మన పంటలు ఇంటికి వచ్చే వేళ.. ముంగిళ్లలో పాడి పొంగిపొరలే వేళ.. గంగిరెద్దులు, జానపదులు ఆడిపాడే వేళ.. లిప్తపాటు కాలంలో ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ మహా పుణ్యకాలానికి నాంది పలుకుతాడు. దీంతో ప్రజలు ఈ సంక్రమణ కాలమనే సంక్రాంతి పండుగను తీయతీయగా చేసుకునేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా మన పల్లెల్లో నెలకొనే పండుగ వాతావరణం కమనీయం. ఈ వేడుకలకు అంతటికీ మూల కారణం సూర్యుడే. కాబట్టి ఇది సూర్యదేవుడి పరంగా జరిగే పెద్ద పండుగగా భావిస్తారు. సంక్రాంతి అనే మాటకు సంక్రమించడం అనే అర్థముంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఒక్కో నెల ఒక్కో రాశిలోకి సూర్యుడు సంక్రమిస్తాడు. ఇలా ప్రతి నెలా మనకు సంక్రాంతి వస్తూనే ఉంటుంది. ఇలా ఏడాదిలో వచ్చే పన్నెండు సంక్రాంతుల్లోనూ ముఖ్యమైనది మకరరాశిలోకి సూర్యుడు సంక్రమించే సమయం. అదే మకర సంక్రాంతి
ఒక సూర్యుడు సమస్త జీవులకు దానొక్కడై తోచు.. అన్నాడు పోతనామాత్యుడు. సమస్త ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. భిన్న జాతులకు, మతాలకు విభిన్నమైన దేవుళ్లు ఉండవచ్చు. కానీ, అందరికీ ప్రత్యక్ష దైవం మాత్రం సూర్యుడే. సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకుని అనుసరించే కాలగణన పద్ధతే.. ‘సౌరమానం’
మూడింధాలుగా..
సూర్యగమనం మూడు విధాలు.
అవి- మంద, శీఘ్ర, సమగతులు.
ఉత్తరాయణ కాలంలో సూర్యుడు ఆరోహణ క్రమంలో ఉంటాడు కాబట్టి గతి మాంద్యం పొందుతాడు. అంటే నిదానంగా కదులుతాడన్న మాట. వృషభం మొదలుకుని కన్యా రాశి వరకు గల ఐదు రాశులలో సంచరిస్తున్నప్పుడు పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది.
దక్షిణాయనంలో సూర్యుడు అవరోహణ క్రమంలో ఉంటాడు కాబట్టి గమనం వేగంగా సాగుతుంది. దీనివల్ల వృశ్చికం నుంచి మీనం వరకు గల ఐదు రాశుల్లో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగటి పూట నిడివి తగ్గుతుంది. రాత్రిళ్లు దీర్ఘంగా ఉంటాయి.
విషవత్‍లలో మాత్రం సూర్యుడు సమగతిలో ఉంటాడు. విషవత్‍లంటే రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు. ఇవి సాధారణంగా మార్చి 21, సెప్టెంబర్ 23 నాడు వస్తాయి.
సంక్రమణం అంటే.
ఇలా కదిలే క్రమంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణ కాలం చాలా సూక్ష్మంగా ఉంటుంది.
మనిషి కనురెప్ప కదిలించడానికి పట్టే కాలంలో 30వ భాగానికి ‘తత్పర’ అని పేరు. తత్పరలో వందో వంతును ‘తృటి’ అంటారు. ఆ తృటిలో వందో వంతు కాలంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయాన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
మూడు రోజుల పండుగ ముచ్చట
భోగిభాగ్యాలు
జనవరి 13, 2021 ధనుర్మాసంలో నెల రోజులూ రోజుకు ఒక్క పాశురం చొప్పున రచించిన గోదాదేవి.. శ్రీరంగనాథుడిని వివాహమాడిన రోజు భోగి. ఒక భక్తురాలు భగవంతుడిని వివాహమాడటానికి మించిన భోగమేముంది? భాగ్యమేముంది? ఒక భక్తురాలు అలాంటి భోగాన్ని పొందిన రోజును భోగి పండుగగా నిర్వహించుకుంటున్నాం. ఆ రోజు అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, శ్రీమహావిష్ణువు అర్చన నిర్వహిస్తారు. ఆ సాయంత్రం పిల్లలకు తల్లులు తలలపై రేగిపండ్లను భోగిపండ్లుగా వేస్తారు
సంక్రాంతి
జనవరి 14, 2021
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మకర మాసం. ఆ నెలలో మొదటి రోజు మకర సంక్రాంతి అవుతుంది. నాటి నుంచి సూర్యుడు ఉత్తరదిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అందువలన నాడు సూర్య దేవతారాధన, పితృదేవతల పేరుతో కూష్మాండ దానం చేయాలని పెద్దలు చెబుతారు
కనుమ
జనవరి 15, 2021
ఇది మూడో రోజు పండుగ. ఇది పశు సంతతిని గౌరవించే రోజు. మనది వ్యావసాయక దేశం. పాడికి, పంటకు, అభివృద్ధికీ మూలకారణమైన గోవులను, ఎద్దులను పూజించడం మన సంస్క•తిలో భాగం. అలా పూజించి గోసంతతి దీవెనలు అందుకునే పండుగ కనుమ. ముక్కనుమ నాడు కూడా ఇలాగే పూజిస్తారు.
అత్యంత సూక్ష్మంగా ఉండే ఈ కాలాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. అందువల్లే సంక్రమణానికి ముందు పదహారు, తరువాత పదహారు ఘడియలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ ఘడియల్లోనే సంక్రాంతి సంబరాలను చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది
ఆరు నెలలకోసారి మారే సూర్య గమన
సూర్య గమనం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఆరు నెలలు, దక్షిణంగా ఆరు నెలలు అక్షాంశాలను బట్టి మారుతూ ఉంటుంది. కర్కాటక రేఖ మన దేశంలోని వింధ్య పర్వతాల మీదుగా వెళుతుంది. కర్కాటక సంక్రమణంతో దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలం పితృ దేవతలకు ప్రీతికరమైనది. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర అక్షాంశంలోసంచరించే ఆరు నెలలు ఉత్తరాయణం. ఇది దేవతలకు అత్యంత ఇష్టమైన కాలమని అంటారు. ఆధ్యాత్మికంగా, జ్యోతిషశాస్త్ర రీత్యా ఇది అద్భుతమైన రోజు. అందుకే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు మహాభారత యుద్ధంలో క్షతగాత్రుడై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్యపై ఎదురు చూస్తూ మాఘ శుద్ధ అష్టమి నాడు తనువు చాలించాడు
ఉత్తరాయణ పుణ్యకాల
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’.. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు ప్రాత:కాలానికి చైతన్యం కలిగిస్తున్నాడు. మానవజాతికి, పశుపక్ష్యాదులకు, చెట్లకు అమృతతత్వాన్నిచ్చే జీవనదాత. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్షాల పెరుగుదలకు, జీవకణాల వృద్ధికి కారణం అవుతున్న ఆయనను సృష్టి కార్యక్రమ నిర్మాత అనవచ్చు. దేవతలకు మకర సంక్రమణంతో రోజు ప్రారంభమవుతుందని చెబుతారు. అందుకే మకర సంక్రాంతి నాడు చేసే దాన, జప, తర్పణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తారు. ఉపనయనం వంటి శుభకార్యాలను ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తారు
సంక్రాంతంటే సందడే సందడి
సంక్రాంతి పండుగ నెల రోజులూ తెలుగు పల్లెసీమల్లో సందడే సందడి. ధనుర్మాసం ప్రవేశించగానే సంక్రాంతి కోలాహలం మొదలవుతుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, పూల అలంకరణలతో పల్లెల్లో ప్రకృతికి నిత్యారాధన చేస్తారు. మకర సంక్రమణం సమయంలో రథం ముగ్గులతో తీర్చిదిద్దడం పెద్దలకు పుణ్యలోకాల మార్గాలను సుగమం చేయడమేనని అంటారు. మన పండుగల్లో ఎప్పుడూ ఒక పరమార్థం ఉంటుంది. దేవీ దేవతలను ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుకోవడం, పితృదేవతలను స్మరించుకోవడం అటు భౌతికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఉన్నత భావాలకు నిదర్శనాలు. సంక్రాంతి నాటికి అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇంటికి చేరతాయి. ఆ సమయంలో దానధర్మాలకు వెసులుబాటు ఉంటుంది. ఆ సమయంలో హరిదాసులు, గంగిరెద్దుల వారు, జంగమ దేవరలు.. ఇలా ఎందరో జానపద కళాకారులు మన ఇంటి ముంగిళ్లకే వస్తారు. మనం ఇచ్చే కానుకలు అందుకుంటారు. ఒకప్పుడు వస్తుమార్పిడికి సంక్రాంతి సమయం ఆలవాలంగా ఉండేది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండివంటల తయారీ, పిల్లలకు భోగిపళ్ల అభిషేకాలు, పిడకలు దండకట్టడాలతో ప్రతి ఇంటా ఎంతో సందడి. నిజంగా ప్రతి గ్రామం ఈ పండుగ రోజుల్లో ఓ సౌభాగ్యసీమగా మారుతుందడనడంలో సందేహం లేదు. సూర్యుడు సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. సర్వజీవులనూ అనుగ్రహించే ఆ దివ్యమూర్తి అరాధన అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే సంక్రాంతి ఓ పండుగ కాదు.. అదో సదాచారం. ప్రత్యక్ష నారాయణుడికి జోతలర్పించడం తెలుగు వారిమైన మన ఘన సంస్కతికి నిదర్శనం
Review ఊరంతా సంక్రాంతి నేలంతా పూబంతి.