ఆంగ్లమానం ప్రకారం ఎనిమిదవ మాసం ఆగస్టు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ-శ్రావణ మాసాల కలయిక. ఆషాఢ మాసంలోని కొన్ని రోజులు, శ్రావణ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో ఉంటాయి. అటు ఆషాఢం.. ఇటు శ్రావణం.. రెండు మాసాలూ అమ్మవారి పూజలకు ప్రసిద్ధి. ఆగస్టు 1, శనివారం నుంచి ఆగస్టు 12, బుధవారం వరకు ఆషాఢ మాస తిథులు, ఆపై ఆగస్టు 13, గురువారం నుంచి ఆగస్టు 31, సోమవారం వరకు శ్రావణ మాస తిథులు ఉంటాయి. సికింద్రాబాద్ మహంకాళి జాతర (బోనాలు), నాగపంచమి, వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్, గాయత్రీ జపం వంటివి ఆగస్టు మాసంలోని ప్రధాన పర్వాలు.
2026- ఆగస్టు 1, శనివారం, ఆషాఢ బహుళ తదియ నుంచి 2026- ఆగస్టు 31, సోమవారం, శ్రావణ బహుళ తదియ వరకు
శ్రీ పరాభవ నామ సంవత్సరం- ఆషాఢం/ శ్రావణం/ గ్రీష్మ/వర్ష రుతువులు- దక్షిణాయణం
శ్రావణ మాసానికి శుభ మాసమనీ, నభో (ఆకాశ) మాసమనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా వర్ష రుతుకాలం. నిండైన వర్షాలతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. సస్యశ్యామలమైన వాతావరణం.. ప్రకృతి పులకరింతలతో శోభిల్లే ఈ శుభ శ్రావణంలో ప్రతి రోజూ పండుగే. ఈ మాసంలో చేపట్టే ఎలాంటి పనికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. అటు విష్ణుమూర్తి – లక్ష్మీదేవి దంపతులకు, ఇటు శివపార్వతులకు మిక్కిలి ప్రీతికరమైన మాసమిది. మహా విష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. కాబట్టి ఈ మాసం విష్ణు, లక్ష్మీపూజకు ఉద్ధిష్టమైనది. సాధారణంగా అష్టమి, నవమి, అమావాస్య తిథులు శుభకార్యాలకు అంతగా అనువైనవి కాదంటారు. కానీ, శ్రావణ మాసంలో మాత్రం ఈ తిథులు కూడా పూజలు, శుభ కార్యాలు తలపెట్టేందుకు అనువైనవి.
అందుకే శ్రావణ మాసాన్ని శుభప్రదమైన మాసమనీ అంటారు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను విశేషంగా పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, కార్తికేయుని ఆరాధన, బుధవారం విఠలుడి, గణేశుడి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మి, తులసి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజలు, శనివారం వేంకటేశ్వరస్వామి, హనుమంతుడి, శనీశ్వరుడి పూజలు, ఆదివారం సూర్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఆచరించే దైవ కార్యాలకు ఎంతో శక్తి, మహిమ ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రధానంగా పూజలందుకునేది లక్ష్మీదేవి. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధనకు శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. ఆమె- ఉత్సాహం, ఉల్లాసం,
ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణమాసమే. అటువంటి శ్రావణంలో శ్రీలక్ష్మిని విశేషంగా ఆరాధించేందుకు వరలక్ష్మీ వ్రతం ఓ వేదిక. ఇంకా, సోదర సోదరీ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్, నాగపంచమి వంటి పర్వాలు కూడా ఈ నెలలోనే పలకరిస్తాయి.
శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడి జన్మతిథి కూడా ఈ మాసంలోనిదే. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. అరవింద యోగి శ్రావణ మాసంలోనే జన్మించారు. ఇంకా ఆధ్యాత్మిక పరమ పురుషులైన ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్, చూడికుడుత్త నాంచార్ తదితరుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే. గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోని శుద్ధ పంచమి నాడేనని ప్రతీతి. దక్షిణాయనంలో వర్ష రుతువు మొదటగా వచ్చేది శ్రావణ మాసంలోనే. దక్షిణాయనం వర్షాకాలం.
అంటే, వివిధ జబ్బులు, వ్యాధులు ముసురుకునే సమయమిది. అందుకే ఆరోగ్య పరిరక్షణార్థం ఈ మాసం పొడవునా మన పెద్దలు వివిధ వ్రతాలను ఆచరించాలని నియమం విధించారు.
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో శివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేయాలి.
శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే మొదటి పదిహేను రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించాలి.
శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాల్లో ఉంది. కొత్తగా వివాహమైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. వరుసగా ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి.
శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రమైనవి.
శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్ర వారమే వరలక్ష్మీ వ్రతం ఆచరణకు యోగ్య మైనది. ఈనాడు తెలుగు లోగిళ్లు అన్నీ లక్ష్మీకళతో ఉట్టిపడతాయి.
ఆషాఢ బహుళ తదియ
ఆగస్టు 1, శనివారం
ఇది ఆగస్టు మాసం ప్రారంభ దినం. తిథి ఆషాఢ బహుళ తదియ.
ఆషాఢ బహుళ చవితి
ఆగస్టు 2, ఆదివారం
ఆషాఢ బహుళ చవితి నాడు సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర. అలాగే ఈనాడు సంకష్టహర చతుర్థి. ఈనాడు సంకటాలు తొలగిపోవాలని వినాయకుడిని పూజిస్తారు. ఆగస్టు 2వ తేదీ స్నేహితుల దినోత్సవం.
అలాగే, ఈనాడు మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి దినం. ఈయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. 1876, ఆగస్టు 2న జన్మించారు. 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో చోటుచేసుకున్న వివిధ ఘట్టాలలో ఈయన పాల్గొన్నారు. తొలిసారి ఈయన రూపొందించిన జాతీయ పతాకాన్ని 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఎగురవేశారు. 1947, జూలై 22న భారత రాజ్యాంగసభలో జాతీయ జెండా గురించి తీర్మానాన్ని ఆమోదించారు. ఈయన రూపొందించిన మునుపటి త్రివర్ణ పతాకంలో రాట్నం ఉండేది. దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు.
ఆషాఢ బహుళ చవితి
ఆగస్టు 3, సోమవారం
ఆషాఢ బహుళ చవితి నాటి నుంచి ఆశ్లేష కార్తె ప్రారంభం అవుతుంది.
ఆషాఢ బహుళ షష్ఠి
ఆగస్టు 4, మంగళవారం
ఆషాఢ బహుళ షష్ఠి స్కంద షష్ఠి దినం. ప్రతి మాసంలో వచ్చే షష్ఠి తిథి స్కంద షష్ఠిగా ప్రతీతి. ఈనాడు కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు.
ఆషాఢ బహుళ అష్టమి
ఆగస్టు 6, గురువారం
ఆషాఢ బహుళ అష్టమి తిథి రౌచ్య మన్వంతరాది తిథిగా ప్రసిద్ధి. రౌచ్యుడు 13వ మనువు. ఆయనకు రేచ్చుడు అనే మరో పేరూ ఉంది. ఈయన రుచి అనే వాని కుమారుడు. మొదట రుచి మహర్షి వివాహం చేసుకోలేదు. అందువల్ల ఒకనాడు పితరులు అతనికి కనిపించి పెళ్లి చేసుకుని సంతానం పొందాలని చెబుతారు. ఈ క్రమంలో అతను బ్రహ్మ ఆదేశానుసారం మాలిని అనే అప్సరస కుమార్తెను వివాహమాడతాడు. ఫలితంగా ఆయనకు ఒక కొడుకు పుడతాడు. అతనే రేచ్చుడనే పేరుతో త్రయోదశి మన్వంతరాధి పత్యం వహిస్తున్నాడు. ఈ మన్వంతరానికి దివస్పతి నామకుడు ఇంద్రుడు. ధృతిమంతుడు, తత్త్వదర్శి మున్నగు వారు సప్తర్షులు.
ఆషాఢ బహుళ నవమి
ఆగస్టు 7, శుక్రవారం
ఆషాఢ బహుళ నవమి ఆడి కృత్తిక దినం. ఇది కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్యుడి ప్రీతిరమైన నక్షత్రం. తమిళ ఆషాఢ మాసం (ఆడి)లో కృత్తిక నక్షత్రం ప్రవేశించే రోజున గొప్ప ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అందుకే ఈ తిథిని ఆయనకే అంకితం చేస్తారు. ఈ మాసంలో ఈనాటి నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇది ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమ సమయం. భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని కావడి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. తమిళనాడు వ్యాప్తంగా ఈనాడు కావడి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.
అలాగే, ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఆషాఢ బహుళ ఏకాదశి
ఆగస్టు 9, ఆదివారం
ఆషాఢ బహుళ ఏకాదశి కామిక ఏకాదశిగా ప్రసిద్ధి. దీనినే కామికైకాదశి అని కూడా అంటారు. ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ ఏకాదశిని కామదైకాదశి అని వర్ణించారు. ఈనాటి ఏకాదశీ వ్రతాచరణం వల్ల కోరుకున్న అభీష్టాలు నెరవేరుతాయని అంటారు. కోరిన కోరికలు తీర్చే ఏకాదశి కాబట్టే దీనికి కామికైకాదశి అనే పేరు వచ్చింది.
ఆషాఢ బహుళ ద్వాదశి
ఆగస్టు 10, సోమవారం
ఆషాఢ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. దీనినే సోమా ప్రదోష వ్రతమనీ అంటారు. ఈనాడు శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే, ఈనాడు రోహిణి వ్రతాన్ని కూడా ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.
కాగా, త్రయోదశి తిథి కూడా ఆగస్టు 10వ తేదీనే ద్వాదశి తిథితో కూడి ఉంది. ఆషాఢ బహుళ త్రయోదశి నాడు శని త్రయోదశి పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా త్రయోదశి తిథి శనీశ్వరుని పూజలకు ఉద్ధిష్టమైనది.
ఆషాఢ బహుళ చతుర్దశి
ఆగస్టు 12, బుధవారం
ఆషాఢ బహుళ చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి. ఈనాడు శివుడిని విశేషంగా ఆరాధిస్తారు.
శ్రావణ శుద్ధ పాడ్యమి
ఆగస్టు 13, గురువారం
ఈనాటి నుంచి శ్రావణ మాస తిథులు ఆరంభమవు తాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి వీటిలో మొదటి తిథి. వర్ష రుతువు ఆరంభ దినం కూడా ఇదే. శ్రావణ మాసపు పవిత్రారోపణోత్సవాలు ఈనాటి నుంచే మొదలవుతాయి. ఈ తిథి పవిత్రారోపణాలకు ఉద్ధిష్టమైనది. అంటే శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరములను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవం అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు. దర్భలను ‘పవిత్రం’ అంటారు. వీటికి మొదట పూజ చేసిన తరువాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురు దేవతల పేరుతో పంచుతారు. ఇదే పవిత్రారోపణోత్సవ పక్రియ.
శ్రావణ శుద్ధ విదియ
ఆగస్టు 14, శుక్రవారం
శ్రావణ శుద్ధ విదియ నాటి పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాదికాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రారోపణం’ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. తిథి తత్వం దీనినే ‘మనోరథ ద్వితీయ’ అని చెబుతోంది.
ఇక, శ్రావణ మాసపు తొలి
శుక్రవారం ఇది. ఈనాటి నుంచి శ్రావణ
శుక్రవారాలు ఆరంభమవు తాయి. ఇది శ్రావణ మాసపు తొలి
శుక్రవారం. దీని తరువాత వచ్చే
శుక్రవారమే (ఆగస్టు 21, 2026) వరలక్ష్మీ వ్రతాచరణ వారం. ఆగస్టులో శ్రావణ
శుక్రవారాలు 2026 ఆగస్టు 14, 21, 28, సెప్టెంబరు 4, 11 తేదీలలో ఉన్నాయి.
శ్రావణ శుద్ధ తదియ
ఆగస్టు 15, శనివారం
శ్రావణ శుద్ధ తదియ నాడు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరిం చాలని కృత్యసార సముచ్చ యము అనే వ్రత గ్రంథంలో వివరించారు. అందులో ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అలాగే, పంచాంగాలలో ఈనాడు స్వర్ణగౌరీ వ్రతంగా ఆచరించాలని ఉంది. అనోన్య దాంపత్యాన్ని కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారాలతో పూజించి, పదహారు ముడులు కలిగిన తోరమును మగవారు కుడిచేతికి, ఆడవారు ఎడమ చేతికి లేదా మెడలో కట్టుకోవడం ఈనాటి ప్రధాన విధాయ కృత్యం. ఈ వ్రతాన్ని గురించి శివుడు తన దేవేరి అయిన పార్వతికి చెప్పాడని అంటారు. ఈ వ్రతానికి సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు ఓ రాజు అడవిలో వేటకు వెళ్లాడు. అక్కడ నదీతీరాన మహిళలంతా గుమికూడి ఉంటారు. అక్కడేం చేస్తున్నారని రాజు అడుగుతాడు. స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నామని మహిళలు బదులిస్తారు. ఈ వ్రతకథ చెప్పాలని ఆయన కోరగా, వారు చెబుతారు. దీంతో ఆయన తన రాజమందిరానికి చేరుకుని తన భార్యలకు ఈ వ్రత విశేషం గురించి చెబుతాడు. ఆ ఇద్దరి భార్యలలో పెద్దావిడ వ్రతాన్ని పట్టించుకోకపోగా, హేళన చేస్తుంది. రెండో భార్య మాత్రం శ్రద్ధగా వ్రతాన్ని ఆచరిస్తుంది. వ్రతాన్ని నిర్లక్ష్యం చేసిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. చిన్న భార్య మాత్రం వ్రతాచరణ ఫలంతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవిస్తుంది. గౌరీదేవి అంటే పార్వతీదేవి.
ఈనాడు భారత స్వాతంత్య్ర దినోత్సవం. 1947, ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. అందుకే ఏటా ఈ రోజున జాతీయ పతాకాలను ఆవిష్కరించి, గౌరవ వందనాలను సమర్పిస్తారు. ఇక, ఇదే రోజు అరవింద యోగి జన్మతిథి. ఈయన 1872, ఆగస్టు 15న పశ్చిమబెంగాల్లో జన్మించారు. సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు. కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఈయన పాల్గొన్నారు. వందేమాతరం గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఈయనే. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ఈయన అలీపూర్‌లోని కారాగారంలో శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులయ్యారు. యోగ, భగవద్గీతపై ఈయన పలు గ్రంథాలను రచించారు. ‘ది లైఫ్ డివైన్’ అనేది అరవిందుల ప్రసిద్ధ గ్రంథం.
శ్రావణ శుద్ధ చవితి
ఆగస్టు 16,ఆదివారం
చతుర్థి నాడు సాధారణంగా గణేశ పూజలు విశేషంగా జరుగుతాయి. చవితి తిథి విఘ్న పూజకు ఉద్ధిష్టమైనదని వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. అందుకే ఈనాడు ఆచరించే పూజనే చతుర్థి వ్రతం అని అంటారు. అయితే శ్రావణ మాసపు శుద్ధ చతుర్థిని నాగ చతుర్థిగా భావించి పూజలు చేసే ఆచారమూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో నాగుల పూజ ఈ నాగ చతుర్థి నాడే జరుగుతుంది. ఆంధప్రదేశ్‌లో మాత్రం ఈ తిథి మర్నాడు వచ్చే శుద్ధ పంచమి నాడు నాగుల పండుగ జరుపుకుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి
ఆగస్టు 17, సోమవారం
శ్రావణ శుద్ధ పంచమి తిథి నాగపంచమి పర్వం. ఈనాడే గరుడ పంచమి కూడా. కల్కి జయంతి దినం కూడా ఈనాడే. ఈనాడు సోమవార వ్రత దినం కూడా. ఈనాడు శ్రావణ సోమవార వ్రతాలను ఆచరించాలి. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన దినం. పార్వతీదేవి శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించే శివుడిని భర్తగా పొందిందని అంటారు. పూజా మందిరాన్ని అలంకరించి, శివపార్వతుల విగ్రహాలను ఉంచి దీపారాధన చేయాలి. శివలింగాన్ని అభిషేకిం చాలి. బిల్వ పత్రాలు, గంధం, అక్షతలు సమర్పించాలి. శివపార్వతులకు నైవేద్యం సమర్పించిన అనంతరం శ్రావణ సోమవార వ్రత కథను చదవాలి లేదా వినాలి. పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం శివపూజ చేసిన అనంతరం సాత్వికాహారంతో కూడిన భోజనం చేయాలి.
ఇక, ఈనాటి ప్రధాన పర్వం- నాగ పంచమి. దీని గురించి హేమాద్రి స్కాంద పురాణంలో ఉంది. అందులో శివుడు పార్వతితో ఇలా చెప్పాడు.
‘ఓ పార్వతీ! శ్రావణ మాసాన శుక్ల (శుద్ధ) పంచమి నాడు ద్వారములకు రెండు పక్కలా పేడతో సర్ప చిత్రములను గీసి పూజించాలి. చతుర్థి నాడు ఒక్క పొద్దు ఉండి, పంచమి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, కర్రతో కానీ, మట్టితో కానీ ఐదు పడగల పామును చేయించాలి. లేక పసుపుతో కానీ, చందనంతో కానీ ఐదు లేక ఏడు పాముల చిత్రములు గీయాలి. విధిప్రోక్తంగా పంచామృతంతోనూ, గన్నేరు, సంపెంగ, జాజి తదితర పువ్వులతో ఈ నాగపంచకాన్ని పూజించాలి. పిదప ఘృతపాయసమోదకాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. అనంతాది నాగరాజులను ధ్యానించాలి. నాగులను ఎప్పుడూ భక్తితో పూజించాలి. పంచమి నాడు పాలు, పాయసాలను నైవేద్యంగా పెట్టాలి. ఆనాడు పగలు కానీ, రాత్రి కానీ భూమిని తవ్వరాదు’’.
శ్రావణ శుద్ధ పంచమి నాడు స్త్రీలు పాముల పుట్టల వద్ద పూజ చేస్తారు. ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించడం ఈనాటి ఆచారం. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేసిన ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రావణ శుద్ధ నాగ పంచమి నాడు రైతులు అరక ముట్టుకోరు. నాగలి పట్టరు. భూమిని దున్నరు. ఆ రోజు ఆ పని చేయకూడదనేందుకు ఒక ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది.
పూర్వం ఒక రైతు పొలం దున్నుతుండగా, నాగటి కర్రు ఒక బొరియలో దిగబడిపోయింది. నాగటి కర్రు గుచ్చుకుని బొరియలో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. తల్లి నాగు వచ్చి చూసే సరికి పిల్లలన్నీ చనిపోయి ఉన్నాయి. పక్కనే ఉన్న నాగలి కర్రుకు నెత్తుటి మరకలు అంటుకుని ఉండటాన్ని అది చూసింది. రోషావేశంతో బుసలు కొడుతూ తల్లి నాగుపాము రైతు ఇంటికి వెళ్లింది. రైతు కుటుంబంలోని అందరినీ కాటువేసి చంపేసింది. అంతటితో కూడా దాని రోషం చల్లారలేదు. అత్తింట కాపురం చేస్తున్న రైతు కుమార్తెను కూడా కాటేయాలనే ఆవేశంతో అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఫణి రాజైన ఆదిశేషుడిని పూజిస్తోంది. దీంతో ఆ తల్లి పాము ఆమె శేషు పూజను ముగించుకుని వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అంతలోపున పూజ నిమిత్తం తొమ్మిది నాగవంశాలను రాసిన పీఠంపై ఉన్న చందనపు గిన్నెలో పడగ ముంచి పక్కనున్న పాలను తాగి, పేలాలను మింగింది. దాంతో తల్లి పాము ఆవేశం చల్లారిపోయింది. అనంతరం ఆమె ఎదుట పడగ విప్పి నిల్చుని ‘నువ్వు ఎవరి కుమార్తెవు?’ అని నాగు ప్రశ్నించింది. ఆమె బదులివ్వగానే, ‘నేను నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను చంపివేశాన’ని నాగు చెప్పింది. ఆమె ఎంతో చింతించి వారిని మళ్లీ బతికించాలని కోరింది. దీంతో నాగు ఆమెకు కొంచెం అమృతం ఇచ్చింది. అది తీసుకుని ఆమె పరుగున తండ్రి ఇంటికి వెళ్లి వారి నోట అమృతం పోసి మళ్లీ బతికించుకుంది.
అప్పటి నుంచి శ్రావణ శుద్ధ పంచమి నాడు పొలాలు దున్నరు. ఆనాడు ఇంకా కూరగాయలు తరుగుట, వంటలు వార్పులు నిషిద్ధములయ్యాయి. నాగరాజుకు పాలు నివేదించాలనే నియమం ఇప్పటికీ తెలుగునాట అన్నిచోట్లా ఆచారంలో ఉంది.
నాగపంచమికి సంబంధించి ఇది మరో కథ.
పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఏడుగురు కోడళ్లు. కడపటి కోడలు తప్ప మిగతా వారంతా ఒకసారి తమ పుట్టినిళ్లకు వెళ్లారు. కడపటి కోడలికి తల్లిదండ్రులు లేరు. కనీసం కొద్ది రోజులు ఉంచుకునే బంధువులు కూడా లేరు. ఆమె పరమ భక్తురాలు. ఆదిశేషుడే తనకు దిక్కని చెప్పుకునేది. ఆమె భక్తికి సహస్ర పడగలు కలిగిన ఆదిశేషుడు కరుణించి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆమె మామ గారి వద్దకు వచ్చాడు. తాను ఆమె మేనమామనని, ఆమెను తనింటికి పంపాలని కోరాడు. ఇంతకాలం మీ మేనమామ ఏమయ్యాడని మామ కోడలిని ప్రశ్నించాడు. ఆమె శేషుని చలవతో ఏదో కథ చెప్పి తప్పించుకుంది. ఆ తరువాత వృద్ధుడు ఆమెను మామగారి అనుమతితో తనతో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఒక ఎలుక కలుగు వద్ద వృద్ధుడు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ఆమెను తన పగడపై ఎక్కించుకుని నాగలోకానికి తీసుకెళ్లాడు. ఆమె కొంతకాలం ఆదిశేషుని ఇంట, బంధుమిత్రులతో పాటు నివసించింది. ఆమెను ఎవరూ కరవరాదని ఆదిశేషుడు కఠినంగా ఆదేశించాడు. కొంతకాలానికి ఆదిశేషుని భార్య ప్రసవించింది. పాము పిల్లలన్నీ ఇంటి నిండా తిరగసాగాయి. ఒకనాడు ఆ కోడలు ఒక బరువైన ఇత్తడి దీపాన్ని పట్టుకుని వెళ్తుండగా, దారికి అడ్డంగా పారాడుతున్న పాము పిల్లలను చూసి భయంతో దీపాన్ని జారవిడిచింది. దీంతో పాము పిల్లలకు గాయాలయ్యాయి. కొన్నిటికి తోకలు తెగిపోయాయి. మరికొంత కాలానికి ఆదిశేషుడు ఆమెను అత్తారింటికి పంపించి వేశాడు. అంతలో శ్రావణ మాసం వచ్చింది. కోడలు శుక్ల పంచమి నాడు ఒక పీటపై నాగరూపాలను తీర్చిదిద్ది పూజ చేసింది. ఆనాడే, కాకతాళీయంగా తోకలు తెగిన పాము పిల్లలు తమ విరూపానికి కారణం ఏమిటని తల్లిని అడిగాయి. ఒకామె ఇత్తడి దీపాన్ని జారవిడవటం వల్ల మీద పడి మీకు గాయాలయ్యాయని తల్లి పాము చెప్పింది. దీంతో పాము పిల్లలన్నీ పగ తీర్చుకోవడానికి కోడలి ఇంటికి వచ్చాయి. కానీ, ఆమె తమను రక్షించాలని భగవంతుడిని వేడుకోవడం చూసి తమ దుష్టచింతనను మానుకున్నాయి. అక్కడ నైవేద్యంగా ఉంచిన పాలను, పేలాలను ఆరగించి, పాలగిన్నెలో ఓ రత్నహారాన్ని వదిలి వెళ్లిపోయాయి.
ఇక, ఈనాటి నుంచి శ్రావణ సోమవార వ్రతం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో శ్రావణ సోమవార వ్రతాలు ఆచరిస్తారు. ఇది మొదటి సోమవారం. వరుసగా (2026, ఆగస్టు 17, 24, 31, సెప్టెంబరు 7) వచ్చే సోమవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణ శుద్ధ షష్ఠి
ఆగస్టు 18, మంగళవారం
శ్రావణ శుద్ధ షష్ఠి కల్కి జయంతి దినమని మరికొన్ని పంచాంగాలలో ఉంది. శ్రావణ శుద్ధ షష్ఠి తిథి కల్కి జయంతి దినమని ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సుపోదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో రాశారు. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సుపోదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం).
శ్రావణ శుద్ధ విదియ నాటి నుంచే శ్రావణ మంగళవారాలు ఆరంభమవుతాయి. ఈనాడు, ఆపై శ్రావణ మాసం పొడవునా వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది శ్రావణ మాసంలో 2026, ఆగస్టు 18, 25, సెప్టెంబరు 1, 8 తేదీలు) ఆచరించాల్సిన వ్రతం.
శ్రావణ శుద్ధ సప్తమి
ఆగస్టు 19, బుధవారం
శ్రావణ శుద్ధ సప్తమి తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించినది. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి (హస్తా నక్షత్రం వస్తే) వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది.
శ్రావణ శుద్ధ అష్టమి
ఆగస్టు 20, గురువారం
శ్రావణ శుద్ధ అష్టమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. సాధారణంగా దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనది. శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాపూజకు విశేషమైనది. ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అనీ అంటారు.
శ్రావణ శుద్ధ నవమి
ఆగస్టు 21, శుక్రవారం
శ్రావణ శుద్ధ నవమి.. శ్రావణ మాసపు రెండో
శుక్రవారం. ఈనాడు వరలక్ష్మీ వ్రతం. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని పూజించడం అనూచానంగా వస్తోంది.
ఈనాడు మహాలక్ష్మిని అష్టైశ్వర్యప్రదాయినిగా పూజిస్తారు. లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతోందని శ్రీగుణరత్న కోశం చెబుతోంది. మహాలక్ష్మికి మహదానందం చేకూర్చడం కోసమే శ్రీహరి ఈ లోకాలను సృజించాడని భాగవతం వెల్లడిస్తోంది. భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. సంకల్పం చేసేది హృదయస్థానం. విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి. మనం తలపెట్టే కార్యాల్ని జయప్రదంగా కొనసాగింపచేసే ధీయుక్తి, ‘లోకైక దీపాంకురమ్’ అని సిరులతల్లిని ఈనాడు విశేషంగా ఆరాధిస్తారు.
శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం. సకల జీవరాశులు ఆమె సంతానం. ఆ కృప కోసమే ఈనాడు విశేష వ్రతమాచరిస్తారు. అదే వరలక్ష్మీ వ్రతంగా ప్రసిద్ధి.
భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు’
(శుక్ర)వారం నాడు ప్రతి మాసంలోనూ లక్ష్మీ ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది. మాసాల్లో ‘ఆర్థ్రత’కు ప్రధానమైన వర్ష రుతువు మొదటి మాసమే శ్రావణం. అందులో వృద్ధి చెందే చంద్రకళకు నెలవైన శుక్ల పక్షం, శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ‘ఆర్ధ్రాం పుష్కరిణీం..’ అని శ్రీసూక్తం వర్ణించిన ఆర్ధ్ర శక్తి- శాంతికి, పంటకు, ఐశ్వర్యానికి సంకేతం. శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైనది.
స్త్రీలో లక్ష్మీకళ ఉందని ‘దేవీ భాగవతం’ వంటి పురాణ వాంగ్మయం చెబుతోంది. అందుకే స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మంగా భాసిల్లుతోంది. స్త్రీ మూర్తులు లక్ష్మీకళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే- శ్రావణ శుద్ధ శుక్రవారం.
సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ, సంపదల సాకారమే మహాలక్ష్మి. దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.
వరలక్ష్మి వ్రత కథలో సిద్ధి పొందిన కథానాయిక చారుమతి. మంచి మతి (బుద్ధి) మాత్రమే దేవీకృపకు పాత్రమవుతుందని మానవాళికి ఆ పాత్ర సంకేతమిస్తుంది. సంపదలను అడిగే ముందు ‘చారు’ (చక్కని) మతి కలిగి ఉండాలన్నదే అంతరార్థం. ఆ సందేశం అర్థమైతే వ్యక్తికి, సమాజానికి సౌభాగ్యప్రదం.
ఇక, చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ చతుర్దశి నాడు శివునికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక 12-8-4 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి, ముడి ముడికి మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీలు 50, 38, 21 ఉండేలా దర్భలు వేలాడదీయాలి. ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అంటారు.
ఈనాడు కౌమార (కుమారి) పూజలు చేస్తారు. కౌమార దశలో ఉన్న బాలికలు ప్రత్యేక పూజలు చేయడానికి ఒక తిథిని ఉద్దేశించారు. అదే శ్రావణ శుద్ధ నవమి తిథి. ఈ తిథికి ‘కౌమారీ నామక పూజనమ్’ అని పేరు. ఈ పేరును బట్టి ఇది కౌమార దశలో ఉన్న బాలికలు ఆచరించే వ్రతంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.
శ్రావణ శుద్ధ నవమి నాడు కౌమారీ నామ పూజ చేయడం హిందూ సంప్రదాయం. ఈ రోజున కౌమారీ దేవతను పూజిస్తారు. కౌమారీ దేవి శక్తిస్వరూపిణి. దుర్గాదేవి అంశ. ఈ పూజ ద్వారా బాలికలు శక్తి, ధైర్యం, విజయం పొందుతారని అంటారు. కౌమారీ దేవి అనుగ్రహంతో ఆరోగ్యం, సంపద లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శ్రావణ శుద్ధ నవమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని శుచి చేసి అందంగా అలంకరించాలి. కౌమారీదేవి విగ్రహాన్ని లేదా ఆమె చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. దీపాలు వెలిగించి, ధూపం వేయాలి. పుష్పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. కౌమారీదేవి స్తోత్రాలు, మంత్రాలు పఠించాలి. పూజానంతరం ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. అలాగే, 2 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న బాలికలను కౌమారీదేవి రూపంగా ఎంచి, పూజించడం కూడా ఒక ఆచారంగా ఉంది. దుర్గాదేవి తొమ్మిది రూపాలలో కౌమారి రూపం ఒకటి. ఈ పూజ శ్రావణ శుద్ధ నవమి నాడు ఆచరించడం ఆచారంలో ఉన్నా.. ఈ కౌమారీ పూజా ఆశ్వయుజంలో వచ్చే దుర్గానవరాత్రుల సందర్భాలలో ఈ పూజలు ఇంకా విశేషంగా జరుగుతాయి.
శ్రావణ శుద్ధ దశమి
ఆగస్టు 22, శనివారం
శ్రావణ శుద్ధ దశమి శ్రావణ మాసపు పదవ రోజు. శ్రావణ
శుద్ధ దశమి తిథి ఆశా దశమిగా కూడా ప్రసిద్ధి. మనసులో సంకల్పించే ఆశలన్నిటినీ తీర్చేది కాబట్టి ఇది ఆశా దశమి అయ్యింది. ఈనాడు చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరుతాయని అంటారు. ఈనాటి పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించాలని నియమం.
శ్రావణ శుద్ధ ఏకాదశి
ఆగస్టు 23, ఆదివారం
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రద ఏకాదశిగా ప్రసిద్ధి. మహిజిత్తు అనే అతడు శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా అతనికి పుత్ర సంతానం కలిగింది. పుత్రుడిని ప్రసాదించిన ఏకాదశి కాబట్టి ఇది పుత్రదైకాదశి, పుత్రద ఏకాదశి అయింది. ఈ మేరకు ఈ వ్రతం వివరాలు ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉన్నాయి. సంతానం లేని వారు, సత్సంతానం కావాలనుకునే వారు ఈ ఏకాదశి తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇక, ఈనాడు మంగళగౌరీ వ్రతాన్ని విశేషంగా ఆచరిస్తారు.
శ్రావణ శుద్ధ ద్వాదశి
ఆగస్టు 24, సోమవారం
శ్రావణ శుద్ధ ద్వాదశి తిథి దామోదర ద్వాదశిగా ప్రతీతి. ఈనాడు విష్ణు ప్రతిమను లేదా సాలగ్రామాన్ని దానం చేస్తారు. దీనినే శ్రీధర పూజగా కూడా వ్యవహరిస్తారు. ఈనాడు ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు. దామోదర ద్వాదశి శ్రావణ మాసపు శుక్ల పక్షంలో వచ్చే పన్నెండవ రోజు. ఈ ద్వాదశి గురించి విష్ణు పురాణంలో ప్రస్తావన ఉంది. శ్రావణ శుక్ల (శుద్ధ) ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజైన దామోదర ద్వాదశి రోజున సాలగ్రామ రూపంలో గల విష్ణువును పూజిస్తే మోక్షం లభిస్తుందని అంటారు. సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఇలా అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్ర వచనం. ఉత్తర భారతదేశంలోని గండకీ నదిలో సాలగ్రామాలు విరివిగా లభిస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలను కొన్ని పుణ్యక్షేత్రాలలో విక్రయిస్తుంటారు. ఇంతటి విశిష్టమైన సాలగ్రామాన్ని దామోదర ద్వాదశి అయిన శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధారణంగా పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారు దామోదర ద్వాదశి నాడు ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు. ఈనాడు విష్ణువును గంగాజలంతో అభిషేకించి, తులసి, గన్నేరు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.
శ్రావణ శుద్ధ త్రయోదశి
ఆగస్టు 25, మంగళవారం
శ్రావణ శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశిగా ప్రసిద్ధి. త్రయోదశి తిథి అనంగుడికి ప్రీతికరమైనది. అనంగుడు అంటే మన్మథుడు అని అర్థం. ఈ తిథి నాడు అనంగ వ్రతం చేయాలని, రతీమన్మథులను నెలకొల్పి పూజించాలని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మినుములతో చేసిన మినపసున్ని ఉండలు, పాలను నివేదించాలి. మైనపువత్తితో హారతినివ్వాలి. ఈనాడు ఆయనకు పవిత్రారోపణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఈ తిథి శని త్రయోదశి పర్వం కూడా. ఆయనకు ప్రీత్యర్థమైన నువ్వులు, నువ్వుల నూనెతో పూజించాలి. త్రయోదశి తిథి ఆగస్టు 26వ తేదీన కూడా కొనసాగుతోంది.
శ్రావణ శుద్ధ పూర్ణిమ
ఆగస్టు 28, శుక్రవారం
శ్రావణ శుద్ధ పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అనీ, రాఖీ పూర్ణిమ (రక్షాబంధన్) అనీ, జంధ్యాల పౌర్ణమి అనీ వ్యవహరిస్తారు.
జంధ్యాన్ని ధరించే వారు శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడే పాతది వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే వేద పరిభాషలో ఉపాకర్మ అంటారు. ఈ ఉపాకర్మనే యజ్ఞోపవీతం గానూ వ్యవహరిస్తారు. జంధ్యం అంటే యోగకర్మతో పునీతమైన దారం అని అర్థం. ఈ కారణంగానే పాల్కురికి సోమనాథుడు ఈ పూర్ణిమను నూలి పూర్ణిమగా వ్యవహరించాడు. నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించే రోజు కాబట్టి ఆ విధంగా ఆయన వర్ణించారు. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. ఈనాడు ఉపనయనం కూడా నిర్వహించే ఆచారం ఉంది.
రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ.
ఈ రోజు ‘అధ్యాయోపాకర్మ’ జరుపుతారు. అంటే, వేదాధ్యయన ప్రారంభం. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించాలి. ఇంటికి వచ్చి అధ్యయన హోమం ఆచరించాలి. మర్నాడు ఉపాకర్మాంగభూతంగా 1,008 సార్లు గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువ ఆచారంలో ఉంది. దీనినే మహారాష్ట్ర ప్రాంతంలో నార్లీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుడిని పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో దీనినే పౌవతి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివ, విష్ణు, గణేశులను పూజిస్తారు. అలాగే, సర్వరోగ ఉపశమనం కోసం, సర్వ శుభాల కోసం ఏం చేయాలని ధర్మరాజు కృష్ణుడిని అడిగాడట. అందుకు కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధిని ఉపదేశించాడట. శాస్త్రం ప్రకారం రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా.. ఆచరణలో మాత్రం చెల్లెలు తమ్ముడు, అన్నకు చెల్లెలు కట్టడం ఆచారంగా మారింది. ఈ క్రమంలోనే శ్రావణ శుద్ధ పూర్ణిమ రాఖీ పూర్ణిమగానూ ప్రసిద్ధి చెందింది. ఇక, రాఖీ పూర్ణిమకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. తనను రక్ష కోరి వచ్చిన సోదరిని బలి చక్రవర్తి ఆమెను రక్షిస్తూ, ఈ క్రమంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎదురొడ్డి నిలుస్తాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తన సోదరుడికి రక్షనివ్వాలని కోరుతూ కుడిచేతికి ఒక దారపు పోగును కడుతుంది. అదే రాఖీగా ప్రసిద్ధి. సోదర – సోదరి ప్రేమకు ప్రతీకగా నిలిచే పర్వమిది. మన హిందూ సంప్రదాయంలో కుటుంబ అనుబంధాలను బలపరిచే అనేక పర్వాలను ఏర్పరిచారు. అటువంటి అనేకానేక పర్వాల్లో రాఖీ పౌర్ణమి ఒకటి. ఈనాడు సోదరీమణులు తమ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీని కట్టి అనుబంధాన్ని చాటుకుంటారు.
శ్రావణ పూర్ణిమ నాడు ముంబై ప్రాంతంలో ప్రజలు కొత్త బట్టలు కట్టుకుని సాయంకాలం చౌపతి సముద్ర తీరానికి వెళ్లి వరుణదేవుని తృప్తి కోసం కొబ్బరికాయలు సమర్పిస్తారు. కాబట్టే దీనికి నారికేళ పూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అనే పేర్లూ ఉన్నాయి. ఇంకా పూణె, గుజరాత్ ప్రాంతాల్లోనూ గొప్ప ఉత్సవంగా శ్రావణ పూర్ణిమను జరుపుకుంటారు.
అలాగే, ఈనాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు. హయగ్రీవుడు అంటే గుర్రపు ముఖము కలవాడని అర్థం.
శ్రావణ బహుళ పాడ్యమి
ఆగస్టు 29, శనివారం
ఈనాటి నుంచి శ్రావణ మాసపు కృష్ణ (బహుళ) పక్ష తిథులు ప్రారంభం. ఈ వరుసలో తొలి తిథి- శ్రావణ బహుళ పాడ్యమి. శ్రావణ బహుళ పాడ్యమి నాడు శివ వ్రతాన్ని ఆచరిస్తారు. దీనినే ధనావాప్తి వ్రతం అని కూడా అంటారు. శ్రావణ బహుళ పాడ్యమి మొదలుకుని భాద్రపద పూర్ణిమ వరకు ఆచరించాల్సిన మాస (నెల) వ్రతమిది.
శ్రావణ బహుళ విదియ
ఆగస్టు 30, ఆదివారం
శ్రావణ బహుళ విదియ నాడు అశూన్య వ్రతం ఆచరిస్తారు. ఈ మేరకు పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో దీని వివరాలు ఉన్నాయి. ఈ రోజు మొదలు నాలుగు నెలలు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలని గ్రంథాంతరాలలో ఉంది. అందుచేతనే దీనిని చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. అయితే, ప్రస్తుతం ఈ తిథి శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు విష్ణువు వాకుడు చెట్టు పరుపుగా లక్ష్మితో కూడి శయనిస్తాడని ప్రతీతి. ఈనాడు వీరిద్దరిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు.
శ్రావణ బహుళ తదియ
ఆగస్టు 31, సోమవారం
శ్రావణ బహుళ తదియ తిథి నాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో కబ్జలీ తృతీయా వ్రతం చేయాలని ఉంది.


























































































Review మాసం.. విశేషం.