చింతగింజ.. తొక్కుడుబిళ

ఇప్పుడు తెలుగు భాషే కాదు.. తెలుగు సంస్క•తికి సంబంధించిన ఆటపాటలు కనుమరుగై పోయాయి. అష్టాచెమ్మా.. తొక్కుడు బిళ్ల.. కోతికొమ్మచ్చి.. ఇవి ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అయితే ఇక్కడ చదవండి.
వామనగుంత
ఈ ఆటను ఇద్దరు మాత్రమే ఆడాలి. చాలా సరదాగా సాగే ఆట. ఒక చెక్కపీటకి రెండువైపులా, అంటే ఎదురెదురుగా 5 లేదా 6 గుంతలు ఉంటాయి. ముందుగా ఆ గుంతల్లో నాలుగేసి పిక్కలు పెట్టాలి. పంటలు వేసుకుని ఆట ఎవరు ప్రారంభించాలో నిర్ణయించుకున్నాక.. మొదటి గుంతలోని పిక్కల్ని తీసి మిగతా గుంతల్లో వేయాలి. తర్వాత అయిదో గుంతలోని పిక్కల్ని పక్క గుంతల్లో ఒక్కొక్కటి చొప్పున వేయాలి. అలా అన్ని పిక్కలూ అయ్యాక ఒక గుంత ఖాళీ అవుతుంది. దాన్ని వేళ్లతో రాసి ఆ పక్క గుంతలో ఉన్న పిక్కల్ని తీసుకుని మళ్లీ ఆట మొదలుపెట్టాలి. అలా పిక్కలు వేసుకుంటూ వెళ్లేటప్పుడు ఖాళీ గుంత రాకపోతే వాళ్లు ఓడిపోయినట్టే.

తొక్కుడు బిళ్ల
అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన ఆట ఇది. ఆటలో భాగంగా నాలుగు నిలువు, రెండు అడ్డం దీర్ఘ చతురస్రాకారంలో గడుల్ని గీయాలి. గడుల బయటే ఇద్దరూ నిల్చోవాలి. ముందుగా ఒకరు చేతిలో బిళ్లను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత రెండో గడి, మళ్లీ 3,4,5,6,7,8 గడుల్ని దాటిస్తూ.. కాలు, బిళ్ల గడుల గీతల్ని తాకకుండా జాగ్రత్త పడాలి. గడులన్నీ దాటేశాక కాలి వేళ్లలో బిళ్లను పట్టుకుని కుంటి కాలితో ఆ గడులన్నీ గెంతుతూ బయటకు వచ్చేయాలి. అలాగే కాలి మడం మీద, తల మీద, అరచేతిలో, మోచేతి మీద, భుజాలపై కూడా పెట్టుకుని గెంతాలి. అన్నీ అయిపోయాక బిళ్లను గడుల బయటకు విసిరి కళ్లు మూసుకుని అన్ని గడుల్ని దాటాలి. మధ్యలో గడుల గీతని తొక్క కూడదు. అలా ఆడితేనే గెలుపొందినట్టు. ఇది ఒంటికి ఎంతో మంచి వ్యాయామాన్ని అందించే ఆట. ఈ ఆటను ఇద్దరు ఆడతారు.
చింతపిక్కలాట
ఒక పిక్క.. రెండు పిక్కలు.. మూడు పిక్కలు.. ఇలా పది పిక్కల వరకు కుప్పగా పోస్తారు. ఒక చింతపిక్కను పైకి ఎగరేసి అది తిరిగి చేతిలోకి వచ్చేలోపే కింద ఉన్న పిక్కల్ని పట్టుకోవాలనేది పందెం. అలా ఎగరేసి పట్టుకునే సమయంలో-
ఒకటీ ఓ చెలియా/ రెండూ రోకళ్లూ/ మూడూ ముచ్చిలకా/ నాలుగు నందన్నా/ ఐదూ చిట్టిగొలుసూ/ ఆరూ జువ్వాజి/ ఏడూ ఎలమంద/ ఎనిమిది ఏతామూ/ తొమ్మిది తోకుచ్చు/ పది పట్టెడ/
అంటూ వరుసగా పది పిక్కల వరకూ ఒక్కోదాన్ని పైకి ఎగరెయ్యాలి. దాన్ని మళ్లీ పట్టుకునేలోపు కింద ఉన్న పిక్కల కుప్పల్ని పట్టి పక్కన పెట్టాలి. ఎగరేసిన పిక్క పడిందో ఓడిపోయినట్టే!.
చింతపిక్కల ఆటలోనే మరో ఆట.. నాలుగు పిక్కల్ని పుంజి అంటారు. రెండు పుంజీలు ఓ కచ్చటం. ఐదు కచ్చటాలేమో గుర్రం. ఐదు గుర్రాలు కలిపితే ఓ ఏనుగు. ఎవరు ఎక్కువ ఏనుగుల్ని చేస్తే వాళ్లు గెలిచినట్టు. దీనికి ముందు చింతపిక్కల్ని కుప్పగా పోయాలి. ఒక పిక్కని ఎగరేసి పట్టుకునేలోగా నాలుగు పిక్కలు కుప్పలో నుంచి వేరు చెయ్యాలి. అప్పుడు ఓ పుంజీ అవుతుంది. అలా పై పిక్కని పట్టుకోలేనంత వరకు ఆట సాగుతుంది. •

Review చింతగింజ.. తొక్కుడుబిళ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top