వసంతానికి స్వాగతం

1, మార్చి, గురువారం, ఫాల్గుణ శుక్ల చతుర్దశి నుంచి – 31, మార్చి, శనివారం, చైత్ర శుక్ల పౌర్ణమి వరకు.
విలంబి నామ సంవత్సరం-ఫాల్గుణం-చైత్రం-వసంత రుతువు-ఉత్తరాయన
ఆంగ్లమానం ప్రకారం
మూడవది మార్చి నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మొదటిది. ఇది ఫాల్గుణ – చైత్ర మాసాల కలయిక. ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు, చైత్ర మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. రంగులకేళీ హోళీ పర్వం, తెలుగు సంవత్సరాది, శ్రీరామనవమి, వసంతోత్సవం, మహావీర జయంతి, హనుమజ్జయంతి వంటి పండుగలు, పర్వదినాలు ఈ నెలలోనే వస్తాయి. ఇక, తిరుమల తిరుపతి శ్రీవారి వసంతోత్సవాలు జరిగేది మార్చి నెలలోనే. ఈ మాసంలో రంగుల వర్ణాలను అద్దులేని కొత్త కాంతులీనుతుంది.
ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన పున్నమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణమనే పేరు స్థిరపడింది. ఈ నెలతోనే శిశిర రుతువుకు తెరపడుతుంది. నువ్వులు, ఉసిరిక, చూత కుసుమం (మామిడిపూత) విరివిగా వాడ టానికి కొన్ని నెలలు ప్రత్యేకమైనవి. అందులో ఫాల్గుణం ఒకటి. ఇక దశావతారాల్లో అతి ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశి ఈ మాసంలోనే వస్తుంది. అలాగే, ఉసిరికాయతో ముడిపడి ఉన్న ఓ తిథి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ మాసం తరువాత నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ దినమే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమితో వసంతకాలం ఆరంభమవుతుంది. వసంత రుతువుకు స్వాగతం పలికేది, తెలుగు సంవత్సరాలలో తొలిది చైత్ర మాసమే. చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలయ్యే వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ నవమితో ముగుస్తాయి. ఆ రోజు శ్రీరామ నవమి అవుతుంది. ప్రకృతి కొత్త చిగుళ్లు తొడుగుతూ వాతావరణం మహా ఆహ్లాదభరితంగా ఉంటుందీ మాసంలో. ఉగాది, శివడోలోత్సవం, శ్రీపంచమి, సౌభాగ్య గౌరీ వ్రతం, శ్రీరామ నవమి, మత్స్య, వరాహ జయంతులు, హనుమజ్జయంతి ఈ నెలలో ప్రధాన పండుగలు. చైత్ర మాసానికి మరో విశేషం ఉంది. శ్రీ మహా విష్ణువు అవతారాలు పది. వీటిలో రామ, వరాహ, మత్స్య అవతారాల జయం తులు చైత్ర మాసంలోనే వస్తాయి. ఆ రకంగా ఇది విశేష మాసం.
ఒకపక్క.. వసంత సమీరాలు.. గండుకోయిలల మధుర గానాలు.. మావి చిగురుల సువర్ణ వర్ణాల హొయలు.. శ్వేత వర్ణపు వేపపువ్వు మిలమిలలు.. కొత్త సంవత్సరపు కళకళలు.. మరోపక్క.. రామనామ స్మరణలు.. సీతాపతి కల్యాణ కాంతులు.. అంతటా ఆనందోత్సాహం.. ఇటు ఆధ్యాత్మిక ఉత్సవం.. కాలంలో ఇంత కంటే హృద్యమైన సందర్భం, సమయం మరొకటి ఉందా? ఉంటేగింటే అది వసంతమై ఉంటుంది. ఉగాది.. రామ నవమి సమ్మిళిత చైత్ర మాసం.. మానవ జీవితాలను పరిపూర్ణంగా సాఫల్యం చేయగల చిత్రమైనది. ఇక, ఫాల్గుణ – చైత్ర మాసాల్లో వచ్చే తిథి పర్వాలు, పండుగల గురించి తెలుసుకుందాం.

ఫాల్గుణ శుక్ల చతుర్దశి/బహుళ పౌర్ణమిమార్చి 1, గురువారం
ఫాల్గుణ మాసం శుక్ల పక్షంలో ఇది చివరి తిథి. ఈ చతుర్దశి తిధితో పాటే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ గడియలు కూడా ప్రవేశించడం వల్ల ఈనాడు హోళీ పర్వదినమై ఉంది. శుక్ల చతుర్దశి తిథి నాడు మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అలాగే, ఈ తిథి లలిత కాంత్యాదేవి వ్రతానికి ఉద్ధిష్టమైనదనీ తిథితత్వంలో పేర్కొన్నారు. ఇక, ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మన తెలుగు నాట హోళీ పర్వదినం. దీనినే మహా పాల్గుణి అని కూడా అంటారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలితాలు కలుగుతాయని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఇక, ఈ నాడు హోలీ పేరిట వసంతోత్సవం నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ ఆనందోత్సవం వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో వాడుకలో ఉంది. రంగులు చల్లుకోవడం ఈనాటి ప్రధాన విధాయక కృత్యం. కామదహనం కూడా జరుపుతారు. కొన్ని గ్రంథాలు ఈ పూర్ణిమను డోలా పూర్ణిమగా పేర్కొన్నాయి. మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే వివాహం చేసుకుందని అంటారు. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. అలాగే, అంతర్జాతీయంగా కూడా ఈ వసంతోత్సవం వివిధ పద్ధతుల్లో ఆచరణలో ఉంది. ఇది ప్రత్యేకంగా వసంత రుతువుకు సంబంధించిన పర్వం. మాఘ మాసపు కృష్ణ పంచమికి జరిపే వసంత పంచమి దినాలకే వసంత రుతువు లక్షణాలు పొడచూపుతాయి. ఫాల్గుణ పూర్ణిమ నాటికి అవి మరింత ప్రస్ఫుటమవుతాయి. ఫల, పుష్ప జాతుల మొక్కలన్నీ కొత్త చిగుళ్లు తొడిగి రంగురంగుల పూలను విరబూస్తాయి. తొలకరి పంటలన్నీ ఈ కాలానికి ఇళ్లకు చేరి ఉంటాయి. ఈ వర్ణ సంబరానికి స్వాగతం పలుకుతూ జరుపుకునే పర్వంగా హోలీ ప్రసిద్ధమై ఉంది. ఇక, ఈనాటితో తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి తెప్పోత్సవం పరిసమాప్తి అవుతుంది.

ఫాల్గుణ బహుళ పాడ్యమి మార్చి 2, శుక్రవారం
ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథిని వసంత ఆరంభోత్సవ తిథిగా పేర్కొన్నారు. అలాగే, ఈనాడు ధూళి వందనం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. వసంతోత్సవాన్ని ఈ రోజు కూడా ఆచరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది.

ఫాల్గుణ బహుళ విదియ, మార్చి 3, శనివారం
ఈనాడు కామ మహోత్సవం. అయితే, ఇది ఎక్కడా భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యంలో ఉన్నట్టు కనిపించదు. ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీ సంబంధ పర్వంగా భావిస్తారు. హోలీకి అనుబంధంగా వచ్చే తిథి పర్వమని దీని గురించి భావించవచ్చు.
ఫాల్గుణ బహుళ తదియ, మార్చి 4, ఆదివారం
ఈ తిథి కల్పాదిగా ప్రసిద్ధం. ఈ మేరకు ఆయా వ్రత గ్రంథాలలో
ఉంది.

ఫాల్గుణ బహుళ చవితి మార్చి 5, సోమవారం
ఇది సంకష్ట హర చతుర్థి దినంగా ప్రసిద్ధి. వినాయకుడిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఇక, ఈ తిథి వ్యాసరాజ స్మ•తి దినంగా కూడా ప్రసిద్ధి. వ్యాసరాయ స్వామి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. రాజ వ్యవహారాలు, యుద్ధ విషయాలలో రాయల వారు ఈయన సలహాలు సూచనలు పొందే వారని ప్రతీతి. రాయచూరు యుద్ధంలో రాయలు విజయానికి వ్యాసరాయల వారి వ్యూహమే కారణమని అంటారు.

ఫాల్గుణ బహుళ అష్టమి మార్చి 9, శుక్రవారం
ఈ తిథి సీతాదేవి పుట్టిన రోజు. ఈమె రాముడి భార్య. జనకుని కుమార్తె. సీత పూర్వ వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి అనే ముని దంపతులకు వేదవతి జన్మించింది. పుట్టిన వెంటనే పురిటింటి నుంచి వేదఘోష వెలువడటం వల్ల ఈమెకు వేదవతి అనే పేరు పెట్టారు. ఒక సందర్భంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తపోదీక్షలోకి వెళ్లిపోయింది. విష్ణును తప్ప వేరెవరినీ పెళ్లాడనని ప్రతినబూనింది. తపోదీక్షలో ఉన్న ఆమెను రావణుడు తాకుతాడు. దీంతో ఆగ్రహోద్రగు రాలైన ఆమె అయోజనిగా ఈ భూమిపై తాను తిరిగి పుట్టి నిన్ను పుత్రమిత కళత్రంగా సర్వనాశనం చేస్తానని శపిస్తుంది. అన్నట్టే యోగాగ్ని సృష్టించు కుని ఆహుతైపోతుంది. పిమ్మట భూమిలో జనకుడికి పసిబిడ్డగా దొర కగా, సీతగా నామకరణం చేసి పెంచుకుంటాడు. రాముడిని పెళ్లాడి.. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల రీత్యా రావణాసుర సంహా రానికి కారకురాలవుతుంది. ఇంకా ఈనాడు కాలాష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా జరుపుకుంటారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

ఫాల్గుణ బహుళ ఏకాదశి, మార్చి 13, మంగళవారం
నీలమత పురాణంలో పేర్కొన్న ప్రకారం ఈనాడు కాశ్మీర్‍లో ఛందో దేవపూజ చేస్తారు. అలాగే, ఈనాడు కృష్ణ ఏకాదశి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా దీనిని పాప విమోచన ఏకాదశి అనీ, స్మార్త ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు.

ఫాల్గుణ బహుళ ద్వాదశి, మార్చి 14, బుధవారం
ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో మాత్రం ఈనాడు ఫాల్గుణ శ్రావణ ద్వాదశి వ్రతం ఆచరించాలని పేర్కొంటోంది. యోగేశ్వర భగవానుడిని పూజించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

ఫాల్గుణ బహుళ చతుర్దశి, మార్చి 16, శుక్రవారం
ఫాల్గుణ బహుళ చతుర్దశినే పిశాచ చతుర్దశి అని కూడా అంటారని నీలమత పురాణం అనే వ్రత గ్రంథం వివరిస్తోంది. ఈ తిథి నాడు శివపూజ చేసి పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని అందులో ఉంది.

ఫాల్గుణ బహుళ అమావాస్య, మార్చి 17, శనివారం
ఈనాడు గోదావరి తీరవాసులు ఏరువాక సాగుతారు. అమావాస్యను సాధారణంగా అశుభంగా భావిస్తారు. కానీ, శుభాశుభాలతో నిమిత్తం లేకుండా ఈనాడు ఆంధప్రదేశ్‍లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారు ఈ పర్వాన్ని వైభవంగా జరుపుకొంటారు. ఈ పర్వాన్ని దొంగ ఏరువాకగా కూడా పేర్కొంటారు. గ్రామ దేవతల ఉత్సవాలు ఈ తిథి నాడు విశేషంగా జరుగుతాయి. అలాగే, ఈ తిథి నాడు మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి ఇందుకు సంకేతంగా మత్స్యవాసులదేవుళ్లను పూజించాలని హేమాద్రి అనే పండితుడి అభిప్రాయం.

చైత్ర శుద్ధ పాడ్యమి, మార్చి 18, ఆదివారం
కొత్త సంవత్సర ఆరంభ దినమిది. అందుకే ఇది సంవత్సరాది అయ్యింది. వరాహమిహిరాచార్యుడు వసంత విషువత్తు కొన్ని శతాబ్దాలాకు ముందే అశ్వినీ నక్షత్రాలు చలించడాన్ని గుర్తించాడు. వేదాంగ జ్యోతిష కాలం కంటే ప్రాచీనమైన బ్రాహ్మణములు కాలంలో వసంత విషువత్కాలమూ కృత్తికా నక్షత్రంలో సంభవించడాన్ని పరిశీలించాడు. వసంత విషువత్తు తన కాలంలో అశ్విన్యాదిలో సంభవించడాన్ని గ్రహించి అది ప్రాచీనమైన దేవమాన దిన ప్రారంభమైన ఉత్తరాయణ పుణ్యకాలమనీ, సంప్రదాయానుసారంగా అదే వసంత కాలమనీ, వసంత విషువత్కాలమే ఉగాది అని నిర్ణయించి మాసరుతు సమతుల్యం సాధించాడు. వరాహమిహిరాచార్యుని నిర్ణయానుసారమే మనం చైత్ర మాసం పాడ్యమి తిథినే సంవత్సరారంభ దినంగా భావించి ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. కానీ, ధర్మసింధు, నిర్ణయ సింధుకారులు అన్నట్టు శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్నే నెలగా పరిగణిస్తున్నాం. కనుక చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పాటించే ఆచారం ఏర్పడింది. అలా ఉగాదికి బీజం పడింది.

చైత్ర శుద్ధ విదియ, మార్చి 19, సోమవారం
ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలను ఈనాడు దమనములతో పూజించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. బ్రహ్మ పురాణంలో ఈ మేరకు వీరికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పార్వతి తన భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉంది. ఆ సమయంలో అగ్ని అక్కడకు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా జరిగాడు. అప్పుడు శివుడికి వీర్యపతనం అయ్యింది. క్రీడా భంగానికి ఆగ్రహించిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాలని ఆజ్ఞాపించింది. అగ్ని ఆ వీర్యాన్ని భరించి కుమారస్వామి జననానికి కారణభూతుడయ్యాడు. ఇక, స్కంధ పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఆ వ్రతం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు తృతీయ వరకు చేయాలని అంటారు. ఇది స్త్రీల సుమంగళత్వాన్ని కాపాడ్డానికి ఉద్దేశించిన వ్రతం. అయితే, ప్రస్తుతం ఎక్కడా అరుంధతీ వ్రతం ఆచరిస్తున్న దాఖలాలు లేవు. అయితే, వివాహ సందర్బాలలో అరుంధతీ దర్శనం చేయించే ఆచారం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లి నాటి రాత్రి ఔపోసనా నంతరం నక్షత్ర రూపంలో ఉండే అరుంధతిని ప్రాతివత్య నిష్టకు ప్రతీకగా పెళ్లి కుమార్తెకు చూపిస్తారు. అరుంధతి అంటే- ఏ కారణం చేత కానీ ధర్మాన్ని అతిక్రమించనిది అని అర్థం.

చైత్ర శుద్ధ తదియ, మార్చి 20, మంగళవారం
ఈనాడు శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీవ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు శివపార్వతులను దమనాలతో పూజించి,
డోలోత్సవం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చని అంటారు. గౌరితో కూడిన శివుడిని పూజించడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. ఈనాటి
ఉదయాన స్త్రీలు మట్టితో గౌరీ విగ్రహాన్ని చేస్తారు. దానిని బాగా అలంకరిస్తారు. సాయంకాలం స్త్రీలందరూ ఒకచోటచేరి గౌరిని స్తోత్రిస్తూ పాటలు పాడుతారు. తిరిగి వెళ్లేటప్పుడు ప్రతి స్త్రీ దేవి వద్ద తన భర్త పేరు చెప్పాలి. ఈ పూజ జరిగిన అయిదవ నాటి సాయంకాలం గౌరీ విగ్రహాన్ని ఊరేగించి, తిరిగి ఇంటికి తీసుకువస్తారు. తిరిగి పాటలు పాడతారు. కుంకుమ పంచి పెడతారు. వడపప్పు ప్రసాదం ఇస్తారు. వెళ్లిపోయేటప్పుడు ప్రతి స్త్రీ దేవి వద్ద తన భర్త పేరు చెప్పాలి. సాధారణ:గా హిందూ గృహిణికి తన భర్త పేరు చెప్పడం నిషిద్ధం. అయితే, దేవి వద్ద ప్రతి స్త్రీ తన భర్త పేరు చెప్పడం వల్ల దేవి కృప అతనికి లభిస్తుందనే నమ్మకం ఈ ఆచారానికి ప్రాతిపదిక. నిజానికి చైత్ర శుద్ధ తదియ నాడు సౌభాగ్య గౌరీపూజలు చేసే ఆచారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేదు. తమిళనాట కూడా ఈ ఆచారం లేదు. తమిళులు ఈ గౌరీ పూజను వైశాఖ మాసంలో చేస్తారు. తెలుగు రాష్ట్రాల వారు సంక్రాంతికి పిమ్మట ముక్కనుమ నుంచి ఆచరించే సావిత్రీ గౌరీదేవి నోముల్లో ఈ వ్రతాచరణ విధానం ప్రాయకంగా అంతర్భాగమై ఉంది. ఇంకా ఈ తిథి నాడు సౌభాగ్య శయన వ్రతం, ఉత్తమ మన్వంతరాది వంటివీ ఆచరిస్తారు.
ఇంకా ఈ తిథి మత్స్య జయంతి దినంగా కూడా పరిగణనలో ఉంది.

చైత్ర శుద్ధ చతుర్థి, మార్చి 21, బుధవారం
చైత్ర శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరుడిని దమనములతో పూజించాలి. ఇంకా ఈ తిథి ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలకు ఉద్ధిష్టమైనదని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.

చైత్ర శుద్ధ పంచమి, మార్చి 22, గురువారం
ఈ తిథి నాడు హయ పూజ చేయాలి. పూర్వం మన రాజులు అశ్వ దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్ర హయ పంచమి వ్రతం మిక్కిలి ఆచారంలో ఉండేది. అలాగే, వాల్మీకి రామాయణంలో పేర్కొన్న ప్రకారం- శ్రీరాముడు ఇదే తిథి నాడు అయోధ్యలో పట్టాభిషేకం చేయించుకున్నాడు. అందుకే, ఇది ‘శ్రీరామ రాజ్యోత్సవ పర్వం’గానూ ప్రసిద్ధి. అలాగే, ఈ తిథి నాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈ తిథి శ్రీపంచమి, వసంతపంచమిగా కూడా ప్రసిద్ధి.

చైత్ర శుద్ధ షష్టి, మార్చి 23, శుక్రవారం
ఈనాడు స్కందోత్పత్తి జరిగిందని తిథితత్వం అనే గ్రంథం చెబుతోంది. స్కందుడిని ఈనాడు దమనంతో పూజించాలి. ఇంకా అర్య కుమారషష్టి వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారు.

చైత్ర శుద్ధ సప్తమి, మార్చి 24, శనివారం
ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన దినం. ఈనాడు అర్య వ్రతం ఆచరించే వారు రాత్రి పూట భోజనం చేయకూడదు. అలాగే, సూర్యుడిని దమనంతో పూజించాలి.

చైత్ర శుద్ధ అష్టమి, మార్చి 25, ఆదివారం
ఇది భవానీ దేవి పుట్టిన రోజు. భవానీ అనేది పార్వతిదేవికి గల మరో పేరు. ఆమె శివుని భార్య. శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షుని పెద్ద కుమార్తె. శివుడు ఒకసారి దక్షుడిని నిరాదరించాడు. ఆ కోపంతో దక్షుడు కూతురిని పుట్టింటికి తీసుకురావడం మానేశాడు. ఆమె చెల్లెళ్లను మాత్రం తరచూ తీసుకొస్తూ చీరలు, సారెలు పెడుతుండే వాడు. ఒకసారి దక్షుడు యజ్ఞం తలపెట్టాడు. దీనికి శివుడిని తప్ప మిగతా దేవతలందరినీ ఆహ్వానించాడు. దేవతలంతా ఆ యజ్ఞానికి వెళ్తుండటం చూసి సతీదేవి తానూ వెళ్తానంది. భర్త అనుమతి కోరింది. పిలవని పేరంటానికి పుట్టింటికైనా వెళ్లడం మంచిది కాదని శివుడు భార్యకు హితవు చెబుతాడు. తండ్రి తలపెట్టే యజ్ఞానికి చెల్లెళ్లంతా వస్తారని, అందరినీ చూసినట్టు ఉంటుందనీ స•తీదేవి భర్తను బతిమలాడింది. శివుడు నీ ఇష్టం అన్నాడు. సతీదేవి సంతోషంగా పుట్టింటికి వెళ్లింది. ఆమెను తండ్రి దక్షుడు పలకరించలేదు. ఇతరులెవ్వరినీ ఆమెతో మాట్లాడనివ్వలేదు. పైగా శివుడిని అమంగళ వేషుడనీ నిందించాడు. పతి నింద సతీదేవికి భరింపరానిదైనది. కోపంతో కాలి బొటనవేలిని నేలా రాచింది. ఆ రాపిడికి యోగాగ్ని పుట్టింది. అందులో ఆమె భస్మమైపోయింది. ఇది తెలిసి శివుడు ఆగ్రహోదగ్రుడై వీరభద్రుడిని పుట్టించి, దక్షుడి యజ్ఞాన్ని సర్వ నాశనం చేయించాడు. యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని భార్య అయిన మేనకాదేవి గర్భాన చైత్ర శుద్ధ అష్టమినాడు పుట్టింది. పర్వతరాజుకు పుట్టడం వల్ల ఆమెనే పార్వతి అని పిలువసాగారు. భవానీ ఆమె పర్యాయ నామం. ఇదే తిథి నాడు అశోకాష్టమి కూడా నిర్వహిస్తారు. ఈ అష్టమి నాడు స్త్రీలు ఎనిమిది అశోకపు మొగ్గలను తినాలని శాస్త్ర వచనం.

చైత్ర శుద్ధ దశమి, మార్చి 26, సోమవారం
ఈ తిథి నాడు ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి నిర్వహించాలని పంచాంగాలలో ఉంది. ఈనాడు దమనముతో ధర్మరాజును పూజించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఇక, శక పురుషుడైన శాలివాహనుడు తెలుగు నేల ప్రసవించిన మహా పురుషులలో ఒకడు. ఇతని చేతిలోనే విక్రమార్కుడు హతమయ్యాడని అంటారు.

చైత్ర శుద్ధ ద్వాదశి, మార్చి 28, బుధవారం
వామనుడినైనా, విష్ణువునైనా, వాసుదేవుడినైనా ఈ రోజున దమనంతో పూజించాలి. ఈనాడు భాతృప్రాప్తి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ద్వాదశి గొప్ప తిథుల్లో ఒకటి. ఈ తిథి విశిష్టత గురించి పద్మ పురాణంలో కొంత ప్రస్తావన ఉంది. క్షీరసాగర మథనం సందర్భంలో విష్ణువు దేవతలతో ఇలా అన్నాడట- ‘ద్వాదశి నాడు లక్ష్మీసహితుడనైన నన్ను తులసీ దళాలతో విశేషంగా పూజించారు కాబట్టి ద్వాదశి తిథి నాకు మిక్కిలి ప్రియతమమైనదిగా ఉంటుంది. ఇది మొదలు జనులు ఏకాదశిని ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ప్రాతఃకాలాన శ్రద్ధాభక్తులతో లక్ష్మీసహితుడనైన నన్ను తులసితో పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగింటినీ ఇచ్చేది’.ఈ తిథి మహావీర జయంతి దినం. ఈనాటి నుంచే శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం అవుతాయి.

చైత్ర శుద్ధ త్రయోదశి, మార్చి 29, గురువారం
ఈ తిథి అనంగ త్రయోదశి. దీనినే మదన త్రయోదశి అని కూడా అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మథుడని అర్థం. కాగా, ఇది మన్మథుడికి సంబంధించిన పర్వం. మన్మథుడు బ్రహ్మ చేత, శివుడి చేత అనంగుడైనట్టు (అదృశ్యుడు) పురాణాల్లో రెండు కథలు ఉన్నాయి. మన్మథుడు సౌందర్యవంతుడు. అతని వాహనం చిలుక. అరవిందాది పుష్పాలు అతని బాణములు. అతను ప్రేమాధి దేవత. సృష్ట్యాదిలో బ్రహ్మ హృదయం నుంచి మన్మథుడు, వామ భాగం నుంచి రతీదేవి పుట్టారు. మన్మథుడు తన బాణాలు మొదట బ్రహ్మ మీదనే ప్రయోగించాడు. దీంతో బ్రహ్మ అతనిని శరీరం లేనివాడుగా అయ్యేటట్టు శపించాడు. ఇక, శివునిపైనా బాణాలు ప్రయోగించి ఆయన క్రోధాగ్నితో భస్మమై అనంగుడయ్యాడు. రతీదేవి భర్త దుస్థితికి రోదించింది. మన్మధుడు ఆమెకు మాత్రమే కనిపించేలా బ్రహ్మ, విష్ణువు వరమిచ్చారు. రతీ మన్మథులు అన్యోన్యానురాగం గల దంపతులు. కాబట్టి ఈ రోజున మన్మథుడిని పూజిస్తే దంపతుల మధ్య అన్యోన్యం, అనురాగం, ప్రేమ పెరుగుతాయని అంటారు.

చైత్ర శుద్ధ చతుర్దశి, మార్చి 30, శుక్రవారం
మన పంచాంగాలలో ఈనాడు శైవ చతుర్దశిగా పేర్కొన్నారు. శివుడిని ఈనాడు దమనములతో పూజించాలని, శివ సన్నిధి గల తీర్థాలలో స్నానం చేయాలని పురుషార్థ చింతామణి, తిథి తత్త్వం అనే వ్రత గ్రంథాలలో ఉంది. ఇది మదన చతుర్దశిగా కూడా ప్రసిద్ధి. ఇక, ఈనాడు నృసింహ డోలోత్సవం చేస్తారని కూడా అంటారు.

చైత్ర శుద్ధ పౌర్ణమి, మార్చి 31, శనివారం
ఏడాదికి పన్నెండు పూర్ణిమలు. ఆ పన్నెండు పూర్ణిమలలోనూ ఒక్కో నక్షత్రంతో కూడి ఉంటాడు చంద్రుడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పూర్ణిమకు పేరు వస్తుంది. చైత్ర నక్షత్రంతో కూడిన పూర్ణిమకు చైత్ర పూర్ణిమ అని పేరు. ఇరవై ఏడు నక్షత్రాలలో చిత్త ఒకటి. అది ముత్యంలా ఉండే ఒక్కటే నక్షత్రం. మంచి ప్రకాశవంతమైనది. అట్టి చిత్రా నక్షత్రంతో కూడిన పున్నమికి ‘చైత్రీ’ అని పేరు. ఈనాడు మధుర కవి ఆళ్వారు తిరు నక్షత్రం. ఏ మాసంలో చైత్ర పూర్ణిమావాస్య వస్తుందో ఆ మాసం చైత్ర మాసం అని పిలువబడుతుంది. చైత్రమాసంలో సూర్యుని ప్రకాశం ప్రబలం కావడం ప్రారంభమవుతుంది. ఆ ప్రబలమైన సూర్య ప్రకాశాన్ని అందుకుని చంద్రుడు ఈ నెలలో చక్కని వెన్నెల కాస్తాడు. ఆ వెన్నెల పౌర్ణమి నాడు మరీ ఎక్కువగా ఉంటుంది. మంచి ఎండ, మంచి వెన్నెల గల ఈ పౌర్ణమి మానవునికి సుఖాన్ని కలిగించే రోజులలో ఒకటిగా ఉంటుంది. కాబట్టే దీనిని మన పంచాంగకర్తలు ‘మహా చైత్రి’ అన్నారు. చైత్ర పూర్ణిమ గురువారంతో కానీ, శనివారంతో కానీ, ఆదివారంతో కానీ కలిసి వస్తే అది మరీ పుణ్యప్రదమై ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈసారి చైత్ర పూర్ణిమ మార్చి 31, శనివారం వచ్చింది. కాబట్టి ఇది ఉద్ధిష్టమైనది అనడంలో సందేహం లేదు. ఈనాడు చిత్ర వస్త్రదానం, దమన పూజవిహిత కృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. చిత్ర వస్త్ర దానం అంటే, రంగురంగుల బట్టలను దానం చేయడం. ఈ పర్వం సందర్బంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహా ఫలం.చిత్ర పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం ఆచరించడం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ పూజ చేసిన వారికి యమ దండన ఉండదని శాస్త్ర ప్రమాణం.
మధుర మీనాక్షి దేవాలయంలో ప్రథమ పూజ ఒకానొక చైత్ర పూర్ణిమ నాడు జరిగింది. అందుచేత ఏటేటా ఆనాడు అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ప్రతి చైత్ర పూర్ణిమ రాత్రికి ఇప్పటికి కూడా ఇంద్రుడు అక్కడికి వచ్చి పూజ చేస్తాడని అక్కడి ప్రజల నమ్మకం. ఇక, ఈనాడు ఆంధప్రదేశ్‍, మహారాష్ట్ర ప్రాంతాల్లో హనుమజ్జయంతి పర్వాన్ని నిర్వహిస్తారు.
ఈనాటి నుంచి రేవతి కార్తె ఆరంభమవుతుంది. అలాగే తిరుమల శ్రీవారి వసంత్సోతవాలు ఈనాటితో ముగుస్తాయి

(చైత్ర శుద్ధ పాడ్యమి, మార్చి 18 ఉగాది/ చైత్ర శుద్ధ నవమి, మార్చి 25 శ్రీరామ నవమి
ఒకపక్క వసంత సోయగాలు.. ప్రకృతి హొయలు.. వసంతాయన మధు మాసపు ఆనంద డోలికలు.. అదే ‘విలంబి’ నామ సంవత్సర
ఉగాది పర్వం..మరోపక్క రాములోరి కల్యాణ సంబరాలు.. ఆధ్యాత్మిక ఉత్సవ కాంతులు.. శ్రీరామ నవమి వేడుక.. ఈ జంట పర్వాల సమ్మేళనం చైత్ర మాసం.అరవై సంవత్సరాల కాలాన్ని ఒక మహా విపంచిగా భావన చేశారొక కవి. అరవై తంత్రులు ఉన్న వాద్యమది. ఒక్కో సంవత్సరం ఒక్కొక్క తంత్రి పలుకుతుందట. మన సంప్రదాయంలో సంవత్సరాలకీ పేర్లు ఉన్నాయి. సంవత్సరాన్ని ఆరు రుతువులుగానూ, పన్నెండు మాసాలగానూ విభజించారు మన పూర్వులు. ఈ మాసాల్లో తొలి మాసం చైత్రం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని పురాణోక్తి. చైత్రంలో వసంతం వెల్లివిరుస్తుంది. వసంతం రుతువుల రాణి. పూర్వ కవులు ప్రతి రుతువులోనూ అందాలు దర్శించినా అన్ని రుతువుల్లోకీ వసంతం అత్యంత ఆహ్లాదకరమైనదని వారికి అనిపించి ఉంటుంది. తెలుగునాట వసంతోత్సవాలు జరుపుకొనే సంప్రదాయం ఉంది. శ్రీరామ నవమి ఉత్సవాల్లో సైతం ఆఖరి రోజున వసంతం చల్లుకోవడం ఒక వేడుకగా ఇటీవల కాలం వరకు కొన్నిచోట్ల ఉంది. ఉత్తరాది వారి హోలీ తరువాత వచ్చే పండుగ ఇది. ఆటలు పాటలతో ఉత్సవాల రోజులు సందడిగా సాగిపోతాయి. ఒకప్పుడు మతం, సంస్క•తి పరస్పర ఆశ్రితాలుగా ఉండేవి. కనుక ఈ దినాలు సాంస్క•తిక ఉత్సవాలుగా ఒక ఉత్సాహ సందర్భానికి వేదికగా నిలుస్తుండేవి.
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి కనుక కవిపండితులను రప్పించి వసంతోత్సవాల్లో వారిని సత్కరించే వాడని నంది తిమ్మన పారిజాతాప హరణం అనే ప్రబంధంలోని ఒక పద్యంలో వివరించాడు. కొండవీటి పాలకుడు కుమారగిరిరెడ్డి పాలనలో వసంతోత్సవాలు కడు వైభవంగా జరిగేవట. అందుకే ఆయనకు ‘కర్పూర వసంతరాయలు’ అనే బిరుదు ఉండేది. వసంతం ప్రకృతికాంతకు సీమంతం. వసంతాన్ని మధు మాసమనీ, మాధవ మాసమనీ అంటారు. మాధవుడంటే విష్ణువు. విష్ణువుకు ప్రీతికరమైన మాసమిది. మనసును చలింప చేసే వసంత మాసం మన్మథ మాసం. వసంతంలో ఎర్రగా పూచేవి మోదుగ పూలు. వసంతంలోని నందివర్ధనాలు కంటికి చల్లదనాన్ని ప్రసాదించేవైతే మల్లెలు, జాజులు శిరోజాలంకరణకే కాక పరిమళ ద్రవ్యాల్లోనూ ఉపయోగపడుతుంటాయి. వేప దివ్యౌషధం. వాటి కాయలను వ్రణాల చికిత్సలో వినియోగిస్తారు. పెద్దన మను చరిత్రలో వసంతాన్ని శత్రువుపై దండెత్తిన రాజుగా అభివర్ణిస్తాడు. వసంతం రాగానే
దేవకాంతలు హిందోళంలో గానం చేశారట. మానవ జీవితమే ఆరు రుతువుల సమ్మేళనం. కొత్త కొత్త ఆలోచనలే వసంతం. నిరాశా నిస్ప•హలకు లోనుకాకుండా భవిష్యత్తుపై ఆశలు పెంచి కొత్త జీవితానికి ఊపిరి పోసేది వసంతం. పగలు, వెలుగు-చీకటి, సుఖం-దుఃఖం, తీపి-చేదుల మిశ్రమ ఫలితాలే జీవిత పంచాంగంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. రోగాలను తొలగించి శుభాలను ఇచ్చే ప్రతి ఉగాదీ నూతన కార్యారంభమే. ఇక, ఈ సంవత్సరం ‘విలంబి’ నామ సంవత్సరం. దీనికి ఆటపట్టయిన ఆరంభ మాసమే చైత్రం.

ఉగాది.. పంచాంగ శ్రవణం
తెలుగు మాసాలలో మొదటిది చైత్రం. ఈ మాసపు ఆరంభ దినమే ఉగాది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల యుగమే ఉగాది. తిథి సంపదలను, వారం ఆయుష్షును ఇస్తుంది. నక్షత్రం పాపాలను హరిస్తుంది. యోగం రోగాలను నివారిస్తుంది. చివరిదైన కరణం విజయాన్ని సిద్ధింప చేస్తుంది. సంపదలను కోరుకునే వారు తిథిని, దీర్ఘాయుష్ణును కోరుకునే వారు వారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పాప పరిహారం కోసం నక్షత్రం విషయంలో, రోగ నివారణకు యోగం విషయంలో జాగ్రత్తగా
ఉండాలి. విజయం కోసం కరణం విషయంలో శ్రద్ధ చూపాలి. ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించే ముందు, అభివృద్ధి పనులు చేపట్టే ముందు ఇతర మంచి పనుల ప్రారంభానికి ముందు ఈ అయిదు అంగాలు బలంగా, అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ అయిదూ వేటికవే ప్రత్యేక ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి.
రేపు ఎలా ఉండబోతోంది? దీన్ని గురించి తెలుసుకోవడం అందరికీ ఆసక్తే. ఎంతో కుతూహలం కూడా. అదీ కొత్త సంవత్సరం ఆరంభ దినాన ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతూ భవిష్యత్తు ఎలా ఉండనుంది?, కొత్త సంవత్సరంలో గ్రహ బలాలు, దోషాలు ఏవిధంగా ఉన్నాయి? ఆదాయ వ్యయాల తీరుతెన్నులేమిటి? అనేవి ఉగాది వేదికగా తెలుసుకునే సంప్రదాయం ఏర్పడింది. కొత్త వ్రస్తాలు ధరించి, ఆరు రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించి, ఇష్టదేవతకు పూజాదులు చేసి ఆనందంగా గడపడం ఉగాది ప్రధాన కృత్యమైతే ఆనాడు ఆచరించే విధుల్లో ప్రధానమైనది పంచాంగ శ్రవణం. వ్యక్తిగత జీవితంలో కలిగే మార్పులతో పాటు సమాజంలో చోటుచేసుకునే పరిణామాలు, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ స్థితిగతులన్నీ పంచాంగంలో భాగమై ఉంటాయి. రాశుల వారీగా సంవత్సర ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, నవనాయక ఫలితాలు వంటివి పండితులు చదివి వినిపిస్తారు. గ్రహ గమనాలు, అవి మానవాళిపై చూపే ప్రభావాల గురించి కూడా పంచాంగమే తెలియ చెబుతుంది. 2018 ‘విలంబి’ నామ సంవత్సరం. చైత్ర శుద్ధ పాడ్యమి, మార్చి 18 ఉగాది పర్వదినం. ఈనాడు పంచాంగ శ్రవణం చేయడం ఫలదాయకం. శాస్త్రోక్తమైన పంచాంగ శ్రవణం గ్రహదోషాల్ని నివారిస్తుంది. ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అపమృత్యు భయాలు తొలగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. సంపదలు కలుగుతాయి. శుభ ఫలితాలు లభిస్తాయి. పంచాంగ శ్రవణం ఇంతటి విశేషమైనది కాబట్టే పూర్వీకులు దీనిని ఉగాది నాడు ఆచరించాల్సిన తప్పనిసరి విధిగా నిర్ణయించారు.

ఉగాది ప్రబోధం
నేర్చుకోవాలే కానీ, జీవితంలో మనం గడిపే ప్రతి రోజూ మనకు ఒక్కో పాఠాన్ని నేర్పుతుంది. ఇక పండుగలు, పర్వదినాలైతే ఏకంగా పరమార్థాన్నే బోధిస్తాయి. 2018, మార్చి 18 ‘విలంబి’ నామ సంవత్సర పర్వదినం మనకు మరీ ప్రత్యేకమైనది. ఈ రోజంతా ఎంత సంతోషంగా ఉండగలిగితే మిగతా ఏడాదంతా అంత ఆనందంగా ఉండగలమనేది ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రత్యేకతే కాక మరెన్నో విధాలుగా ఇది అద్భుత పర్వం.
ఉగాది నాడు మధుర, తిక్త, లవణ, ఆమ్ల, కటు, కషాయం వంటి షడ్రుచులతో చేసిన పచ్చడిని స్వీకరించడం ఒక సంప్రదాయం. జీవితం అంటేనే సుఖదుఃఖాల మిశ్రమం. వాటిని సమభావంతో స్వీకరించి, సమన్వయంతో నెగ్గుకురావాలనే అంతరార్థం ‘ఉగాది పచ్చడి’లో ఇమిడి ఉంది. మన ఆచార వ్యవహారాలు, సంస్క•తీ సంప్రదాయాలు ఘనమైనవి. పండుగలు, పర్వదినాల వంటి సందర్భాలు వాటిని మరింత పటిష్టపరుస్తూ ఉంటాయి. మనం నిర్వహించుకునే ప్రతి పండుగ విశిష్టమైనదే. అవన్నీ జీవిత పరమార్థాన్ని బోధించేవే.
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. వారు మనకు చేసిన ఈ ఉపకారం తాలూకు రుణం ఎంత చేసినా తీరదు. అటువంటి వారిని మరిచిపోకుండా వారి పట్ల నిరంతరం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని చాటే పర్వదినం- ‘సంక్రాంతి’. అందుకే ఈనాడు పితృ దేవతలను సంతృప్తిపరిచేలా పూజాధికాలు ఉంటాయి.
అక్రమాలు రాజ్యమేలినా, దుర్మార్గులు అందలాలు ఎక్కినా అది తాత్కాలికమే. చివరకు మంచితనమే విజయం సాధిస్తుంది. చెడుపై మంచిదే పై చేయి అనీ, అధర్మంపై ధర్మమే విజయం సాధిస్తుందని సందేశం ఇచ్చే పండుగ- ‘విజయ దశమి’.
అజ్ఞానాంధకారం తొలగిపోయి, రాక్షసత్వంపై సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ విశేషం- ‘దీపావళి’.
జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అది మంచికానీ, చెడుకానీ దానిని సమర్థంగా ఎదుర్కొని నిలవాలని సందేశాన్ని ఇచ్చే పర్వం-
‘ఉగాది’.
జీవితంలో నిత్యం సుఖాలనే అనుభవించాలని, దుఃఖాలు మన దరిదాపులకు కూడా రాకూడదని ఆశించడం అత్యాశే అవుతుంది. అటువంటి వారు ఎన్నటికీ, ఎప్పటికీ ఉన్నతిని సాధించలేరు. జీవితం అన్నాక కష్టం, సుఖం.. రెండూ ఉంటాయి. ఇవి రెండూ రెండు రెక్కలు. వాటిని సమన్వయం చేసుకుంటేనే మనం పైకి ఎదగగలం. ఇది ప్రకృతి ధర్మం. ఇది ప్రకృతి నియమం. దీన్ని ఎవరు ఉల్లంఘించినా, ఉల్లంఘించాలని చూసినా పరిణితిని సాధించలేరు.
ఈ నూతన సంవత్సరం మనకు సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు, భయక్రోధాలకు అతీతమైన పరమోన్నతమైన స్థితిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుందాం.

రమణీయం.. రామనవమి
చైత్ర మాసం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత రుతువులోని శుక్ల పక్ష నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆనాడే ఆయన జన్మదినంతో పాటు కల్యాణం జరిపించడంలో లోకోత్తరమైన రహస్యం ఇమిడి ఉంది. దశావతరాల్లో రామావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ అవతారాలు కేవలం దుష్టశిక్షణ, శిష్ట రక్షణ అనే రెండు మహత్కార్యాలపైన కేంద్రీకృతమయ్యాయి. పరబ్రహ్మ రాముడై వెలియడానికి ముఖ్య కారణం- ‘ధర్మ సంరక్షణ’. అందుకే ‘రామో విగ్రహవాన్‍ ధర్మః’ అని కీర్తించాడు వాల్మీకి మహర్షి.
ఈ సృష్టిలో మనిషిగా పుట్టి ఉదరపోషణతో తృప్తిపడి, మళ్లీ మళ్లీ పుట్టడం గమకమే అవుతుంది కానీ, గమ్యం కాజాలదు. తన ఉనికిని నిలబెట్టుకోవడానికి మనిషి ఏం చేయాలి? తన పాత్రకు ఎలా న్యాయం చేకూర్చాలి? ఆ పరమార్థం తెలపడానికే రాముడు ఈ భూమి మీద మానవుడై అవతరించాడు. నాలుగు పురుషార్థాల్లో ధర్మం ఇటు, మోక్షం అటు ఎదురెదురుగా నిలిచి, అర్థకామాలను ధర్మ మార్గాన సాధించాలని, అదే జీవన్ముక్తి మార్గమని రామకథ ద్వారా మనందరికీ రామాయణం మార్గదర్శనం చేస్తోంది.
చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులుగా శాస్త్ర ప్రసిద్ధి. ఈ నవమికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. పరాశక్తి దేవరుషి ప్రార్థనల మేరకు హిమవత్పర్వత పుత్రికగా చైత్ర శుద్ధ నవమి నాడు ఉద్భవించిందని పురాణగాథ. ఈ తిథి శక్తి ప్రధానం కావడంతో
వసంత నవరాత్రులు దేవీ భక్తులకు అత్యంత ప్రధానమయ్యాయి. అదే విధంగా- అదితీ దేవతాకమైన ‘పునర్వసు’ నక్షత్రంలో జగత్‍ విఖ్యాతుడైన శ్రీమన్నారా యణుడు పరిపూర్ణావతారంగా, శ్రీరాముడిగా అవతరించినదీ ఈ తిథి నాడే. అందుకే ఇవి రామ నవరాత్రులు అయ్యాయి. ఈ ఘట్టాన్ని పరిశీలిస్తే.. ఎన్నో చక్కని సమన్వయాలు కనిపిస్తాయి. జగదాంబ లలితాదేవి. లోకాతీత లావణ్యమే లలిత. కనుకనే ఆమె త్రిపుర ‘సుందరి’. ‘రామ’ అంటే ‘రమణీయ’ స్వరూపం. ఇదీ సౌందర్య తత్త్వమే. నిత్య నూతన సౌందర్యానికి ‘రమణీయం’ అని పేరు. ఇక వసంత రుతువు అంటేనే పూలు, చెట్లు చిగురించే, విరబూసే అందాల రుతువు. ఈ మాసంలో సౌందర్యతత్వాన్ని లలితరూపంగానో, రామభావంగానో అర్చించడం ఒక చక్కని ఔచిత్యం.
వసంత నవరాత్రుల్లో మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది అయితే, చివరి రోజు చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి. రామ నవమి తొమ్మిది రోజుల పర్వం. ఉగాది తొలి రోజు పాడ్యమి మొదలుకుని నవమి వరకు రామ మందిరాల్లో, రామాలయాల్లో రామాయణ కథా కాలక్షేపాలు, భజనలు జరుగుతాయి. అగస్త్య సంహితలో మాత్రం రామ జయంతి మూడు రోజుల పండుగగా పేర్కొన్నారు. శ్రీరాముని పూజకు పునర్వసు నక్షత్రంతో కూడిన చైత్ర శుద్ధ నవమి చాలా పుణ్యవంతమైన కాలం. అష్టమితో కలిసిన నవమిని రామపూజకు విష్ణు భక్తులు ఎప్పుడూ చేసుకొనకూడదని అగస్త్య సంహిత చెబుతోంది. అందుచేతనే మిగులు నవమి నాడు వైష్ణవులు శ్రీరామ జయంతిని జరుపుతారు. శ్రీరామ నవమి నాటి కార్యకలాపాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీరామ నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ శ్రీరామ నవమి ఆఖరి రోజు. అతి ముఖ్యమైన రోజు. ఉపవాసాది నిష్టలు వహించని వారు కూడా ఆనాడు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటారు. రామ కల్యాణాన్ని తిలకిస్తారు. ఆంధప్రదేశ్‍, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీరామ నవమి నాడు సీతారామ కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఈ ఆచారం ఇతర ప్రాంతాలలో లేదు. పుట్టిన రోజు పండుగ నాడు కల్యాణం చేయడానికి గల కారణాలేమిటో తెలియవు. ఇక, రామ సంబంధమైన పర్వాలు ఏడాదిలో శ్రీరామ నవమి కాక మరో రెండు ఉన్నాయి.
ఒకటి- రామ లక్ష్మణ ద్వాదశి. ఇది జ్యేష్ట శుద్ధ ద్వాదశి నాడు వస్తుంది.
రెండు- జానకీ జయంతి. ఇఇ ఫాల్గుణ శుద్ధ అష్టమి నాడు. జనక మహారాజు యజ్ఞశాల కోసం భూమిని దున్నుతుండగా నాగటి సాలులో తగిలిన బంగారు పెట్టెలో సీత ఈనాడే దొరికింది. అందుచేత ఈనాడు సీతా జయంతి దినమైంది. రామ సంబంధపు పర్వదినాలైన ఈ రెండు రోజులు కూడా రామ కల్యాణానికి అనువైన తిథులని అనుకోవడానికి వీలులేదు. రామ నవమి నాడు దేవాలయంలో జరిగే సీతారాముల కల్యాణానికి వెళ్లి తలంబ్రాల బియ్యం పుణ్య వస్తువుగా పుచ్చుకుని తలపై వేసుకోవడం తెలుగు వారి సనాతన ఆచారంగా ఉంది. రామ నవమికి మిరియపు పొడి వేసిన బెల్లపు పానకం విరివిగా వాడటం ఆంధ్రుల్లో పలు ప్రాంతాల వారి ఆచారం. ఈ పండుగ నాటికి తెలుగు నాట వేసవిగాడ్పులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ కాలంలో పానకం పుచ్చుకోవడం తాప శమనం గానూ, కాలోచితంగానూ ఉంటుంది.

Review వసంతానికి స్వాగతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top