ఆంగ్లమానం ప్రకారం తొమ్మిదవ నెల సెప్టెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ – భాద్రపద మాసాల కలయిక. శ్రావణ మాసంలోని కొన్ని రోజులు, భాద్రపద మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో ఉంటాయి. అటు వినాయక చవితి.. ఇటు శ్రీకృష్ణాష్టమి.. ఆబాలగోపాలానికీ ఆధ్యాత్మికానందాన్ని పంచే రెండు ప్రధాన పర్వాలు ఒకే మాసంలో రావడం విశేషం. సెప్టెంబరు 1, మంగళవారం నుంచి సెప్టెంబరు 11, శుక్రవారం వరకు శ్రావణ మాస తిథులు, ఆపై సెప్టెంబరు 12, శనివారం నుంచి సెప్టెంబరు 30, బుధవారం వరకు భాద్రపద మాస తిథులు ఉంటాయి. ఇంకా రుషి పంచమి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మహాలయ పక్షం ప్రారంభం వంటి పర్వాలు ముఖ్యమైనవి.
2026- సెప్టెంబరు 1, మంగళవారం, శ్రావణ బహుళ చవితి నుంచి
2026- సెప్టెంబరు 30, బుధవారం, భాద్రపద బహుళ చవితి వరకు
శ్రీ పరాభవ నామ సంవత్సరం – శ్రావణం/ భాద్రపదం/
వర్ష రుతువు – దక్షిణాయణం
అటు శ్రావణ శోభ.. ఇటు భాద్రపద ప్రభ.. ఒకపక్క వినాయక చవితి.. ఇంకోపక్క ఆబాల గోపాలానికి ఇష్టమైన కృష్ణాష్టమి.. శ్రావణ, భాద్రపదాల కలయికలోని సెప్టెంబరు మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుంది.
భాద్రపద మాసం విశేషాల్లోకి వెళ్తే… భాద్రపద మాసం ఆధ్యాత్మికంగా విశిష్టమైనది. అసలు ఆదిలో కలియుగం భాద్రపద మాసంతోనే మొదలైందనే వాదనలు కూడా ఉన్నాయి. అందుకేనేమో నిజానికి మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలోని ప్రధాన పర్వాలన్నీ ఈ మాసం నుంచే ఆరంభమవుతాయని అంటారు. మిగతా పండుగలకు మనల్ని సన్నద్ధం చేసి మనకు శుభాలు (భద్ర) కలిగేలా చేస్తుంది కాబట్టి ఇది భద్రమాసం. అదే భాద్రపదం అయ్యింది. వినాయకుడికి ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసం నుంచి మొదలయ్యే పండుగలన్నింటికీ మనల్ని సన్నద్ధం చేసి, ఆయా రోజుల్లో ఆయా దేవతల్ని కొలిచేందుకు, వారి ఆరాధనలో మనకు విఘ్నాలు రాకుండా ఉండేందుకు గణపతిని మొదట పూజించాలి. ఆబాల గోపాలానికి ఇష్టమైన వినాయక నవరాత్రోత్సవాలతో భాద్రపద మాసంలో ఎటుచూసినా ఉత్సవ వాతావరణమే కనిపిస్తుంది. ఊరూరా సందడి నెలకొంటుంది.
మన తెలుగు మాసాలలో ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మం ఉంది. ఆ వరుసలో ఆరోగ్యానికి భద్రత కల్పించేది- భాద్రపదం. భాద్రపదంలో వర్షాలు ధారాళంగా కురుస్తాయి. నేలంతా చిత్తడిగా మారుతుంది. రోగాలు ముసురుకుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి తగిన ఆహార నియమాలతో ఈ మాసంలో వివిధ వ్రతాలు, నోములను మన పెద్దలు నిర్దేశించారు.
ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం ఆయా మాసాల ప్రత్యేకత. ఈ క్రమంలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడు చంద్రుడు ఆయా నక్షత్రాల్లో ఉంటే అది భాద్రపద మాసం అవుతుంది. తెలుగు నెలల వరుసలో ఇది ఆరవది. పూర్తి వర్ష రుతువు. వానలు మెండుగా పడతాయి. ఈ మాసంలో గృహ నిర్మాణం ఆరంభించరాదని మత్స్య పురాణం చెబుతోంది. ఆషాఢం తరువాత మళ్లీ భాద్రపద మాసంలోనే ఆడపిల్లలు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయేది. భాద్రపదంలో వచ్చే పర్వాల్లో ఆయా దేవతలకు నివేదించే ప్రధాన నైవేద్యం ఉండ్రాళ్లు. వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు. సెప్టెంబరు నెలలో ఉండే వాతావరణం రీత్యా ఉండ్రాళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వినాయకుడికీ ఇవంటే ఎంతో ప్రీతి. మన పెద్దలకు, పితరులకు ప్రత్యేక పూజలు చేయడానికి అవకాశం కల్పించే మహాలయ పక్షం ఈ నెలలోనే వస్తుంది. ఈనాడు విరివిగా దానాలు చేయడం రివాజు. ఈ నెలలో వచ్చే పర్వాలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం.
శ్రావణ బహుళ చవితి
సెప్టెంబరు 1, మంగళవారం
శ్రావణ బహుళ చవితి నాడు సంకష్ట హర చతుర్థీ(చవితి ఉదయం 7.32 వరకు వుంది) వ్రతం ఆచరించాలి. దీనికే ‘బహుళా చతుర్థి’ అనే పేరు కూడా ఉంది. ఇది గణపతి సంబంధ పూజ. అలాగే, ఈనాడు గోపూజ చేయాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించే సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. శివుడు, రావణుడు, రాముడు, ధర్మరాజు, పార్వతి, దమయంతి, అహల్య తదితరులు గణపతిని ఉద్దేశించి సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించినట్టు వ్రత కల్పంలో ఉంది.
శ్రావణ బహుళ పంచమి
సెప్టెంబరు 2, బుధవారం
శ్రావణ బహుళ పంచమిని రక్షా పంచమిగా వ్యవహరిస్తారు. ఈనాడు రక్షా పంచమి వ్రతం ఆచరించాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈనాడు నాగపూజ ఆచరిస్తారు.
శ్రావణ బహుళ షష్ఠి
సెప్టెంబరు 2, బుధవారం
శ్రావణ బహుళ పంచమి తిథి ఘడియల్లోనే షష్ఠి తిథి కూడా కూడి ఉంది. శ్రావణ బహుళ షష్ఠి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో రాశారు. హలం అంటే నాగలి. ఇది శ్రీకృష్ణుడి అన్నగారైన బలరాముడి ఆయుధ చిహ్నం. ఇది వ్యవసాయ పనిముట్టు. అందుకే బలరాముడిని వ్యవసాయానికి ఆద్యుడిగా కొలుస్తారు. అందుకే ఈనాడు బలరామ జయంతిగా కూడా ప్రసిద్ధి. కర్షకులకు నాగలే దైవం. దానిని పూజించడానికి శ్రావణ బహుళ షష్ఠి ఒక అనువైన పర్వదినం.
శ్రావణ బహుళ సప్తమి
సెప్టెంబరు 3, గురువారం
శ్రావణ బహుళ సప్తమి నాడు శీతలా సప్తమి వ్రతం ఆచరించాలని అంటారు. పార్వతీదేవి అవతారంగా శీతలాదేవిని భావిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. ‘శీతల’ అంటే చల్లదనం అని అర్థం. వేడి వల్ల వచ్చే రోగాల నుంచి ఈమె చలువ కలుగచేస్తుందని నమ్ముతారు. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే జ్వరాలు, అపరిశుభ్రత వల్ల వచ్చే వ్యాధులు తొలగిపోతాయని, ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం. ఉదయాన్నే స్నానం చేసి శీతలాదేవిని పూజించాలి. ముందు రోజు రాత్రి వండిపెట్టిన నైవేద్యాలను నివేదించాలి. ఆమెకు చల్లటి ఆహార పదార్థాలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలనేది ఒక నియమం. సప్తమి రోజు ఇంట్లో పొయ్యి వెలిగించకుండా క్రితం రాత్రి వండుకున్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
శ్రావణ బహుళ అష్టమి
సెప్టెంబరు 4, శుక్రవారం
శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ తిథి కృష్ణుని జన్మతిథి. కాబట్టి ఇది జన్మాష్టమి గానూ ప్రసిద్ధి. కృష్ణాష్టమిని మహారాష్ట్రలో బుద్ధాష్టమిగా వ్యవహరిస్తారు. ఈనాడు మంగళ గౌరీ వ్రతం జరుపుతారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. కాలాష్టమి, కృష్ణ జయంతి, శ్రీ జయంతి అనే పేర్లూ వ్యావహారికంలో ఉన్నాయి. కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలంలో శుక్ల సంవత్సరం, శ్రావణ మాసం బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు రెండు యాయముల రాత్రి వేళ కారాగారంలో మేనమామ గండాన పుట్టాడు. కాబట్టి ఈ అష్టమి నాడు పగలంతా ఉపవసించి, సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తారు. కృష్ణాష్టమి నాడు తిలామలక పిష్టం ఒంటికి పట్టించుకుని స్నానం చేయాలి. తులసీ దళాలు వేసిన నీటితో ఆచమించాలి. ఆనాడు ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఇంటి మధ్యలో గోమయంతో అలికి రంగవల్లి తీర్చిదిద్దాలి. దాని మీద బియ్యం పోసి మంటపం ఏర్పరిచి నూతన కుంభం ఉంచాలి. ఈ కొత్త కుండను గంధపుష్పాక్షలతో అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమను ప్రతిష్ఠించాలి. తొలుత దేవకీదేవిని ప్రార్థించి, ఆపై కృష్ణ ప్రార్థన చేయాలి. అర్ధరాత్రి వరకు పూజ నిర్వహించాలి. పాలు, పెరుగు, వెన్న నైవేద్యంగా ఉంచాలి. చంద్రోదయ సమయాన బయటకు వెళ్లి అక్కడ అలంకృతమైన భూమిలో ఫలపుష్ప చందనయుతమైన శంఖంతో ఉదకం గ్రహించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత శంఖంతో నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ రాత్రి భగవత్కథలు వింటూ జాగరణం చేసి మర్నాడు భోజనం చేయాలి. ఇది కృష్ణాష్టమి నాటి విధాయ కృత్యం.
ఈనాడు చాలాచోట్ల ఉట్టి కొట్టే పండుగను సరదా సంతోషాల మధ్య నిర్వహించడం ఆచారంగా వస్తోంది. వీధులలో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇదే ఉట్ల పండుగగానూ ప్రసిద్ధి. కృష్ణ జయంతి నాడు ఉపవసించి ఆయనను పూజిస్తే సకల పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడిని పూజిస్తే ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, మహా జయం కలుగుతాయని స్కంద పురాణోక్తి. కృష్ణ జయంతిని ఆచరించని వారు మహా పాపాన్ని పొందుతారని, యమపాశంలో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, క్రూర రాక్షసులుగా జన్మిస్తారని స్కాందాది పురాణాల్లో ఉంది. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యమివ్వాలని, బంగారంతో కానీ, వెండితో కానీ ద్వాదశాంగుల విస్తారమైన చంద్రబింబం చేసి వెండి, బంగారుపాత్రలలో దానిని ఉంచి, పూజించి అర్ఘ్యమివ్వాలని, అలా చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో ఉంది.
కృష్ణావతారం దశావతారాల్లో 8వది. కృష్ణ చరితం హరివంశ భాగవత విష్ణు పురాణాల్లో విపులంగా ఉంది. ఆబాల గోపాలానికి కృష్ణుని లీలలు, కొంటె చేష్టలు తెలిసినవే. కృష్ణుడు లోకోత్తర సుందరమూర్తి. మహా బల పరాక్రమశాలి. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం- భగవద్గీత. కృష్ణుని కాలంలో కంసుడు, నరకాసురుడు, కాలయవనుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన రాజులు ఎవరికి వారు చక్రవర్తులమని, రాజాధిరాజులమని చెప్పుకొంటూ దుష్పరిపాలన సాగించేవారు. కృష్ణుడు తాను రాజ్యాధికారం కోరక, పాండవులచే మిగతా రాజులను హతులను చేయించి ధర్మరాజును పట్టాభిషిక్తుడిని చేశాడు.
కృష్ణుడు జన్మించిన తిథి ఘడియలు కృష్ణాష్టమి అయితే, మహాశక్తి యోగమాయ జన్మించిన అదే తిథి కాలాష్టమి తిథి అయ్యింది. కృష్ణుడు పుట్టిన సమయానికే నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహా శక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనాడు ‘ఆస్థానం’ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది ఏటా రెండుసార్లు జరుగుతుంది. తిరుమల ఆలయ లెక్కలు, జమాఖర్చుల వివరాలను శ్రీవారి పాదాల చెంతన ఉంచుతారు. అలాగే తిరుమల గోశాలలో గోపూజలను నిర్వహిస్తారు.
శ్రావణ బహుళ నవమి
సెప్టెంబరు 5, శనివారం
శ్రావణ బహుళ నవమి తిథి నాడు చండికా పూజ నిర్వహించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అలాగే, ఈ తిథి అరవింద యోగి జనన తిథి కూడా. భారతీయ యోగి పరంపరలో అరవింద యోగి ప్రముఖులు. ఈ తిథి నాడు కౌమార పూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.
అలాగే, సెప్టెంబరు 5న భారతదేశంలో ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. దీనినే గురుపూజోత్సవం అనీ అంటారు. తమకు చదువుసంధ్యలు చెప్పిన ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవభావంతో సన్మానించడం, సత్కరించడం ఈనాటి ప్రధాన విధి.
శ్రావణ బహుళ ఏకాదశి
సెప్టెంబరు 7, సోమవారం
శ్రావణ బహుళ ఏకాదశి తిథి అజైకాదశి. ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథం ఈ ఏకాదశి తిథిని అజైకాదశిగా పేర్కొంది. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయిన హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ (బహుళ) ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. తత్ఫలితంగా ఆయన తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడని అంటారు.
ఇంకా, ఈనాడు కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కామికా వ్రతం చేయబడే దినం కావడం చేత ఈ తిథిని ‘కామికా ఏకాదశి’ అని కూడా అంటారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి తెలుగు క్యాలెండర్లో ఈనాడు ‘సర్వ ఏకాదశి’గా పేర్కొన్నారు.
శ్రావణ బహుళ ద్వాదశి
సెప్టెంబరు 8, మంగళవారం
శ్రావణ బహుళ ద్వాదశి తిథి రోహిణీ ద్వాదశీ తిథి అని వ్రత గ్రంథాలలో ఉంది. అంతకుమించి ఇతర వివరాలేవీ లేవు.
శ్రావణ బహుళ త్రయోదశి
సెప్టెంబరు 9, బుధవారం
శ్రావణ బహుళ త్రయోదశి ద్వాపర యుగాదిగా ప్రసిద్ధి. ఈ మేరకు ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ తిథి వివరాలను పేర్కొన్నారు.
శ్రావణ బహుళ చతుర్దశి
సెప్టెంబరు 10, గురువారం
శ్రావణ బహుళ చతుర్దశి నాడు అఘోర చతుర్దశి వ్రతం ఆచరించాలని ఆమాదేర్ జ్యోతిషీలో పేర్కొన్నారు.
శ్రావణ బహుళ అమావాస్య
సెప్టెంబరు 11, శుక్రవారం
శ్రావణ కృష్ణ అమావాస్య పోలాలమావాస్యగా ప్రసిద్ధి. ఈనాడు కర్షకులు వ్యవసాయ సంబంధ పనులేమీ, ప్రత్యేకించి ఎద్దులతో ఏ పనీ చేయిం చరు. మహారాష్ట్రలో దీనిని పిఠోరి అమావాస్య అని, ఆమాదేర్ జ్యోతిషీలో కౌశ్యమావాస్య అని, గ్రంథాంతరాల్లో ఆలోకామావాస్య అని వ్యవహరిస్తారు.
ఇక, శ్రావణ బహుళ అమావాస్యను మన పంచాంగకర్తలు పోలాలమావాస్యగా పేర్కొంటు న్నారు. తెలుగు నాట ఇది పోలాంబ వ్రతంగా ప్రసిద్ధి. కాబట్టి ఈనాడు పోలాంబ వ్రతం ఆచరించాలని అంటారు. పోలేరమ్మ అనే గ్రామ దేవత ఈనాడు విశేష పూజలు అందుకుంటుంది. కాగా, పోలి పేరుతో మరో అమావాస్య పర్వం కూడా అమల్లో ఉంది. అది కార్తీక బహుళ అమావాస్య మరునాడు వస్తుంది. అది పోలి స్వర్గానికి వెళ్లిన అమావాస్యగా భావిస్తారు.
శ్రావణ బహుళ అమావాస్య నాడు వచ్చే ఈ అమావాస్యను తెలుగునాట పోలాలమావాస్యగా వ్యవహరిస్తారు. గోదావరి జిల్లాల్లో పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్య నాడు గోదావరి పొర్లి పొర్లి ప్రవహిస్తుందని నానుడి. గ్రంథాంతరాల్లో ఆలోకామావాస్య గానూ, ఉత్కల దేశంలో సప్తపూరికామావాస్య అనీ పిలుస్తారు.
పోలాలమావాస్యను ‘పోలామా’ అనీ అంటారు. పోల అంటే కడుపు నిండా మేత మేసి, నీరు తాగి పనిపాటు లేకుండిన ఎద్దు అని అర్థం. ‘అమా’ అంటే అమావాస్య. ‘పోలామా’ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. దీనిని బట్టి ఈ పర్వం వృషభ పూజకు ఉద్ధిష్టమైనదిగా భావించాలి. సాధారణంగా అమావాస్య నాడు రైతులు ఎద్దుల చేత ఏ పనీ చేయించరు. నాగలి కట్టరు. దుక్కి దున్నరు. ఏరువాక పున్నమి వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ (జూన్) నాటి నుంచి వ్యవసాయ పనులతో ఎద్దులకు తీరిక ఉండదు. శ్రావణ మాసానికి వచ్చే సరికి వ్యవసాయ పనులు తీరుతాయి. దీంతో ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే నియమంతో ఈ పర్వాన్ని ఏర్పరిచి ఉండవచ్చు.
శ్రావణ బహుళ అమావాస్య నాడు పిఠోరి వ్రతం చేయదగినది. ఈనాడు పొద్దుటే లేచి స్నానం చేసి శివుడిని ఉద్దేశించి బొమ్మల పూజ చేయాలి. గోడపై, కాగితంపై, నేలపై దేవతల బొమ్మలు, ఇంట్లో ఉన్న వస్తువుల బొమ్మలు, మంచం, బల్ల, పాత్రలు, ఇల్లు, ఆవులు, గేదెలు, గుర్రాలు.. వీటి బొమ్మలు గీయాలి. వాటికి ఐదు సంవత్సరాల పాటు పూజా నియమాలు చేసి ఉద్యాపన చేయాలి. ఇలా చేస్తే సమస్త వస్తు సమృద్ధి కలుగుతుందని అంటారు. ఇది దసరా, దీపావళి, సంక్రాంతి పర్వదినాల సందర్భంలో చేసే బొమ్మల కొలువు వంటిదన్న మాట.
భాద్రపద శుద్ధ పాడ్యమి
సెప్టెంబరు 12, శనివారం
భాద్రపద శుద్ధ పాడ్యమి భాద్రపద మాసపు తొలి తిథి. ఈనాడు ప్రత్యేకించి ఏ దేవుడి పూజాకృత్యం లేదని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. కానీ, ఈనాడు ఆడపడుచులు ఆడిపాడే సంప్రదాయం ఉంది. ఈనాడు పడు చులు పెందరాళే లేస్తారు. తలంటి పోసు కుంటారు. అనేక పిండివంటలు వండుతారు. భోజనానంతరం స్త్రీలు విలాసంగా పొద్దుబుచ్చు తారు. సాయంకాలం తిరిగి పిండి వంటలతో భోజనం చేస్తారు. పడకకు చేరే లోపుగా ప్రతి వారు జొన్న కంకిలో గింజలు కొన్ని, ఒక దోసకాయ ముక్క తిని తీరాలని నియమం. అయితే, ఈ పర్వం పేరేమిటో, దానికి సంబంధించిన నేపథ్యమేమిటో ఇదమిత్థముగా తెలియరాదు. అయితే, భద్రచతుష్టయ వ్రతం, మృగశీర్షా వ్రతం వంటివి ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద శుద్ధ విదియ
సెప్టెంబరు 13, ఆదివారం
భాద్రపద శుద్ధ విదియ వరాహ జయంతి దినం. విష్ణువు దశావతారాల్లో వరాహావతారం మూడవది. ఆ అవతారం దాల్చిన రోజే వరాహ జయంతి దినం. హిరణ్యాక్షుడనే రాక్షసుడిని వరాహ రూపంలో వధించి, సముద్రంలో మునిగిపోతున్న భూదేవిని తన కోరలపై ఉంచుకుని కాపాడిన దైవిక లీలను ఈ తిథి నాడు స్మరించుకుంటారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పర్వాన్ని జరుపు కుంటారు. వరాహ స్వామిని పూజిస్తే భూమికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే, ఈనాడు బలరామ జయంతి దినమని కూడా అంటారు. బలరాముడు హలధారి. హలం అంటే పొలం దున్నే అరక. కర్షకులు హలధారి అయిన బలరాముడిని ఈనాడు పూజిస్తారు.
భాద్రపద శుద్ధ తదియ
సెప్టెంబరు 14, సోమవారం
భాద్రపద శుద్ధ తదియ హరితాళిక వ్రతానికి ప్రసిద్ధి. తెలుగు నాట పదహారు కుడుముల తద్దిగా ఇది ప్రాచుర్యంలో ఉంది. సౌభాగ్యవంతమైన స్త్రీలు, కన్యలు ఆచరించే వ్రత పర్వమిది. ఈ వ్రతం ఆచరించే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందిందని పురాణగాథ. ఈనాటి పూజకు అరటి స్తంభాలతో మండపం నిర్మించి, వివిధ వర్ణాల పట్టుబట్టలతో, తోరణాలతో దానిని అలం కరించాలి. పూజ తరువాత ఉపవాసం ఉండాలి. ఉత్తర భారతదేశంలోనే ఈ వ్రతాచరణ ఎక్కువగా ఉనికిలో ఉంది. ఇదే నాడు మన తెలుగు నాట పదహారు (16) కుడుముల తద్ది పర్వాన్ని జరుపుకుంటారు. ఇది నోము. పూర్వం ఓ రాజ కుమార్తె ఈ నోము సరిగా పరిసమాప్తి చేయలేదు. దీంతో మరుసటి జన్మలో ఆమె పేదరాలుగా పుట్టింది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి అడవికి వెళ్లగా, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై గతజన్మలో పదహారు కుడుముల తద్ది సరిగా ఆచరించని ఫలితంగానే ఈ కష్టాలు కలిగాయని చెబుతారు. అప్పుడు ఆ యువతికి పార్వతి స్వయంగా ఈ వ్రతాచరణ గురించి చెప్పింది.
రాకుమార్తె ఇంటికి వచ్చి పార్వతీదేవి చెప్పిన విధంగా భాద్రపద శుద్ద తదియ గడియల్లో తలంటి పోసుకుని పదహారు కుడుములు వండుకుని మూతపెట్టి చల్ల తెచ్చేందుకు తలుపు దగ్గరగా వేసి పొరుగింటికి వెళ్లింది. ఆమె వచ్చేలోపు కుక్క లోనికి ప్రవేశించి కుడుములు తినివేసింది. అయితే, ఈశ్వరార్పణంగా భావించి ఆ చల్ల కూడా కుక్కకే ఆమె పోసింది. ఆమె జంతుప్రేమకు పార్వతీదేవి మెచ్చి ప్రత్యక్షమైంది. ‘రాచబిడ్డా! కుక్క కుడుములు తినేసిందని విచారించకు. నీ భూత హితార్థబుద్ధికి మెచ్చుకున్నాను. నీకు నేను కావాల్సినంత సంపద ఇస్తున్నాను’ అని చెప్పింది.
ఆ ప్రకారమే ఆమెకు సంపద కలిగింది. దీంతో ఆమె ఏటేటా భాద్రపద
శుద్ధ తదియ నాడు పదహారు కుడుములు వండి నైవేద్యం పెట్టి నోము ఆచరిస్తూ వచ్చింది. అప్పటి నుంచీ అది పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతి చెందింది.
భాద్రపదంలో ఇది చాలా విశేషమైన తిథి అని చెప్పాలి. ఈనాడు పదహారు కుడుముల తద్దితో పాటుగా, హరితాళికా వ్రతాన్ని ఆచరిస్తారు. ఉత్కల దేశంలో గౌరీ తృతీయ పేరిట నోము ఆచరిస్తారు. ఇంకా ఈనాడు కాంచన గౌరీ పూజ, ఉమా పూజ, కోటీశ్వరీ వ్రతం, అనంత తృతీయా వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఈ తిథి నాడే వరాహ జయంతి అని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద శుద్ధ తదియ
సెప్టెంబరు 14, సోమవారం
భాద్రపద శుద్ధ తదియ తిథి నాడే వినాయక చవితి. గణపతి మొత్తం దేవతల్లోనే విశిష్ట దైవం. విశేష రూపం, వాక్కులు, మనసు చేత ఏర్పడే దృశ్యాదృశ్య ప్రపంచం ‘గ’కారం. వాక్కులకు, మనసుకు అతీతమైన రూపాన్ని ‘ణ’కారం చేత సూచిస్తారు. ‘గం’ గణపతి బీజాక్షరం. గణపతి పృథ్వీతత్వానికి అధి దేవత. గణపతి చేతిలోని పాశం రాగాన్ని, అంకుశం తాళాన్ని సూచిస్తాయి. ఏకదంతం ఏకాగ్రతను, మోదకం ఆనందానికి ప్రతీకలు.
గణపతి ఏకదంతుడు. ఏకదంతం అద్వైత ప్రతీక. ఆయన చేతిలోని దంతం భగ్నలేఖిని. సృష్టిలో జ్ఞానం, విజ్ఞానం ఉన్నాయి. ఈ రెండూ ఒకటి కావు. అన్నింటిలోని ఒకే తత్వాన్ని వివరించి అనుభూతి కలిగించేది జ్ఞానం. దాన్ని విశ్లేషించేది విజ్ఞానం. విశ్లేషణ విభిన్నత్వాన్ని నిరూపిస్తుంది. జ్ఞానం ఏకత్వానికి ప్రతీక. విజ్ఞానం ఒక్కోసారి వైషమ్యాలను, అహంకారాన్ని కలిగిస్తుంది. గజముఖుని ఏకదంతం ఏకత్వానికి సంకేతం. భగ్నదంతం విజ్ఞానానికి సూచిక అని పండితుల భావన.
వినాయక ‘చవితి’ అయినా కానీ, ఇది వేర్వేరు చోట్ల అంతకంటే ఎక్కువ రోజులే ఆచరిస్తారు. మహారాష్ట్రలో 11 రోజులు, ఆంధ్ర దేశంలో 3, 5, 7, 9, 11 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. ఈ దేవుడికి 21 మోదకాలు నైవేద్యంగా పెడతారు. ఆ రోజు దేవునికి సమర్పించే పత్రిలో అతి పవిత్రమైనవి దూర్వా పత్రాలు (గరిక పోచలు). గజాననుడు మంగళాదైవతం. కాబట్టి ప్రతి కార్యానికి ముందు గజానన పూజ చేయడం ఆచారమైంది.
తెలుగు నాట నాలుగు చతుర్థులు గణేశపరంగా ప్రసిద్ధం. అవి-
1) సంకష్ట చతుర్థి,
2) దూర్వా గణపతి (శ్రావణం లేదా కార్తీకంలో శుద్ధ చతుర్ధి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు),
3) సిద్ధి వినాయక వ్రతం (భాద్రపద శుద్ధ చతుర్థి),
4) కపర్ధి వినాయక వ్రతం (శ్రావణ శుక్ల చతుర్థి).
వంగ దేశంలో గణేశ చతుర్థి లేదు. దక్షిణ భారతంలో ఇది మిక్కిలి ప్రసిద్ధం. దీన్ని కొన్నిచోట్ల రాళ్ల పండుగ అనీ అంటారు. రాజస్థాన్లో ఇది వివాహ నిశ్చయాలకు మంచి రోజు. విద్యను కోరే వారు చవితి తిథిలో సరస్వతీ పూజ చేయాలని అంటారు. కొన్ని వ్రత గ్రంథాలలో భాద్రపద చతుర్ధిని శివ చతుర్థిగా వర్ణించారు. త్రిమూర్తులు కూడా గణపతిని పూజిస్తారని ప్రతీతి.
ఈనాటి నుంచే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అందుకు సూచికగా ఈనాడు ఉత్సవాలు అంకురార్పణ చేస్తారు.
భాద్రపద శుద్ధ చవితి
సెప్టెంబరు 15, మంగళవారం
భాద్రపద శుద్ధ చవితి తిథి రుషి పంచమిగా ప్రసిద్ధి. దీని గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది కేవలం ఆడవాళ్ల వ్రతం. ఈనాటి మధ్యాహ్న సమయంలో నదికి కానీ చెరువుకు కానీ వెళ్లి స్నానం చేయాలి.
ఒకప్పుడు సితాశ్వరాజు బ్రహ్మని తక్షణమే పాపాల్ని తగ్గించే వ్రతాన్ని గురించి చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మ ‘రుషి పంచమి’ వ్రతం గురించి ఉపదేశించాడట.
విదర్భ దేశంలో ఉత్తంగుడు అనే బ్రాహ్మణుడి భార్య సుశీల మిక్కిలి పతివ్రత. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె. కొడుకు వేద పండితుడు. కూతురు దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే బాల వితంతువు అయ్యింది. ఈ కష్టంతో ఉత్తంగుడు గంగా తీరవాసి అయి బ్రహ్మచారులకు వేదం చెబుతుండే వాడు. కూతురు అతనికి సపర్యలు చేస్తుండేది. ఒకనాడు ఆ బాలిక శరీరం నుంచి పురుగులు పడ్డాయి. వాటిని చూసి భయంతో ఆమె స్ప•హ తప్పి పడిపోయింది. అప్పుడు తల్లి ఆమెను తండ్రికి చూపగా, అతను దివ్యదృష్టితో ఆమె పూర్వజన్మలో బ్రాహ్మణ బాలిక అయి ఉండి, రజస్వల అయిన నాడే ఇంట్లోని వస్తువులు ముట్టుకున్నట్టు గ్రహించాడు. అంతేకాక, నాడు ఆమె రుషి పంచమి వ్రతాన్ని ఆచరించే వారిని చూసి నవ్వింది. అందుకు ఆమె శరీరం క్రిమిగ్రస్తమైంది.
రుషి పంచమి వ్రతాన్ని ఆచరిస్తే ఈ దోషం పోతుంది. ఈ వ్రతాచరణ వల్ల రజస్వలగా ఉండి అజ్ఞాతంగా చేసే తప్పుల్ని పోగొట్టుకోవచ్చని అంటారు.
ఈ వ్రతం గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం గురించి చాలామందికి తెలుసు కానీ, ఆచరించే వారు తక్కువ.
భాద్రపద శుద్ధ షష్ఠి
సెప్టెంబరు 17, గురువారం
భాద్రపద శుద్ధ షష్ఠి నాడు సూర్యపూజ చేయాలని ప్రముఖ వ్రత గ్రంథమైన పురుషార్థ చింతామణిలో ఉంది. ఉద్యాపన పూర్వకమైన సూర్యషష్ఠి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతా మణి, కృత్యసార సముచ్చయము అనే గ్రంథాలలో కూడా ఉంది. అందుకే ఈ షష్ఠిని సూర్యషష్ఠి అని వ్యవహరిస్తారు. అలాగే షష్ఠి తిథి కార్తికేయుడికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఈనాడు స్కంద (కుమారస్వామి) దర్శనం చేసుకోవాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు ఆయనకు చేసే పూజలను స్కంద షష్ఠి పూజలని అంటారు.
అలాగే ఈనాడు కన్యా సంక్రమణ దినం.
భాద్రపద శుద్ధ సప్తమి
సెప్టెంబరు 18, శుక్రవారం
భాద్రపద శుద్ధ సప్తమి నాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలని, దీనినే ఆముక్తాభరణ వ్రతం అని అంటారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు కుక్కుటీ వ్రతం చేసి సాంబశివ పూజ చేయాలని తిథి తత్వంలో రాశారు. ఇంకా చతుర్వర్గ చింతామణిలో ఈనాడు ద్వాదశ సప్తమి, అనంత ఫల సప్తమి, పుత్ర సప్తమి, అపరాజితా సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని ఉంది. ఈనాడు లలితా సప్తమి అని ఆమాదేర్ జ్యోతిషీలో ఉంది. నీలమత పురాణంలో ఈనాడు అలంకార పూజ చేయాలని రాశారు.
భాద్రపద శుద్ధ అష్టమి
సెప్టెంబరు 19, శనివారం
భాద్రపద శుద్ధ అష్టమి దుర్గాష్టమి తిథి. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా పూజించాలి. అలాగే, మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఈనాడు దేశంలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించుకునే పర్వం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
భాద్రపద శుద్ధ అష్టమి నాటి సాయంకాలం ప్రతి ఇంటి నుంచి ఒక యువతి బయల్దేరి బయటికి వచ్చి కొన్ని బొమ్మరాళ్లు ఏరుతుంది. వాటిని ఒక కుండలో వేస్తుంది. ఆ కుండకు తాడు పోసి ఇంటి నూతిలో దింపి తిరిగి బయటకు తీస్తుంది. ఆపై బొమ్మరాళ్లను ఒక పళ్లెంలో పెడుతుంది. ఆ నూతి పక్కనే వాటికి పూజ చేస్తుంది. అనంతరం ఒక చిన్న గంట పుచ్చుకుని వాయిస్తూ బొమ్మరాళ్లతో కూడిన పళ్లాన్ని పట్టుకుని ఇంట్లోకి వస్తుంది. ఈలోగా ఇంటిలోని ఇతర స్త్రీలు తమ చేతుల్ని పసుపు కుంకాల్లో ముంచి నేల మీద అద్ది ఆనమాళ్లు వేస్తారు. సింహద్వారం వద్ద, ఇంటి నిండా ఇలాగే ఆనమాళ్లను వేస్తారు. బొమ్మరాళ్ల పళ్లాన్ని గొనివచ్చిన బాలిక ఈ ఆనమాళ్ల మీదనే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడు స్త్రీలు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెబుతారు. ఈ బొమ్మరాళ్లను మామూలుగా దేవతార్చన జరిగే చోట పెడతారు. మర్నాడు సాయంకాలం వరకు అవి అక్కడనే ఉంటాయి. అప్పుడు పేరంటాళ్లను పిలిచి వేడుక చేస్తారు. పసుపు, కుంకుమలు ఇస్తారు. కొద్దిగా కొబ్బరి, గసగసాలు పంచదార కలిపి తొక్కి చేసిన ఉండలు ఈనాటి ప్రధాన ప్రసాదం.
మర్నాడు మళ్లీ ఆ బొమ్మలను పూజిస్తారు. పెరుగు అన్నం నైవేద్యం పెడతారు. ఆ మీదట బొమ్మరాళ్లను తీసుకెళ్లి నూతిలో వేస్తారు. వేస్తూ వేస్తూ మీదటికి మళ్లీ వచ్చేటప్పుడు మీతో ఆనందాన్ని, సుఖాన్ని తీసుకురండి అంటారు.
భాద్రపద శుక్ల అష్టమికి రాధాష్టమి అని కూడా పేరు. శ్రీకృష్ణుడి యందు తన చిత్తాన్ని లయింప చేసిన రాధ కృతార్థత పొందిన శుభదినం ఇదేనని చెబుతారు. ఈనాడు రాధాకృష్ణులను పూజించిన వారికి సంసార సుఖం అగ్గలమవు తుంది.
భాద్రపద శుక్ల అష్టమి నాడు గౌరీపర్వం కూడా కొన్నిచోట్ల ఆచరిస్తారు. ఈ పండుగ వినాయక చవితి వెళ్లిన మూడు రోజులకు ఆరంభమై మూడు రోజులు ఉంటుంది. గణపతి తల్లి, శివుని భార్య అయిన పార్వతికి ఇది అత్యంత ప్రియకరమైన దినాలని అంటారు.
ఈ అష్టమి ఒకవేళ గురువారంతో కూడి వస్తే కనుక, ఈ తిథిని గుర్వష్టమి అనీ అంటారు. దీనినే నీలమత పురాణంలో అశోకికాష్టమిగా వర్ణించారు.
అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లో ఈనాడు రాధాష్టమిగా పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు గరుడ వాహనసేవను నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ధ నవమి
సెప్టెంబరు 20, ఆదివారం
భాద్రపద శుద్ధ నవమి గురించి వివిధ గ్రంథాలలో వివిధ రకాలుగా ఉంది. పుణ్యస్త్రీలుగా చనిపోయిన వారి శ్రాద్ధ దినంగా ఈ తిథిని ఎంచుతారని అంటారు. దీనిని వారి భర్తలు ఈ తిథి నాడు బతికి ఉన్నంత కాలం చేస్తారు. కొడుకులు లేకపోతే భర్తే స్వయంగా చేస్తాడు. కొడుకులు ఉంటే పెద్ద కొడుకు చేయడం ఆచారం. పిండ ప్రదానం మొదలైనవి ఉండవు. ఇంకా ఈనాడు శ్రీవృక్ష నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, నందికా నవమి, గోధూమ నవమి అంటారని నీలమత పురాణం చెబుతున్నాయి. ఈ తిథిని నందా నవమి అంటారని, ఈనాడు దుర్గాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈ తిథి కేదార వ్రత దినం కూడా.
ఈనాడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణరథ డోలోత్సవం నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ధ దశమి
సెప్టెంబరు 21, సోమవారం
భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతారాలను పూజించాలని అంటారు. ఈ కారణంగానే ఈనాడు చేసే పూజకు దశావతార వ్రతమనే పేరు వచ్చింది. నీలమత పురాణంలో ఈనాడు విత స్తోత్సవం చేస్తారని ఉంది. వితస్త అనేది పాంచాల దేశంలోని ఒక నది. ఈ నది ఈనాడే పుట్టిందని అంటారు. ఈ దశమి మొదలుకుని ఏడు రోజులు విడవకుండా వితస్తానదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని చెబుతారు.
దశావతార వ్రతం నాడు దేవతలకు, రుషులకు, పితరులకు తర్పణం ఇవ్వాలి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార ప్రతిమలను చేసి పూజించాలి. భోజనం చేయకూడదు. శక్తి లేని వారు ఒంటి పూట భోజనం చేయవచ్చు.
భాద్రపద శుద్ధ ఏకాదశి
సెప్టెంబరు 22, మంగళవారం
భాద్రపద శుద్ధ ఏకాదశిని వామన ఏకాదశి, పరివర్తినీ ఏకాదశి అని అంటారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్ర మిస్తాడు. అప్పటి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి నాటికి ఆయన శయనించి రెండు మాసాలవు తుంది. ఆయన భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు కాస్త ఒత్తిగిలుతాడు. ఆ ఒత్తిగిలడం కూడా ఎడమ నుంచి కుడికి.. అందుచేత దీనికి పార్శ్వపరివర్తిన్యే కాదశి అని పేరు వచ్చింది.
కాగా, పరివర్తన ఏకాదశిని ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు.
ఈ పర్వాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు సంధ్యాకాలంలో జరగడం కొన్నిచోట్ల ఆచారంగా ఉంది. అలాగే, ఈనాడు కటదానోత్సవం అనే వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. కటము అంటే చాప. కటకారుడు అంటే చాపలు అల్లేవాడు. అంటే ఈనాడు చాప దానం చేయాలి.
ఈనాడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో కీలకమైన రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ధ ద్వాదశి
సెప్టెంబరు 23, బుధవారం
భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వామన జయంతి పర్వమని అంటారు. అలాగే ఇది కల్కి ద్వాదశి దినం కూడా. విష్ణువు ఐదవ అవతారమైన వామనుడికి ఇది ప్రియమైన దినమని అంటారు. వామనుడు బ్రహ్మచారి వటుడు. తపస్విని అయిన అదితికి, కశ్యప రుషి వల్ల పుట్టిన వాడు. విరోచనుడు అనే దైత్యుని కొడుకు బలి. దైత్య కులంలో పుట్టిన బలి గొప్ప విష్ణు భక్తుడు. విష్ణువు అభిమానాన్ని చూరగొన్నాడు. దీంతో అతనికి గర్వం కలిగి దేవతలను బాధించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు శేష నారాయణుని సన్నిధికి వెళ్లి బలి బాధ పోగొట్టవలసిందిగా కోరారు. అయితే బలి తన ఇష్ట భక్తుడు కావడంతో అతని జోలికి వెళ్లడానికి విష్ణువుకు ఇష్టం లేదు. అయితే, దేవతల బలవంతంతో ఆయన వామనమూర్తి అయిన బ్రాహ్మణ యాచకుని వేషంలో బలి చక్రవర్తి వద్దకు వెళ్లాడు. బలి సింహాసనంపై నుంచి లేచి దానిపై వామనుడిని కూర్చోబెట్టాడు. మిక్కిలి వినయంతో రాకకు కారణం అడిగాడు. తన వేద పఠనానికి తనకు ‘త్రిపద్భూమి’ కావాలని వామనుడు కోరాడు. త్రిపద్భూమి అంటే మూడు అడుగుల నేల. బలి అలాగే ఇస్తానన్నాడు. మంత్రయుక్తంగా ఆ దానం చేయడానికి బలి తన గురువైన శుక్రుడికి కబురంపాడు. శుక్రుడు వచ్చి వామనుడి ఆంతర్యం గ్రహించి బలికి అసలు విషయం చెబుతాడు. దానం ఇవ్వడంతోనే నిన్ను పాతాళానికి తొక్కివేస్తాడని కూడా అంటాడు. అయినా సరే, తాను ఆడిన మాట తప్పనని బలి అంటాడు. అంతట వామనుడు ్ర•హ్మాండాంత సంవర్థియై ఒక పాదంతో భూమిని, మరో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో పాదం బలి నెత్తి మీద ఉంచి అతనిని పాతాళంలోకి తొక్కివేశాడు.
హేమాద్రి, భవిష్య పురాణాలలోని కథ ఇది. భాద్రపద మాస శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రంలో వామనావతార జయంతి ఉత్సవం జరుపుతారు. దీనిని విజయ ద్వాదశి అనీ అంటారు. వామన ద్వాదశికి ముందు ఏకాదశి ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేసి వామనావతార విగ్రహాన్ని పూజించాలి. విగ్రహానికి శిఖ, సూత్రం, యజ్ఞోపవీతం, కమండలువు ఉండాలి. శ్రవణ ద్వాదశి నాడు ఉపవాసం చేసిన వారికి బ్రహ్మహత్యా దోషాలు పోతాయని అంటారు.
ఈనాడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
భాద్రపద శుద్ధ త్రయోదశి
సెప్టెంబరు 24, గురువారం
భాద్రపద శుద్ధ త్రయోదశిని గోత్రిరాత్రి వ్రతమని, దూర్వాత్రి రాత్రి వ్రతమని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఈనాడు మొదలుకుని మూడు రోజులు అగస్త్యార్ఘ్య దానం చేయాలని కృత్యసార సముచ్చయం అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఈనాడు తిరుమల శ్రీవారి బ్యాక్ సవారీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ధ చతుర్దశి
సెప్టెంబరు 25, శుక్రవారం
భాద్రపద శుద్ధ (శుక్ల) చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశిగా ప్రసిద్ధి. అందుకే ఈ తిథిని పద్మనాభ చతుర్దశిగానూ వ్యవహరిస్తారు. ఈనాడు అనంత వ్రతాన్ని ఆచరించాలి. అనంతుడు అనేది విష్ణువు యొక్క అనేక నామాల్లో ఒకటి. అనంత చతుర్దశీ వ్రతం మిక్కిలి విశేషమైనదని స్మ•తి దర్పణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఉత్కళ దేశంలో దీనిని అఘోర చతుర్దశి అంటారని ఆమాదేర్ జ్యోతిషీ వ్రత గ్రంథంలో రాశారు. ఈ వ్రతాచరణకు త్రయోదశితో కూడిన చతుర్దశి పనికి రాదు. పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యము. అనంత వ్రతం గురించి భవిష్యోత్తర పురాణంలోనూ, తిథి ప్రాముఖ్యం గురించి హేమాద్రి వ్రత గ్రంథంలోనూ ఉంది.
భారతీయులు ఆచరించే కామ్య వ్రతాల్లో అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం ఒకటి. ఈ వ్రతాచరణకు ఉదయ వ్యాపిని అయిన చతుర్దశి ముఖ్యం. పూర్ణిమ ఘడియలు ఏ కొంచెం ఉన్నా ఈ వ్రతానికి ఇంకా శ్రేష్ఠమై ఉంటుంది. అనంతుని వ్రతానికి ముఖ్యమైన అంగాలు మూడు. అవి-
1. యమునా జల పూజనం, 2. అనంతుని పూజ, 3. ప్రతిసర పూజ.
అనంతుడు అనగా ఆదిశేషువు. విష్ణువు, రుద్రుడు అనే అర్థాలూ ఉన్నాయి. కానీ, ఇక్కడ పూజను అందుకునేది విష్ణువు పాన్పు, భూమిని మోసేవాడు అయిన ఆదిశేషువు. పద్మాల పిండితో ఏడు పడగలు గల పామును చిత్రించాలి. దర్భలతో పాము బొమ్మను వేస్తారు. దీని మీద కలశాన్ని ఉంచుతారు. ‘సహస్ర శిరసేనమ:’, ‘ఫణైస్సప్తభిరావిష్టం’ అనే మంత్రాలతో అనంతుని పూజించాలి. అలాగే అనంతుని ముందు ఒక తోరాన్ని ఉంచి పూజించాలి. అది పద్నాలుగు ముళ్లు గలదిగా ఉండాలి. కుంకుమాయుక్తమై ఉండాలి. పూజారంభానికి ముందు ముందటి సంవత్సరపు పాత తోరం ధరించాలి. పూజచేసిన అనంతరం దీనిని దక్షిణ కరానికి కట్టుకుని అప్పుడు పాత తోరాన్ని తీసివేయాలి.
అనంతుని పూజలో పద్నాలుగు (14) సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది.
విష్ణువుకు పానుపు అయిన ఆదిశేషుడికి ఏడు (పద్నాలుగులో సగం) పడగలు.
చతుర్దశి తిథి పద్నాలుగోది.
తోరం పద్నాలుగు పోచలతో చేసినది.
ఆ తోరానికి పద్నాలుగు గ్రంథులు.
అలాగే, అనంతుని పూజకు ఉపయోగించే పత్రులు- పద్నాలుగు.
నైవేద్యానికి పద్నాలుగు రకాల పండ్లు, పద్నాలుగు రకాల పిండివంటలు వాడటం ఆచారం.
వాయన దానానికి పద్నాలుగు అతిరసములు వాడాలి.
గోధుమ పిండితో ఇరవై ఎనిమిది (రెండు పద్నాలుగులు) అతిరసములు చేయాలని వ్రత వివరణలో ఉంది.
అలాగే, పద్నాలుగేసి ఏళ్లకు ఒకసారి వ్రతానికి ఉద్యాపనం చేయాలి.
మనిషికి పోయిన అధికారం, సంపద, రాజ్యం మొదలైనవి అనంతుని పూజించడం వల్ల తిరిగి వస్తాయని అంటారు. అందుకే భారతదేశంలో అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం చాలా ప్రాముఖ్యమైది. ఈ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా విశేష పూజలు నిర్వహిస్తారు. కేరళలో ప్రసిద్ధి చెందిన అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో అనంత సంపద పోగుపడి ఉందని, దానికి భారీ సర్పాలు కాపలా కాస్తుంటాయని అంటారు.
ఇంకా, భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు పాలీ చతుర్దశీ వ్రతం, కదలీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
ఈనాడు తిరుమల శ్రీవారి చక్రస్నాన పర్వం నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ధ పౌర్ణమి
సెప్టెంబరు 26, శనివారం
భాద్రపద శుద్ధ పూర్ణిమ అనేక విధాలుగా ప్రతీతమై ఉంది. శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు మంచిది కాకపోయినా, వీలులేక పోయినా ద్విజులు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకుంటారు.
ఈనాడు ఉమామహేశ్వర వ్రతం, పుత్ర వ్రతం, ఉపాంగ లలితాగౌరీ వ్రతం, లోక పాలక పూజ, వంధ్యత్వ హారిలింగార్చనా వ్రతం, వరుణ వ్రతం, బ్రహ్మసావిత్రీ వ్రతం, అశోక త్రిరాత్ర వ్రతం వంటివి చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద పూర్ణిమ నాడు భాగవత పురాణాన్ని దానం ఇస్తే పరమపదం కలుగుతుంది.
భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించిన అగస్త్యార్ఘ్య దానాన్ని భాద్రపద పూర్ణిమతో ముగిస్తారని తిథి తత్వం చెబుతోంది.
ఈనాడు దిక్పాల పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. దీనినే ఇంద్ర పౌర్ణమాసీ అంటారని గదాధర పద్ధతి అనే గ్రంథంలో రాశారు. అలాగే, భాద్రపద శుద్ధ పూర్ణిమ ‘మహా భాద్రీ’ అని, ఈనాడు బదర్యాశ్రమంలో గడిపితే విశిష్ట ఫల ప్రదమై ఉంటుందని గదాధర పద్ధతిలో ఉంది.
నైష్కియులకు పౌర్ణమాసీ కృత్యాలైన నాన్దీ శ్రాద్ధం, పితృ శ్రాద్ధం మొదలైనవి ఈనాడు తప్పకుండా చేయాలని చెబుతారు.
హిందూ సంప్రదాయంలో ప్రధానమైన మహాలయ పక్ష దినాలు ఈ మర్నాటి నుంచే ఆరంభమవుతాయి.
ఈనాటితో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
భాద్రపద బహుళ పాడ్యమి
సెప్టెంబరు 27, ఆదివారం
మహాలయ పక్షం ప్రారంభం. ఈనాటి నుంచి హస్తకార్తె ప్రారంభం అవుతుంది. మహాలయ పక్షం అనేది వేదకాలం నుంచీ ఆచరణలో ఉన్న పర్వం. దీనినే పితృ పక్షమని కూడా అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి ఆరంభమై ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది. ఆ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. సాధారణ శ్రాద్ధ దినం వ్యక్తులకు సంబంధించినది. మహాలయ పక్షము సాముదాయకంగా పితరులను పూజించడానికి ఏర్పడింది. మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి 96 శ్రాద్ధాలని చెప్పారు. వీటిలో పితృ పక్షం ముఖ్యమైనది. శ్రాద్ధ దినం నాడు కర్మ చేసే వాడు శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఉపవసించాలి.
తండ్రి బతికి ఉండగా తల్లిని కోల్పోయిన వాడు భాద్రపద కృష్ణ పక్ష నవమి నాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు గంట కాలం పుచ్చుకుంటుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసే వాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై ఉంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి. ఇదే విధంగా తండ్రికి కూడా శ్రాద్ధకర్మను నిర్వహించాలి. పురోహితులు సూచించిన మేరకు దర్బగడ్డి మీద అవిసె చెట్టు ఆకులు వేస్తారు. దాని మీద విష్ణు పాదమనే ఆకు వేస్తారు. దాని మీద పిండాలు ఉంచుతారు. ఇవి పెద్ద పిండాలు. ఈ పిండాల పక్కన చిన్న పిండాలు, మరికొన్ని ధర్మ పిండాలు ఉంచుతారు. వీటినన్నింటినీ పూజిస్తారు. తరువాత దీపారాధన చేస్తారు. ఆ మీదట మంత్ర పుష్పాంజలి చేస్తారు. చివరగా నైవేద్యపు వస్తువును ఆరుబయట కాకి తినడం కోసం ఉంచుతారు. కాని ఈ నైవేద్యాన్ని ఎంత తొందరగా ముట్టుకుంటే పితృ దేవతలు అంత ఎక్కువగా తృప్తి పడ్డారని తలుస్తారు. ఇలా కర్మ చేయడానికి పాలుమాలిన వంశీకుడిని అతడి పితృ దేవతలు శపిస్తారని అంటారు. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధ కర్మ చేయడం మహత్కార్యంగా మహారాష్ట్రులు భావిస్తారు. ఈ రోజు శ్రాద్ధ కర్మ చేయలేని వారు కనీసం తర్పణమైనా విడవాలి. తర్పణానికి పిండాలు అవసరం లేదు. తిలాంజలి విడిస్తే సరిపోతుంది.
రోమన్ జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృ దేవతల పూజకు నిర్ధిష్టమై ఉండేది. ఆనాడు వారు రోమ్ నగరం సమీపంలోని కొండలలో ఒక కొండపై పెద్ద గొయ్యి తీసేవారు. పితృ దేవతలు భూమి కింద ఉంటారని వారి విశ్వాసం. ఆ గోతుల్లో అన్నం ఉంచేవారు. వివాహాలు, వ్యాపారాలు, ఇతర శుభకార్యాలు ఆనాడు ఆచరించరు. మనలో కూడా దాదాపు ఇదే ఆచారం కొనసాగుతోంది.
భాద్రపద బహుళ విదియ
సెప్టెంబరు 28, సోమవారం
భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. కొన్ని పండుగలకు ముందు వచ్చే రోజును భోగిగా వ్యవహరిస్తారు. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పండుగల పూర్వ దినాలను భోగి అని వ్యవహరిస్తారు. ఈ కోవలో ఉండ్రాళ్ల తద్దికి ముందు వచ్చేది భాద్రపద బహుళ విదియ. ఇది ఉండ్రాళ్ల తద్ది భోగి. దీని తరువాత రోజు (బహుళ తదియ, సెప్టెంబరు 29, మంగళవారం) ఉండ్రాళ్ల తద్ది. ఇది స్త్రీల పండుగ. కన్నెలు, పడుచులు, చిన్నారి మగపిల్లలు కూడా ఈ పర్వంలో పాల్గొంటారు. ఇక, ఉండ్రాళ్ల తద్ది భోగి నాడు ఆడపిల్లలు అందరూ తలంటి పోసుకుంటారు. దీంతో భోగి పీడ వదులుతుందని అంటారు. తలంటు అయిన తరువాత చేతి, కాలి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారుగట్ల గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గట్టి పెరుగు వంటివి వేసుకుని భోజనం చేసి, తాంబూలం వేసుకుని ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం మున్నగు వాటితో కాలక్షేపం చేస్తారు.
భాద్రపద బహుళ తదియ
సెప్టెంబరు 29, మంగళవారం
భాద్రపద బహుళ తదియ (తద్ది) అమ్మాయిలకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తమ భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. భాద్రపద బహుళ తదియకు ముందు రోజైన భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారుజామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట ఆడతారు. ఊరి బయట తోటలకు అట్లు, బెల్లపట్లు, పెరుగన్నం పట్టుకెళ్లి, వాటిని ఆరగించాక ఉయ్యాలలూగుతారు. రాత్రి గౌరీ పూజ చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా స్త్రీల సౌభాగ్యం కోసం చేసే పండుగ. శ్రావణ, భాద్రపద మాసాలలో కొన్ని స్త్రీ సౌభాగ్యకారకమైన వ్రతాలు గురించి వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కానీ, ఉండ్రాళ్ల తద్ది గురించి ఆయా గ్రంథాలలో లేదు. హేమాద్రి పండితుడు చెప్పిన ప్రకారం.. చైత్ర, భాద్రపద, మాఘ మాసాలలో రూప సౌభాగ్య సౌఖ్యదమైన తృతీయా వ్రతాన్ని గురించి తనకెందుకు చెప్పలేదని యుధిష్టరుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. కృష్ణుడు- భవిష్యోత్తర పురాణం నుంచి ఓ వ్రతాన్ని ఉదహరించాడు. భాద్రపద తృతీయ అన్నాడే కానీ, భాద్రపద బహుళ తదియ అని స్పష్టంగా చెప్పలేదు. సాధారణంగా భాద్రపద శుద్ధ తృతీయ నాడు చేయాల్సిన వ్రతాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ‘గుడ తృతీయ’ మనే ఒక వ్రతాన్ని కృష్ణుడు ఉదహరించాడు. గుడాపూపములు దేవికి నైవేద్యంగా పెట్టి, జలాశయాల్లో దేవీ ప్రతిమలను విసర్జిస్తారు. వామదేవుని ప్రీతి కోసం పాయసాన్ని సమర్పించాలని ఈ వ్రతంలో ఉంది. ఈ వ్రతం కూడా ఏ పక్షపు తృతీయ అనేది స్పష్టంగా లేదు. గుడాపూపములు నైవేద్యంగా ఇవ్వాలని అనడం వల్ల నేటి ఉండ్రాళ్ల తద్దియే ఆ వ్రతమై ఉండవచ్చని వ్రతకారుల అభిప్రాయం. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలనేది ఆరోగ్య సూత్రం. దానికి అనుగుణంగానే ఉండ్రాళ్లు ఆరగించే ఈ పండుగ ఆచరణలోకి వచ్చి ఉండవచ్చు.
కాగా, ఉండ్రాళ్ల తద్ది (తదియ) నాడు కొన్ని వర్ణాల వారు గొంతెమ్మ (కుంతి) పూజ చేయడం కూడా ఆచారం.
భాద్రపద బహుళ చవితి
సెప్టెంబరు 30, బుధవారం
భాద్రపద బహుళ చతుర్థి నాడు దికాల్ప పూజ చేయాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, గణపతి సంబంధమైన సంకష్ట హర చతుర్థి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు.
పుణ్యప్రద మాసం
మన ఆరోగ్యాలకు పూర్తి భద్రత కల్పించే మాసం కాబట్టి దీనిని భాద్రపద మాసం అన్నారు. భాద్రపద మాసంలో ఏకాన్న ఆహార వ్రతాన్ని ఆచరిస్తారు. దీనివల్ల ధనం, ఆరోగ్యం ప్రాప్తిస్తాయని అంటారు.
గణపతి నవరాత్రులు భాద్రపదం ప్రత్యేకం. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆంగ్లేయులపై పోరాటానికి, భారతీయులను ఐక్యంగా ఉంచడానికి వినాయక చవితి ఉత్సవాలను నాటి నాయకులు ఒక వేదికగా చేసుకున్నారు. మహారాష్ట్రలో వినాయక ఉత్సవాలను దేశభక్తికి ప్రతీకగా నిర్వహిస్తారు.
రుషి పంచమి నాడు స్త్రీలంతా రుషులను పూజించి ఉపవాసం ఉండాలి. అలా చేస్తే రుషుల అనుగ్రహంతో తమలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని అంటారు.
పరివర్తన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే.. గృహస్తు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని అంటారు.
భాద్రపద మాసంలో మరో ప్రత్యేకత.. మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాటి నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తలుచుకోవడం, వారికి వైదిక కర్మలు నిర్వహించడం వంటివి ఈ పదిహేను రోజుల కాలంలో చేయాలని చెబుతారు. మనకి జన్మనిచ్చిన మన పూర్వుల రుణం తీర్చుకునే అవకాశం మహాలయ పక్షంతోనే సాధ్యమవుతుంది.
అసలు ఆదిలో కలియుగం భాద్రపద మాసంతోనే మొదలైందని అంటారు. ఎందుకంటే హిందూ పండుగలు వినాయక చవితితోనే మొదలవుతాయనే వాదన కూడా ఉంది.
భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన తిథుల సమయంలో విరివిగా దానధర్మాలు చేయాలని అంటారు.
భాద్రపద అమావాస్య హిందువులకు చాలా ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే స్నానం చేసి, ఇష్టదైవాన్ని పూజించి దానధర్మాలు చేసిన అనంతరం పూర్వీకులకు (తల్లిదండ్రులు, ఇతర పెద్దలు) నైవేద్యం సమర్పిస్తారు. ఈనాడు నదిలో కాకుంటే చెరువులో స్నానం చేయడం ముఖ్యం. ఉదయాన్నే సూర్య నమస్కారాలు ఆచరించాలి. అనంతరం నది తీరాన పూర్వీకులకు పిండ ప్రదానం సమర్పించాలి. అలాగే పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితురులకు శాంతి, విముక్తి లభిస్తాయని చెబుతారు.
భాద్రపద అమావాస్య నాడు శనిదేవుడిని పూజించే ఆచారం కూడా ఉంది. రావి చెట్టు కింద ఆవగింజల నూనెతో దీపం వెలిగించి, పూర్వీకులను తలచుకుని, ఆ చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి.


























































































Review మాసం.. విశేషం.