అనగనగా దోమ.. కోతిబావతో పెళ్లి

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

అనగనగా దోమ..
కోతిబావతో పెళ్లి
అనగనగా ఒక దోమ
దానికి పెండ్లాడవలెననే కోరిక పుట్టె
మంచి మగడిని కట్టుకుందామని బయలుదేరే కంచికి..
దారిలో ఒక ఏనుగు ఎదురుపడే..
‘దోమా.. దోమా.. ఎక్కడికి నీ ప్రయాణం?’ అని కుశలమడిగె
‘కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నా’నంది దోమ
‘ఏం? నన్ను పెళ్లాడరాదా?’ అని అడిగె ఏనుగు
‘ఛీ ఛీ. నీకు డొప్ప చెవులు. నేను చేసుకోను’ అని ఛీదరించె దోమ
అలా ముందుకు వెళ్తుండగా,
ఒక గుర్రము ఎదురొచ్చె
‘దోమా.. దోమా.. ఎందాక నీ ప్రయాణం అని గుర్రం ఆరా తీసె
‘కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నా’నంది దోమ
‘నన్ను పెళ్లి చేసుకోరాదా?’ అంది గుర్రం
‘ఛీ ఛీ గుర్రానికి గుది కాళ్లు. నేను చేసుకోను’ అని బదులిచ్చె దోమ
అలా మరికొంద దూరం పోయె
ఒక పాము ఎదురొచ్చె
‘దోమా దోమా ఎందాక నీ ప్రయాణం’ అని పాము అడిగె
‘కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని’ అంది దోమ
‘నన్ను పెండ్లాడరాదా?’ అనె పాము
‘ఛీ ఛీ! పాముకు పడిగతల. నేను చేసుకోను ఫొమ్మనె
మరికాస్త దూరం వెళ్లె
ఒక కోతి ఎదురుపడె
‘దోమమ్మా దోమమ్మా! ఎందాక ప్రయాణం’ అని కోతి అడిగ్ణె
‘కంచికి పోయి మంచి మొగుడిని తెచ్చుకుందామని పోతున్నా’ అని బదులిచ్చె దోమ
‘ఇదే గదా కంచి. నా కంటే మంచి మొగుడు నీకెక్కడ దొరుకు? నన్ను పెళ్లి చేసుకోరాదా?’ అనె కోతి
‘ఇదేనా కంచి? అయితే నిన్నే చేసుకుంటాలే!’ అనింది దోమ.
కోతి దోమను నెత్తిపై ఎక్కించుకునె
ఇంటి వద్ద దించి పుటిక పూరీలు, అటిక ఆవునెయ్యి పెట్టి విందు చేసె
తరువాత వైభవంగా పెళ్లాడె
ఒకనాడు దోమమ్మ ఒక కొడుకును కనె
బిడ్డ ఏడుస్తుండగా ఈ కింది విధంగా పాడె
‘ఏనుగును వద్దంటి
ఎత్తు చెవులంటి
గుర్రమును వద్దంటి
గుదికాళ్లదంటి
పామును వద్దంటి
పడిగతలదంటి
కోతిని పెండ్లాడి
కొడుకును గంటి .. జో.. జో..’
అంతలో మొగుడు కోతి ఇంటికి వచ్చె
పెళ్లాం దోమ పాట విని ఎక్కడలేని సంతోషమూ వచ్చె
సంతోషం పట్టక అమాంతం దోమను ముద్దాడె
ఆ ఆనందంలో దోమ కోతి ముక్కులో దూరె
‘నీకు కాసులదండ
జేయిస్తా.. రా..
కట్టె వంకలు పెడతా.. రా..
ముక్కుపోగు కుట్టిస్తా.. రా..
అని కోతి తన ముక్కులో దూరిన దోమమ్మను బతిమాలె
కోతి ముక్కులోకి దూరిన దోమ ఎంతకీ బయటకు రాలేకపాయె..
కోతికి కోపం వచ్చె..
ముక్కును గట్టిగా రుద్దె
దోమ కాస్తా నలిగి చచ్చె
ముక్కు దురద పెట్టగా కోతి ‘ఆఛ్‍’మని తుమ్మె
ఆ తుమ్ముతో చచ్చిన దోమ బయటపడె
పెళ్లాం దోమను చూసి విలవిల్లాడె
చేసేది లేక కోతి కళ్ల నీళ్లెట్టుకునె
దోమ పెండ్లి కథ కంచికి చేరి ముగిసినట్టె ఈ పాట కథ కూడా కంచికి చేరె
మనం ఇంటికి చేరె

Review అనగనగా దోమ.. కోతిబావతో పెళ్లి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top