ప్రకృతి పాఠం

నేర్చుకోవాలే కానీ ప్రకృతిని మించిన పరమ గురువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సినవి, అలవర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ప్రకృతి నియమాన్ని పరిశీలిస్తే మనకు ఆరు విధులు కనిపిస్తాయి.
అవి- పుట్టడం, పెరగడం, పోషించుకోవడం, ఉత్పత్తి చేయడం, క్షీణించడం.. చివరిగా మరణించడం. కొన్ని వృక్షాలు విత్తులు వేసినా, వేయకున్నా పుడమిపై వాటంతట అవే మొలకెత్తుతాయి. బీజాంకురంలో ఉన్న ఆహార శక్తిని వినియోగించుకుని మొలకెత్తిన మొక్క కొంత వరకు పెరిగి, తరువాత సూర్యకాంతి సాయంతో తనను తాను పోషించుకోవడం ప్రారంభిస్తుంది. సమస్త జీవనానికి ఆధారభూతమైన భూమాత సహాయంతో ఫల, పుష్పాలను ఉత్పత్తి చేస్తుంది. కొంతకాలం జీవించిన తరువాత క్షీణించడం మొదలవుతుంది.
జంతుజాలం జీవనచక్రం కూడా ఇంచుమించు ఇదే విధంగా కొనసాగుతుంది. అలాగే, మానవ జీవన పరిణామక్రమం కూడా కొనసాగుతుంది. కానీ, బుద్ధిజీవి జీవనపంథా మాత్రం వృక్ష, జంతువుల మాదిరిగా ప్రయోజనకరంగా ఉండకపోతే అది ప్రకృతి విరుద్ధం అనిపించుకుంటుంది.

బతికినన్ని రోజులు ఫలములిచ్చుటే కాదు,
చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు
త్యాగభావమందు తరువులే గురువులు
ఇది ఓ శతకకారుని మాట. ఆయన మాటల్లోని వృక్షరాజాల యొక్క త్యాగం అర్థం చేసుకోవచ్చు. ప్రకృతిలోని ప్రతి జీవి ఉనికి పూర్తి ప్రయోజనకరంగా ఉంటుంది. విజ్ఞుడైన మనిషి మాత్రం స్వార్థం చేత ప్రకృతికి ఎదురు తిరుగుతూ, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తూ తన నాశనాన్ని చేజేతులా కొనితెచ్చుకుంటున్నాడు. ఈ అజ్ఞానానికి కారణం మన వేద వేదాంగాలను విస్మరించడమేనని చెప్పాలి. మన పురాణ ఇతిహాసాలను తరువాత తరాలకు అందించే ప్రయత్నం చేయకపోవడం కూడా ఇందుకు మరో కారణం.
ఆధ్యాత్మిక జీవన విధానాన్ని విస్మరించడం కూడా మరో కారణం.
ఈ కారణాల వల్ల సమాజంలో అసుర లక్షణాలు ప్రబలిపోతున్నాయి.
నిజమైన ఆత్మ మనసు కాదు. మనసు ఒక పదార్థం. దానికి భౌతికమైన ఆహారంతో పాటు తాత్వికమైన ఆలోచన ఆహారం చాలా అవసరం.
ఆలోచనారహితంగా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు. చివరకు నిద్రలో కూడా మనసు ఆలోచిస్తూ స్వప్నలోకంలో విహరిస్తూ ఉంటుంది. మనసును స్వాధీనం చేసుకున్న వాడే విశ్వ విజేత అని మన పురాణేతిహాసాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.
ఒకవిధంగా ఆలోచిస్తే, ప్రపంచం మన చుట్టూ లేదు. అది మనలోనే ఉంది. అర్థానికి,

అనర్థానికి కారణం మన మనసే. బాల్యం నుంచి మనసుకు సరైన శిక్షణ చాలా అవసరం. బాలబాలికలకు తొలి గురువు తల్లి. సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర తల్లులదే. తల్లికి మాతృత్వం లభించేది చాలా సహజమైన ప్రకృతి చర్య. పుట్టిన సంతానానికి సంస్కారం నేర్పడమే తల్లి యొక్క అసలైన సామాజిక చర్య.
ఈ సామాజిక చర్య బాధ్యతాయుత ప్రవర్తనగా మారాలంటే గృహ నిర్వహణలో ఆధ్యాత్మిక మార్గం అత్యంత ఆవశ్యం. అది తల్లి ద్వారా మాత్రమే పిల్లలకు అలవడుతుంది. ఇంటి గృహిణి, గృహస్తుడు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం, నిత్యపూజ, దైవప్రార్థన మొదలైనవి భార్యాభర్తలు ఇద్దరూ ఆచరించాలి. తల్లిదండ్రుల నుంచి సంతానానికి లభించే కానుకలు ఇవే.
గృహిణి ఆచరించే ఆధ్యాత్మిక జీవన మార్గం ఆ ఇంటిని నిస్సందేహంగా పురోభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ఇంటిలో చేసే నిత్య దీపారాధన, ఇతర పూజాదికాలు ఆ కుటుంబ మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి ఎంతోగానో దోహదపడతాయి.
విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మనిషి జీవితంలో ఒక భౌతికమైన అంశం. మనకు ఆహారం ఎలా అవసరమో విజ్ఞాన శాస్త్ర ఫలాలైన వైజ్ఞానిక పరికరాలు కూడా ఈ ఆధునిక జీవనానికి అంతే అవసరం అవుతున్నాయి. అయితే ఇవి ఆధ్యాత్మిక జీవనాభిలాషులకు ప్రతిబంధకంగా మారిపోవడమే నేటి విషాదం.

పిల్లలకు బాల్యంలో అలవడిన సంస్కారాలు మనసులో బలమైన ముద్ర వేస్తాయి. అందుకే పిల్లలతో చిన్నతనం నుంచే రామాయణం, మహా భారతం, మహా భాగవతం, ఇతర పురాణాలు, ఇతిహాసాలను చదివించాలి. వాటిలోని కథలను ఆసక్తికరంగా మలిచి చెప్పాలి. పిల్లలకు వాటిని చదివించడం నేర్పించాలి. అప్పుడే వారిలో ధర్మ జిజ్ఞాస మొదలవుతుంది. ఆధ్యాత్మిక జీవనం అలవడుతుంది. పిల్లలకు పురాణగాథలను వివరించడం విజ్ఞాన శాస్త్ర అధ్యయనానికి ఏమాత్రం ఆటంకం కాదు. పైగా విజ్ఞాన శాస్త్ర ఉపయోగాన్ని మానవ శ్రేయస్సుకు మరింత దోహదపడేలా ఆధ్యాత్మిక జీవనం చేస్తుంది.
సంకల్పమైనా మరొకటైనా మనసు నుంచే జనిస్తుంది. అది శుభ సంకల్పం కావాలంటే చిన్నతనంలోనే పిల్లల ఆధ్యాత్మిక జీవనానికి సోపానాలు వేయాలి. అప్పుడే తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు, శ్రేయోభిలాషుల పట్ల పిల్లలకు గౌరవం, శ్రద్ధ కలుగుతాయి. సమాజంలో ఇతరులతో ఎలా కలిసిమెలిసి ఉండాలో అర్థమవుతుంది. సమాజంలో బాధ్యతాయుత ప్రవర్తనతో మెలగడానికి ఆధ్యాత్మిక జీవనం ఒక మంచి సాధనం.
పిల్లలు పెద్దల అనుభవసారాన్ని గ్రహించి జీవితంలో ఉపయోగించుకునేలా వారి జీవితాలను మలచాలి. పటిష్టమైన జీవన పథాన్ని ఏర్పరుచుకోవడానికి ఆధ్యాత్మిక జీవనం ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. లేకపోతే అంత:కరణ చతుష్టయాలంటే ఏమిటో తెలియకుండానే జీవితం ముగిసిపోతుంది.
ప్రస్తుత యువతకు మనోబలం తక్కువగా కనిపిస్తోంది. దానికి కారణం స్వార్థం. త్యాగ గుణం లోపించడం. మనసుకు చక్కని సంస్కారం లేకపోవడం.. నేర్పకపోవడం. మనసును స్వాధీనం చేసుకోవడం అనేది చాలా క్లిష్టమైన విషయం. దానికి సాధన ఎంతో అవసరం. అలాంటి సాధనను పైన చెప్పిన విధంగా చిన్ననాటి నుంచే అలవర్చడానికి తల్లిదండ్రులు కృషి చేయాలి.
ఏ వయసులోనైనా చక్కని, సంస్కారయుతమైన వ్యాపకం చాలా అవసరం. వ్యాపకం లేని మనసు ధనస్సు నుంచి వెలువడిన బాణం లాంటిది. దానికి ఒక గురి అంటూ ఉండదు. ఎటు పోతుందో తెలియదు. ఒక గురి ఏర్పడాలంటే ఏకాగ్రత, పట్టుదల వంటి విషయాలను పురాణేతిహాసాల్లోని కథల ద్వారా పిల్లలకు నేర్పించాలి. బాల్యం నుంచే మన సనాతన వాజ్మయం వారి వారి స్థాయిని బట్టి పరిచయం చేస్తే వారు లోకోపకారులుగా మారతారు. అప్పుడే తల్లిదండ్రుల బాధ్యత నెరవేరుతుంది. పిల్లల పుట్టుకకు పరమార్థం ఏర్పడుతుంది.
దత్తాత్రేయుడికి ప్రకృతే గురువు
నేర్చుకోవాలనే ఆసక్తి, స•ంకల్పం ఉండాలే కానీ, ఈ ప్రకృతిలో మనం నేర్చుకోలేనిది ఏదీ లేదు. ఈ సృష్టిలో సమస్త,ం సకలం.. అన్నీ మనకు ఆది గురువులే. మన భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరంలో దత్తాత్రేయుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ప్రకృతినే పరమ గురువుగా స్వీకరించారు. ప్రకృతి నుంచే తాను అన్నీ నేర్చుకున్నానని ఆయన చెప్పారు. దత్తాత్రేయ చరిత్రకు సంబంధించిన ‘అవధూతోపాఖ్యానం’ ఒకటి ఉంది. అందులో మనిషి ప్రకృతిలోని వివిధ జంతువుల నుంచి నేర్చుకోవాల్సినవి ఏమిటో దత్తాత్రేయుడు స్వయంగా ఉపదేశించారు. మరి, అవేమిటో ఒకసారి చదవండి..

భూమి: దున్నినా, తవ్వినా, అపరిశుభ్రం చేసినా సకల జీవుల శ్రేయస్సునే కోరుకుంటుంది. మనిషి కూడా విశ్వ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తే మహనీయుడు అవుతాడు. పైగా భూమి నుంచి అనంతమైన సహనాన్ని, ఓపికను నేర్చుకోవాలి.
వాయువు: శీతోష్ణాలు, సుగంధ దుర్గంధాలతో తాత్కాలికంగా ప్రభావితమైనా గాలి నిర్మలత్వాన్ని కోల్పోదు. ఎలాంటి పరిస్థితుల్లో నివసించినా మనిషి నిర్మలంగా ఉండగలగాలి.
ఆకాశం: మేఘాలు, ధూళి, సంధ్యారాగాలు.. ఇవేవీ ఆకాశానికి అంటుకోవు. మనిషి కూడా మనోవికారాలను దూరంగా పెడితే సజ్జనుడవుతాడు. తేజస్సుతో వెలుగుతాడు.
అగ్ని: యజ్ఞం చేసే వారి పాపాలను, కర్మదోషాలను తనలో దగ్ధం చేసినా అగ్నికి అపవిత్రత అంటదు. సిద్ధులు ఇతరుల పాపాలను తొలగించినా వారి పవిత్రత ఏమాత్రం తగ్గదు.
సూర్యుడు: నీటిని తన కిరణాలతో స్వీకరించిన ఆదిత్యుడు తరువాత వర్షంగా కురిపిస్తాడు. గొప్ప వ్యక్తులు కూడా తమ అనుభవసారాన్ని బోధనల రూపంలో అందరికీ పంచుతారు.
కొండచిలువ: ఇది వేటాడదు. తనకు దొరికిన ఆహారాన్ని మాత్రమే తింటుంది. మనిషి కూడా ఇహపర సుఖాల కోసం పాకులాడకూడదు.
పావురం: బోయవాడు వలవేసి తన పిల్లలను పట్టుకుంటే ఓ పావురాల జంట తాము కూడా వలలోకి దూకేశాయి. మనిషి కూడా ఇలాగే సంసార బంధంలో చిక్కుకుని అల్లాడుతున్నాడు.
సముద్రం: నదులన్నీ పొంగిపొర్లి తనలో కలిసినా కడలి పొంగదు. మానవులు ఇలాగే పరిపూర్ణంగా ఉండాలి. ధర్మమనే చెలియలి కట్టను దాటకూడదు. గాంభీర్యం సముద్రం యొక్క ముఖ్య లక్షణం. మనిషి కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గంభీరంగా ఉండగలగాలి.
మిడత: అగ్నికి ఆకిర్షతురాలై అందులోకి దూకి నశిస్తుంది. అజ్ఞాని కూడా అంతే. సుఖాలపై మోహంతో, ఆకర్షణతో అందులోకి దూకి పతనం అవుతాడు.
ఏనుగు: ఆడ ఏనుగు బొమ్మను అడవిలో పెడితే మగ ఏనుగు దాని దగ్గరకు వచ్చి వేటగాళ్లకు చిక్కుతుంది. అజ్ఞానులు ఇలాగే అరిషడ్వర్గాలకు చిక్కుకుంటున్నారు.
చీమ: ఎన్నో కష్టాలు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా ఆహారాన్ని సంపాదిస్తుంది. మనిషి కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా జ్ఞానధనాన్ని సంపాదిస్తూనే ఉండాలి.
శరకారుడు: బాణాలు వేయడంలో నిమగ్నుడైన ఓ నిపుణుడు పక్క నుంచి పోతున్న ఊరేగింపును పట్టించుకోలేదు. అందరూ లక్ష్యంపై ఇలాగే ధ్యాసను నిలపాలి. భ్రమింపచేసే వాటిని వదిలిపెట్టాలి.
చేప: నీటిలోని చేప జిహ్వ చాపల్యం వల్ల ఎరకు చిక్కుతోంది. మనుషులు కూడా జిహ్వ చాపల్యం వల్ల ఆత్మహాని కొనితెచ్చుకుంటున్నారు.
పసిపిల్లాడు: పసివాడికి చీకూచింతలు ఉండవు. హాయిగా జీవిస్తుంటాడు. ప్రతీ వ్యక్తీ అంతే హాయిగా జీవితాన్ని గడపాలి. యోగ మార్గంలో ఆ స్థితిని సంపాదించవచ్చు.
చంద్రుడు: చంద్రుడి వృద్ధిక్షయాలు తాత్కాలికం. నిజానికి ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే జననం నుంచి మరణం వరకు వచ్చే మార్పులన్నీ శరీరానికే కానీ, ఆత్మకు కాదని గ్రహించాలి.
తేనెటీగ: తుమ్మెద వివిధ రంగుల పుష్పాల నుంచి తేనెను మాత్రమే గ్రహిస్తుంది. ఇక దేని జోలికీ వెళ్లదు. వివేకవంతుడు సకల శాస్త్రాల సారాలను ఇలాగే గ్రహిస్తాడు.
లేడి: వేటగాడి సంగీతానికి పరవశించి లేడి చివరకు అతని వలకు చిక్కుతుంది. ఇలా విషయవాంఛలకు చిక్కుకోకుండా జాగ్రత్తపడిన వారు ఆధ్యాత్మిక శిఖరాలను సులువుగా చేరుకోగలుగుతారు.
నీళ్లు: సర్వజీవులనూ పోషిస్తున్నా నీరు పల్లానికే ప్రవహిస్తుంది. గొప్పవాళ్లు అంతే నమ్రతతో ఉండాలి.
గద్ద: చచ్చిన ఎలుక కోసం పోరాటం వృథా అనుకున్న ఓ గద్ద ప్రశాంతంగా ఓ చెట్టు కొమ్మపై కూర్చుంది. విజ్ఞుడైన వాడు ఇతరులు ఆశించే వాటి కోసం పోరాడి దుఖాన్ని కొనితెచ్చుకోడు.
సాలెపురుగు: తన లాలాజలంతో గూడు అల్లుతుంది. కొంతకాలానికి తిరిగి దాన్ని మింగేస్తుంది. సరిగ్గా పరబ్రహ్మం తనలోంచి సృష్టిని బహిర్గతం చేస్తుంది.. చివరకు తనలోనే లీనం చేసుకుంటుంది.
కన్య: ధాన్యం దంచడానికి సిద్ధమైంది ఓ కన్య. చేతి నిండా ఉన్న గాజులు సవ్వడి చేస్తుంటే, వాటన్నిటినీ తీసేసి ఒక్కో చేతికి ఒక్కో గాజును మాత్రమే ధరిస్తుంది. సాధనకు ఏకాంతం అవసరం.
భ్రమరం: తేనెటీగ తన పిల్ల చుట్టూ తిరుగుతూ ఝుంకారం చేస్తుంది. దీంతో ఆ పిల్ల కూడా కొంతకాలానికి భ్రమరంగా మారిపోతుంది. ఇలాగే మంచి శిష్యుడు కూడా గురువును అనుసరించి గొప్పవాడు అవుతాడు.
పాము: ఏకాంతంలో నిశ్చలంగా ఉంటుంది. ఇలాగే యోగి కూడా ఏకాంతంలో నిశ్చలమైన సమాధి స్థితిని పొందుతాడు.

Review ప్రకృతి పాఠం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top