కుక్క చెప్పిన నీతి

రామాపురం అనే గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులున్నారు. వ్యవసాయ కుటుంబం కావటం వలన ఆవులు, గేదెలు, గొర్రెలతో పాటు కుక్కను, పిల్లిని కూడా పెంచు కుంటున్నాడు రామయ్య. ప్రతిరోజు పశువులను మేపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ పొలాలలోనే భార్యా, భర్త గడిపేవారు! రాత్రివేళకు ఇంటికి చేరి, సీతమ్మ వంటపని చేసేది. పగలంతా ఇంటిని కనిపెట్టుకొని కుక్క, ధాన్యం బస్తాలు ఎలుకల బారిన పడకుండా పిల్లి కాపలాకాసుకొని ఉండేవి. రామయ్య రాత్రి ఇల్లు చేరిన వెంటనే కుక్క ఎదురెళ్ళి, ఆప్యాయంగా నాలుకతో నాకుతూ చిన్న పిల్ల వానిలా పైకి ఎగబడి, తోక ఊపుతూ అతని చుట్టూ తిరిగేది. రామయ్య వేడినీళ్ళతో స్నానం చేసేసరికి టవల్‍ పట్టుకొని అతనికి ఎదురువెళ్ళేది.
పిల్లలు లేని రామయ్య దానిని ఎంతో ముద్దుచేస్తూ, అదిచూపే ప్రేమకి పొంగిపోయేవాడు. భోజనానికి కూర్చొని మొదటి ముద్దను కళ్ళకు అద్దుకొని, దానికే పెట్టేవాడు. తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని దానికి కొసరి కొసరి అన్నం పెట్టి, తినిపించే వాడు. సీతమ్మ అందరి భోజనం అయిన తరువాత ఆఖరుగా మిగిలినది పిల్లికి పెట్టేది. కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చి, తనను ఇలా చిన్న చూపు చూడటం పిల్లి భరించలేక పోయింది. ఎట్లాగైనా కుక్కస్థానం తాను కొట్టే యాలనుకుంది. మరుసటి రోజు రామయ్య, సీతమ్మ పొలానికి వెళ్ళిన తరు వాత, పిల్లి కుక్క దగ్గరకు వచ్చింది. ‘‘మరేమో నేను రోజు చీకటికొట్టులో ఎలుకల కోసం కాపలాకాయటం చాలా బోర్‍గా ఉంది. ఎంచక్కా నీలా ఆరుబయట తిరుగుతూ ఇంటిని చూడాలని ఉంది. ఈ ఒక్కరోజు మన పనులను మార్చుకుందామా?’’ అంది ఆశగా. కుక్క క్షణం ఆలోచించి ‘‘వద్దు! ఎవరి పని వాళ్ళే చేయాలి. అలాకాకపోతే ఏం జరుగుతుందో మా తాత చెప్పి ఉన్నాడు. కాబట్టి నీవు చెప్పిన దానికి నేనొప్పు కోను. అయినా చేసే పనిలో ‘బోర్‍’ ఏమిటి? ఇష్టంగా చేస్తే ఏదీ కష్టంగా ఉండదు. నీ ముఖం చూస్తుంటే అసలు కారణం ఇదై ఉండదనిపిస్తోంది. నీ సమస్య ఏమిటో చెప్పు. ఎప్పుడో మన ముత్తాతలనాటి జాతి వైర్యంతో నను చూడకు. రోజులు మారాయి. పరిస్థితులూ మారాయి. ఇప్పుడున్న స్థితులలో ఎవరెంతకాలం బ్రతుకుతామో ఎవరికీ తెలియదు! బ్రతికి నంతకాలం ఆనందంగా, ఎలాంటి కల్మషం లేకుండా, హాయిగా అందరితో కలిసి మెలిసి, ఏ చీకూ చింతా లేకుండా, మనల్ని తిండిపెట్టి, ఆదరించేవారికి కృతజ్ఞత చూపిస్తూ, ఈ జీవితాన్ని ముగించడంకంటే పరమార్థం ఏముంది? కాబట్టి నన్ను నీ స్నేహితునిగా భావించి, నీ సమస్య చెప్తే తప్పక పరిష్కరిస్తాను!’’ అంటూ లాలనగా అనేసరికి, పిల్లి తన మనస్సులోని బాధనంతా కక్కేసింది! అంతా విని, కుక్క ‘‘ఓస్‍! ఇంతేనా? ఈ రోజుతో నీ సమస్య తీరిపోయింది’’ అంటూ పిల్లిని ఓదార్చి, తన పని తనని చేసుకోమని సలహా ఇచ్చింది.
రాత్రి ఎప్పటిలాగే రామయ్యకు ఎదురువెళ్ళి, అన్ని సేవలూ చేసింది. రామయ్య మొదటి ముద్ద కళ్ళకు అద్దుకొని, కుక్కకు పెట్టాడు. కానీ అది తినలేదు. ఎంత నోటికి అందించినా ముద్ద ముట్టలేదు. రామయ్య భోజనం చేయకుండా ‘‘ఏమి జరిగింది? ఆరోగ్యం బాగాలేదా?’’ అంటూ కుక్కవైపే ఆందోళనగా చూస్తూ ఉండి పోయాడు. కొద్దిసేపు తరువాత కుక్క వెనుకకు వెళ్ళి, దూరంగా ఒక మూలన నక్కి చూస్తున్న పిల్లిని తీసుకొని వచ్చి, మొదటి ముద్దను దానికి తినిపించింది. అంతేగాక తనకోసం పెట్టిన అన్నాన్ని కూడా దానికే పెట్టేసింది. అదిచూసి రామయ్య మనసు పొంగి పోయింది. కుక్కకి ఉన్న ఇంగితం తనకు లేకపోయింది. తోటి జీవిని సమానంగా చూడలేని తన మూర్ఖత్వానికి చింతించి, నాటినుండి తనతో సమానంగా పిల్లిని, కుక్కని కూర్చోబెట్టుకొని తినటం ప్రారంభించాడు. కుక్క చూపించిన ఔదార్యానికి పిల్లి ఎప్పుడూ మనస్సులోనే దానికి కృతజ్ఞత చూపిస్తూ, బ్రతికినంతకాలం రామయ్య దంపతులతో ఆనందంగా గడిపేసాయి.

Review కుక్క చెప్పిన నీతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top