాయత్రి మాత జయంతి కూడా ఈ తిథి నాడేనని భావిస్తారు. సకల మంత్రాలకు మూలమూర్తి గాయత్రిదేవి. ఈనాడు ఆమెను విశేషంగా ఆరాధిస్తారు.
జ్యేష్ఠ శుద్ధ దశమి కొందరికి సంవత్సరాది దినంగానూ పరిగణనలో ఉంది. ఈనాడు వారు స్నానం, దానం చేయడాన్ని ముఖ్యమైన విధులుగా భావిస్తారు.

అధిక జ్యేష్ట శుద్ధ ఏకాదశి/నిర్జన ఏకాదశి
మే 27, బుధవారం

అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు గంగోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో ఎండలు మెండుగా ఉంటాయి. భూమిలో నీటి మట్టం చాలా లోతుకు పోతుంది. అటువంటి గడ్డు వేసవిలో ఈ ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లయినా పుచ్చుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుచేతనే దీనికి నిర్జలైకాదశి అనే పేరు వచ్చింది. ఈ నిర్జలైకాదశి ఆదిలో భీముని వల్ల ఏర్పడినట్టు పురాణగాథ ఉంది. భీముడు తిండిపోతు. ఒక్కపూట కూడా తిండి లేకుండా ఉండలేడు. అందుచేత దశమి నాడు ఏకభుక్తం మాత్రం చేసి ఏకాదశి నాడు ఒకపూట అయినా భోజనం లేకుండా అతడు ఉండలేడు. దీంతో అతను వ్యాసుడిని సంప్రదించాడు. అప్పుడు వ్యాసుడు అతనితో ‘నీవు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నీళ్లు కానీ, అన్నం కానీ తినకుండా ఉండు. ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలను చేసిన ఫలితం నీకు సమకూరుతుంది’ అని చెప్పాడు. భీముడు అలాగే చేశాడు. ఏడాదికి ఒక వ్రతాన్ని చేసి భీముడు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాల ఫలాన్ని పొందాడు. ఈ ఏకాదశి అంత మహత్తయినది.
మే 27, భారత తొలి ప్రధాని జవహర్‍లాల్‍ నెహ్రూ వర్ధంతి దినం.

అధిక జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
మే 28, గురువారం

జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి తిథి చంపక ద్వాదశి పర్వమని గదాధర పద్ధతి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు త్రివిక్రమ పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అంటే వామనుడిని ఈనాడు పూజించాలి. అలాగే, ఈ తిథి రామలక్ష్మణ ద్వాదశిగానూ ప్రసిద్ధి. ఈనాడు కూర్మ జయంతి ఆచరిస్తారు. శ్రీశంకరాచార్య కైలాస గమనం కూడా ఈనాడే జరిగింది. ఈనాడు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈనాటి తిథి కాలాన్ని కర్తరీ త్యాగమని వ్యవహరిస్తారు.

అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
మే 29, శుక్రవారం

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వివిధ పూజల ఆచరణకు మంచి ముహూర్త సమయం. ఇది మూడు వ్రతాలు చేసే ముహూర్త తిథిగా చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు.
వీటిలో ఒకటి- దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం.
మిగతా రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం పర్యాప్తమై సాగేవి. వాటి పేర్లు- జాతి త్రిరాత్రి వ్రతం, రంభా త్రిరాత్రి వ్రతం. రెండో వ్రతాన్ని రాత్రి ప్రారంభించి, అరటి చెట్టు కింద ఉమామహేశ్వరులను పూజించాలని వ్రత నియమం.
అలాగే, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి- విద్యారణ్యుల ఆరాధన దినం కూడా. విద్యారణ్యుల వారు ఈ తిథి నాడే సిద్ధి పొందారు. విద్యారణ్య స్వామి వేదత్రయ భాష్యకర్త. విద్యానగరమును, విద్యానగర సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు. లౌకికం, వైదికం.. రెండింటా అసమాన ప్రతిభ గలవారీయన. ఆయనకు వివేకం తెలిసే సరికి ఉత్తర హిందుస్థానమంతా మహ్మదీయుల వశమైంది. దక్షిణాదినా అన్య మతస్తులు అక్కడక్కడా అడుగుపెట్టారు. ఇవి విద్యారణ్యస్వామిని కలతపెట్టాయి. అప్పుడు ఆయన తుంగభద్ర నదీ తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సును గాయత్రీ మంత్రంతో ప్రారంభించాడు. అమ్మవారు ప్రసన్నరాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకొమ్మనగా, ఐశ్వర్యం కోరుకున్నాడు. అమ్మ వారు అది వీలు కాదంది. దీంతో అక్కడికక్కడే విద్యారణ్య పేరుతో సన్యసించి శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించాడు. విరూపాక్ష పీఠం నెలకొల్పినది ఈయనే. హరిహర రాయలు, బుక్కరాయలుకు కొంతకాలం ఈయన మంత్రిగానూ ఉన్నారు.
విద్యారణ్య స్వామి ఆంధ్రుడా, ద్రవిడుడా, కర్ణాటకుడా, మహారాష్ట్రుడా అనే సందేహం ఉంది. ఆయన జాతి విషయమై వివరణ ‘విద్యారణ్య చరిత్ర’లో ఉంది. ఆయన ఆంధ్రుడే అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆది శంకరుల తరువాత అంతటి వారు విద్యారణ్య స్వామి. ఆది శంకరుడు కశ్మీరం నుంచి శృంగేరికి తెచ్చిన శారదా విగ్రహం చందన ప్రతిమను విద్యారణ్య స్వామి తన హయాంలో పంచలోహాలతో తయారు చేయించి పూర్ణకుంభాలతో అభిషేచనం చేశారు. ఆ విగ్రహమే నేటికీ శృంగేరీ పీఠంలో పూజలందుకుంటోంది.

అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి
మే 30, శనివారం

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశికి చంపక చతుర్దశి అని మరోపేరు కూడా ఉంది. ఈనాడు వాయు వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే రుద్ర వ్రతం కూడా ఆచరిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ/ ఏరువాక పూర్ణిమ
మే 31, ఆదివారం

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తెలుగునాట ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి. మన పంచాంగంలో జ్యేష్ఠ పూర్ణిమ నాటి వివరణలో ‘వృషభ పూజా, హల ప్రవాహ’ తదితర పదాలు ఉన్నాయి. ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని ఈ పదాలకు గల అర్థాలను బట్టి తెలుస్తోంది.
ఏరువాక అంటే వివిధ అర్థాలున్నాయి.
ఏరు= సర్వావయవములు గల నాగలికి ఎడ్లను కట్టినది, సర్వావయములు గల నాగలి.
ఏరువాక= దున్నుటకు ఆరంభం.
శబ్ద రత్నాకరం నిఘంటువులో పేర్కొన్న ప్రకారం..
ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధంచేసిన నాగలి.
ఏరువాక= దుక్కి యొక్క ప్రారంభం.
ఈ రెండు అర్థాలను విశదీకరించి చూస్తే ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పర్వమని స్పష్టంగా తెలుస్తోంది.
ఏరువాక పున్నమిని వర్ష రుతువు ఆరంభంలో ఆచరిస్తారు. ఈ సమయంలో వర్షాలు కురిసి భూమి పదునెక్కితే పునర్వసు కార్తెలో పునాస విత్తనాలను జల్లుతారు. ఈ పని పునర్వసు కార్తెలో జరుగుతుంది కాబట్టే ఈ కాలంలో పండే పంటను పునాస పంట అంటారు.
ఏరువాక పండుగ నాడు రైతులు ఎద్దులను
శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. గజ్జెలు, గంటలు, అద్దం, కుచ్చులు తదితరాలను ఎద్దులకు అలంకరిస్తారు. ఉదయాన్నే ఇంట్లో పొంగలి (పులగం) వండి ఎద్దులకు పెడతారు. ఎద్దులను కట్టి ఉంచే కాడికి ధూపదీప నైవేద్యాలు ఇస్తారు. సాయంకాలం తప్పెట, మేళం తదితర మంగళవాద్యాలతో ఎద్దులను ఊరి బయటకు తోలుకుని వెళ్తారు. ఊరి పొలిమేరలో పుంటినారతో చేసి తోరణాన్ని కడతారు. ఈ తోరణాన్ని రైతులు తమ చర్నాకోలలతో కొట్టి పీచుపీచు చేసి ఎవరికి దొరికిన పీచు వారు తీసుకునిపోతారు. దానిని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది పశువులకు మేలు కలిగిస్తుందనేది వారి నమ్మకం.
కన్నడనాట కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఇదే మాదిరిగా ఎద్దులను పూజిస్తారు. ఈ పర్వాన్నే వారు ‘కారుణిపబ్బ’ అని పిలుస్తారు.
ఏరువాక పున్నమ పూర్వ కాలం నుంచి ఆచరణలో ఉన్న పర్వం. మనది వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో అనాదిగా ఇది ఆచారంగా వస్తోంది.
ఎద్దులతో మన రైతులది అవినాభావ సంబంధం.
‘ఎద్దులు లేని సేద్యం చద్దిలేని పయనం’
‘ఒంటి ఎద్దుసేద్యం వరిగాలు నొప్పి’
‘గొడ్లు, వడ్లు ఉన్న వాడిదే వ్యవసాయం’
‘ఎక్కువ వెల పెట్టి గుడ్డను తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూడదు’
తెలుగు నాట ప్రాచుర్యంలో గల ఈ సామెతలన్నీ ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేవే.
ఈ తిథి నాటికి బండలు పగిలే భరణి కార్తె ఎండలు, రోళ్లు పగిలే రోహిణి కార్తె ఎండలు తగ్గుతాయి. మృగశిర కార్తెతో ముంగిళ్లు చల్లబడతాయి. ఆపై ఆరుద్ర వాన అదును వాన. ఇది వ్యవసాయానికి అనువైన కాలం. రోహిణిలో విత్తనాలు చల్లితే రోళ్లు కూడా నిండని అల్ప పంట చేతికందుతుందని మన రైతుల నమ్మకం.
ఇక, జ్యేష్ఠ పూర్ణిమ.. సావిత్రీ వ్రతాచరణ దినం కూడా. ఈనాడు బంగారంతో కానీ, మట్టితో కానీ సావిత్రీ, సత్యవంతుల ప్రతిమలను చేసి యథాశక్తి పూజించాలి. ఆ రాత్రి సావిత్రి చరిత్ర వింటూ జాగారం చేయాలి. తెల్లవారిన తరువాత సావిత్రి ప్రతిమను దక్షిణసహితంగా దానం చేయాలి. ఇది స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతం. ఇంకా ఈనాడు తిలచ్ఛత్రాదిదానం, బిల్వత్రిరాత్రి, పుత్రకామ, అశోకత్రిరాత్ర తదితరమైన వ్రతాలు కూడా చేస్తారని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఆమాదేర్‍ జ్యోతిషి అనే గ్రంథంలో ఈ వ్రతాన్ని గురించి స్నాన పూర్ణిమ వ్రతంగా పేర్కొంది.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు వట పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనినే వట సావిత్రీ వ్రతం అనీ అంటారు. వివాహితలైన స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పర్వాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటారు. స్త్రీలకు వైధవ్యం రాకుండా ఈ పర్వం చేస్తుందని అంటారు. ఇది మూడు రోజుల వ్రతం. త్రయోదశి నాడు మొదలుకుని పౌర్ణమి వరకు ఉపవసిస్తారు. కొందరు పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వట అంటే మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఈనాడు పూజలు చేస్తారు. మర్రిచెట్టుకు దారం చుడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్నిస్తాయి.
కాగా, కబీరుదాసు జయంతి తిథి కూడా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడే.

జ్యేష్ఠం.. ఏ ఆహారం శ్రేష్ఠం?
జ్యేష్ఠ మాసంలో కొన్ని ఆహార నియమాలను పాటించాలి. మే 17, 2026 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ఆరంభమవుతుంది. ఆయుర్వేద గ్రంథాలలోనూ, ఇతర భారతీయ సంప్రదాయ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఈ మాసంలో ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదో వివరించారు. రుతువులను బట్టి తీసుకోవాల్సిన ఆ ఆహార నియాలను తెలుసుకుందాం.
తెలుగు పంచాంగాల ప్రకారం జ్యేష్ఠం నెలల వరుసలో మూడవది.

చైత్ర మాసంలో బెల్లం, వైశాఖ మాసంలో నూనె, జ్యేష్ఠ మాసంలో మిరపకాయలు, ఆషాఢ మాసంలో పప్పులు, శ్రావణ మాసంలో పచ్చిమిర్చి, భాద్రపద మాసంలో పెరుగు ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు. ఇంకా కార్తీక మాసం, పుష్య మాసంలో ధనియాలు, మాఘ మాసంలో పంచదార, ఫాల్గుణ మాసంలో పప్పు దినుసులను ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాలానుగుణంగా తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు ప్రమాదకరమైన వ్యాధులను నిరోధించవచ్చు.
జ్యేష్ఠ మాసంలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నూనెలు, మసాలాలతో తయారయ్యే ఆహారానికి ఈ కాలంలో దూరంగా ఉండాలి.

జ్యేష్ఠ మాసంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి మహాభారతంలో కూడా కొన్ని వివరాలున్నాయి. దాని ప్రకారం..

జ్యేష్ఠ మూలం తు యో మస్మేకభక్తేన్‍ సంక్షిపేత్‍ ।
ఐశ్వర్యమతులం శ్రేష్ఠం పుమంస్త్రి వా ప్రపద్యతే ’’
అంటే- జ్యేష్ఠ మాసంలో రోజుకు ఒక్కసారే భోజనం చేయాలి. ఇది మనిషిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది అని పై శ్లోకానికి భావం.
జ్యేష్ఠ మాసంలో ఆ కాలంలో లభించే పండ్లు, ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో ఎక్కువ భాగం చేసుకోవాలి. ముఖ్యంగా మామిడిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలను చేర్చుకోవాలి. పెరుగు, మజ్జిగ, లస్సి, పండ్ల రసాల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు దట్టించిన ఆహారం వేసవిలో అధిక వేడిని కలిగించి ఒంట్లోని శక్తినంతా పీల్చేస్తుంది. అలాగే, స్పైసీ ఫుడ్‍ మైకం లేదా నరాల సమస్యలకు కారణమవుతుంది.
జ్యేష్ఠ మాసంలో వంకాయను అసలు ఆహారంలో భాగం చేసుకోకూడదని చెబుతారు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందట. ఆర్థరైటిస్‍ అవకాశాలను పెంచుతుంది. అలాగే బెండకాయ
కూడా ఈ కాలంలో ఎక్కువగా తినకూడదని అంటారు.

అధిక (పురుషోత్తమ) మాసం
మన కాల గణన జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుడిని ఆధారంగా చేసుకుని లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అనీ, చంద్రుడిని ఆధారంగా చేసుకుని లెక్కగట్టే కాలమానాన్ని చంద్రమానం అనీ వ్యవహరిస్తారు. చాంద్రమానంలో నెలకు 29.53 రోజులుగా లెక్కగడతారు. ఈ లెక్క ప్రకారం చాంద్రమానంలో వచ్చేవి సంవత్సరానికి 354 రోజులే. ఇక, సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులు. అంటే చాంద్ర, సౌరమానాలకు మధ్య సంవత్సరంలో పదకొండు రోజుల తేడా ఏర్పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడం కోసం ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దీనినే అధికమాసం లేదా పురుషోత్తమ మాసం అనీ వ్యవహరిస్తారు.
అధిక మాసం సమయంలో పండుగలు, వ్రతాలు ఒక నెల ముందుకు జరుగుతాయి. ఈ ఏడాది 2026 సంవత్సరంలో ఈ అధికమాసం జ్యేష్ఠ మాసంలో వచ్చింది. దీంతో కొన్ని పండుగుల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ అధిక మాసం మే 17, 2026న ప్రారంభమై, జూన్‍ 15, 2026 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో సూర్య సంక్రాంతి సరిగా ఉండదని అంటారు. అందువల్ల అధిక మాసాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. అధిక వ •సం సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు,
ఉపనయనాలు ఇతర శుభకార్యాలను నిర్వహించరు. ఈ కాలంలో వీటిని చేపట్టడం అంతగా మంచిది కాదని పండితులు చెబుతారు. పితృకార్యాలను సైతం అధిక మాసంలో కాకుండా నిజమాసంలోనే జరపాలని అంటారు. అయినా
కూడా అధిక మాసానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకున్నా ఆధ్యాత్మిక కార్యకలాపాలు, దానధర్మాలకు శ్రేష్ఠమైన కాలమని చెబుతారు. ఆయా తిథానుసారం ఆయా పర్వాలను జరుపుకోవచ్చు.
పురుషోత్తమ మాసమని ఎందుకు అంటారంటే..

అధిక మాసం శ్రీమహావిష్ణువు ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసం. అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసమని కూడా పిలుస్తారు. ఈ మాసానికి పేరును మహావిష్ణువే ప్రసాదించాడనీ, అధిక మాసంలో చేపట్టే దైవకార్యాలకు అనంతమైన ఫలాలు లభించేలా వరమిచ్చాడని పురాణాల్లో ఉంది. ఒకసారి అధిక మాసం మహిమ గురించి లక్ష్మీదేవి అడిగినపుడు, పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు, జపం, హోమం, దానం వంటివి ఆచరిస్తారో వారికి మిగిలిన సాధారణ (నిజ) మాసాల కన్నా అనేక రెట్ల ఫలితం లభిస్తుందని విష్ణువు చెప్పాడట. అధిక మాసం అశుభమని భావించి పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో అనేక అవరోధాలు కలుగుతాయని కూడా చెప్పినట్టు పురాణ కథలు ఉన్నాయి.
పుణ్యకార్యాలకు ఈ తిథులు అనుకూలం..

అధికమాసంలో వచ్చే శుక్లపక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి తిథి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో పుణ్యకార్యాలు ఆచరించవచ్చని చెబుతారు. వీరికి అపార పుణ్యఫలం కలుగుతుంది. ముఖ్యంగా అధికమాసంలో శ్రీమహావిష్ణువు ఆరాధన, విష్ణు సహస్ర నామ పారాయణం, ఏకాదశి ఉపవాసాలు ఆచరించడం, వ్రతాలు, దీక్షలు చేపట్టడం వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చని పెద్దలు చెబుతారు.

Review మాసం.. విశేషం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top