మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి జాతీయం. జాతీయాలనే పదబంధాలనీ, పలుకుబడులనీ అంటారు. విడివిడి మాటలు కలిసి విశేషార్థంలో ఏర్పడేది జాతీయం. జాతీయంలోని అర్థానికీ, లక్ష్యార్థానికీ పోలిక ఉంది. వ్యాకరణంలోని శబ్ద పల్లవాలు ఇలాంటివే. జాతీయాలను లేదా సామెతలను మరో భాషలోకి అనువదించలేం. కానీ, వాటికి సమానార్థకమైనవి ఉండొచ్చు.
ప్రాచీన కవుల కావ్యాల్లో కూడా జాతీయాలు కనిపిస్తాయి. ఉబుసుపోక, ఎకసెక్కమాడు, కడుపుచల్లగా వంటివి కవులు ప్రయోగించారు.
ఇంటిపోరు, అత్తగారి సాధింపు, గుండెల మీద కుంపటి మొదలైనవి కుటుంబ సంబంధమైన జాతీయాలు.మన పై అధికారి కఠినంగా ఉంటే, ‘వాడు నా మొగుడురా బాబా’ అంటాం. పెళ్లీడుకొచ్చినా పెళ్లికాకపోతే అదొక భారంగా భావించి పూర్వం కూతురును ఉద్దేశించి ‘గుండెలపై కుంపటి’ అనేవారు.
జాతీయాల్లో శరీర అవయవాలను ఉపయోగించి చెప్పేవి చాలా ఉన్నాయి. తలలో నాలుక, చెవి కోసుకోవడం, కళ్లకద్దుకోవడం, పొట్టకొట్టడం, నోరు పారేసుకోవడం, ఒంటికాలిపై లేవడం, కళ్లలో నిప్పులు పోసుకోవడం, నోరెట్టుకుని జీవించడం వంటివి.
సామెతల్లోలాగా జాతీయాల్లోనూ రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించినవి ఉన్నాయి.
రామరాజ్యం, లక్ష్మణరేఖ, ఉబతాభక్తి, కబంధహస్తం మొదలైనవి రామాయణానికి సంబంధించినవి.
శల్యసారథ్యం, పద్మవ్యూహం, కీచకుడు, గొంతెమ్మకోరిక వంటివి భారతానికి సంబంధించినవి.
సంస్క•త సాహిత్య ప్రభావంతో ఆపాదమస్తకం, కాకతాళీయం, నభూతోనభవిష్యతి, అసిధారావ్రతం వంటివి ఏర్పడ్డాయి.
మన ఆచారాలు, నమ్మకాలకు సంబంధించిన వాటిలో మూగనోము, నీ కడుపున పుడతా, పప్పన్నం పెట్టడం, తిలోదకాలు వంటివి ఉన్నాయి.
నాటక సాహిత్యంలోని నాంది, భరతవాక్యం అనేవి కూడా జాతీయాలు అయ్యాయి. ‘నీ భరతం పడతా’ అనడం తెలిసిందే. కొన్ని జాతీయాలు అలంకారికంగా, కవితాపరంగా ఉంటాయి. గాలిమేడలు, ఇసుకేస్తే రాలనంత, కైంకర్యం, కుంభకోణం వంటివన్నమాట
ఒకే వస్తువుపై అనేక జాతీయాలు ఉన్నాయి. కాకి గోల, కాకి మూక, కాకి బంగారం, కాకి కూడు,, కాకి ఎంగిలి వంటివి ఈ కోవకు చెందుతాయి.
ఖరారునామా, ఖరాబు చేయడం, గులాంగిరి, ఖతం వంటివి ఉర్దూ ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. సామెతలకు మాదిరిగానే జాతీయాలకూ కథలున్నాయి. ఇక, జంట పదాలుగా ఉపయోగించే జాతీయాలూ లేకపోలేదు. అవకతవకలు, కారాలూ మిరియాలూ, రాతకోతలు అనేవి ఇలాంటివే. ఇక, ఠక్కున నవ్వించే జాతీయాలకు మన తెలుగులో కొదవలేదు. పుల్లయ్య వేమారం, ఉత్సవ విగ్రహం, కరువులో అధిక మాసం, అలకపాన్పు, పానకంలో పుడక, నూతిలో కప్ప, గంగిరెద్దు, అతివృష్టి-అనావృష్టి, మసిపూసి మారేడుకాయ, కళ్లలో నిప్పులుపోసుకోవడం, పక్కలో బల్లెం, నామం పెట్టడం, టోపీ వేయడం, తాటాకులు కట్టడం వంటివి నవ్వు పుట్టించే జాతీయాలు.
Review నామం పెట్టడం.. టోపీ వేయడం.