మాసం.. విశేషం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో నాలుగో మాసం- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర – వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు ఉంటాయి. ఏప్రిల్‍ 17వ తేదీ, శుక్రవారం వరకు చైత్ర మాస తిథులు.. ఆపై ఏప్రిల్‍ 18, శనివారం నుంచి వైశాఖ మాస తిథులు కొనసాగుతాయి. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి రథోత్సవం, హనుమజ్జయంతి, వరూధునీ/సర్వ ఏకాదశి, సింహాచల నృసింహస్వామి చందనోత్సవం, పరశురామ జయంతి, అన్నవరం సత్యదేవుని కల్యాణం, రామానుజ జయంతి, ఆదిశంకరుల వారి జయంతి, అక్షయ తృతీయ వంటివి ఈ మాసంలోని ప్రత్యేక పండుగలు, పర్వాలు..
చైత్ర, వైశాఖ మాసాలు వసంత కాలం. ఒకపక్క చెట్లు ఆకులు రాల్చే కాలమిది. మరోపక్క కొత్త చివుళ్లు తొడుగుతాయి. పచ్చనాకులు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. చిత్తా నక్షత్రంలో పూర్ణ చంద్రుడు ఉండే మాసం కాబట్టి ఇది చైత్ర మాసం అయ్యింది. చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి మన పెద్దలు ఆయా మాసాలకు ఆయా పేర్లను నిర్ణయించారు. అంటే, చంద్రుని గతి ఆధారంగా నక్షత్ర మండలాలకు ఆయా పేర్లు పెట్టారు. ఆ మండలాలలో చంద్రుడు ప్రవేశించినపుడు ఆ నెలకు ఆయా నక్షత్రాల పేర్లు వస్తాయి. ఈ కోవలో, చిత్త నక్షత్రంలో పూర్ణ చంద్రుడున్న మాసం చైత్రమవుతుంది. చైత్ర మాసంలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని అంటారు. చెట్లు ఆకులు రాల్చే కాలమిది. పూలు మాత్రం విరబూస్తాయి. ఎటుచూసినా వసంత పరిమళాలు వెదజల్లుతుంటాయి. పచ్చనాకులు.. లేత చివుళ్లు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మన మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. అందుకే చైత్రాన్ని వసంత మాసమనీ అంటారు. ఏప్రిల్‍ 17వ తేదీతో చైత్ర మాస తిథులు ముగుస్తాయి.
తదుపరి వైశాఖ మాసం ఆరంభమవుతుంది. చిత్తా నక్షత్రంలో చంద్రుడున్న మాసం చైత్రమైతే.. విశాఖ నక్షత్రాన పూర్ణ చంద్రుడున్న మాసం వైశాఖ మాసం అవుతుంది. అలా చంద్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించినపుడు పుట్టినదే వైశాఖ మాసం. ఏప్రిల్‍ 18వ తేదీ నుంచి వైశాఖ మాస తిథులు ప్రారంభం అవుతాయి. ఈ నెలలో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అటు వాసంత సమీరాలు.. ఇటు వైశాఖ మాసపు వెలుగులు వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతాయి. చెట్లు ఆకులు రాల్చే కాలమిది. అయినా పూలు మాత్రం విరబూస్తాయి. ఎటుచూసినా వసంత పరిమళాలు వెదజల్లుతుంటాయి. శ్రీ మహా విష్ణువు లీలా విలాసాలకు వైశాఖ మాసం చిరునామా. ఇది మాధవునికి (విష్ణువు) అత్యంత ఇష్టమైన మాసం. ఆయన దశావతారాల్లోని విశిష్టమైన మూడు అవతారాల జయంతులు వైశాఖ మాసంలోనే వస్తాయి. ఇంకా శంకర జయంతి, రామానుజ జయంతి తిథులు ఈ మాసంలోనే వస్తాయి. ఈ నెలలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని ప్రతీతి. ఇంకా అక్షయ తృతీయ వంటి సర్వ శుభకారక తిథి ఈ మాసంలోనిదే. మరెన్నో తిథులకు, పర్వాలకు నెలవైన వైశాఖ మాసం నుంచే ఎండలు ముదురుతాయి. క్రమంగా వాతావరణం వేడెక్కుతుంది. ఇక ఏప్రిల్‍ నెలలోని సగానికి పైగా రోజులు తెలుగుమానం ప్రకారం చైత్రమాసంలోనివి. మిగతా రోజులు వైశాఖ మాసంలోనివి. ఆయా రోజుల్లో వచ్చే తిథులు.. ఆ తిథుల్లో వచ్చే పర్వాల విశేషాలు..

చైత్ర శుద్ధ చతుర్దశి
ఏప్రిల్‍ 1, బుధవారం

చైత్ర శుద్ధ తిథి రౌచ్య మన్వాదిగా ప్రతీతి. చతుర్దశి తిథి శివుడికి ప్రీత్యర్థమైనది కాబట్టి దీనిని శైవ చతుర్దశి అనీ అంటారు. ఇక, రౌచ్యుడి వివరాల్లోకి వెళ్తే.. రౌచ్యుడు రుచి కుమారుడు. రుచి భార్య మాలిని. రుచికి పితృ దేవతలు అతని కొడుకు మనువు కాగలడని చెప్పారు. ఆ విధంగానే రౌచ్యుడు మనువు అయ్యాడు. ఈయన మన్వంతరంలో బృహస్పతి ఇంద్రుడు అయ్యాడు. అతని కుమారులైన చిత్రసేనుడు, దృఢుడు, సురధుడు మొదలైన వారు రాజులు అయి పాలించారు. ఈనాడు కూడా శివపూజ చేయదగినది. ఈనాడు ఇంకా నృసింహ డోలోత్సవం చేస్తారని స్మ•తి కౌస్తుభం, మహోత్సవం వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా ఈ చతుర్దశి శైవ చతుర్దశి, కర్దమ క్రీడ పర్వంగానూ ప్రసిద్ధి. అలాగే ఈనాడే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణమని కొన్ని పంచాంగాలలో ఉంది. శ్రీసత్యనారాయణస్వామి వారి పూజాధికానికి ఈ తిథి ప్రత్యేకం. ఇంకా, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‍ 1ని ఏప్రిల్‍ ఫూల్‍ డే/ఆల్‍ ఫూల్స్ డేగానూ వ్యవహరిస్తారు.

చైత్ర శుద్ధ పౌర్ణమి
ఏప్రిల్‍ 2, గురువారం

చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వరాహ పురాణాన్ని దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈనాడు పశుపతవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. చైత్ర పూర్ణిమను మహాచైత్రి అని కూడా ఉంటారు. ఈనాడు చిత్ర వస్త్ర దానం, దమన పూజ విహితకృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశించాయి. చిత్ర వస్త్రదానం అంటే రంగురంగుల బట్టలను దానం చేయడం.

ఈ పర్వ సందర్భంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహా ఫలాన్నిస్తుంది. అలాగే చిత్రా పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. ఈ పూర్ణిమను ‘అనుమతి’ అంటారు. పదహారు కళలతో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. ఇది రాకా పూర్ణిమ. సూర్యేందు సంగమ కాలం అమావాస్య. అమావాస్య నుంచి పూర్ణిమకు పదహారు రోజులు. అమావాస్య నుంచి పున్నమికి, పున్నమి నుంచి అమావాస్యకు గల కాలాన్ని పర్వసంధి అంటారు. అమావాస్య నుంచి పూర్ణిమాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క దినానికి చంద్రుడికి ఒక్కో కళ హెచ్చుతూ ఉంటుంది. పూర్ణిమాస్య నుంచి అమావాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కో దినానికి చంద్రునికి ఒక్కో కళ తగ్గుతూ ఉంటుంది. పదహారు కళలతో ఒప్పుతూ పూర్ణిమ నాడు చంద్రుడు కాంతివంతుడై ఉంటాడు. ఇలా చంద్రుడు కాంతివంతంగా ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. అనగా, ఏడాదికి పన్నెండు పూర్ణిమలన్న మాట. ఈ పన్నెండు పూర్ణిమలలోనూ చంద్రుడు ఒక్కో నక్షత్రంతో కూడి ఉంటాడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పూర్ణిమకు పేరు వస్తుంది. మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో చిత్త ఒకటి. అటువంటి చిత్త నక్షత్రంతో కూడిన పూర్ణిమకు ‘చైత్రీ’ అని పేరు. ఈనాడు మధుర కవి ఆళ్వారు తిరు నక్షత్రం కూడా. అలాగే ఒక ఏడాదిలోని పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా కూడా ఉన్నాయి.
చైత్ర పూర్ణిమ తిథి హనుమజ్జయంతి (శ్రీ హనుమ ద్విజయోత్సవం) పర్వంగా కూడా ప్రసిద్ధి. ఆంధ్రులలో మధ్వ మతస్తులకు ఇది మరీ ముఖ్యమైన పండుగ. హనుమంతుడు అంజనాదేవి పుత్రుడు. అంజన కేసరి అనే వానరుని భార్య. సంసారంలో విసుగుపుట్టి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. తపస్సుకు వెళ్తూ అతను తన భార్యను వాయుదేవునికి అప్పగించాడు. ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి, వాయువు తన గర్భమందున్న శివుని వీర్యాన్ని ఆమెకు ఇచ్చాడు. దాంతో ఆమె గర్భం ధరించి కుమారుడిని ప్రసవించింది. అతనే ఆంజనేయుడు. వాయు ప్రసాదితం కావడం చేత అతనికి వాయుపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది.

చైత్ర బహుళ పాడ్యమి
ఏప్రిల్‍ 3, శుక్రవారం

చైత్ర బహుళ పాడ్యమి నాడు పాతాళ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు జ్ఞానావాప్తి వ్రతం కూడా చేస్తారని తెలుస్తోంది. అయితే, ఈ వ్రతాచరణలకు సంబంధించి వివరాలు అందుబాటులో లేవు. ఈ తిథి నాడు ప్రపాదానం చేయాలని, ధర్మఘటాది దినమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాటితో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. అలాగే, ఈనాడు క్రైస్తవుల పర్వదినం గుడ్‍ ఫ్రైడే.

చైత్ర బహుళ తదియ
ఏప్రిల్‍ 5, ఆదివారం

చైత్ర బహుళ తదియ ఘడియల్లోనే చవితి కూడా ఆరంభమవుతుంది. కాబట్టి ఈనాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఇది గణపతి సంబంధ పూజ. బాబూ జగ్జీవన్‍రామ్‍ జయంతి దినం కూడా ఈనాడే. అలాగే క్రైస్తవుల ఈస్టర్‍ పండుగ (ఈస్టర్‍ సండే)ను ఈనాడే నిర్వహించుకుంటారు.

చైత్ర బహుళ చవితి
ఏప్రిల్‍ 6, సోమవారం

చైత్ర బహుళ తదియ ఘడియల్లో ఆరంభమైన చవితి తిథి ఘడియలు ఏప్రిల్‍ 6న కూడా కొనసాగుతున్నాయి. చైత్ర బహుళ చతుర్థి తిథి సంకష్ట హర చతుర్థి. సాధారణంగా చతుర్థి తిథి గణపతి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. జనులు తమ సంకటాలన్నీ హరించిపోవడానికి వరుసగా కొన్ని వారాల పాటు ప్రతి నెలలోనూ వచ్చే చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తుంటారు. తెలుగు నాట సంకష్టహర చతుర్థి వ్రతం బాగా ఆచరణలో ఉన్న వ్రత పర్వం.

చైత్ర బహుళ పంచమి
ఏప్రిల్‍ 7, మంగళవారం

చైత్ర బహుళ పంచమి మత్స్య జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అయితే ఈ జయంతి దినంపై కొంత వివాదం కూడా ఉంది. ఎందుకంటే, చైత్ర శుద్ధ పంచమి నాడే మత్స్య జయంతి దినమని మన తెలుగు క్యాలెండర్‍, పంచాంగాలలో ఉంది. అయితే విష్ణువు దశావతారాల్లో మూడు ముఖ్యమైన అవతారాలు చైత్ర మాసంలోనే వస్తాయని, వాటిలో శ్రీరామ నవమి మొదటిది కాగా, ఆ తరువాత వచ్చే రెండో అవతార జయంతి తిథి బహుళ పంచమి అనే వాదన ఉంది. ఇదిలా ఉండగా, విష్ణువు పది అవతారాల్లో మత్స్యావతారం మొదటిది. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించుకునిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దీంతో బ్రహ్మ సృష్టికార్యం ఆగిపోయింది. ఆపై బ్రహ్మ విజ్ఞప్తితో విష్ణువు మత్స్యావతారం దాల్చి రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అలా విష్ణువు చేప అవతారమెత్తిన దినం చైత్ర బహుళ పంచమి నాడేనని విశ్వాసం. ఇక, మత్స్యం (చేప) హిందువులలోనే కాక ఇతర మతాల్లోనూ దైవం రూపంలో ఆరాధనలు అందుకుంటోందని తెలుస్తోంది. క్రైస్తవులలో మత్స్యం శాంతి దేవతగా, మహమ్మదీయులలో చేప భగవానుడిగా పేర్కొని ఉంది. బౌద్ధ జాతక కథలలో బుద్ధుడు చేపగా పుట్టినట్టు ఉంది.
ఇక, మత్స్య జయంతికి సంబంధించి మరో కథ కూడా వ్యాప్తిలో ఉంది. ఒకనాడు వైవస్వత

మనువు పితృ తర్పణం చేస్తూ ఉన్నాడు. అతని దోసిట్లో ఒక చిన్న చేప పడింది. కరుణించి ఆయన దానిని తన కమండలంలో వేశాడు. అందులో అది ఒక పగలు, ఒక రాత్రి ఉండి పదహారు అంగుళాలు పెరిగింది. తను ఉండటానికి ఆ కమండలం చాలకుండా ఉందని అది గోల పెట్టింది. అప్పుడు మనువు దానిని ఎత్తి ఒక నీళ్ల కాలువలో ఉంచాడు. అందులో అది ఒక రాత్రి ఉంది. ఆ రాత్రికి రాత్రి అది మూడు మూరల పొడవు పెరిగింది. నాకీ చోటు చాలక చచ్చిపోతున్నాను.. నన్ను రక్షింపవలసింది అని ఆ చేప మనువుకు మొర పెట్టుకుంది. అప్పుడు మనువు దానిని ఒక నూతిలో వేశాడు. అది ఆ నుయ్యి కూడా సరిపోనంత పెద్దగా పెరిగింది. అందుమీద మనువు దానిని ఒక చెరువులో వదిలాడు.
పెరుగుతూ వచ్చిన చేపకు ఆ నది కూడా సరిగా సరిపోలేదు. ఆ పిమ్మట మనువు దానిని సముద్రంలో ఉంచాడు. అది సముద్రంలోకి చేరడంతోనే కడలి అంతా అల్లకల్లోలమైంది. ఆ అల్లకల్లోలంలో ఆ మీనం మేను రెండు లక్షల యోజనాల ప్రమాణానికి పెరిగింది. అంత బ్రహ్మాండంగా పెరిగి కూడా అది ‘నన్ను రక్షించు.. నన్ను రక్షించు’ అని మొర పెట్టుకోవడం మానలేదు.
మనువుకి ఇదంతా చూసి ఆశ్చర్యం వేసింది. ‘ఓ మత్స్యమా! నీ లీలలు లోగడ చూసి ఉండనివిగా ఉన్నాయి. కనీసం విని అయినా ఉండనివి ఉన్నాయి. నీవు నిజానికి వాసుదేవుడవో, కాకపోతే అసురుడవో అయి ఉండాలి’ అన్నాడు.
అప్పుడు ఆ చేప ‘ఓ వైవస్వతా! నీవు నన్ను గుర్తించావు. కాబట్టి నీకు ఒక సంగతి చెబుతున్నాను. ఇదిగో ఈ నావను చూడు. ప్రళయ కాలం సమీపించింది. ఇప్పుడు చాక్షుష మన్వంతరం నడుస్తోంది. ఆ మన్వంతరం నూరేండ్లలో ముగుస్తుంది. ఆ ముగింపునకు ముందు అనావృష్టి దోషం కలుగుతుంది. ఆ కారణంగా కరువు ఏర్పడుతుంది.

ఆ పిమ్మట సంవర్తం, భీమనాదం, ద్రోణము, ఇంద్రము, వలాహకము, విద్యుత్పతాకము, శోణము అనే ఏడు మేఘాలు విజృంభించి అధిక వ••ష్టిని కలిగిస్తాయి. ఆ వానకు సప్త సముద్రాలు ఏకమై జళ ప్రళయం కలుగుతుంది. భూమి వనపర్వత సహితంగా జలార్ణవంలో మునిగిపోతుంది. కాబట్టి ముందుగానే వేదములు, విద్యలు, బీజములు మున్నగునవి- నేను, బ్రహ్మ, దేవతలు మున్నగు వారు నీచే రక్షితులు కావాలి. ఆ జల ప్రళయంలో అనంతుడనే పాము నీటి మీద తేలుతూ ఉంటుంది. ఆ పామును తాడుగా చేసి ఈ నావను నా కొమ్ముకు కట్టివేయి. అప్పుడు ప్రళయ మారుతం వీచి ఈ ఓడను కుదిపి వేస్తుంది. ఆ అల్లకల్లోలానికి నీవు ఏమీ భయపడవద్దు’ అని చెప్పి ఆ చేప అంతర్థానమైంది. అది ఆ చెరువు పట్టనంతటి పెద్ద చేపగా మారింది. అంతట ఆయన దానిని ఒక నదిలో వదిలాడు. ప్రళయ కాలంలో మనువు ఆ చేప చెప్పినట్టే చేశాడు. మత్స్యమూర్తి అయి ఆనాడు ఇట్లు వేదాలను తెచ్చి లోకానికి ఇచ్చి కాపాడాడు. ఇది జరిగిన చైత్ర బహుళ పంచమి నాడు మత్స్యమూర్తి ప్రతిమను పూజించాలనే నియమం ఏర్పడింది.

చైత్ర బహుళ షష్ఠి
ఏప్రిల్‍ 8, బుధవారం

చైత్ర బహుళ షష్ఠి తిథి కుమారస్వామి ఆరాధనా తిథి. దీనినే స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఇది ఆయనకు ప్రీతికరమైన తిథి. ఇక ఈనాడు కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి వారి వసంతోత్సవం ఆరంభమవుతుంది.

చైత్ర బహుళ అష్టమి
ఏప్రిల్‍ 10, శుక్రవారం

చైత్ర బహుళ అష్టమి దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. అలాగే, ఈనాటితో కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి వారి వసంతోత్సవం ముగుస్తుంది.

చైత్ర బహుళ నవమి
ఏప్రిల్‍ 11, శనివారం

చైత్ర బహుళ నవమి నాడు దుర్గాదేవిని పూజించాలి.

చైత్ర బహుళ ఏకాదశి
ఏప్రిల్‍ 13, సోమవారం

చైత్ర బహుళ ఏకాదశి వరూధిని ఏకాదశిగా, వరూథిన్యేకాదశిగా ప్రతీతి. దీనినే మన పంచాంగకర్తలు వరూథిని వ్రతం అనీ అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం చేసిన వారికి వేయి గోదానాలు చేసిన ఫలం కలుగుతుందని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ పర్వానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. చైత్ర కృష్ణ (బహుళ) ఏకాదశి తిథి వల్లభాచార్యుల జన్మదినం కూడా. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్‍ ప్రకారం ఈ తిథిని సర్వ ఏకాదశిగా పేర్కొన్నారు.

చైత్ర బహుళ ద్వాదశి
ఏప్రిల్‍ 14, మంగళవారం

చైత్ర బహుళ ద్వాదశి నాడే తమిళుల సంవత్సరాది. అంటే ఉగాదిని వారు ఈనాడే జరుపుకుంటారు. సౌరమానం ప్రకారం తమిళులు తమ పండుగలు, పర్వాలను నిర్వహించుకుంటారు. కాబట్టి వారికి ఉగాది పర్వదినం ఏప్రిల్‍ 14న, చైత్ర బహుళ ద్వాదశి నాడు వస్తుంది. ఈనాడే మేష సంక్రమణం. అశ్వనీ కార్తె ఈనాటి నుంచే ప్రారంభమవుతుంది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‍ బాబాసాహెబ్‍ అంబేడ్కర్‍ జయంతి దినం ఈనాడే.

చైత్ర బహుళ త్రయోదశి
ఏప్రిల్‍ 15, బుధవారం

చైత్రంలో వచ్చే దశావతారాల్లో మూడు అవతార జయంతుల్లో వరాహావతారము మూడవది. ఇది విష్ణుమూర్తి పది అవతారాల్లో మూడవది. ఈ అవతారం శ్రీరామావతారం జరిగిన చైత్ర శుద్ధ నవమి నాడే అని కూడా అంటారు. కానీ, ఈ జయంతి తిథి కూడా వివాదగ్రస్తమై ఉంది. వరాహావతారం చైత్ర బహుళ త్రయోదశి నాడు ప్రాదుర్భవించిందని తెలుగు పంచాంగాలు చెబుతున్నాయి. కాగా, ఆనాడే వరాహ జయంతి జరపవలసి ఉంది.
ఈ అవతారంలో విష్ణుమూర్తి లోకకంటకుడైన హిరణ్యాక్షుని సంహరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బలగర్వితుడై భూమిని చాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకునిపోయి పాతాళ లోకంలో దాక్కున్నాడు. అప్పుడు భూదేవి తన బాధలు విష్ణుమూర్తితో చెప్పుకుంది. ఆ మొర విని విష్ణువు ఒక పెద్ద పంది రూపాన్ని ధరించి వెలశాడు. దాని శరీరం నల్లని పర్వతంలా ఉంది. దాని కోరలు తెల్లగా వాడిగా ఉన్నాయి. దాని కాళ్లు ఇనుపదిమ్మెలుగా ఉన్నాయి. దాని కన్నులు పెద్ద జ్యోతుల్లా ఉన్నాయి. అది ఘీంకరిస్తే ఉరుము ఉరిమినట్టు ఉంది. ఇటువంటి రూపంతో గల ఆ వరాహం వచ్చి హిరణ్యాక్షుడిని ఎదుర్కొంది. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు చనిపోయాడు. అప్పుడు ఆ వరాహమూర్తి పాతాళంలో పడి ఉన్న భూమిని తన బలిష్టమైన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ఉంచాడు. తనను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి నమస్కరించి స్తుతించింది.
ఇక, ఇది వరాహవతారానికి సంబంధించిన మరో కథ..

కల్పాంతంలో ఒకసారి సమస్తమూ జలమయమై పోయింది. బ్రహ్మాండమంతా చీకట్లు కమ్ముకున్నాయి. విష్ణుమూర్తి ఆ జలార్ణవంలో వటపత్రశాయి అయి యోగనిద్రలో ఉండిపోయాడు. నిత్యులైన మహర్లోక నివాసులు కొందరు అప్పుడు స్తుతింపగా ఆయన మేల్కొన్నాడు. తిరిగి జగత్‍ సృష్టికి పూనుకున్నాడు. మళ్లీ ప్రకాశింప చేసే ఉద్దేశంతో బ్రహ్మాండానికి ఊర్థ్వ, అథోముఖాలు అయ్యేటట్టు రెండుగా చేశాడు. వాటిని పద్నాలుగు లోకాలుగా చేశాడు.
అథోభాగాండ ఛిద్రం నుంచి యుల్బము భూమి మీద పడింది. అది మేరు పర్వతమైంది. పిదప నానావిధములైన పర్వతము, చెట్లు, చేమలు, జంతువులు, మనుష్యుల భారానికి భూమి పాతాళానికి కుంగింది. అప్పటి భూదేవి స్థితి బురదలో కూరుకుపోయిన ఆవు స్థితి వలే ఉంది.

భూదేవి తన బాధను విష్ణువుకు చెప్పుకుంది. అప్పుడు విష్ణుమూర్తి భూదేవితో, ‘నీవు భయపడకు. నిన్ను ఉద్ధరిస్తాను’ అన్నాడు. భూమిని తేల్చడం కోసం ఆయన వరాహావతారాన్ని పొందాడు. నూరు ఆమడల వెడల్పు, ఇన్నూరామడల పొడవు గల పంది రూపం ధరించాడు. అది నల్లని మబ్బులా ఉంది. యజ్ఞ స్వరూపాన్ని పొంది ఉన్న దానికి యజ్ఞ వరాహమూర్తి అనే పేరు వచ్చింది. ఆ యజ్ఞ వరాహ మూర్తి పాతాళ లోకానికి వెళ్లి భూమిని పైకి ఎత్తాడు. దీంతో భూమి స్వస్థానాన్ని చేరింది. అప్పుడు భూదేవి విష్ణుమూర్తిని పలువిధాల స్తుతించింది.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్‍ ప్రకారం ఏప్రిల్‍ 15న మాస శివరాత్రి.

చైత్ర బహుళ చతుర్దశి
ఏప్రిల్‍ 16, గురువారం

చైత్ర బహుళ చతుర్దశి తిథి నాడు గంగాస్నానం చేస్తే పిశాచత్వం రాకుండా పోతుందని అంటారు. చైత్ర బహుళ చతుర్దశి పర్వం భౌమవారం (మంగళవారం)తో కూడి వస్తే మరీ ఫలప్రదమైనదని అంటారు. టీటీడీ మినహా మిగతా తెలుగు క్యాలెండర్ల ప్రకారం ఈనాడే మాస శివరాత్రి పర్వం.

చైత్ర బహుళ అమావాస్య
ఏప్రిల్‍ 17, శుక్రవారం

చైత్ర బహుళ అమావాస్య నాడు వహ్ని వ్రతం ఆచరిస్తారు. పితృ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఇది అమావాస్య తిథి. అమావాస్య కూడా పర్వదినమే అని ఒక నానుడి వాడుకలో ఉంది. కానీ చిరకాలంగా అమావాస్య పర్వదినంగానే పరిగణనలో ఉంది. బహుళ చతుర్దశి తిథికి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిపే కథ ఇది.
అచ్ఛోదము అని ఒక కొలను ఉంది. సోమవులనే పితరుల మానస పుత్రిక ఆ కొలను ఒడ్డున ఉండి తపం చేయసాగింది. ఈ కారణంగా ఆమె అచ్ఛోద అయ్యింది. ఆమె తన పితరులను చిరకాలం వరకు చూడకుండా ఉండిపోయింది. అందుచేత వారిని చూడాలని ఆమెకు కోరిక పుట్టింది. పితరులు ఒకనాడు ఆమెకు దర్శనం ఇచ్చారు. అందులో మావసుడు అనే పితృదేవుడు చాలా అందంగా ఉన్నాడు. పైగా వాడు దివ్యాలంకార భూషితునిగా కూడా ఉన్నాడు. అతనిని అచ్ఛోద మోహించింది. కానీ మావసుడు మాత్రం చలించలేదు. ఆమె కోరికను నిరాకరించాడు. ఆ కారణం వల్ల ఆనాటికి అమావాస్య అనే పేరు వచ్చింది. అది పితరుల పాలిట పర్వదినంగా చెలామణిలోకి వచ్చింది. ఆనాడు మానవులు పితరులకు భక్తి ప్రపత్తులతో తిల తర్పణాలు ఇవ్వడం ఆచారంగా వస్తోంది.
ఈనాటి నుంచి భరణి కార్తె ఆరంభమవుతుంది. ఈనాటితో చైత్ర మాస తిథులు ముగుస్తాయి.

వైశాఖ శుద్ధ పాడ్యమి
ఏప్రిల్‍ 18, శనివారం

ఏప్రిల్‍ మాసంలో చైత్ర మాస తిథులు ముగిసి, ఈనాటి నుంచి వైశాఖ మాస తిథులు ఆరంభం అవుతాయి. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. మాధవుడు అంటే విష్ణువే. అంటే ఇది విష్ణువుకు ప్రీతికరమైన మాసం. మాధవ మాసంగా పేరొందిన వైశాఖ మాసానికి వైశాఖ శుద్ధ పాడ్యమి ఆరంభ దినం. వైశాఖ స్నాన వ్రతాలు ఈ తిథి నుంచే మొదలవుతాయి. వాజ్ఞనః కాయజాశేష పాపాలు వైశాఖ స్నానంతో పోతాయని ప్రతీతి. ప్రాతఃకాలంలో నియమంగా స్నానం చేస్తే మాధవునికి ప్రీతి కలుగుతుంది. స్నానాంతరం రావి చెట్టుకు నీరుపోసి ప్రదక్షిణాలు చేయడం ఆరోగ్యకరం. ఈ మాసంలో తులసి దళాలతో మాధవుడికి పూజ చేస్తే పుణ్యం కలుగుతుంది.

వైశాఖ శుద్ధ తదియ
ఏప్రిల్‍ 20, సోమవారం

వైశాఖ శుక్ల తృతీయ (తదియ) అక్షయ తృతీయ అనీ, ఈ పర్వం పూర్వాహ్ణ వ్యాపినీ అని వ్రతరాజం చెబుతోంది. ఇది గొప్ప పుణ్యదినం.
వైశాఖే మాసి రాజేంద్రశుక్ల పక్షే తృతీయకా

అక్షయాసాతిథిః ప్రోక్తా కృత్తికా రోహిణీయుతా

అని శాస్త్ర ప్రమాణం. ఈనాడు చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని ప్రతీతి. దానాలే కాదు ఈనాడు దేవతలను గురించి, పితృ దేవతలను గురించి చేసే పూజలు కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. అందుచేతనే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. ఈ పర్వాన్ని గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠరున (ధర్మరాజు)కు చెప్పినట్టు భవిష్య పురాణంలో ఉంది.
‘‘పూర్వ కాలంలో దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు జనభక్తుడు అయిన ఒక కోమటి ఉండేవాడు. అతను ఒకసారి వైశాఖ మాస శుక్ల పక్ష మహాత్స్యం గురించి పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగాస్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు, విసనకర్రలు దానం చేశాడు. ఆ కోమటి ఉత్తర జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడి ఇంట పుట్టాడు. ఆ జన్మలోనూ అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉండేది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం’’. ఇదీ ధర్మరాజుకు కృష్ణుడు చెప్పిన కథ.
అలాగే వ్రతోత్సవ చంద్రికాకారుడు ఈ వ్రత విధానాన్ని వివరిస్తూ విశేషాలు ఇలా చెబుతున్నారు.

‘‘ఈ రోజున గంగాస్నానం చేసే వారు సకల పాప విముక్తులు అవుతారు. పితృదేవతలకు తర్పణాదులు విడవాలి. లక్ష్మీసహితమైన నారాయణుని, గౌరీసహితుడైన త్రిలోచనుడిని పూజించాలి. ఆ పూజా సమయంలో విసనకర్రలు, లడ్లు పంచి పెట్టిన వారు వైకుంఠాన్ని, శివలోకాన్ని పొందుతారు. యవలతో అన్నం వండి దేవుడికి ఆరగింపు చేయాలి. గురువులకు నవధాన్యాలు, గ్రీష్మ రుతువులో లభ్యమయ్యే ఇతర వస్తువులతో కలిపి దానం చేయాలి. ఈనాటి దానాల్లో జలపూరిత కుంభం ముఖ్యమైనది. ఈనాడు ఒంటిపూటే భోజనం చేయాలి.
అక్షయ తృతీయ వ్రతం కేవలం ధార్మిక గుణ సంపన్నమైనది. అందువల్ల ఈ పండుగ అట్టే ఆర్భాటంతో జరిగేది కాదు. ఈ పర్వం హిందూ దేశం అంతటా ఆచరణలో ఉంది. దేవాలయాల్లో ఈనాడు విగ్రహాలకు ధవళ వస్త్రాలు కడతారు’’.
పై వివరణ వల్ల ఈ రోజున తీర్థ స్నానం, తిలలతో పితృ తర్పణం, ఘటదాన ధర్మాలు, దైవపూజ విధాయక కృత్యాలని తెలుస్తోంది.
ఇక, పంచాంగకర్తలు వైశాఖ శుక్ల తదియ తిథి ఎన్ని విధాలుగా ప్రశస్తమైనదో చెబుతున్నారు. ఈ తిథి నాడు అక్షయ తృతీయతో పాటు వచ్చే ఇతర పర్వాలు ఇవి అని పంచాంగంలో రాశారు.
1. దధ్యన్న వ్యజన ఛత్ర పాదుకోపానహదానాని ఉదకుంభ దానం
2. లక్ష్మీనారాయణ పూజ
3. గౌరీ పూజ, త్రిలోచన గౌరీ వ్రతం
4. త్రేతాయుగాది
5. పరశురామ జయంతి
6. సింహాచల క్షేత్ర చందన మహోత్సవం

అక్షయ తృతీయ నాడు పెరుగు అన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభము మున్నగునవి దానం చేయాలని నిర్దేశించారు. గతంలో వైశాఖ మాసంలో ‘వైశాఖ పూజ’ అనే పేరుతో సంపన్న గృహస్థులు ఒక వ్రతం చేస్తుండే వారట. అందులో వేసవికి అవసరమైనవి వేసవిలో బాగా దొరికే మామిడిపండ్లు, పనస తొనలు మున్నగునవి కూడా పంచి పెట్టేవారు. వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా ఈనాడు దానం చేయడం అక్షయ తృతీయ వ్రతం యొక్క ప్రధానోద్ధేశమని దీనిని బట్టి అర్థమవుతోంది.
అక్షయ తృతీయ నాడు చేసే దానాలలో ముఖ్యమైనది- ఉదకుంభ దానం ఒకటి. వైశాఖ మాసం నుంచి ఎండలు మెండుగా ఉంటాయి. ఎండల రోజుల్లో కుండల్లో జాగ్రత్తపెట్టిన నీరు పుచ్చుకుంటే బాగా దాహశాంతికరంగా, ఆప్యాయంగా ఉంటుంది. కావునే నీటితో నిండిన చల్లని కుండల్ని ఈ కాలంలో దానం చేయడం మత విధుల్లో ఒకటిగా మన పెద్దలు నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం అక్షయ తృతీయ ఆచరణ విధి తీరుతెన్నులు మారాయనే చెప్పాలి. ఈనాడు ఎంతోకొంత బంగారం లేదా విలువైన వస్తువులు కొనడమే ఎక్కువ ఆచారంగా మారింది.
ఇక, దశావతారాల్లో ఆరవది పరశురామావతారం. ఇది ఏటా అక్షయ తృతీయ నాడు జరుపుకోవాలని అంటారు. పరశురాముడు జమదగ్ని, రేణుక దంపతుల కుమారుడు. ఈయన ఆయుధం గొడ్డలి (పరశువు). గొప్ప శివభక్తుడు. మహిష్మతి వంటి పెద్ద సామ్రాజ్యాన్ని జయించిన మహావీరుడు. లక్ష్మీదేవి అవతారమైన ధనవిని వివాహం చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన చిరంజీవి. అంటే అమరుడు. ఇప్పటికీ ఆయన ఈ భూమిపై ఉన్నట్టు నమ్ముతారు. ఈయన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడులకు గురువని అంటారు. హరివంశ పురాణం ప్రకారం కార్తవీర్యార్జునుడు మహిష్మతి రాజ్యానికి రాజు. ఆనాడు క్షత్రియ రాజుల పాలనలో ప్రజలు అనేక బాధలు పడేవారని, ఆ బాధలు పడలేక తమ భూమిని, తమను క్షత్రియుల క్రూరత్వం నుంచి కాపాడాలని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని మహర్షి దంపతులకు జన్మించాడు. ఆయన క్షత్రియులను సంహరించి భూమిని, ప్రజలను కాపాడాడు. ఈ వివరాలన్నీ స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశ, భశివ పురాణాల్లో ఉన్నాయి. పరశురాముడిని శివుడు, విష్ణువు.. ఇద్దరికీ ప్రతిరూపమని భావిస్తారు. తండ్రి ఆదేశం మేరకు కన్నతల్లినే సంహరించి, తిరిగి బతికించుకున్నాడు. ఈయన తన గొడ్డలితో క్షత్రియులను, వారి సామ్రాజ్యాలను ఇరవై ఒక్కసార్లు నాశనం చేశాడు. ఆయన ఆయుధం పేరు పరశువు (గొడ్డలి). నిత్యం పరశువును ధరించి ఉండేవాడు కాబట్టి ఆయనకు పరశురాముడనే పేరు వచ్చింది.
ఇక, కృష్ణుడి అన్నగారైన బలరాముని జయంతి కూడా ఈనాడేనని అంటారు.

వైశాఖ శుద్ధ పంచమి/షష్ఠి
ఏప్రిల్‍ 22, బుధవారం

శంకరాచార్యుల వారి అవతరణ దినం
వైశాఖ శుద్ధ పంచమి, షష్ఠి తిథులు ఒకే తేదీన (ఏప్రిల్‍ 22) కూడి ఉన్నాయి. వైశాఖ శుద్ధ పంచమి తిథి జగద్గురు శంకరాచార్యుల వారి అవతరణ దినంగా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథిని పురస్కరించుకుని ఈనాడు శృంగేరి తదితర జగద్గురు పీఠాలలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తారు. శంకరాచార్యులు భారతదేశమంతా తిరిగారు. నలుమూలలా నాలుగు మఠాలు స్థాపించారు. తూర్పున జగన్నాథంలో గోవర్థన మఠం, పడమట ద్వారకలో శారదా మఠం, ఉత్తరాన కేదారంలో జ్యోతిర్మఠం, దక్షిణాన శృంగేరిలో శృంగగిరి మఠం స్థాపించారు. ఈయన అద్వైత మత స్థాపనాచార్యుడు. వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నది అద్వైత మతమే. శంకరులు బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసాశ్రమం స్వీకరించారు. సన్యాశి అయి ఉండీ తల్లికి అంత్యకర్మలు చేశారు. డెబ్బయి రెండు మతాల వారిని జయించారు.
శతాదికమైన ఉద్గ్రంథాలను రచించారు. ఇదంతా ముప్పయి రెండు సంవత్సరాల వయసు నాటికి సాధించిన ఘనత ఆయనది. ముప్పది రెండవ ఏటనే కైలాసగమనం చేసిన ఆయన జగద్గురువుగా ప్రసిద్ధి పొందారు.

ఈయనను ఆదిశంకరులు అని, జగద్గురువు అని జనులు స్మరించుకుంటారు. ఆదిశంకరాచార్యులకు సంబంధించి ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో ఆసక్తికరమైనది ఇది. ఒక చండాలుని ప్రబోధంలో ఆదిశంకరులు ప్రబుద్ధుడయ్యారు. ఆ కథ మిక్కిలి ఆసక్తికరం. కేరళలోని కాలడి అనే అగ్రహారంలో విద్యాధిరాజు అనే పండితునికి శివగురువు అనే పుత్రుడు ఉండేవాడు. శివగురువు భార్య ఆర్యాంబ. వీరికి శంకరుని కృపతో బిడ్డ కలగడంతో అతనికి శంకరుడనే పేరు పెట్టారు. శంకరుడి ఐదవ ఏటనే తండ్రి మరణించాడు. తల్లి ఉపనయనం చేసింది. అనంతరం శంకరుడు గురుకులవాసం చేశాడు. అచిరకాలంలోనే ఆయన చతుర్వేదాలు, షడంగాలు, షడ్డర్శనాలు, చతుష్షష్టి కళలు నేర్చాడు. విద్యార్థి దశలో ఉండగా శంకరుడు ఒక బ్రాహ్మణుడి ఇంటికి బిక్షాటనకు వెళ్లాడు. ఆ ఇంటి వారు కడుబీదలు. ఆ ఇంటి ఇల్లాలు- ‘నాయనా! మేమా కటిక దరిద్రులం. నేను నీకు అన్నం ఎలా పెట్టగలను?’ అంటూ ఇల్లంతా వెతికి ఒక ఉసిరికాయను కనుగొని దానిని శంకరునికి బిక్షగా వేసింది. ఆమె ఆదరణకు శంకరుని హృదయం కరుణార్థ్రమైంది. వెంటనే ఆ ఇంటి వాకిలిలో నిల్చుని లక్ష్మీస్తుతి గావించాడాయన. అనుగ్రహించిన లక్ష్మీదేవి ఆ ఇంటిలో బంగారపు ఉసిరికాయలను కురిపించింది. ఆనాడు శంకరుడు నుడివిన ఆ శ్లోకాలే ‘కనకధారాస్తవం’గా ప్రసిద్ధి చెందాయి.
రామానుజాచార్యుల జయంతి

వైశాఖ శుద్ధ పంచమితో పాటే షష్ఠి తిథి కూడా ఏప్రిల్‍ 22వ తేదీనే కూడి ఉంది. ఈనాడే రామానుజాచార్యుల వారు జనియించారు. త్రిదండ సన్యాసి కావడం చేత ఆయనను యతిరాజు అనీ పిలుస్తారు. ఈయనను శేషాంశ సంభూతుడిగానూ కొలుస్తారు. రామానుజుల వారి తండ్రి ఆసూరి కేశవ పెరుమాళ్‍. తల్లి భూమి పిరట్టియార్‍. మద్రాసు నగర సమీపాన గల శ్రీపెరుంబుదూరు వీరి జన్మస్థలం. క్రీస్తు శకం 1017లో నల నామ సంవత్సరం ఆయన జన్మ సంవత్సరం. శంకర, రామానుజ, మధ్వ అనే త్రిమతాల ఆచార్యులలో ఈయన రెండవ వారు. యాదవ ప్రకాశులు అనే గురువు వద్ద రామానుజులు వేదాంతం అభ్యసించారు. అయితే, ఆయనతో వేదాంత బోధన విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకసారి స్థానిక రాజ ప్రముఖుని కుమార్తెకు దయ్యం పట్టింది. రాజ ప్రముఖులు యాదవ ప్రకాశుని పిలిచారు. ఆయన తన మంత్ర శక్తితో దయ్యాన్ని వదిలించలేకపోయాడు. అప్పుడు రామానుజుడు తన మంత్రశక్తితో దయ్యాన్ని వదిల్చాడు. దీంతో శిష్యునిపై యాదవ ప్రకాశకునికి అసూయ పుట్టింది. కాశీ యాత్ర తలపెట్టి మార్గమధ్యంలో రామానుజుడిని మట్టుబెట్టాలని ప్రణాళిక రచించాడు. ఈ విషయం గోవిందభట్టు అనే సహచర విద్యార్థి ద్వారా రామానుజుడికి విషయం తెలిసింది. దీంతో ఆయన ప్రయాణం మధ్యలోనే తప్పించుకుని వచ్చేశాడు.
బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన మహనీయుడు రామానుజుల వారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామికి పూజాధికాలు నిర్వహించే విషయమై రెండు తెగల మధ్య విభేదాలు పొడచూపాయి. ఆ సమయంలో తిరుపతి వచ్చిన రామానుజులు.. ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిగా ఉండి దేవాలయంలో వైష్ణవ ప్రాబల్యం ప్రకారం పూజలు నిర్వహించాలని నిర్దేశించారు.
ఇక, వైశాఖ శుద్ధ షష్ఠి తిథి.. విద్యారణ్య స్వామి జయంతి దినంగానూ పరిగణిస్తారు. విద్యారణ్య స్వామి శ్రీకృష్ణదేవరాయలుకు గురువు. ఆయనకు అనేక యుద్ధ వ్యూహాల్లో సలహానిచ్చే వారని చెబుతారు.

వైశాఖ శుద్ధ సప్తమి
ఏప్రిల్‍ 23, గురువారం

వైశాఖ శుద్ధ సప్తమి గంగా సప్తమిగా ప్రసిద్ధి. గంగోత్పత్తి కథ పురాణ నామ చంద్రికలో విపులంగా ఉంది. తన ముత్తాతలైన సగర పుత్రులు కపిల మహాముని యొక్క కోపాగ్ని చేత నీరుగా మారగా, వారికి సద్గతి కలిగించాలని తలంచి గంగను గురించి తపస్సు చేసి భూలోకానికి దిగి వచ్చేలా భగీరథుడు ప్రార్థించాడు. అప్పుడు ఆ మహానది ఆ మహర్షి ప్రార్థన మేరకు భూలోకానికి ఏతెంచింది. తొలిగా గంగా బిందువులు పడినచోటే బిందు సరస్సుగా వ్యవహరిస్తారు. ఈ సరస్సు నుంచి ప్రవహించే గంగా నది జహ్ను మహాముని ఆశ్రమాన్ని ముంచెత్తింది. ఆయన కోపగించి మొత్తం తాగేశాడు. పిమ్మట భగీరథుని ప్రార్థనతో ఆయన శాంతించి గంగను తన చెవి నుంచి విడిచి పెట్టాడు. ఈ కారణంగానే గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. అలా గంగానది జహ్నుముని చెవి నుంచి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పూజ చేయాలి. ఇదెంతో పుణ్యప్రదం. శర్కరా సప్తమి, నింబా సప్తమి, అనోదన సప్తమి, ద్వాదశ సప్తమి మున్నగు వ్రతాలు కూడా ఈ తిథి నాడు ఆచరిస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈనాడు పర్జన్య పూజ చేస్తారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగాదేవిని విశేషంగా పూజిస్తారు. భగీరథ మహర్షిని స్మరించుకుంటారు. ఈనాడు గంగానదీ స్నానం విశేష ఫలాన్ని ఇస్తుందని అంటారు. సగరులు తమ కులదైవమైన భగీరథుని స్మ•త్యర్థం ఆయనను విశేషంగా అర్చిస్తారు. వైశాఖ మాస ప్రారంభ దినమైన వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు నదీ స్నానం ఎంత శ్రేష్టమో వైశాఖ శుద్ధ సప్తమి నాటి స్నానమూ అంతే ఫలప్రదమైనది.

వైశాఖ శుద్ధ అష్టమి
ఏప్రిల్‍ 24, శుక్రవారం

సాధారణంగా ప్రతి నెలలో వచ్చే శుద్ధ అష్టమి, బహుళ అష్టమి తిథులలో దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. దేవిని పూజించడం ఈనాటి విధాయకృత్యం. ఈనాడు దుర్గాష్టమి వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. వైశాఖ శుద్ధ అష్టమిని బుద్ధ అష్టమిగానూ పరిగణిస్తారు.

వైశాఖ శుద్ధ నవమి
ఏప్రిల్‍ 25, శనివారం

ప్రతి నెలలో వచ్చే శుద్ధ, బహుళ నవమి తిథులు కూడా శక్త్యారాధనకు ఉద్దేశించినవి. వైశాఖ శుద్ధ నవమి ద్వాపర యుగాంతం.

వైశాఖ శుద్ధ ఏకాదశి
ఏప్రిల్‍ 27, సోమవారం

వైశాఖ శుద్ధ ఏకాదశి మోహినీ ఏకాదశిగా ప్రతీతి. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి మహా విష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణులోక ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం.
మోహినీ ఏకాదశికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ధనవంతుడైన ఒక వైశ్యుడు తన ధనాన్ని అంతా దుర్వ్యయం చేశాడు. దీంతో అతనిని బంధువులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో అతను ఒక అడవికి వెళ్లి తిరుగుతుండగా, ఒక ముని కనిపించాడు. ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించి ఆచరించాలని చెప్పాడు. ఆ వైశ్యుడు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పుణ్యం సంపాదించి, తిరిగి ధనవంతుడు అయ్యాడు. ఈ ఏకాదశి మిక్కిలి ఫలకారి.
ఆంధప్రదేశ్‍లోని అన్నవరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడి రత్నగిరిపై వెలసిన సత్యనారాయణమూర్తి ప్రతి తెలుగింటా నిత్య ఆరాధనీయుడు. ఈనాడే అన్నవరం సత్యదేవుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు జరగని తెలుగిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.
ఈనాటి నుంచే భరణి కార్తె ఆరంభమవుతుంది.

వైశాఖ శుద్ధ ద్వాదశి
ఏప్రిల్‍ 28, మంగళవారం

వైశాఖ శుద్ధ ద్వాదశి పరశురామ ద్వాదశి తిథి. వైశాఖ మాసంలో పరశురాముడికి సంబంధించి రెండు పర్వాలు వస్తాయి. పరశురామ జయంతి దినం (వైశాఖ శుద్ధ తదియ, ఏప్రిల్‍ 20, సోమవారం) కూడా ఈ నెలలోనే ఉంటుంది. రత్నగిరిలో పరశురామ మందిరం ఉంది. అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంటుంది. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు పరశురామునికి అర్ఘ్యం ఇస్తే శత్రు నాశనమవుతుంది. తండ్రి మాటను జవదాటకుండా పితృవాక్య పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్న జమదగ్ని కుమారుడే పరశురాముడు. ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువు (గొడ్డలి)ని పట్టుకుని ఇరవై ఒక్కసార్లు రాజులపై దండయాత్ర చేశాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు, రాముడు శివచాపాన్ని విరిచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకుందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నిటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోతాడు. ఈ ప్రాంతం ప్రస్తుత ఒరిస్సాలో ఉంది. అక్కడి నుంచి ఆయన మలబారు ప్రాంతానికి వలస వెళ్లాడని అంటారు. అస్సాంలోని కామాక్షి దేవి ఆలయం ఉంది. అదే జమదగ్ని ఆశ్రమం అని అంటారు. ఈ ప్రాంతంలో పరశురామాలయం కూడా ఉందని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో మలబారు భూమి ఉన్న చోట కరువు ఉండదట. అలాగే, ఈనాడు సోమా ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు.

వైశాఖ శుద్ధ త్రయోదశి
ఏప్రిల్‍ 29, బుధవారం

వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

వైశాఖ శుద్ధ చతుర్దశి
ఏప్రిల్‍ 30, గురువారం

వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి తిథి. రాక్షస రాజైన హిరణ్య కశిపుడిని అంతమొందించడానికి శ్రీ మహా విష్ణువు అవతరించింది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే. అందుకే ఈ తిథి నాడు నృసింహ జయంతి నిర్వహిస్తారు. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి స్వామిని పూజించడం వల్ల లేదా స్వామి వారి వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈనాడు స్వామి వారు ఉద్భవించిన స్తంభం, ఇంటి గడపలను పూజించడం కూడా ఆచారం. తన భక్తుడైన ప్రహ్లాదుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహా విష్ణువు నృసింహుడై స్తంభం నుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ విధంగా లోకాలను కాపాడిన రోజు శుద్ధ చతుర్దశిగా భావించి నృసింహ జయంతిని నిర్వహిస్తారు.
అలాగే, ఈనాడు తరిగొండ వెంగమాంబ జయంతి దినం కూడా. ఈమె 18వ శతాబ్దికి చెందిన తెలుగు కవయిత్రి. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తురాలు. వేంకటాచల మహాత్మ్యము, ద్విపద భాగవతం ఈమె ప్రసిద్ధ రచనలు. వెంగమాంబ ఇంకా పలు ఆధ్యాత్మిక కావ్యాలు రచించారు.

Review మాసం.. విశేషం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top