చైత్రాది మాస పరిగణనలో శ్రావణం ఐదవ మాసం. ఈ మాసం అనేక ఆధ్యాత్మిక విషయాల రీత్యా ఉత్క•ష్టమైనది. విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రమని అంటారు. అటువంటి నక్షత్రయుక్త పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. అలాగే, శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మాసమిది. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. ఆధునిక యుగంలో ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే జన్మించారు. ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్, చూడికుడుత్త నాంచార్ తదితరుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే. గరుడుడు అమృతభాండాన్ని సాధించింది ఈ మాసంలోని శుద్ధ పంచమి నాడు.
సువాసినులంతా సిరిదేవతను తలపించేలా ముస్తాబవుతారు. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. మామిడాకుల మంగళ తోరణాలు కళకళలాడుతుంటాయి.. ఇదీ శ్రావణ మాసంలో కనిపించే ఆధ్యాత్మిక శోభ. ఈ నెలలో ముప్ఫైకి ముప్ఫై రోజులూ పవిత్రమే. పర్వదినాలకు ‘నెల’వే. వర్షంతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. మేఘమాలికలు బారులుతీరి మురిపించే సమయమిది. ప్రకృతి సస్యశ్యామలమైన పులకరింతలతో వెదజల్ల్లే కాలం. ఈ వర్షరుతువులో అడుగడుగునా పర్వదినాలతో శ్రావణ మాసం శోభిల్లుతుంది.
ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయన పక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది. వేదాధ్యయనానికి బ్రహ్మోపదేశం తప్పనిసరి అని చెబుతారు. బ్రహ్మోపదేశ స్వీకరణకు సూచికగా యజ్ఞోప వీతధారణ చేస్తారు. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని ‘శ్రావణి’ అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపమే లక్ష్మీదేవి. మహాలక్ష్మిని అష్టైశ్వర్యప్రదాయినిగా పూజిస్తారు. లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతోందని శ్రీగుణరత్న శ్లోకం చెబు తోంది. మహాలక్ష్మికి మహదానందం చేకూర్చడం కోసమే శ్రీహరి ఈ లోకాలను సృష్టించాడని భాగవతం వెల్లడిస్తోంది. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. సంకల్పం చేసేది హృదయస్థానం. విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి. కార్యాల్ని జయప్రదంగా కొనసాగింపచేసే ధీయుక్తి. ‘లోకైక దీపాంకురమ్’ అని సిరులతల్లిని మనం ఆరాధిస్తాం. ఆమె ఎల్ల లోకాలకు ఏకైక దీపం. ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం. సకల జీవరాశులు ఆమె సంతానం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణ మాసమే. ఈ మాసం విశేషాల్లోకి వెళ్తే..
జూలై 24: శ్రావణ శుద్ధ (శుక్ల) పాడ్యమి
ఈ తిథి నుంచి శుక్ల పక్షం ఆరంభ మవుతుంది. శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరములను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవ అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు. దర్భలను ‘పవిత్రం’ అంటారు. వీటికి మొదట పూజ చేసిన తరువాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురు దేవతల పేరుతో పంచుతారు. ఇదే పవిత్రారోపణోత్సవ పక్రియ. కాగా, శ్రావణంలో వచ్చే ఈ తొలి సోమవారం మొదలు.
జూలై 25: శ్రావణ శుద్ధ విదియ
శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రా రోపణం’ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. తిథి తత్వం దీనినే ‘మనోరథ ద్వితీయ’ అని చెబు తోంది. ఈనాటి పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాదికాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. కాగా, జూలై 25 మంగళవారం నాటి ఈ తిథి నుంచి మంగళగౌరీ వ్రతం ప్రారంభమవుతుంది. తిరిగి ఆగస్టు 1, 8, 15 తేదీల్లో వచ్చే మంగళవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
జూలై 26: శ్రావణ శుద్ధ తదియ
ఈనాడు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచ రించాలని కృత్యసార సముచ్చయము అనే వ్రత గ్రంథంలో ఉంది.
జూలై 27: శ్రావణ శుద్ధ చవితి
ఈ తిథి విఘ్న పూజకు ఉద్ధిష్టమైనదని వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు.
జూలై 28: శ్రావణ శుద్ధ పంచమి
శ్రావణ శుద్ధ పంచమిని కొన్ని వ్రత గ్రంథాలు నాగ పంచమిగా పేర్కొంటున్నాయి. స్త్రీలు ఈనాటి ఉదయమే పూజ చేస్తారు. ఈనాడు ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజిస్తారు. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేసిన ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరా జనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ఉంది. నాగపంచమి నాడు భూమి దున్నకూడదని అంటారు. కాగా, నాగపంచమి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. తెలంగాణలో శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకొంటుంటే, ఆంధ్ర ప్రదేశ్‍లో మాత్రం కార్తీక శుద్ధ పంచమి నాడు నాగపంచమి జరుపుకోవడం ఆచారంగా వస్తోంది.
జూలై 29: శ్రావణ శుద్ధ షష్ఠి
శ్రావణ శుద్ధ షష్ఠి తిథి కల్కి జయంతి దినమని ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సూపౌదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో రాశారు. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సూపౌదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం).
జూలై 30: శ్రావణ శుద్ధ సప్తమి
శ్రావణ శుద్ధ సప్తమి చాలా విధాలుగా ముఖ్యమైన దినం. ప్రధానంగా ఈ తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించినది. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి (హస్తా నక్షత్రం వస్తే) వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది.
జూలై 31: శ్రావణ శుద్ధ అష్టమి
శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనది. ఈ అష్టమి నాడు దుర్గా పూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అనీ అంటారు.
ఆగస్టు 1: శ్రావణ శుద్ధ నవమి
ఈ తిథి నాడు కౌమారీ నామక పూజనమ్ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఆగస్టు 2: శ్రావణ శుద్ధ దశమి
శ్రావణ శుద్ధ దశమి ఆశా దశమి. ఈనాడు చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరు తాయని ప్రతీతి. పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించాలి. అలాగే, ఈనాడు తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆగస్టు 3: శ్రావణ శుద్ధ ఏకాదశి
ఈ తిథి పుత్రైదైకాదశిగా ప్రసిద్ధి. మహిజిత్తు అనే ఆయన శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా అతనికి పుత్ర సంతానం కలిగింది. పుత్రుడిని ప్రసాదించిన ఏకాదశి కాబట్టి పుత్రదైకాదశి అయ్యిందని ఆమాదేర్ జ్యోతిషీలో ఉంది.
ఆగస్టు 4: శ్రావణ శుద్ధ ద్వాదశి
ఈ తిథితో కూడిన శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అయి ఉంటుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలతల్లిని పూజించడం ఆచారంగా వస్తోంది (వరలక్ష్మీ వ్రత విధానం, వైభవం గురించి ‘వ్రత మహిమ’లో చదవవచ్చు.
ఆగస్టు 5: శ్రావణ శుద్ధ త్రయోదశి
ఈనాటితో తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు ముగు స్తాయి. అలాగే, ఈ తిథి శని త్రయోదశి. ఇంకా ఈనాడు అనంగ వ్రతం చేయాలని, రతీమన్మథులను నెలకొల్పి పూజించాలని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మినుములతో చేసిన మినపసున్ని ఉండలు, పాలను నివేదించాలి. మైనపువత్తితో హారతినివ్వాలి. అనంగుడు అంటే మన్మథుడు. శ్రావణ శుద్ధ త్రయోదశి ఆయనకు ప్రీతికరమైన తిథి. ఈనాడు ఆయనకు పవిత్రా రోపణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది.
ఆగస్టు 6: శ్రావణ శుద్ధ చతుర్దశి
ఈ తిథి నాడు శివునికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక 12-8-4 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి, ముడి ముడికి మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీలు 50, 38, 21 ఉండేలా పవిత్రం (దర్భలు) వేలాడదీయాలి. ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అని వ్యవహరిస్తారు.
ఆగస్టు 7: శ్రావణ శుద్ధ పౌర్ణమి
రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ పేరుతో ఈనాడు ఉల్లాసకరమైన వేడుక నిర్వహించుకోవడం ఆనవాయితీ. రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ. ఈ రోజు ‘అధ్యాయోపా కర్మ’ జరుపుతారు. అంటే, వేదాధ్యయన ప్రారంభం. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించాలి. ఇంటికి వచ్చి అధ్యయన హోమం ఆచరించాలి. మర్నాడు ఉపాకర్మాంగభూతంగా 1,008 సార్లు గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువ ఆచారంలో ఉంది. దీనినే మహారాష్ట్ర ప్రాంతంలో నార్లీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుడిని పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో దీనినే పౌవతి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివ, విష్ణు, గణేశులను పూజిస్తారు. అలాగే, సర్వరోగ ఉపశమనం కోసం, సర్వ శుభాల కోసం ఏం చేయాలని ధర్మరాజు కృష్ణుడిని అడిగాడట. అందుకు కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధిని ఉపదేశించాడట. శాస్త్రం ప్రకారం రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా.. ఆచరణలో మాత్రం చెల్లెలు తమ్ముడు, అన్నకు చెల్లెలు కట్టడం ఆచారంగా మారింది. అలాగే, ఈనాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు.
ఆగస్టు 8: శ్రావణ బహుళ (కృష్ణ) పాడ్యమి
శ్రావణ బహుళ పాడ్యమి నాడు ధనాప్రాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో
ఉంది. ఇది మొదలు భాద్రపద పూర్ణిమాంతం వరకు ఆచరించాలని మాస వ్రతమిది. దీనినే శివ వ్రతమని కూడా అంటారు.
ఆగస్టు 9: శ్రావణ కృష్ణ విదియ
ఈనాడు విష్ణువు వాకుడు చెట్టు పరుపుగా లక్ష్మితో కూడి శయ నిస్తాడని ప్రతీతి. వీరిని పూజించడం శుభం. అలాగే, ఈనాడు అశూన్య వ్రతం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. ఈ రోజు మొదలు నాలుగు నెలల పాటు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలని గ్రంథాంతరాలలో ఉంది. అందుచేతనే దీనిని చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. అయితే, ప్రస్తుతం ఈ తిథి శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా ప్రసిద్ధమై ఉంది.
ఆగస్టు 10: శ్రావణ బహుళ తదియ
ఈనాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
ఆగస్టు 11: శ్రావణ బహుళ చవితి
ఈనాడు సంకష్ట చతుర్థీ వ్రతం చేస్తారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ‘బహుళా చతుర్థి’ అనే పేరూ ఉంది. గోపూజ చేయాలని ఆమాదేర్ జ్యోతిషీ చెబుతోంది. సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయని ఫలశ్రుతి.
ఆగస్టు 12: శ్రావణ బహుళ పంచమి
ఇది రక్షా పంచమి వ్రత దినమని ఆమాదేర్ జ్యోతిషీ చెబుతోంది. నాగపూజ చేసే ఆచారం కూడా ఉంది.
ఆగస్టు 13: శ్రావణ బహుళ షష్ఠి
ఈ తిథి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు బలరామ జయంతిగా కూడా ప్రసిద్ధి.
ఆగస్టు 14: శ్రావణ బహుళ సప్తమి
ఈనాడు శీతలా సప్తమి వ్రతమాచరించాలని అంటారు. విదేశీ కాలమానం ప్రకారం 14వ తేదీ 19.46 గంటల నుంచి 15వ తేదీ 17.40 గంటల వరకు కృష్ణాష్టమి గడియలు ఉన్నాయి.
ఆగస్టు 15: శ్రావణ బహుళ అష్టమి
ఈ తిథి కృష్ణాష్టమి పర్వం. ఇది మనకు ముఖ్యమైన పండుగల్లో ఒకటి. శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పర్వం కావడం వల్ల జన్మాష్టమిగా కూడా ప్రసిద్ధి. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. కృష్ణ జయంతి నాడు ఉపాసించి ఆయనను పూజిస్తే సకల పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, మహా జయం కలుగుతాయని స్కంద పురాణోక్తి. కృష్ణ జయంతిని ఆచరించని వారు మహా పాపాన్ని పొందుతారని, యమపాశంలో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, క్రూర రాక్షసులుగా జన్మిస్తారని స్కాందాది పురాణాల్లో ఉంది. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యమివ్వాలని, బంగారంతో కానీ, వెండితో కానీ ద్వాదశాంగుల విస్తారమైన చంద్రబింబం చేసి వెండి, బంగారుపాత్రలతో దానిని ఉంచి, పూజించి అర్ఘ్యమివ్వాలని, అలా చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో ఉంది. కృష్ణావతారం దశావతారాల్లో 8వది. కృష్ణ చరితం హరివంశ భాగవత విష్ణు పురాణాల్లో విపులంగా ఉంది. ఆబాల గోపాలానికి కృష్ణుని లీలలు, కొంటె చేష్టలు తెలిసినవే. కృష్ణుడు లోకోత్తర సుందరమూర్తి. మహాబల పరాక్రమశాలి. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం- భగవద్గీత. ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పాలనా పద్ధతికి కృష్ణుడే ఆద్యుడు. కృష్ణుని కాలంలో కంసుడు, నరకాసురుడు, కాలయవ నుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన రాజులు ఎవరికి వారు చక్రవర్తులమని, రాజాధి రాజులమని చెప్పుకొంటూ దుష్పరిపాలనతో రాజ్యాలను ముక్కలు చెక్కలుగా చేసి పాలిస్తుండే వారు. కృష్ణుడు తాను రాజ్యాధికారం కోరక, దేశానికి కేంద్ర పరిపాలన విధానం ఉండటం మంచిదని భావించి పాండవులచే మిగతా రాజులను హతులను చేయించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేసి కేంద్ర పాలనకు బీజం వేశాడు. కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రాన రాత్రి ఉద్భవించాడు కనుక అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తారు. జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి ఆడిస్తారు. బాల్యంలో కృష్ణుడు చేసిన బాల్య చేష్టలకు నిదర్శనంగా వీధులలో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇదే రోజు భారత స్వాతంత్య్ర దినోత్సవం కూడా.
ఆగస్టు 16: శ్రావణ బహుళ నవమి
ఈనాడు చండికా పూజ చేస్తారు. అలాగే, ఈ తిథి అరవింద యోగి జన్మ తిథి. కౌమార పూజ కూడా ఆచరిస్తారు. రామకృష్ణ పరమ హంస వర్ధంతి దినం కూడా ఈ రోజే.
ఆగస్టు 18: శ్రావణ బహుళ ఏకాదశి
ఈ ఏకాదశిని అజైకాదశి అనీ అంటారు. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు. ఇంకా ఈనాడు కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కామికా వ్రతం ఆచరించే దినం కాబట్టి ఈ తిథిని కామికా ఏకాదశి అని కూడా అంటారు.
ఆగస్టు 19: శ్రావణ బహుళ ద్వాదశి/త్రయోదశి
ద్వాదశి తిథి నాడు రోహిణీ ద్వాదశీ వర్షం అనే పూజ చేస్తారు. అలాగే, త్రయోదశి తిథి ద్వాపర యుగాది అని ఆమాదేర్ జ్యోతిషీ చెబుతోంది.
ఆగస్టు20: శ్రావణ బహుళ చతుర్దశి
ఈనాడు అఘోర చతుర్దశి అని, మాస శివరాత్రి పర్వమని ఆమాదేర్ జ్యోతిషీ పేర్కొంటోంది.
ఆగస్టు 21: శ్రావణ బహుళ అమావాస్య
శ్రావణ కృష్ణ అమావాస్య పోలామావాస్యగా ప్రసిద్ధి. పోల + అమ= పోలామా అయ్యింది. ‘పోల’ అంటే కడుపు నిండా తిని, నీళ్లు తాగి పని పాటు లేకుండా పడి ఉన్న ఎద్దు అని అర్థం. ‘అమా’ అంటే అమావాస్య. ‘పోలామా’ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. దీనిని బట్టి పోలామావాస్య గో, వృషభ పూజకు విశేషమైన దినమని అవగతమవుతోంది. ఈనాడు కర్షకులు వ్యవసాయ సంబంధ పనులేమీ, ప్రత్యేకించి ఎద్దులతో ఏ పనీ చేయించరు. మహారాష్ట్రలో దీనిని పిఠోరి అమావాస్య అని, ఆమాదేర్ జ్యోతిషీలో కౌశ్యమావాస్య అని, గ్రంథాంతరాల్లో ఆలోకామావాస్య అని వ్యవహరిస్తారు. ఇక, తెలుగు నాట ఇది పోలాంబ వ్రతంగా ప్రసిద్ధి. పోలేరమ్మ అనే గ్రామ దేవత ఈనాడు విశేష పూజలు అందుకుంటుంది.
వరలక్ష్మి ని మహిమలు….
మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం- శ్రావణం. ఈ నెలలోని ప్రతి రోజూ పవిత్రమైనదే. ప్రత్యేకించి వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మంగళగౌరీ వ్రతం స్త్రీల సౌభాగ్యసిద్ధికి ఉద్దేశించినవి. లక్ష్మీ దేవతకు ప్రతిరూపంగా భావించే స్త్రీలు.. ఆ లక్ష్మిని తమపై ఆవాహన చేసుకోవడానికి వీలుగా పూజాధికాలు చేయడానికి లభించిన గొప్ప ‘వరం’ ఈ శ్రావణ మాసం. ప్రత్యేకించి వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 4) ముత్తయిదువుల అభీష్టసిద్ధికి ఉద్దేశించినది. ఈ వ్రత నియమాల గురించి తెలుసుకుందాం.
శ్రావణంలో వచ్చే వారాల్లో విశేష మైనది – శుక్రవారం. ఈ రోజున ముత్తయి దువలు వరలక్ష్మి వ్రతం పేరుతో విశేష పూజలు నిర్వహిస్తారు. ఇంకా ఈ మాసం లోని మంగళవారం, శనివారం కూడా విశేషమైనవే. ఒక్కో వారం గురించి వివరంగా తెలుసుకుందాం.
శ్రావణ శనివారాలు
వారానికి ఉన్న ఏడు రోజుల్లో మాఘ మాసంలో ఆదివారాలు, కార్తిక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో లక్ష్మివారాలు (గురువారం) మహత్తు కలవిగా పరిగణనలో ఉన్నాయి. ఆది, సోమ, లక్ష్మివారాలు పోతే ఇక మిగిలిన నాలుగు వారాల్లో మూడు వారాలు ఒక్క శ్రావణమాసంలోనే మహత్తు కలవిగా ఆచారంలో ఉన్నాయి. ఇవన్నీ అతివలకు అత్యంత ప్రీతిపాత్రమై ఉన్నాయి.
శ్రావణ మాసంలో శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు కూడా ఎక్కువ నియమనిష్టలను కోరేవిగా ఉన్నాయి. శ్రావణ మాసంలోని శనివారాల్లో తిరుమలలో పూజా విశేషాలు అధికంగా జరుపుతారు.
శ్రావణ మంగళవారాలు
కొత్తగా వివాహమైన మహిళలు శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా ఆచ రించడం వల్ల జన్మజన్మల్లో అమంగళం కలగకుండా ఉంటుందని చెబుతారు. దీనినే శ్రావణ మంగళగౌరీ వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం వివాహమైన తరువాత వరుసగా ఐదు సంవత్సరాలు చేయాలని వ్రత నియమం.
శ్రావణ శుక్రవారాలు
శ్రావణ శుక్రవారం వ్రతం (వరలక్ష్మీ వ్రతం) కూడా మహత్తర మయినది. ఇది పుణ్యస్త్రీలకు ప్రత్యేకంగా నియమించిన వ్రతం. ఈ వ్రతాచరణ వలన పాపాలు పోవడమే కాక, లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందని ప్రతీతి. శ్రావణ మాసంలోని శుక్రవారాల్లో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మరీ మహత్తు కలది. ఈ వ్రతం ధనకనకవస్తు వాహనాది వృద్ధికి మూలమైనది. మహాలక్ష్మి నుంచి ఉపదేశాన్ని పొంది చారుమతీ దేవి ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్రతమిది. వేంకట పార్వతీశ్వర కవులు శ్రావణ శుక్రవార వ్రత విషయమై ఇలా ప్రస్తావించారు.
శ్రీల జెలు వొందుటకు సువాసినులొనర్చు
శ్రావణీ శుక్రవార పూజలకు నలరు
నమ్మహాలక్ష్మి శుభదృష్టి నవతరించు
నమృత వీచికల శుభంబునార్చుగాత!
శ్రావణ వరలక్ష్మీ పూజ కొత్త నగతో చేయాలని నియమం. కొత్తగా వివాహమైన మహిళలకు శ్రావణ పట్టి పేరుతో అత్తవారు ఆభరణాలను తెస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనినే శ్రావణ పట్టీ అంటారు.
వరలక్ష్మీ ప్రాశస్త్యం..
‘వర’ శబ్దానికి ‘కోరుకున్నది’ అని అర్ధం. అందరూ కోరుకునే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేది, వాటి రూపంలో ఉన్నది వరలక్మీ. వారి వారి ప్రజ్ఞా స్థాయీ బేధాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవీ కావాలన్నా భగవత్ సంకల్పం లేనిదే, ఆయన దయ లేనిదే పొందలేం. అసలు ఆనందం, సంపద లేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నది, ఆనందాలను ప్రసాదించేది ఈ వరలక్మీ. వాస్తవానికి ఈ వరలక్మీలో జయలక్మీ, సరస్వతి, శ్రీలక్ష్మి, మోక్షలక్మీ, సిద్ధలక్మీ అనే ఐదు లక్ష్ములూ సమన్వయమై ఉన్నారు. ఈ ఐదు లక్ష్మీల చరమ నామమే ‘వరలక్మీ’. ‘ప్రతి స్త్రీలోనూ లక్ష్మీకళ ఉన్నది’ అనేది అర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీస్వరూపాలుగా ఆరా ధించడం, స్త్రీలు లక్ష్మీ రూపాన్ని అర్చించడం ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం.
వరలక్ష్మీ వైభవం
మన పంచాంగానుసారం శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (శ్రావణ శుద్ధ ద్వాదశి, ఆగస్టు 4) వరలక్ష్మీ వ్రత వారమై ఉంది. అలాగే, శ్రావణ మాసంలోని మిగతా శుక్రవారాలు కూడా ఈ వ్రతానికి ఉద్ధిష్ట మైనవే. మహిళలకు సౌభాగ్యాలనిచ్చే ఈ వ్రతం తెలుగు నాట విశేషంగా ఆచారంలో ఉంది. అష్టలక్ష్మీ రూపాల్లో వరలక్ష్మీ దేవికి ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల్లోకెల్లా వరలక్ష్మీ ఆరాధనం సర్వోత్తమమైనదిగా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. రూప, గుణ, మహిమా విశేషాలతో వరలక్ష్మీ వరాల సిరుల్ని కురిపించడానికి శ్రావణ మాసంలో తరలి వస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవార రోజులలో ఈ వరాల తల్లిని వ్రత విధానంతో పుణ్యస్త్రీలు ఆరాధిస్తారు. సకలాభీష్ట ప్రదం కోసం, నిత్య సుమంగళిగా తాము విలసిల్లాలని వరాలమ్మకు విన్నవించు కుంటారు. వరలక్ష్మీ దేవి వ్రత కథలో అమ్మవారి కృపను పొందిన భక్తురాలు చారు మతి. ఈ చారుమతి నామధేయం ద్వారా తన భక్తులు ఎలా మసులుకోవాలో లక్ష్మీదేవి తెలియ చెప్పిందని కథనం. ‘చారుమతి’ అంటే మంచి మనసు. చెడు బుద్ధి, దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు లేని మనసు. ఇలాంటి పునీత మనస్కులు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలవు తారని వరలక్ష్మీ వ్రతం సందేశమిస్తోంది. ప్రేమపూరితమైన, సామరస్యమైన, ప్రశాంతమైన సన్నిధులు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీ వైభవం అవిరామంగా విలసిల్లు తుంది. ఈ దివ్యమైన వాతావరణంలో ప్రతి లోగిలి లక్ష్మీకళతో వర్థిల్లుతుంది.
వరలక్ష్మీ వ్రత నియమం
వరలక్ష్మీ వ్రతం ఆచరించే స్త్రీలు శ్రావణ శుక్రవారం నాడు ప్రాతఃకాలంలోనే నిద్రలేచి, కాలకృత్యాలు ముగించుకుని అభ్యంగన స్నానం చేయాలి. నూలుతో చేసిన కొత్త వస్త్రాలు ధరించడం శ్రేష్ఠం. పూజ కోసం నిర్ణయించిన స్థలంలో గోమయంతో అలికి, ముగ్గుతో పద్మాన్ని తీర్చిదిద్దాలి. దానిపై పీటను అమర్చి, పీట మీద బియ్యం పోసి దానిపై కలశం, చెంబును ఉంచాలి. ఒక కొబ్బరి కాయకు పసుపు రాసి, కుంకుమ పెట్టి, కాటుకలతో కనులు, ముక్కు, చెవులను తీర్చి వరలక్ష్మీ రూపునివ్వాలి. తరువాత ఆ రూపాన్ని ఆ కలశంపై ఉంచాలి. ఈ విధంగా రూపొందించిన రూపంలోకి నియమబద్ధమైన పూజాధికాలతో వరలక్ష్మీ దేవిని ఆహ్వానించాలి. ఆ రూపాన్ని యథాశక్తి పూజించాలి. సాయంత్రం వేళ ముత్తయిదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి పేరంటం చేయాలి. వ్రతాచరణ తరువాత ముత్తయిదువులతో కలిసి వ్రత మహత్యాన్ని తెలిపే కథలను చదవాలి, వినాలి.
వరలక్ష్మీని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఆ తల్లి స్త్రీలకు అయిదవ తనాన్ని, సౌభాగ్యాన్ని, సంతానప్రాప్తిని, ఇంకా సకల శుభాలను కలుగచేస్తుందని ప్రతీతి. కన్యలు, ముత్తయిదువలు భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వరలక్ష్మి వరాల వర్షాన్ని కురిపిస్తుంది.
Review శ్రావణ శోభ...