సూర్యారాధన..శివార్చన

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో రెండో మాసం- ఫిబ్రవరి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మాఘ మాసం. కేవలం ఒక్కరోజు మాత్రమే ఫాల్గుణ మాస తిథి కలుస్తుంది. ఫిబ్రవరి 1, శనివారం, మాఘ శుద్ధ తదియ నుంచి ఫిబ్రవరి 27, గురువారం, మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య వరకు మాఘ మాస తిథులు కొనసాగుతాయి. ఆపై ఫిబ్రవరి 28, శుక్రవారం, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి ఫాల్గుణ మాస ఆరంభ దినం. మాఘ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో మహా శివరాత్రి, రథ సప్తమి ప్రధాన పర్వాలు. ఇంకా భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి, వసంత పంచమి వంటివి మాఘ మాసంలోని ప్రధాన పర్వాలు, పండుగలు.
2025- ఫిబ్రవరి 1, శనివారం, మాఘ శుద్ధ తదియ నుంచి
2025- ఫిబ్రవరి 28, శుక్రవారం, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – మాఘం – ఫాల్గుణం – శిశిర రుతువు – ఉత్తరాయణం

చంద్రుడు మఘ (మఖ) నక్షత్రాన ఉండే మాసం కనుక దీనిని ‘మాఘ మాసం’ అన్నారు. యజ్ఞ యాగాదులకు శ్రేష్ఠమైనది మాఘ మాసం. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మఘవుడు’ అనీ అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ‘మాఘం’ అయ్యింది. మన పురాణాలలో మాఘ మాసాన్ని జ్ఞాన మాసంగా కూడా అభివర్ణించారు. అహం అనే పాపాన్ని తొలగించేది, అజ్ఞానమనే మృత్యువును హరించేది, నశింప చేసేదీ మాఘమని వేదాలు చెబుతున్నాయి. అందువల్లనే మాఘ మాసాన్ని వేద మాసమని కూడా అంటారు.
ఇది శిశిర రుతువు కాలం. చెట్లు ఆకులు రాలుస్తాయి. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. మాఘ మాసానికి వచ్చే సరికి చలి అంతగా ఉండదు. వానలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి వాతావరణం ఈ మాసంలో అమోఘంగా ఉంటుంది. శూన్యమాసంగా పరిగణించే పుష్యం తరువాత వచ్చే మాఘం కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకూ, భగవచ్ఛింతనకూ నెలవైన ఉత్క•ష్టమైన కాలమిది. వైశాఖ – కార్తీక మాసాల మాదిరిగా మాఘ స్నానాలూ పవిత్రమైనవి. మృకండ ముని, మనిస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుడి అప మృత్యువును తొలగించిందని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరడం సంప్రదాయం. ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పురాణం మాఘ మాస మహిమలను వివరిస్తోంది. అలాగే, మాఘ స్నానం మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మాండ పురాణంలో విపులంగా ఉంది.పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ మాస సంప్రదాయం.

సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయాల్లో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమైనవనీ చెబుతారు. ఇక, మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు (ఫిబ్రవరి 2, 9, 16, 23, 2025) విశేషమైనవి. ఈ కాలంలో ఉదయ స్నానం అత్యంత శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక, అరుణోదయాన దీపారాధన, తిలహోమ తిలదానం, తిలభక్షణం మాఘ స్నానాల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్య విధులు. శివుడు,. సూర్యనారాయణాదులను మాఘ మాసంలో పూజించడం అమితమైన ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
మాఘ మాస స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.
మాఘ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనవృద్ధి అని మత్స్య పురాణం చెబుతోంది.
ఇంకా ఈ మాసంలో తిథానుసారం వచ్చే ప్రధాన పర్వాలు, పండుగల విశేషాలు..

మాఘ శుద్ధ తదియ
ఫిబ్రవరి 1, శనివారం

మాఘ శుద్ధ తదియ మార్కండేయ మహర్షి జయంతి తిథిగా ప్రసిద్ధి. మృకండుడు, మనస్విని దంపతుల కుమారుడు మార్కండేయుడు. గొప్ప శివభక్తుడు. ఆయువు తీరినా.. తన శివదీక్షతో యముడిని సైతం జయించిన బాలుడీ మార్కండేయుడు. ఆయన జన్మించినదీ ఈ మాఘమాసంలోనేనని అంటారు. ఇంకా మాఘ శుద్ధ తదియ నాడు గుడలవణ దానం చేయాలని అంటారు. ఇంకా ఈనాడు ఉమాపూజ, లలితా వ్రతం, హరతృతీయా వ్రతం, దేవ్యా ఆందోళన వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మాఘ శుద్ధ చవితి
ఫిబ్రవరి 2, ఆదివారం

మాఘ శుద్ధ చతుర్థి నాడు శాన్తా (శాంతా) చతుర్థీ వ్రతం ఆచరించాలని అంటారు. చవితి తిథి కావడం వల్ల ఈనాడు గణేశ్‍ పూజ చేస్తారు. ఈ రోజున డుంఠి గణపతిని పూజించాలి. కుంద చతుర్థి నాడు శివుడిని మొల్ల పూవులతో పూజించాలి. అలాగే, పుష్య మాస తిథులు శనీశ్వరుడికి ప్రధానమైనవి కాబట్టి ఈ తిథిని తిల చతుర్థిగానూ వ్యవహరిస్తారు. ఈనాడు తిల (నువ్వులు) దానం చేస్తే కోటిరెట్ల ఫలాన్ని ఇస్తుందని అంటారు. ఇంకా చవితి తిథి నాడు ఉమాపూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. అలాగే వరద గౌరీపూజ కూడా చేస్తారు. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఈ పూజా విశేషాల వివరాలు ఉన్నాయి.

మాఘ శుద్ధ పంచమి
ఫిబ్రవరి 3, సోమవారం

మాఘ శుద్ధ పంచమి చదువుల తల్లి సరస్వతీ దేవికి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథిని ఇంకా మదన పంచమి అనీ, వసంతోత్సవారంభః, వసంత పంచమి, రతికామ దమనోత్సవం, సరస్వతీ జయంతి అని కూడా వ్యవహరిస్తారు. శిశిర రుతువు ప్రారంభంలో వచ్చే ఈ తిథిని వసంత పంచమి అనడాన్ని బట్టి ఇది రుతు సంబంధమైన పండుగగా భావించాల్సి ఉంటుంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువు. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. శిశిర రుతువు ప్రారంభంలోనే వసంత రుతు సంబంధంగా ఈ వసంత పంచమి పర్వాన్ని నిర్వహించడానికి గల కారణం ఏమిటో ఇతమిద్ధంగా తెలియదు. బహుశా రాగల వసంత రుతు సూచనలకు స్వాగత సన్నాహాంగా ఈ పర్వం ఏర్పడి ఉండవచ్చు. మాఘ మాస శుక్ల పంచమి నాడు హరి పూజ చేయాలని, దాంతో పాటు వసంత పంచమి పర్వం కూడా నిర్వహించుకోవాలని హేమాద్రి అనే పండితుడు చెప్పారు. ఈనాటి కృత్యాలలో తైల స్నానం, నూతన వస్త్రధారణం ముఖ్యం. దక్షిణాదిన
వసంత పంచమి అంతగా ప్రాముఖ్యమై లేదు.

రాజవంశములలో దీని ప్రాభవం ఎక్కువ.
ఈనాడు వారు రంగుబట్టలు
ధరించి బుక్కా, వసంతం
చల్లుకుంటారు.
పూర్వం ఈ తిథి నాడు ‘యవేష్ఠి’ అనే యజ్ఞం చేసే వారని తెలుస్తోంది. ఇప్పుడిది అంతగా ఆచరణలో లేదు. ‘యవ’ అంటే ఒక ధాన్య విశేషం. ‘ఇష్ఠి’ అనగా యజ్ఞం. సంక్రాంతికి ఇంటికి వచ్చే ధాన్యాన్ని ఈనాడు అన్నం వండి కులదేవతలకు నైవేద్యం పెట్టి తినే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది. వంగ దేశంలో దీనిని శ్రీపంచమి అంటారు. ఈనాడు సరస్వతీ పూజ చేస్తారు. పుస్తకాలు, కలాలు సరస్వతీదేవి వద్ద ఉంచి, రోజంతా సరదాగా గడుపుతారు. సాయంత్రం దేవి విగ్రహాన్ని సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేస్తారు.
ఏదైమైనా వసంత పంచమి విద్యారంభ దినం. మన తెలుగునాట బాసర, వర్గల్‍ తదితర సరస్వతీ క్షేత్రాల్లో చదువుల తల్లిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఇంకా పర్వానికి రతి కామదమనోత్సవం, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈనాడే రతీదేవి కామదేవ పూజ చేసినట్టు కొన్ని పురాణాల్లో ఉంది. రుతు రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మంచి స్నేహం. కాబట్టి ఈనాడు రతీదేవికి కామదేవుడికి వసంతుడికి పూజ చేయాలనే ఆచారం ఏర్పడింది. ఇది వసంతరుతువు ఆగమనాన్ని తెలిపే తిథి పర్వం.

మాఘ శుద్ధ షష్ఠి
ఫిబ్రవరి 3, సోమవారం

మాఘ శుద్ధ షష్ఠి నాడు కుమార స్వామి (స్కందుడు)ని పూజిస్తారు. కాబట్టి ఇది స్కంద షష్ఠి తిథిగా ప్రసిద్ధి. ఇంకా ఈనాడు విశోకాష్టమీ, మందారషష్టి, కామషష్ఠి వ్రతాలను ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాడు వరుణ షష్ఠి. ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, పుష్పాలు, ధూపం, దీపాలతో విష్ణు స్వరూపుడైన వరుణదేవుడిని పూజించాలని నియమం. కాగా, పంచమి తిథి కాలంలోనే షష్ఠి ఘడియలు కూడా కూడి ఉన్నాయి.
కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీనే పంచమి,
షష్ఠి తిథుల్లో వచ్చే పర్వాలను
జరుపుకోవాలి.

మాఘ శుద్ధ సప్తమి
ఫిబ్రవరి 4, మంగళవారం

మాఘ మాసపు తిథులలో ప్రశస్తమైనది మాఘ శుద్ధ సప్తమి. దీనినే తెలుగునాట రథ సప్తమిగా వ్యవహరిస్తారు. దీనినే సూర్య జయంతి పర్వమనీ అంటారు. ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమిని మహా సప్తమి అని కూడా వ్యవహరిస్తారు. ఇంకా మాఘ శుద్ధ సప్తమి అనేక పేర్లు ఉన్నాయి. అవేమిటంటే..
మన్వాది దినం: సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ఇదే మన్వాది దినం. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. పితృ దేవతల ప్రీత్యర్థం ఈనాడు తర్పణాదులను విడవాల్సి ఉంటుంది.
సంవత్సరాది: వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది.
తెలుగుదేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా తెలుస్తుంది. నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి నాడే పడతారు. వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి ఇన్ని వ్రతాల ప్రారంభ దినమైన రథ సప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు.
రథసప్తమి: చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు ఆచరించదగిన మంత్ర సహితమైన అనే వ్రతాలను గురించి పేర్కొన్నారు. అవన్నీ సూర్యునికి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవే. ప్రాచీన కాలంలో ఇది మనకు ఉగాది అయినా, కాకున్నా మిక్కిలి ప్రాచీనమైన మన పండుగలలో రథ సప్తమి ఒకటి. ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడు కాయలతో చేసిన దానిని సూర్య రథం అంటారు. చిక్కుడు ఆకులపై వేడి వేడి పొంగళిని పరచడం, జిల్లేడు ఆకుల్ని నెత్తి మీద పెట్టుకుని సూర్యుడికి అభిముఖంగా నిలిచి స్నానం చేయడం, అంతకుముందు పెద్దలు పిల్లల తల మీదుగా రేగుపండ్లు పోయడం వంటి వాటి వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి.
సూర్య జయంతి: రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని రాజపుటానాలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, కొన్ని చోట్ల జయంతి సప్తమి అనీ, మరికొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది.
సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు.
జయంతి/మహా సప్తమి: మాఘ శుద్ధ సప్తమికే జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పర్వాలు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చని అంటారు. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు సప్తమి తిథుల్లో మాఘ శుద్ధ సప్తమి ప్రశస్తమైనది. కాబట్టి ఈ సప్తమి తిథిని మహా సప్తమి అన్నారు.

నర్మద జయంతి: ఇక, మాఘ శుద్ధ సప్తమికి నర్మద జయంతి అనే మరో పేరు కూడా ఉంది.

మాఘ శుద్ధ అష్టమి
ఫిబ్రవరి 5, బుధవారం

మాఘ శుక్ల (శుద్ధ) అష్టమి భీష్మాష్టమి. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ దీని గురించి వివరణ ఉంది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చే వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మాఘ శుద్ధ సప్తమి మొదలు మాఘ శుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్ముడు అంపశయ్యపై పరుండి.. ఈనాటి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడని అంటారు. దీనివల్ల భీష్ముడు ఈ రోజునే మరణించినట్టు తెలుస్తోంది. మహా భారతంలో కూడా ఈ దినమే భీష్ముని నిర్యాణ దినంగా చెప్పారు. భీష్మ ద్వాదశి వ్రతం ఈనాడే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు అనే వ్రత గ్రంథంలో రాశారు. భీష్మాష్టమి ఒక్క వంగ దేశంలోనే చేస్తారు.
మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం, తర్పణం విడిచిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ కూడా దీనిని గురించి వివరణ ఉంది. ఇంకా ఈనాడు నందినీ దేవిపూజ కూడా నిర్వహించాలని కొందరంటే, ఈనాడు నర్మదా జయంతి ఈనాడేనని మరికొందరు అంటారు.

మాఘ శుద్ధ నవమి
ఫిబ్రవరి 6, గురువారం

మాఘ శుద్ధ నవమి తిథి మహానంద నవమి పర్వదినమని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు నందినీదేవిని పూజించాలని, ఈ ఆచారం వల్లనే ఈ తిథికి మధ్వ నవమి అనే పేరు కూడా ఉందని అంటారు.

మాఘ శుద్ధ దశమి
ఫిబ్రవరి 7, శుక్రవారం

మాఘ శుద్ధ దశమి తిథి సాధారణంగా దుర్గాపూజకు అనువైనది. మాఘ శుద్ధ దశమి నాడు ప్రత్యేకంగా ఆచరించాల్సిన ఇర పూజా విధులేమీ లేవు.

మాఘ శుద్ధ ఏకాదశి
ఫిబ్రవరి 8, శనివారం

మాఘ శుద్ధ ఏకాదశిని జయైకాదశిగా వ్యవహరిస్తారు. తిథి తత్వంలో భీష్మైకాదశీ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. ఈ ఏకాదశికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంద్రసభలో పుష్పవంతుడు నాట్యం చేస్తున్నాడు. తన భార్యను చూస్తూ అతను నాట్యం తప్పుగా చేశాడు. దీంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పవంతుడిని, అతని భార్యను రాక్షసులు కావాలని శపించాడు. రాక్షసులై తిరుగుతున్న ఆ దంపతులకు మాఘ శుక్ల (శుద్ధ) ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత వారు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ ఉపవాస ఫలితంగా వారిద్దరు శాప విముక్తులయ్యారు. భీష్ముడు ఈ తిథి నాడే మరణించాడని, కాబట్టి ఇది భీష్మైకాదశి దినమని అంటారు. అలాగే, గోదావరి సంగమ ప్రాంతమైన ఆంధప్రదేశ్‍లోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం ఈ తిథి నాడే ఘనంగా నిర్వహిస్తారు. ఈనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగుతుంది. దీనినే అంతర్వేది తీర్థమని అంటారు. మాఘ శుద్ధ ఏకాదశినే జయైకాదశిగానూ వ్యవహరిస్తారు.

మాఘ శుద్ధ ద్వాదశి
ఫిబ్రవరి 9, ఆదివారం

మాఘ శుద్ధ ద్వాదశినే షట్‍తిలా ద్వాదశి (ఆరు తిలల ద్వాదశి) అంటారు. ఇంకా ఈనాడు వరాహ ద్వాదశీ వ్రతం, భీమ ద్వాదశీ వ్రతం కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇక, మాఘ శుద్ధ ద్వాదశి తథి భీష్మ ద్వాదశి పర్వమని పంచాంగకర్తలు పేర్కొంటుంటే.. వివిధ వ్రత గ్రంథాలలో దీనిని భీమ ద్వాదశిగా చెప్పారు. మొత్తానికి భీష్ముడికి సంబంధించిన మూడు పర్వాలు మాఘ మాసంలో వరుసగా వస్తుండటం విశేషం. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

మాఘ శుద్ధ త్రయోదశి
ఫిబ్రవరి 10, సోమవారం

మాఘ శుద్ధ త్రయోదశి కల్పాది దినం. విశ్వకర్మ జయంతి దినంగా ప్రసిద్ధి. విశ్వకర్మ దేవశిల్పి. ఆయన అన్ని కళలకు, అన్ని శిల్పాలకు, అన్ని విధాలైన చేతి పనులకు, అన్ని రకాలైన వృత్తులకు ఆద్యబ్రహ్మ. ఈయన దేవతలకు కావాల్సిన నగరాలు, మేడలు, మిద్దెలు, రథాలు, ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు.

సూర్యుడిని నేర్పుగా సానబట్టి.. రాలిన ఆ చూర్ణంతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఇంకా శివుడికి త్రిశూలాన్ని, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని, రావణుడికి లంకా నగరాన్ని, శ్రీకృష్ణుడికి ద్వారకా బృందావనాన్నీ ఈయనే నిర్మించి ఇచ్చాడు.
విశ్వకర్మ కొడుకు నలుడు సుగ్రీవుని కొలువులో ఉండేవాడు. రాముడు సముద్రాన్ని దాటడానికి కట్టిన వారధికి చీఫ్‍ ఇంజనీర్‍ ఇతడే. విశ్వకర్మ పాండవులకు ఇందప్రస్థ నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. మన దేశంలో విశ్వకర్మ విగ్రహాలు పలుచోట్ల చూడవచ్చు. అందులో కొన్నిటికి ఒకే ముఖం ఉంటుంది. మరికొన్నిటికి పంచముఖాలు ఉంటాయి. ఆయన చేతుల్లో ఉత్పత్తి సాధనాలు అనేకం కనిపిస్తాయి. ఈయనది హంస వాహనం.
విశ్వకర్మ జయంతి నాడు కార్మికులు తమ పనులకు విశ్రాంతినిస్తారు. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు.
అలాగే, మాఘ శుద్ధ త్రయోదశి తిథి శనీశ్వరుడికి ప్రీతికరమైన తిథి. ఈనాడు ఆయన ప్రీత్యర్థం తిలలు (నువ్వులు) దానం చేయాలి. ఆయన ఆలయాలు ఉన్నచోట ఈనాడు విశేష పూజలు జరుగుతాయి. శని గ్రహ ప్రభావం ఉన్న వారు శాంతి పూజలు నిర్వహించడానికి ఈ తిథి ఉద్ధిష్టమైనది.

మాఘ శుద్ధ చతుర్దశి
ఫిబ్రవరి 11, మంగళవారం

మాఘ శుద్ధ చతుర్ధశి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన వ్రతాలు, పూజాదులేమీ లేవు. కాకపోతే, చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆయన ప్రీత్యర్థం అభిషేకాలు, పూజలు చేసుకోవచ్చు.

మాఘ శుద్ధ పూర్ణిమ
ఫిబ్రవరి 12, బుధవారం

ఆకాశవీధిలో గల అనేకానేక నక్షత్రాలలో మఘ ఒకటి. మనకు ప్రధానంగా ఇరవై ఏడు నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులోని ఒక మండలంలో మఘ ప్రధానమైనది. మఘతో పాటుగా మరో నాలుగు నక్షత్రాలు పల్లకి ఆకారంలో చెదిరి ఉంటాయి. నెలకోసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తుంటాడు. కానీ ఏడాదిలో ఒకసారి మాత్రమే అతను పదహారు కళలలో వెలుగొందుతూ మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘ పూర్ణిమ. మన పంచాంగకర్తలు దీనిని మహా మాఘీ అన్నారు. నాడు తిల పాత్ర కంచుక కంబళాది దానాలు చేయాలని పెద్దలంటారు.
మాఘ మాసంలో అరుణోదయాన స్నానం చేయడం మన మత విధులలో ఒకటి. చలికి వెరవక మంచుతో చల్లగా మారిన నదీ జలాల్లో స్నానం చేయాలని మన పెద్దలు మాఘ మాసపు విధిగా నిర్ణయించారు. మాఘ స్నానంతో పాటు తిలహోమం, తిలదానం, తిల భక్షణం కావించాలని చెబుతారు. ఈ ఆచారాలన్నీ ఆరోగ్యప్రదమైనవి. మాఘ మాసం పొడవునా ఈ ఆచారాలను పాటించలేకపోయినా కనీసం ఆ మాసపు పర్వాల్లో అయినా పాటించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇక, మాఘ పూర్ణిమకు కాళహస్తిలో స్వర్ణముఖి నదీ స్నానం మహత్తు కలదని అంటారు. రామేశ్వరం వద్ద సేతువులో రత్నాకరం మహోధుల సంగమం ఒకటుంది. ఇక్కడ స్నానం కూడా విశేషమైనదే. ప్రయాగలో త్రివేణీ సంగమంలో మాఘ పూర్ణిమ స్నానం మహా పాతక నాశినిగా ఉంటుందని అంటారు. అలాగే, మాఘ పూర్ణిమ సతీదేవి ప్రాదుర్భవించిన దినమని పురాణ కథ. మఘతో పాటుగా ఈశ్వరి (పార్వతి) ఒకసారి దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాళింది మడుగులోని ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి అక్కడ స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం పడుతుంది. ఈ సంగతులు తెలిసిన వాడు కావడం చేత దక్ష ప్రజాపతి ఆ శంఖాన్ని అందుకోబోయాడు.

అతని హస్త స్పర్శ తగలడంతోనే ఆ శంఖం ఒక చక్కని చిన్నారి కన్నెగా మారింది. ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ బిడ్డే సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజు మాఘ పూర్ణిమ. అందుచేత మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైన దినం అయ్యింది.
మఘ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి. కాబట్టి ఈనాడు ఆయనను పూజించాలని అంటారు. గురుడు సింహరాశి గతుడైనపుడు తమిళనాడులోని కుంభకోణంలో మహామాఘి ఉత్సవం అత్యంత వైభవంగా చేస్తారు. మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మవైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. మాఘ శుద్ధ పూర్ణిమ నాడే గురు రవిదాస్‍ జయంతి దినం. అలాగే ఈనాడు కొన్నిచోట్ల లలితా జయంతినీ నిర్వహించే ఆచారం ఉంది.
మాఘ శుద్ధ పూర్ణిమ (ఫిబ్రవరి 12, 2025) నాటి నుంచే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఇది నాలుగు రోజుల పాటు నిర్వహించే పర్వం. దేశవ్యాప్తంగా గల ఆదివాసీలు, గిరిజనులు తరలివచ్చి ఇక్కడి వనదేవతలను పూజిస్తారు. ఫిబ్రవరి 12న జాతర ప్రారంభమై 15వ తేదీన ముగుస్తుంది.

మాఘ బహుళ పాడ్యమి
ఫిబ్రవరి 13, గురువారం

ఈనాటి నుంచి మాఘ మాసపు బహుళ (కృష్ణ పక్ష) తిథులు ఆరంభం అవుతాయి. మాఘ బహుళ పాడ్యమి తిథి నాడు సౌభాగ్య వ్యాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మాఘ బహుళ విదియ
ఫిబ్రవరి 14, శుక్రవారం

మాఘ బహుళ విదియ నాడు ఆచరించదగిన ప్రత్యేక విధులేమీ లేవు. కాగా, ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) నిర్వహిస్తారు.

మాఘ బహుళ తదియ
ఫిబ్రవరి 15, శనివారం

మాఘ బహుళ తదియ నాడు కూడా ఆచరించదగిన ప్రధాన పూజా విధులేమీ లేవు. ఈనాటితో తెలంగాణలోని మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ముగుస్తుంది.

మాఘ బహుళ చవితి
ఫిబ్రవరి 16, ఆదివారం

మాఘ బహుళ చతుర్థి.. గణేశ పూజకు విశేషమైనది. ఈనాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. అలాగే, విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి దినం ఈనాడే.

మాఘ బహుళ పంచమి
ఫిబ్రవరి 17, సోమవారం

మాఘ బహుళ పంచమి నాడు ఆచరించదగిన విశేష పూజలు, వ్రతాలేమీ లేవు.

మాఘ బహుళ షష్ఠి
ఫిబ్రవరి 18/19, గురువారం

మాఘ కృష్ణ బహుళ షష్ఠి తిథి ఫిబ్రవరి 18వ తేదీన పూర్తి రాత్రి కాలం.. మరుసటి రోజు ఫిబ్రవరి 19న పగటి కాలం కొనసాగుతుంది. షష్ఠి తిథి నాడు కుమారస్వామిని కొలుస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‍ జయంతి, రామకృష్ణ పరమహంస జయంతులు ఈనాడు. అలాగే ఈనాటి నంచి శతభిష కార్తె ప్రారంభం అవుతుంది.

మాఘ బహుళ సప్తమి
ఫిబ్రవరి 20, గురువారం

మాఘ కృష్ణ సప్తమి తిథి ప్రధానంగా సూర్యారాధనకు ఉద్దేశించినదే. ఈనాడు నిక్షుభార్క సప్తమి, సర్వాప్తి సప్తమి మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.

మాఘ బహుళ అష్టమి
ఫిబ్రవరి 21, శుక్రవారం

మాఘ కృష్ణ అష్టమి నాడు మంగళావ్రతం ఆచరించాలి. దీనినే సీతాష్టమి అనీ, కాలాష్టమీ అని కూడా అంటారని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఈనాడు జానకి జయంతిని జరుపుకుంటారు.

మాఘ బహుళ అష్టమి
ఫిబ్రవరి 20, ఆదివారం

మాఘ బహుళ దశమిని స్మార్త దశమి అంటారు. అలాగే, విజయ దశమిగా కూడా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు దయానంద సరస్వతి జయంతి దినం కూడా.

మాఘ బహుళ ఏకాదశి
ఫిబ్రవరి 24, సోమవారం

మాఘ బహుళ ఏకాదశి నాడే శ్రీరాముడు రావణుడి లంకపై దండెత్తడానికి అనువుగా చేపట్టిన సేతువు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని అంటారు. అందుకే ఈ తిథి నాడు వివిధ పనులు విజయవంతానికి శ్రీకారం చుట్టే ఆచారం తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలలో ఆచరణలో ఉంది. అలాగే, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి తిథిని విజయైకాదశిగా పేర్కొంది. దీనినే వైష్ణవ విజయ ఏకాదశి అని కూడా అంటారు.
మాఘ మాసానికి రామాయణ ఘట్టాలతో ముడిపడిన అనేక అంశాలు కనిపిస్తాయి. అందుకే మాఘ మాసపు తిథులకు రామాయణానికి చాలా సంబంధం ఉంది. అంగద రాయబారం మొదలుకుని రావణవధకు ముందు వచ్చిన యుద్ధ విరామం వరకు జరిగిన ప్రధాన ఘట్టాలన్నీ మాఘ మాస తిథులతోనే ముడిపడి ఉన్నాయి. మాఘ శుద్ధ ప్రతిపత్తి నాడు అంగద రాయబారం జరిగింది. మాఘ శుద్ధ విదియ మొదలుకుని అష్టమి వరకు వానర సేనకు, రాక్షసులకు మధ్య యుద్ధం భీకరంగా జరిగింది. మాఘ శుద్ధ నవమి నాటి రాత్రి రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు.. రామలక్ష్మణులను నాగపాశంతో బంధించాడు. మాఘ శుద్ధ దశమి నాడు వాయువు శ్రీరాముడి చెవిలో మంత్ర నామం వినిపిస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో గరుత్మంతుడు రామలక్ష్మణులను చేరుకుంటాడు. దీంతో అప్పటి వరకు రామలక్ష్మణులను బంధించిన నాగపాశములు విడివడిపోతాయి. మాఘ శుద్ధ ఏకాదశి, ద్వాదశి తిథుల సమయంలోనే ధూమ్రాక్ష వధ జరుగుతుంది. త్రయోదశి తిథి నాడు అకంపనుడిని వధిస్తారు. మాఘ శుద్ధ చతుర్దశి మొదలు కృష్ణ ప్రతిపత్తు వరకు ప్రహస్తవధ, మరో మూడ్రోజులు సంకుల సమరం జరుగుతాయి. పంచమి మొదలు అష్టమి వరకు కుంభకర్ణుని నిద్ర నుంచి మేల్కొలిపే ఘట్టం.. ఇది జరిగిన తదుపరి ఆరు రోజులకు కుంభకర్ణుడిని రామలక్ష్మణులు వధిస్తారు. అమావాస్య నాడు లంకలో యుద్ధ విరామం.

మాఘ బహుళ ద్వాదశి
ఫిబ్రవరి 25, మంగళవారం

మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణంలో ఉంది. ఈ తిథికి ముందురోజున ఉపవాసం ఉండి ఈనాడు నువ్వులు దానం చేయాలని నియమం. అయితే, ఈనాడు తిల ద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మాఘ బహుళ త్రయోదశి/మహా శివరాత్రి
ఫిబ్రవరి 26, బుధవారం

ఇది ద్వాపర యుగాది తిథి. ఈ యుగ సంధిలోనే వేదవ్యాసుడు అవతరించి వేదాన్ని విభాగించాడని, ధర్మశాస్త్ర పురాణేతిహాసాలను రచించాడని ప్రతీతి. ఈనాడు విరివిగా దానాలు చేయాలని అంటారు. ఈ యుగాన్ని తామ్ర యుగమనీ అంటారు. ప్రజల్లో వైరుధ్య బుద్ధులు, సందేహాలు ఎక్కువవుతాయనీ, ప్రతి విషయంలో ప్రజలు సంశయ పీడితులుగా ఉండటం వల్ల ఈ యుగానికి ద్వాపర యుగం అనే పేరు వచ్చిందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఈ యుగంలోని మనుషులు శరీరంలో రక్తం ఉన్నంత కాలం ప్రాణాలు ధరించి ఉంటారు. మాఘ కృష్ణ త్రయోదశి తిథి నాడు విరివిగా దానాలు చేస్తారు. త్రయోదశి తిథి నాడే ఈసారి మహా శివరాత్రి పర్వం. శివయోగ యుక్తమైన ఈ తిథి మహా శివరాత్రి పర్వదినమని శివరాత్రి మహాత్మ్యం అనే గ్రంథం చెబుతోంది.
శివరాత్రి పర్వం అతి ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉంది. దీనికి సంబంధించిన కథల్లో విశేషమైనది ఈ కింది కథ.
వింధ్యాద్రి మీద ఒక వేటగాడు ఉండేవాడు. మిక్కిలి క్రూరుడు. ఒకసారి పగలంతా వేటాడి, ఒక చెరువు తీరానికి చేరి అక్కడున్న బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. తన తల మీద, తన చుట్టూ ఉన్న మారేడు చెట్టు కొమ్మల్ని నరికి కింద పారవేశాడు. ఆ చెట్టు మొదట్లో బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగం ఉంది. వేటగాడు నరికి పారేసిన మారేడు రెమ్మలు అతని అదృష్టవశాత్తూ శివలింగంపై పడ్డాయి. రోజంతా వేటాడుతూ ఉండటం వల్ల అతను ఆ రోజు ఏం తినకుండా ఉండిపోయాడు. అది ఉపవాసమైంది. పైగా అతను తనకు తెలియకుండానే శివ, హర, శంకర అనే నామాలను ఉచ్ఛరించాడు. అందుచేత అతని పాపాలన్నీ అతన్ని వదిలి వెళ్లిపోయాయి. అప్పుడు శంకరుడు అతని కోసం ప్రత్యేకంగా విమానాన్ని పంపి అతనిని కైలాసానికి రప్పించి దర్శనమిచ్చాడు. ఆ వేటగాడు ఆనాటి రాత్రి చెరువులో నీరు తాగడానికి వచ్చిన నాలుగు లేళ్లను చంపకుండా ఉన్నందున ఆ పుణ్యం కూడా అతను సంపాదించాడు. ఆ నాలుగు లేళ్లలో ఒకటి పూర్వజన్మలో క్షీరసాగర మథన సమయంలో దేవాసురులకు దొరికిన పద్నాలుగు రత్నాలలోనూ ఒకటైన దివ్యాంగనా రత్నం. మిగతా మూడు లేళ్లలోనూ రెండు పూర్వజన్మలో ఆ దివ్యాంగన చెలికత్తెలు. నాలుగో లేడి తొలి పుట్టుకలో హిరణ్యుడనే దైత్యుడు. పైన చెప్పిన దివ్యాంగన తన అంగ సౌందర్యానికి, కంఠమాధుర్యానికి గర్వించి శంకరుడిని పూజించడం మరిచిపోయి హిరణ్యుడనే దైత్యునితో కలిసి కేళీవిలాసాల్లో తప్పతాగి మైమరిచి ఉండేది. ఒకనాడు హిరణ్యుడు లేని సమయంలో ఆమె ఒంటరిగా శంకరుని దర్శనం కోసం కైలాస పర్వతానికి వెళ్లింది. ఆమెను చూసేసరికి శంకరుడికి చాలా కోపం వచ్చింది. ఆయన ఆమెను ఆడలేడి కావాలని శపించాడు. శాపమోక్షం తెలపాలని ఆమె అనేక విధాలుగా ప్రార్థించింది. పన్నెండేళ్ల తరువాత శాపం పోతుందని శివుడు మార్గం చెప్పాడు. ఈ లేళ్లు నక్షత్రాలై ఇప్పటికీ ఆకాశం మీద ఉన్నాయని నమ్మిక.
శివుడు అభిషేకప్రియుడు. శివరాత్రి నాడు అభిషేకాలు విశేషంగా జరుగుతాయి. గంజాయి చెట్టు ఆకుల నుంచి పేయౌషధం తయారు చేసి కానీ లేదా భంగుతో కానీ శివలింగాన్ని కడుగుతారు. ఆపై పువ్వులతో పూజిస్తారు. పిమ్మట శివ సహస్ర నామాలు చదువుతూ సహస్ర బిల్వదళాలు సమర్పిస్తారు. ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు శివపూజ మొదలై తెల్లవారుజామున ఐదు గంటలకు ముగుస్తుంది.
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజలు అతి ప్రాచీనమైనవి. యజుర్వేదంలో శివస్తోత్రం ఉంది. శివరాత్రి చరిత్రలో శివుడే నాయకుడు. మహా శివరాత్రి వ్రతం గురించి లింగ పురాణంలో ఉంది. ఆనాటి రాత్రి జాగారం ఉండటం ముఖ్యం. శివరాత్రి నాడు శివలింగానికే పూజ చేయడానికి గల హేతువుకు పురాణోక్తమైన ఈ కథ చెబుతారు.
దక్ష యజ్ఞంలో సతీదేవి శరీర త్యాగం చేసింది. అప్పుడు శివుడు ఖిన్నుడై పరిభ్రమిస్తున్నాడు. అలా తిరుగుతూ ఒకనాడు ఒక బ్రాహ్మణ పట్టణానికి వెళ్లాడు. ఆయన నగ్న రూపం చూసి అక్కడి స్త్రీలు మోహితులయ్యారు. తమ స్త్రీల ఈ దశ చూసి ఆ ఊరి బ్రాహ్మణ పురుషులు శివుడి లింగం ఊడి కిందపడుగాక అని శపించారు. ఆ ప్రకారం లింగం కిందపడిపోయింది. వెంటనే ముల్లోకాల్లోనూ ఉత్పాతాలు పుట్టాయి. దేవతలు, మునులు అందరూ వ్యాకులపడి బ్రహ్మను శరణుజొచ్చారు. బ్రహ్మ తన యోగదృష్టితో అంతా గ్రహించి శివుని వద్దకు వచ్చాడు. ఆ లింగాన్ని తిరిగి ధరించాలని ప్రార్థించాడు. అప్పుడు శివుడు- ఈ రోజు మొదలు ప్రజలంతా లింగపూజ చేస్తామనే షరతు మీద దానిని తిరిగి ధరిస్తానని అంటాడు. దీంతో బ్రహ్మ బంగారంతో లింగాన్ని చేసి మొదటి పూజ చేశాడు. ఆయన తరువాత ఇంద్రుడు మిగతా వారు విడివిడిగా శివలింగాన్ని నిర్మించుకుని పూజించారు. అప్పటి నుంచి శివలింగానికి పూజ చేయడం ఆచారంగా మొదలైంది.
శివరాత్రి అనే పేరు రావడానికి కారణం ఈశానసంహిత ఇంకో విధంగా చెబుతుంది. శివుడు నేటి అర్ధరాత్రి కాలాన కోటి సూర్య సమప్రభలతో లింగాకారంలో పుట్టడం చేత దీనికి శివరాత్రి అనే పేరు వచ్చిందట. అర్ధరాత్రి లింగోద్భవ కాలం. ఇక, పరమశివుడు లింగాకారంలో పుట్టిన రోజు కావడం చేత ఇది శివుడికి ప్రియకరమైనదని, ఈనాడు లింగరూపి అయిన శివుడిని పూజించాలని శైవాగమనం చెబుతోంది. దేవపూజ పగలు కాక రాత్రిపూట సాగడం ఈ పర్వం ప్రత్యేకత. సాధారణంగా పండుగలు మృష్టాన్న భోజనాలతో జరుగుతాయి. కానీ, శివరాత్రి ఉపవాసాల పండుగ. ఇది కూడా ఈ పర్వం ప్రత్యేకతే.
మహా శివరాత్రి గురించి పురాణేతిహాసాల్లో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి ఇది.
బ్రహ్మ, విష్ణువు ఒకసారి తమలో ఎవరు అధికులనే విషయమై కలహించుకోసాగారు. అప్పుడు ఒకానొక అర్ధరాత్రి వేళ ఈశ్వరుడు అగ్ని లింగాకారంలో వారి ఎదుట పొడచూపాడు. దానిని చూసి వారిద్దరు విస్తుపోయి దాని కంటే తాము తక్కువ వారమనే సంగతిని గ్రహించారు. తమ అల్పత్వం తమకు అవగతం కాగా, తమలో తాము పోట్లాడుకోవడం మానివేశారు. అర్ధరాత్రి వేళ ఆ లింగాన్ని వారు అధిక భక్తితో పూజించారు. అప్పటి నుంచి అది మహా శివరాత్రి అయ్యింది. మహా శివరాత్రి ఘనత ఇంతటిది కాబట్టే ‘జన్మకో శివరాత్రి’ అనే నానుడి పుట్టింది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు జన్మ పాపాలు హరిస్తాయని ప్రతీతి.
శివరాత్రి వ్రత ఉద్యాపన..

స్కంద పురాణంలో పేర్కొన్న ప్రకారం శివుడు స్కందునికి శివరాత్రి ఉద్యాపన విధి గురించి ఇలా వివరించాడు-
శివరాత్రి వ్రతం పద్నాలుగు సంవత్సరాల పాటు చేయాలి. త్రయోదశి నాడు ఒంటిపూట భోజనం చేసి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. శివుడికి మండపం ఒకటి కట్టి అలంకరించాలి. బ్రాహ్మణుల్ని శివస్వరూపంగా భావించి పూజించాలి. కలశ స్థాపన చేసి దానిపై పార్వతీ సహితుడైన శివుడిని ప్రతిష్ఠించాలి. బిల్వపత్ర పూజ ప్రధానం. రాత్రి సత్కథా కాలక్షేపంతో జాగారం చేయాలి. మర్నాడు ఉదయాన్నే స్నానం చేసి అర్హ మంత్రాలతో అగ్నికి రెండు వందల ఎనిమిది (208) సార్లు తిలలతో, యవలతో, పాయసంతో ఆహుతి చేయాలి. పూర్ణాహుతి అయిన తరువాత శివ విగ్రహంతో కలశం బ్రాహ్మలకు ఇచ్చి వేయాలి. వారికి గోదానం చేయడం ప్రధానం.
ఈశానసంహిత- ‘శివరాత్రి వ్రతం పాపాల్ని పోగొడుతుంది. చండాలుడికి కూడా భక్తిముక్తినిస్తుంది’ అని చెబుతోంది. శాస్త్రాలు చదవడానికి ఆస్కారం లేని చండాలురు కూడా ఈ వ్రతాచరణకు అర్హులే. ఇందుకు ఇంతకుముందు చెప్పుకున్న వేటగాడి కథే నిదర్శనం. యథాలాపంగా ‘శివా’ అన్నా చాలు.. పాపాలన్నీ శమించిపోతాయి.
మహా శివరాత్రి వ్రతాచరణ విధానం..

లింగ పురాణంలో మహా శివరాత్రి వ్రతాచరణ గురించి ఇలా వివరించారు.
శివరాత్రి నాడు పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేయాలి. శివలింగార్చన చేయాలి. ఈ మూడు రూపాల్లో శివరాత్రి వ్రతం ఆచరిస్తే ఫలదాయకం. శివరాత్రికి ముందు ఒంటిపూట మాత్రమే భక్తులు భోజనం చేస్తారు. ఆ రాత్రి పవిత్రమైన స్థలంలో నిద్రపోతారు. శివరాత్రి నాడు అరుణోదయాన్నే స్నానం చేస్తారు. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శిస్తారు. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాముల్లోనూ నాలుగు సార్లు శివపూజ సాగిస్తారు.
• తొలిజాములో శివుడిని పాలతో అభిషేకించాలి. పద్మాలతో పూజించాలి. రుగ్వేద మంత్రాలు పఠించాలి.
• రెండో జాములో పెరుగుతో అభిషేకించాలి. పాయసం నైవేద్యంగా నివేదించాలి. యజుర్వేద మంత్రాలు చదవాలి.
• మూడో జాములో నేతితో శివుడిని అభిషేకించాలి. మారేడు దళాలతో శివుడిని పూజించాలి. సామవేద మంత్రాలు పఠించాలి.
• నాలుగో జాములో తేనెతో శివుడిని అభిషేకించాలి. నీలోత్పలాలతో పూజించాలి. అన్నం నైవేద్యం పెట్టి, అధర్వణ వేద మంత్రాలు చదవాలి. శైవమతంలో అతి విశేషమైన, సర్వోత్క•ష్టమైన పండుగ శివరాత్రి. ఈనాడు భక్తులు ఉదయాన్నే లేచి, స్నానాదులు చేసి, శివపూజ చేసి, ఉపవసించి, రాత్రంతా మేల్కొని ఉండి మర్నాటి ఉదయం వరకు శివనామస్మరణ చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథన పఠనాలతో గడుపుతారు. పూర్వం శ్రీశైల క్షేత్రంలో ఈ ఉత్సవం ఎంత గొప్పగా జరిగేదో పాల్కురికి సోమనాథుడు తన పండితారా థ్య చరిత్రలో గ్రంథస్తం చేశాడు. శివరాత్రి నాడు పూజలు, జాగరణాదులు చేసే వారు సర్వపాప విముక్తులై అంతమున శివ సాయుజ్యం పొందుతారని, శివరాత్రి వ్రతాన్ని ఆచరించని వారు జన్మ సహస్రములలో కొట్టుమిట్టాడుతారని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి.

మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య
ఫిబ్రవరి 27, గురువారం

మాఘ కృష్ణ చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడిని బిల్వార్చనం, తుమ్మిన పూలతో పూజించాలి. మాఘ కృష్ణ చతుర్దశి నాడు దంతీ చతుర్దశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు అరుణోదయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది.
అలాగే మాఘ బహుళ అమావాస్య కూడా ఈనాడే. అమావాస్య తిథి పితృకర్మలు నిర్వహించడానికి అనువైన తిథి. ఈ దినం మన్వాది అని ఆమాదేర్‍ జ్యోతిషీ పేర్కొంటుండగా, ఈనాడు నవనీతధేను దానం చేయాలని పురుషార్థ చింతామణిలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడిని యథాశక్తి కొలవాలి. మాఘ కృష్ణ అమావాస్య కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలం. ఈ కాలంలో సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నానం వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మాఘ మాసపు చివరి దినం.

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
ఫిబ్రవరి 28, శుక్రవారం

ఈనాటి నుంచి ఫాల్గుణ మాస తిథులు ఆరంభమవుతాయి. తెలుగు చాంద్రమానం ప్రకారం ఫాల్గుణం సంవత్సరంలో పన్నెండవ మాసం. శిశిర రుతువు ఈ మాసంతో ముగుస్తుంది. ఈ మాసపు తొలి దినం- ఫాల్గుణ శుద్ధ పాడ్యమి. ఈనాడు భద్ర చతుష్టయ, గుణావాప్తి, పయో మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.

Review సూర్యారాధన..శివార్చన.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top