అరుణాచలం పంచభూత స్థలాలలో ఒకటి.

అరుణాచలం పంచభూత స్థలాలలో ఒకటి. ఇది అగ్నిలింగ స్థానం. కాబట్టి ఇక్కడ చేసే ప్రతి దానం విశేష ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా అగ్నిలింగ స్థానం కాబట్టి.. అన్నదానం మరీ విశేష ఫలాన్నిస్తుంది. పురాణాల్లో మన కడుపు భాగాన్ని ‘అగ్నికుండ్‍’ అని చెప్పారు. అది అన్నకోశం. శరీరంలోని పంచమూల కాల్లో అగ్ని ఒకటి. కాబట్టి దాన్ని తృప్తి పరచడం ద్వారా.. అంటే అన్నదానం చేయడం లేదా అన్నదాన సత్రాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా జన్మజన్మల పాపరాహిత్యాన్ని పొందవచ్చు. అరుణా చలం (తిరువణ్ణామలై)లో అన్నదానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఇక్కడ చేసే అన్న దానాన్ని ‘మహేశ్వర పూజ’ అని పిలుస్తారు. అరుణాచలంలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రం వారు చేసే అన్నదానం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. మానవత్వం పట్ల ఈ సత్రం నిర్వాహకులు కలిగి ఉన్న ఒక కరుణ, బాధ్యత. నిత్యం వేలాది మంది భక్తులు కరివెన సత్రం ద్వారా మహేశ్వరుని మహా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూడాలనే గొప్ప సంకల్పంతో కరివెన సత్రం భోజన సదుపాయాలను అందిస్తోంది. ఈ అన్నదాన సేవను మరింతగా విస్తరించేందుకు దాతల నుంచి విరాళాలను కోరుతోంది.

అన్నదాన సేవకు సహకరించాలనుకునే దాతలు కరివెన సత్రం బాధ్యులకు నేరుగా నిధులు లేదా ఆహార పదార్థాలను విరాళంగా అందించవచ్చు. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని, జీవించి ఉన్న వారికి శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. పితృపక్షం, పౌర్ణమి వంటి రోజుల్లో మనం ప్రత్యక్షంగా అన్నదానం చేసే వీలు లేకపోయినా బ్రాహ్మణ కరివెన అన్నదాన సత్రాల వంటి వాటికి ఇతోధికంగా సాయపడటం ద్వారా నేరుగా అన్నదాన ఫలాన్ని పొందవచ్చు. ఈరోజుల్లో చేసే అన్నదానం, అందించే అన్నదాన విరాళం వంటి సేవ పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది. తద్వారా దాతతో పాటు వారి కుటుంబానికి, వారి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు లభిస్తాయి. అటువంటి ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసుకోవాలంటే అరుణాచలంలో అడుగుపెట్టాల్సిందే. శివుడాజ్ఞ లేనిదే తిరువణ్ణామలైలో అడుగుపెట్టలేం. కానీ మంచి మనసుతో.. దానబుద్ధితో అక్కడ అడుగుపెట్టడం సాధ్యమే..నేత్రపర్వం చేసే అరుణాచల క్షేత్ర మహత్యమిదుగో..

భూరంభాంస్యనలో నిలోమ్బర మహార్నాథో హిమాంశు: పుమాన్‍
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‍
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో:
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే।।
జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలోని ఒక పాదం ఇది. దీని అర్థం ఏమిటంటే- ‘‘అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనబడే విధంగా అష్టమూర్తి తత్త్వంగా ప్రకాశిస్తుంది’’ అని.
ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. ఆయన తత్త్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తుంది. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు పంచభూతాలు. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు.. ఈ ఎనిమిది శివ స్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్ధారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి- కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్లో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్‍మాండ్‍లో యజమాన లింగం.
అరుణాచలంలో శివుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతిలింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల పుట్టిన వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దానివల్ల మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం- అరుణాచలం. ప్రపంచంలో అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగా ఇది పేరొందింది.
ఇదీ పురాణ గాథ
పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకున్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట.
‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది?’ అని బ్రహ్మ, ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడంతో ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసింది. ఏ మాయ వల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇద్దరి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతిస్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతి స్తంభం ఆది, అంతములు తెలుసుకుని రమ్మన్నాడట. వరాహమూర్తియై విష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకుంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొన భాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లాడట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట వచ్చి ఒకచోట ఆగిపోయాడు. ఆ సమయంలో పై నుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని అడిగాడట. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని బదులిచ్చిందట. ‘ఈ శివలింగం పై భాగం ఇంకెంత దూరం ఉంది?’ అని బ్రహ్మ ఆ కేతకీ పుష్పాన్ని అడగగా, ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలైంది’ అని చెప్పిందట. ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఇలా అన్నాడట- ‘శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పు’ అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించింది. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఈ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు వెళ్లాడు బ్రహ్మ. అప్పటికే మాయ మేఘం వీడిపోయిన విష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్ష్యమని బ్రహ్మ చెప్పాడట. లోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజ లేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ఇలా ప్రార్థన చేశాడట- ‘మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’. ఈ కారణంగానే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిశాడన్నది పురాణగాథ.

సిద్ధ పురుషుల తపోభూమి
అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివ స్వరూపం. అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది. ఆ పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ల దూరం దాని తేజస్సు పడుతుందట. అక్కడ ఏ దీక్షా అవసరం లేదట. ఇందుకు రమణ మహర్షి జీవితంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెబుతారు.
భగవాన్‍ రమణ మహర్షి అరుణాచలం పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి కౌపీనం ధరించి ఉన్నారట. ఆ సమయంలో శృంగగిరి పీఠం నుంచి ఓ పండితుడు వచ్చి, ‘అయ్యా! మీరు అన్నీ విడిచిపెట్టేశారు. ఏ బంధనాలూ లేవు. ఇలా తెల్లటి గోచీ పెట్టుకుని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి, కాషాయ వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది. సన్యాసం కాదంటే ఓ కాషాయ కౌపీనం ధరిస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారట. అందుకు రమణ మహర్షి ఏ సమాధానం ఇవ్వలేదట. తాను మళ్లీ వస్తానని, మనసు మార్చుకుంటే చెప్పండని ఆ పండితుడు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచీతో అక్కడికి వచ్చి, ‘నేను స్నానం చేయలేదు. ఈ మూట చూస్తూ ఉండు’ అని రమణ మహర్షికి చెప్పి వెళ్లిపోయాడట. పుస్తకాల మూటను విప్పి చూసిన రమణులు అందులో పైనున్న పుస్తకాన్ని తెరచి చూశారు. అది సంస్క•తంలో ఉన్న ‘అరుణాచల మహాత్యం’ అనే పుస్తకం. గిరి పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ల వరకూ ఏ దీక్షా నియమాలూ ఉండవని అందులో రాసి ఉందట. పరమశివుడే వృద్ధుడి రూపంలో వచ్చి రమణ మహర్షికి ఆ పుస్తకాలను అందచేశారని చెబుతారు. ఈ పుస్తకాన్ని అంతకుముందు కలిసి వెళ్లిన పండితుడికి చూపితే ఆయన మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడట.
పర్వత గుహలో దక్షిణామూర్తి
అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఒక పెద్ద గుహ ఉంది. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉందని, దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుదిరిగి వచ్చేస్తుంటారు. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయల్దేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట.
పూజాదికాలు నిర్ణయం చేసిన గౌతమ మహర్షి
అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తరువాత అక్కడ నిర్వహించాల్సిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి, గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి? ఏ ఆలయాలు ఉండాలి? ఏ పూజలు చేయాలి? అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అపీతకుచాంబ పేరుతో ఇక్కడ అమ్మవారు కొలువుదీరారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పాతాళలింగం కూడా ఇక్కడ ఉంటాయి.
ముఖ్యమైన మూడు ఉత్సవాలు
అరుణాచలంలో ముఖ్యంగా మూడు ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో వలయాకారపు మండపం ఉంటుంది. అక్కడ అమ్మవారికి గాజులను సమర్పిస్తారు. కార్తీక మాసంలో జరిగే మరో గొప్ప ఉత్సవం- దీపోత్సవం. దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రణయ కలహం ఎందుకు వచ్చిందనేది చెబుతూ నిర్వహించే ప్రణయ కలహోత్సవం కనులపండువగా ఉంటుంది. ఎందుకు వారి మధ్య ప్రణయ కలహం వచ్చిందటే.. ఇందుకు ఓ పురాణగాథను చెబుతారు. ప్రమథ గణాల్లో భృంగి ఒకడు. ఆయన శివుడికి మాత్రమే భక్తుడు. కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. ఇలా రోజూ చేస్తుండటంతో ఒకసారి అమ్మవారికి ఆగ్రహం వచ్చిందట. ఏం చేస్తాడో చూద్దామని భృంగి వస్తున్న సమయంలో అమ్మవారు పరమశివుడి వామార్థం (ఎడమ భాగం)లోకి వెళ్లిపోయి అర్థనారీశ్వర రూపాన్ని ధరించారట. అదే సమయానికి అక్కడకు వచ్చిన భృంగి తేనెటీగలా మారిపోయి పరమశివుడికి, అమ్మవారికి మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట. దీంతో ఆయన భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తాననీ.. ఇవ్వకూడదని అమ్మవారూ.. ఇద్దరూ కలహించుకున్నారని గాథ. దీనిని స్ఫూర్తిగా తీసుకుని అర్చకులు అరుణాచలంలో అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా శివుడు భృంగికి మోక్షం ప్రసాదిస్తాడు. దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి అపీతకుచాంబ ఆలయంలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. దీంతో పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఈ దొంగలతోపును ఆనవాయితీగా చేస్తున్నారు.
గోపురాల విశిష్టత
అరుణాచల దివ్యక్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకూ అంతే విశిష్టత ఉంది. తూర్పువైపు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం.
ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని అమ్మణి అమ్మన్‍ అనే మహిళ కట్టించారట. పరమశివుడి అనుగ్రహం వల్ల ఆమె యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతి ఇంటికీ వెళ్లి ‘గోపురం కడుతున్నాం. దానం చేయండి’ అని అర్థించేవారట. ఎవరైనా డబ్బులు లేవంటే, వారి ఇళ్లలోని ఇనుపపెట్టెలు ఎక్కడున్నదీ, అందులో ఎంత డబ్బున్నదీ ఆమె చెప్పేసేవారట. దీంతో భయపడి ప్రతి ఒక్కరూ ఎంతోకొంత విరాళం ఇచ్చేవారని, ఆ సొమ్ముతోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టించారని చెబుతారు.
మరో గోపురాన్ని భళ్లాల మహారాజు కట్టించాడు. దీనిని కిరి గోపురం అని అంటారు. భళ్లాల మహారాజు అపార శివభక్తుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. సంతానం లేదు. విభూతి ధరించి ఎవరు వచ్చి ఏం కోరినా ఇచ్చేసేవాడట. భళ్లాల రాజును పరీక్షించదలిచిన శివుడు, పెద్ద జంగమదేవర రూపంలో మరికొందరిని వెంటబెట్టుకుని ఆయన ఇంటికి వెళ్లాడట. అతిథి సత్కారాలు అయిన తరువాత అందరూ దేవదాసీలను కోరగా మహారాజు పంపాడట. అయితే పెద్ద జంగమదేవర వద్దకు పంపడానికి దాసీ లేకపోయిందట. దీంతో మహారాజు రెండో భార్య చెల్లమ్మ వచ్చి ‘శివభక్తిలో ఎలాంటి లోపం రాకూడదు’ అని
తానే వెళ్తానని అందిట. దీంతో పెద్ద జంగమదేవర గదికి వెళ్లి నిద్రపోతున్న ఆయనను లేపేందుకు తాకగా పసిబాలుడిలా మారిపోయాడట. ఆ బాలుడిని ఎత్తుకుని మహారాజు వద్దకు వెళ్లగా, రాజు చేతుల్లోకి తీసుకోగానే ఆ బిడ్డ అంతర్థానమైపోయి- ‘నీకు బిడ్డలు లేరని బాధపడకు. నేనే నీకు కుమారుడిని. నువ్వు చనిపోయిన తరువాత నీకు అగ్నిసంస్కారం నేనే చేస్తాను’ అనే మాటలు వినిపించాయట. భళ్లాల మహారాజు తనువు చాలించిన తరువాత పరమశివుడే స్వయంగా ఆయనకు దహన సంస్కారాలు చేశాడంటారు. భళ్లాల మహారాజు వర్ధంతి రోజున ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో శివలింగం వద్దకు వచ్చి మరణవార్తను తెలియచేస్తూ పత్రిక చదువుతారు. అనంతరం ఆలయం తలుపులు మూసివేస్తారు. ఉత్సవమూర్తి పల్లకీలో అపీతకుచాంబ సమేతుడై భళ్లాల మహారాజు రాజధానిగా చేసుకుని పరిపాలించిన పళ్లికొండపట్టు వెళతాడు. ఉత్సవమూర్తికి అక్కడ స్నానం చేయించి, భళ్లాల దేవుడికి ఆబ్దీకం పెట్టి తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. అభిషేకం అనంతరం స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఆరేడు శతాబ్దాలుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం.
ఇక, ‘కిరి’ పర్వతం పేరు వెనుక మరో గాథ ప్రచారంలో ఉంది. అరుణాచలం ఆలయం లోపలికి వెళ్తే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంపై ఉన్న బొమ్మల ప్రకారం ఈ కథ అర్థమవుతుంది. అదేమిటంటే- ప్రౌఢదేవరాయల వద్ద అరుణ గిరినాథర్‍ ఆస్థానకవిగా ఉండేవాడు. ఆయన కన్నా ముందు సంబంధన్‍ ఆస్థానకవిగా ఉండేవాడు. అరుణ గిరినాథర్‍ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆయన సోదరి పెంచి పోషించగా, వ్యసనపరుడై స్త్రీలోలుడిగా మారి స్వేచ్ఛగా తిరుగుతుండే వాడు. ఒకరోజు ఆమె చాలా బాధపడి, అతడిని నిందించడంతో వైరాగ్యం కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీంతో భళ్లాల మహారాజు కట్టించిన గోపురం ఎక్కి అక్కడి నుంచి దూకగా, కింద పడుతుంటే సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి అతడిని పట్టుకుని రక్షించాడట. సుబ్రహ్మణ్యస్వామి స్పర్శ కారణంగా జ్ఞానం పొంది కవిగా మారడంతో ప్రౌఢదేవరాయల ఆస్థానకవి అయ్యాడని పురాణగాథ. అప్పటి నుంచి అరుణ గిరినాథర్‍ సుబ్రహ్మణ్యస్వామిని నిత్యం వివిధ రకాల పూలతో అర్చించేవాడట. అయితే తెచ్చిన పూలు చాలక పరకాయ ప్రవేశం ద్వారా చిలుక రూపంలో వనాలకు వెళ్లి పారిజాత పుష్పాలు తెచ్చి పూజించేవాడట. అరుణ గిరినాథర్‍ ఆస్థానకవి కావడాన్ని సహించలేని సంబంధన్‍ దీనిని గుర్తించి అరుణగిరి నాథర్‍ పరకాయ ప్రవేశం చేయగానే ఆయన శరీరాన్ని కాల్చివేశాడట. దీంతో గిరినాథర్‍ చిలుక రూపంలోనే ఆ గోపురంపై ఉండి సుబ్రహ్మణ్యస్వామిని సేవిస్తున్నాడనీ, ఇప్పటికీ పాటలు పాడుతున్నాడనీ అంటారు. అందుకు గుర్తుగా ఈ గోపురంపై పెద్ద చిలుక బొమ్మ ఉంటుంది.
గిరి ప్రదక్షిణ
అరుణాచల క్షేత్రం ప్రత్యేకత- గిరి ప్రదక్షిణ. ప్ర- పాపసంహారం, ద- కామ్యసిద్ధి, క్షి- జన్మరాహిత్యం, ణ- జ్ఞాన మార్గంలో ముక్తి. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కిలోమీటర్లు. దీనిని చెప్పులు లేకుండా చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షి చెబుతారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కనుక దీనిని సుదర్శనగిరి అని కూడా అంటారు. అరుణాచలం ఒక బ్రహ్మానంద నిలయం. కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలే. కొండ అంతా నిండిన అనేక దివ్యౌషధ వృక్షాలు సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి.
రమణాశ్రమం నుంచి ప్రారంభించి పాలితీర్థం, గణేశ ఆలయం, అగస్త్య తీర్థం, ద్రౌపది గుడి, స్కందాలయం, యమలింగ, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరుతి లింగ, హనుమాన్‍ గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్ర మఠం, ప్రతిధ్వని మండపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మండపం, ఈశాన్య లింగం, ప్రవాల పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శోద్రిస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి ఆలయం.. ఇలా గిరి ప్రదక్షిణ సాగుతుంది. వీటితో పాటు కొండపై ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాదతీర్థం, గురు నమశ్శివాయ సమాధి, రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమాలను దర్శించుకోవచ్చు.
ఆలయ దర్శనవేళలు
రోజూ మధ్యాహ్నం 12.30 వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలకు మూసివేస్తారు. పౌర్ణమి, మహా శివరాత్రి ఇతర పర్వదిన వేళల్లో అందరికీ దర్శనమయ్యే వరకు ఆలయం తెరిచి ఉంచుతారు.
చెన్నై నుంచి నాలుగైదు గంటల్లో అరుణాచలానికి చేరుకోవచ్చు. తిరుపతి నుంచి రైలు సర్వీసులు ఉన్నాయి. తిరువణ్ణామలై రైల్వేస్టేషన్‍ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు, ఆటోలు ఉంటాయి. బస్టాండ్‍కు దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది.

కరివెన సత్రంలో అన్ని శాఖల యందు స్వయంపాకం లేక స్వహస్తం చేసుకోవడానికి వైదిక, నిష్ఠాగరిష్టులైన వేద పండితుల కోసం రెండు రోజులు ముందుగా అవసరమని చెబితే అన్ని క్షేత్రాల్లో కరివెన సత్రాలవారు వారికి కావలసిన సామాగ్రి, ఇత్తడి గిన్నెలు, ఇత్తడి మూతలు, గరిటలు, కట్టెలపొయ్యి, బొగ్గుల పొయ్యి, రాగి బిందెలు సమకూర్చగలరు.

కరివెన నిత్యాన్నదాన సత్రం
అరుణాచల యాత్ర పరిపూర్ణం

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు మరింత శోభ చేకూరింది. తాజాగా శివుని తపోభూమి అరుణాచలం (తిరువణ్ణామలై)లో అధునాతన సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా నిర్మించిన భవనం మీ అరుణగిరి యాత్రకు తలుపులు తెరిచి స్వాగతం పలుకుతోంది. పద్నాలుగు నెలల రికార్డు కాలంలోనే ఈ భవంతి నిర్మాణం పూర్తయి ఫిబ్రవరి 22, 2026 నుంచి వాడుకలోకి వచ్చింది. అటు పరమేశ్వరుని దివ్యదర్శనం.. ఇటు అత్యాధునిక వసతులతో సేదదీరే అవ కాశం.. ఈసారి మీ అరుణాచలం యాత్రలో మంత్రముగ్ధమైన ఆధ్యాత్మికానుభూతిని కలిగిం చడం ఖాయం. ‘కరివెన’ వారి ఈ కొత్త వసతి భవంతిలో ఏమేం సౌకర్యాలున్నాయంటే..
ఙ 18,450 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాస్తానుసారం నిర్మితమైన ఐదంతస్తుల భవనం.. 12 డీలక్స్ గదులతో సహా 40 అద్భుత గదులు (ప్రతి అంతస్తులో 9 గదులు.. అందులో 3 చొప్పున డీలక్స్ గదులు)
ఙ భవనంలోకి అడుగుపెట్టగానే ఆధ్యాత్మికానుభూతి కలిగించేలా ప్రతి ల్యాండింగ్‍లో బంగారు వర్ణంలో శివుని విగ్రహం ఆశీర్వాదం అందిస్తుంది.
ఙ ఐదవ అంతస్తులో భారీ సామర్థ్యం గల డార్మిటరీ.. ఒక్కో డార్మిటరీలో పది పడకలు
ఙ వసతి భవనంలోకి అడుగుపెడుతుండగానే స్వాగతం పలికే ప్రవేశ తోరణం
ఙ 15 పెద్ద వాహనాలకు సరిపడా స్టిల్ట్ పార్కింగ్‍ ప్రాంతం
ఙ గదుల్లోకి, భవనంలోకి కీటకాలు, చీమల ప్రవేశాన్ని నిరోధించేలా ప్రతి అంతస్తు టాయిలెట్‍లో ఎలాంటి ఖాళీలు లేకుండా మూడంగుళాల కాంక్రీట్‍ స్క్రీడ్‍
ఙ విద్యుత్‍ కేబుళ్లు, ప్లంబింగ్‍ పైపులు, తీగలు.. ఏవీ పైకి కనిపించవు. స్టార్‍ హోటళ్లను తలపించే అరుదైన విలాసానుభూతి
ఙ 8 మంది పట్టే రెండు భారీ లిఫ్టులు. లిఫ్ట్ డోర్లు తెరవగానే ‘ఓం నమ:శివాయ’ మంత్రోచ్ఛారణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ఙ అరుణగిరి ప్రదక్షిణ మార్గాన్ని కళ్లకు కట్టేలా చిత్రించిన కళాత్మక చిత్రం భవనం ప్రాంగణంలో మీ ప్రదక్షిణ యాత్రపై ఒక అవగాహన కలిగిస్తుంది
ఙ భవంతిని దేదీప్యమానం చేసే 85 అలంకార స్ధూపాల దీపాలు
ఙ ప్రతి గదిలో 32 అంగుళాల టీవీ, ప్యానెల్‍, రెండు సీట్ల సోఫా, ఆరంగుళాల తివాచీలు, కింగ్‍/క్వీన్‍ సైజ్‍ పడకలు, ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా వసతులు.. విశాలమైన అల్మారాలు
ఙ ప్రతి గది తలుపులకు ‘ఏబీబీకేఎన్‍ఎస్‍’ అని చెక్కిన వెండిపూత హ్యాండిల్స్.. అరుణాచలేశ్వర లోగోతో కూడిన బ్యాక్‍-లిట్‍ గది నంబరు బోర్డులు
ఙ ప్రతి స్నానపు గదిలో గీజర్లు
ఙ 1వ అంతస్తులో భోజనశాల, వంటశాల.. నేపథ్యంలో అందంగా చెక్కిన అరుణగిరి.. దీని వెనుక అన్నపూర్ణ, శివుడు, రమణ మహర్షి విగ్రహాలు.. కనువిందు చేసే రెండు ఏనుగులు, పెద్ద తామర పువ్వు బొమ్మలు
ఙ 28 వేల లీటర్ల సామర్థ్యం గల భూగర్భ నీటి ట్యాంకు.. 18 వేల లీటర్ల ఓవర్‍హెడ్‍ ట్యాంకు (ఇది బయటకు కనిపించకుండా నిర్మాణం)
ఙ ప్రకటనలు, ప్రార్థనలకు ప్రతి అంతస్తులో అత్యున్నత నాణ్యత గల పబ్లిక్‍ అడ్రస్‍ సిస్టమ్‍

అరుణాచలంలో
స్వయంపాకం

శ్రీ కప్పగంతుల వెంకట శివ సీతారామ హవీర్యాజి గారు మరియు శ్రీమతి శ్రీలలిత గారు, విజయవాడ వారు అరుణాచలం సత్రం నందు స్వయంపాకం చేసుకుని ఆతిథ్యం స్వీకరించారు

కరివెన నిత్యాన్నదాన సత్రం
అరుణాచలం చిరునామా:

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
డోర్‍ నంబర్‍: 29బీ/43, వీఓసీ నగర్‍,
7వ వీధి (అరుణాచలం సినిమా థియేటర్‍ నుంచి ఎడమ వైపు వీధి) తిరువణ్ణామలై- 606601
ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
83339 07817
83339 07816
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
యూనియన్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా
అకౌంట్‍ నంబర్‍: 261311010000012
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: యూబీఐఎన్‍0826138

Review అరుణాచలం పంచభూత స్థలాలలో ఒకటి..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top