ఔరౌర.. ఇగురావ కూర!

క్రీడాభిరామం.. ఈ గ్రంథం నాటి జనుల ఆచార వ్యవహారాలు, ఆహార నియమాల గురించి ఎన్నో వివరాలు అందిస్తోంది. వినుకొండ వల్లభరాయుడు ఈ గ్రంథకర్త. ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ప్రజల ఆచార వ్యవహారాలు ఇందులో ఉంటాయి. చలికాలంలో ప్రజలు ఇగురావకూరతో, కొత్తబియ్యం అన్నం, మీగడ పెరుగుతో, నేతితో తినేవారని ఈ క్రింది పద్యం చెబుతోంది.
శీతకాలంబు కడి మాడ
సేయ గుడుచు
భాగ్యవంతుడు ఱేపాడి పల్లెపట్ల
గ్రొత్త యోరెంబు నిగురావకూరతోడ
బిఛ్చిలంబైన నేతితో బెరుగుతోడ

ఈ పుస్తకంలోనే ‘కొర్రయో రెంబు..’ అని కూడా ఉంది. అంటే కొర్రలతో అన్నం తినేవారని దీని భావం.
‘తరుణం సర్షపశాకం నవౌదనం
పిచ్చిలాని చ దధీని
స్వల్ప వ్యయేన సుందరి గ్రామ్యజనో
మృష్ట మళ్నాతి

ఆవ మొక్కల లేత ఆకులకూర, కొత్త బియ్యం అన్నం, మీగడ పెరుగుల్ని గురించి ఈ శ్లోకం ప్రస్తావించింది. ‘తరుణం సర్షపశాకం’ అంటే ‘ఇగురావ కూర’ అని వల్లభరాయుడు తన పద్యంలో రాశాడు.వేటూరి వారు దీనికి ఆవపెట్టిన కూర అనీ, తిరుమల రామచంద్ర ఆవ మొక్క ఆకుల కూర అనీ అర్థం చెప్పారు. లాహోరులో తాను తిన్న ఆవాకుల కూర ఉదంతాన్ని ఆయన దానిని సాక్ష్యంగా పేర్కొన్నారు.
నిజానికి తెలుగు వారికి ఆవ ఆకుల్ని వండుకునే అలవాటు తక్కువ. ఉష్ణ మండలంలో నివసించే మనకు అది అనుకూలం కాదు. ఉత్తరాదిన ఈ కూర ఎక్కువగా తింటారు.
ఆయుర్వేద గ్రంథాలు ఆవాకుల కూరను అపథ్యం అన్నాయి. అంటే కష్టంగా అరుగుతాయన్న మాట. బాగా వేడి చేస్తాయి. మలమూత్రాలను బంధిస్తాయి.
కొత్త అన్నంలో నెయ్యి వేసుకుని, ఆవ పెట్టిన ఇగురుకూరను పెరుగు మీద మీగడతో నంజుకుని తినడం తెలుగు వారికి అలవాటే. ఆవ పెడితే, ఆ కూరకు కొత్త రుచి సమకూరుతుంది. తేలికగా అరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. దోషాలు పోతాయి. పనస పొట్టు, సొరకాయ, క్యాబేజీ, అరటికాయ, కందబచ్చలి, బూడిద గుమ్మడి, గోరు చిక్కుళ్లతో చేసే ఇగురు కూరల్లోనూ, తోటకూర లాంటి పులుసు కూరల్లోనూ ఆవ పెడితే కమ్మగా ఉంటాయి. కూరగాయల ముక్కలు ఉడికించి, పెరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగు పచ్చడిలో ఆవపెట్టే అలవాటు తెలుగు వారికి ఉంది. పులిహోరలో కొద్దిగా ఆవపిండి కలిపితే వచ్చే ఆ రుచే వేరు.

‘ముకు మందై యేర్చు నావం జిగుర్కొను పచ్చళ్లు’ అంటూ రాయల వారు ఆముక్త మాల్యదలో ఆవకూరనూ, ఆవపచ్చడినీ జలుబు నీళ్లు వదిల్చే ముక్కు మందుగా అభివర్ణించారు.
‘మిసిమి గల పుల్ల పెరుగుతో మిళితమైన యావ పచ్చళ్లు చవిచూచి రాదరమున
జుర్రుమని మూర్థములు దాకి యొఱ్రదనము బొగలు వెడలింప నాసికాపుటములందు’ అంటూ మిసిలి (కాంతి) కలిగిన బంగారపు రంగు పుల్ల పెరుగులో ఆవపిండి కలిపి తాలింపు పెట్టిన ఆవ పెరుగుపచ్చడిని అతిథులు ఆస్వాదిస్తూ దాన్ని జుర్రుకోగానే ఆ ఘాటుకి మూర్థాలు అదిరి, ఒర్రదనం నషాలానికి అంటిందనీ, ముక్కుల్లోంచి పొగలు వెడలినాయని అంటాడు శ్రీనాథ మహాకవి. ఆవపచ్చడి ఘాటైన వంటకం. వగరు, చేదు రుచులతో కూడి ఘాటు కలిగిన ఆవపిండిని కలిపితే ఏ వంటకమైనా తీపి, పులుపు, ఉప్పు, కారాలతో పాటు వగరు, చేదు రుచులను కూడా కలిగి ఉంటుంది. అంటే, ఆవ పెట్టడం వలన ఆ వంటకం షడ్రసోపేతం అవుతుందన్న మాట. తీసుకున్న ఆహారం తేలికగా ఒంటబట్టాలంటే వారంలో రెండు మూడు సార్లయినా ఇగురావకూర (ఆవ పెట్టిన ఇగురుకూర) తింటూ ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో ఇవి అనుకూలంగా ఉంటాయి. తెలుగు వారు శతాబ్దాలుగా మైమరచి తిన్నారు ఈ ఇగురావకూరలను.

రాగి ముద్ద
కావాల్సిన పదార్థాలు: రాగి పిండి- కప్పు, నీళ్లు- రెండు కప్పులు, ఉప్పు, నెయ్యి తగినంత.
తయారీ విధానం: చిన్న గిన్నెలో మూడు స్పూన్ల నీటిలో ఒక స్పూను రాగి పిండిని జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో రెండు కప్పుల నీళ్లు పోసి, కాస్త ఉప్పు, నెయ్యి వేసి ఉడికించాలి. నీళ్లు మరిగాక అందులో రాగి మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గరయ్యాక మిగిలిన రాగి పిండిని కూడా చేర్చి గరిటెతో కలుపుతూ ఉంటే పిండి అంతా దగ్గరగా అవుతుంది. వేళ్లకు కాస్త నూనె పూసుకుని దాన్ని ముద్దలా చేస్తే..అదే రాగిముద్ద.

Review ఔరౌర.. ఇగురావ కూర!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top