పల్నాటి సీమలో ఒక పల్లె ఉండేది.
ఆ పల్లెలో చంద్రమ్మ అనే ఒక ముసలమ్మ ఉంది.
ఆ ముసలమ్మకు ధర్మమ్మ అనే కూతురూ, ఆ కూతురికి శేషారెడ్డి అనే ఒకే ఒక్క కొడుకూ ఉన్నాడు.
ఆ బాలుడిని ముద్దుగా శేషు అని పిలుచుకునే వారు.
ధర్మమ్మ మగడు హనుమారెడ్డీ, చంద్రమ్మ భర్త చెంగారెడ్డీ గొప్ప వీరులు.
ఆ అల్లుడు, మామ ఇద్దరూ పలనాటి యుద్ధంలో తమ రాజు పక్షాన శౌర్యంతో పోరాడి ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందారు.
శేషు అప్పటికి ఆరు నెలలైనా నిండని నూనె బిడ్డ.
వాడిని ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటూ ఆ తల్లీ, అమ్మమ్మా తమ భర్తలు పోయారన్న దు:ఖాన్ని దిగమింగుకున్నారు.
ఏణ్ణర్ధం వయసులో శేషు ఒకమాటు పిడుగు చప్పుడికి జడుసుకున్నాడు.
పెరిగి పెద్దవాడు అయినా కూడా ఆ అదటూ, భయమూ వాడిని పట్టుకుని వదలలేదు.
తోటి పిల్లలంతా వాడిని ఉత్త పిరికిపంద కింద జమకట్టి, వాడు ఎప్పుడు ఎదురుపడినా వేళాకోళాలు చేసి ఏడిపిస్తుండే వారు.
శేషు పిరికితనాన్ని చూసి ధర్మమ్మా, చంద్రమ్మా చాలా విచారించే వారు.
ఆ పిరికితనం ఎలా పోగొట్టడమా అని వాళ్లు రాత్రింబవళ్లు ఆలోచించారు.
ఆఖరికి చంద్రమ్మకు ఒక ఆలోచన తట్టింది.
ఒకనాడు శేషు తోటిపిల్లలతో ఆటలకు వెళ్లి మామూలు ప్రకారం వాళ్ల చేత దెబ్బలు తిని ఏడుస్తూ ఇంటికి వచ్చాడు.
చంద్రమ్మ వాడిని చూసి, ‘ఎవళ్లయినా కొడితే తిరగబడి బాదాలి కానీ, చచ్చు నాగమ్మలాగా ఏడుస్తూ రావడం ఏమిటి? మీ నాన్నా, తాతా నీకుమల్లే భయపడ్డారా? కత్తులు పుచ్చుకుని యుద్ధానికి వెళ్లి శత్రువులను సంహరించే వారు. నువ్వు కూడా వాళ్లలాగే, వీరుడవై యుద్ధానికి వెళ్లాలి’ అన్నది.
‘అమ్మో! యుద్ధమే! ఆ మాట చెబితేనే నాకు గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి’ అన్నాడు శేషు భయంగా.
అందుకు ఆమె, ‘అబ్బాయీ! నీకు వచ్చిన భయమేమీ లేదు. గొప్ప తపశ్శాలి అయినటువంటి ఒక మహాయోగి ఇచ్చిన రక్షరేకు మహిమ వల్ల నీ తండ్రి, తాతలు యుద్ధాలలో విజయం పొందారు. దానిని ధరించడం వల్ల మనిషిలో వీరలక్షణాలు పుట్టుకొస్తాయి. ఏమంటే ఆ మహాయోగి మీ నాయనకూ, మీ తాతకూ ఇచ్చి వెళ్లిన రక్షరేకులు రెండూ ఇప్పుడు మనింట్లోనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి నువ్వు కట్టుకుని వెళ్లు. అది నీ వంటి మీద ఉన్నంత కాలం నీవు బలవంతుడవూ, ధైర్యవంతుడవూ అవుతావు. ఎవళ్లూ నిన్ను ఏమీ చెయ్యలేరు’ అన్నది చంద్రమ్మ.
‘సరే’నన్నాడు శేషారెడ్డి.
చంద్రమ్మ లోపలికి వెళ్లి, తన సందుగు పెట్టెలో ఏనాటి నుంచో పడి ఉన్న రాగి నానుకోడు ఒకటి పైకి తీసి, దానికొక తాడు కట్టి తెచ్చి మనవడికి ఇచ్చింది.
శేషారెడ్డి అది నిజంగా యోగీశ్వరుడు ఇచ్చి వెళ్లిన రక్షరేకే అనుకుని, వెంటనే దాన్ని తన దండకు కట్టుకున్నాడు.
దాని మహిమను పరీక్షించాలని తోచి వాడు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడక పిల్లలంతా బొంగరాలు తిప్పుకునే మైదానానికి పరుగెత్తి వెళ్లాడు.
‘ఇంక ఎవరు వస్తారో రండి. డొక్క చీల్చేస్తాను’ అని గట్టిగా అరిచాడు.
పిల్లలందరికీ ఆశ్చర్యం వేసింది.
‘ఏమిటర్రా అలా చూస్తూ నిలబడిపోయారు.
పట్టుకుని చితగ్గొట్టక’ అన్నాడు వాళ్లలో ఒకడు
శేషును ఉద్దేశించి. ఒక్కమాటుగా వాళ్లందరూ శేషారెడ్డిని చుట్టుముట్టారు. అయితేనేం? శేషారెడ్డికి తనకు యోగీశ్వరుడు ఇచ్చిన రక్షరేకు ఉందనే ధైర్యంతో ఉన్నాడు.
అదివరకు మల్లే గాకుండా శివమెత్తిన వాడిలాగా ఎగిరిపడుతూ తలకొక గుద్దూ ఇచ్చాడు.
మదపుటేనుగుల గుంపులో దుమికిన సింహపు పిల్లకు మల్లే గర్జిస్తూ వాళ్లందరినీ చెల్లాచెదురు చేసేశాడు.
‘వీడికి ఈ కొత్త బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా?’ అనుకుంటూ వాళ్లంతా దెబ్బలు తగిలిన చోట తడుముకుంటూ పారిపోయారు.
శేషారెడ్డి విజయగర్వంతో ఇంటికి వెళ్లి, ‘రక్షరేకు పని చేసింద’ని అమ్మమ్మకు ఆనందంగా ఎగురుతూ చెప్పాడు.
చంద్రమ్మ తన యుక్తి ఫలించినందుకు లోలోన సంతోషించింది.
శేషారెడ్డి పెద్దవాడై కత్తిసాము నేర్చి కొండవీడు రాజ్యానికి పోయి, ఆ రాజుగారి సేనలో చేరాడు.
కొద్దికాలానికే అతడు తండ్రినీ, తాతనూ మించిన వీరుడనిపించుకున్నాడు.
కొండవీడు రాజు శేషారెడ్డి ధైర్యసాహసాలకు మెచ్చుకుని, ఒక చిన్న సైనిక దళానికి అతడిని అధిపతిగా చేశాడు.
ఇది జరిగిన కొద్ది రోజులకే కొండవీటి రాజు శత్రు రాజుల మీదకు దండెత్తి పోవలసి వచ్చింది.
దుర్గాన్ని కాపాడుతూ ఉండమని చెప్పి శేషారెడ్డిని, అతని సైన్యాన్ని అక్కడే ఉంచేసి రాజు తన తక్కిన సైన్యాన్ని వెంటబెట్టుకుని దండయాత్ర సాగించాడు.
ఈ సంగతి తెలిసిన నవాబు ఒకడు కొండవీడును వశం చేసుకోవడానికి ఇదే తగిన సమయమని తలచి, తన సైన్యంతో వచ్చి ఆ దుర్గాన్ని ముట్టడించాడు.
దుర్గాన్ని రక్షిస్తున్న శేషారెడ్డి సైన్యం నవాబు సైన్యంతో పోల్చి చూస్తే చాలా తక్కువ.
తండోపతండాలుగా వచ్చి పడుతున్న నవాబు సైన్యాన్ని చూసేసరికి శేషారెడ్డి మొదట చాలా అధైర్యపడ్డాడు.
కానీ, అతడికి తన మొలలో ఉన్న రక్షరేకు మాట జ్ఞాపకానికి వచ్చి గొప్ప ధైర్యం వచ్చింది.
నవాబు ముట్టడి చేశాడన్న వార్తను తెలియచేయడానికి అతడు వెంటనే తన రాజు గారి వద్దకు చారులను పంపి, తన సైనికులతో కోట దర్వాజా వద్ద నిలబడి వచ్చిన సైనికులందరినీ నరకటం మొదలుపెట్టాడు.
అతని సాహసం, తెగువ చూసేటప్పటికి అతని సైనికులకు కొండంత ఉత్సాహం వచ్చింది.
వాళ్లలో ఒక్కొక్కడూ నూరుమంది పెట్టుగా శుత్రువులను తెగనరకడం ప్రారంభించారు.
తృటిలో కొండవీడు తమ వశమవుతుందనుకుని వచ్చిన నవాబు సైన్యం శేషారెడ్డి దళం ధాటికి తట్టుకోలేక, కోటలో ప్రవేశించలేక డీలాపడిపోయింది.
కోటలో అడుగుపెట్టడం మాట అటుంచి చాలామంది సైనికులు హతులైపోయారు.
ఇంతలో దండయాత్రకు వెళ్లిన కొండవీటి రాజు తన సైన్యంతో తిరిగి వచ్చి జతకలవడంతో నవాబు సైన్యం పని మరింత దిగజారిపోయింది.
ఒకపక్క శేషారెడ్డి సైన్యం, మరోపక్క రాజుగారి సైన్యం నవాబు సైనికులను ఢీకొని చెల్లాచెదురు చేసి తరిమివేశాయి.
తను వచ్చే వరకూ కోట శత్రువులకు చిక్కకుండా రక్షించినందుకు రాజు శేషారెడ్డిని మెచ్చుకుని, ఎన్నో బహుమానాలూ, బిరుదులూ ఇచ్చి గౌరవించాడు.
శేషారెడ్డి ఆ బహుమతులన్నీ తెచ్చి అమ్మమ్మకు చూపెట్టి, ‘అమ్మమ్మా! ఇదంతా నువ్వు కట్టిన రక్షరేకు యొక్క మహిమయే సుమా!’ అన్నాడు.
చంద్రమ్మ ఏనాడో తాను మనవడి మొలకు కట్టిన ఆ రాగి నానుకోడు మాటే మరిచిపోయింది.
మనవడు గుర్తుచేసేటప్పటకి, ‘నాయనా! అది ఇంకా నీ మొలనే ఉందా? దానిని నువ్వు నిజంగా రక్షరేకు అనుకుంటున్నావా?’ అంది.
శేషారెడ్డి తెల్లబోయి, ‘అది రక్షరేకు కాదా? యోగీశ్వరుడు ఇచ్చింది కాదా?’ అని అడిగాడు.
దానికి చంద్రమ్మ, ‘యోగీ లేడు. రక్షరేకూ లేదు. ఇదంతా నీ పిరికితనాన్ని పోగొట్టడానికి నాడు నేను చేసిన యుక్తి. అంతే!’ అని చెప్పింది.
‘ఏదైతేనేం అమ్మమ్మా! నా తండ్రి, తాతల పేరూ, ప్రఖ్యాతిని నీ యుక్తే నిలబెట్టింది’ అంటూ శేషారెడ్డి ముసలమ్మకు సాష్టాంగపడ్డాడు.
పిల్లలకు పూర్వ కాలంలో పెద్దలు రక్షరేకులనీ, తాయెత్తులనీ కట్టే వారు. అవి నిజంగా పనిచేస్తాయని కాదు. అవి ఉన్నాయనే భరోసాతో పిల్లలు బెరుకుతనం అనేది పోయి.. ధైర్యంగా ఉంటారనేది వాళ్ల ఉద్దేశం.
అలా ఒక ముసలమ్మ పన్నిన యుక్తి ఏకంగా
ఆమె మనవడిని వీరుడిని చేసింది.



























































































































Review అమ్మమ్మ కట్టిన రక్షరేకు.